6, ఫిబ్రవరి 2017, సోమవారం

యువ గ‌ళాల్లో‌... దేశ‌భ‌క్తి

 

చీపుర్లు పట్టుకుని వీధులన్నీ శుభ్రం చేయడాన్నే దేశభక్తి అంటాడొకాయన. డిజిటిల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా అనడమే అసలు సిసలైన దేశభక్తి అంటాడు మరోకాయన. సినిమా థియేటర్లలో బొమ్మ పడేముందు 'జనగణమన' వేయగానే.. నిలబడి గొంతెత్తి సెల్యూట్‌ చేయడమే నిఖార్సైన దేశభక్తి అని కదం తొక్కుతాడు ఇంకొక పెద్దాయన. పార్కులో ఆడామగ జంటగా కనిపిస్తే చాలు.. బలవంతంగా తాళి కట్టించేసి... ఇదే హిందూస్థాన్‌ దేశభక్తి అంటూ హడల్‌ గొడతాడు మరొకడు. మేము చెప్పిందే 'వేదం'... మేము చేసేదే 'ధర్మం'.. కాదన్నవారంతా దేశద్రోహులే అంటాడు ఇంకొకాయన. ఇలా చెప్పుకుంటూపోతే దేశంలో పెట్రేగుతున్న దేశభక్తి, దేశభక్తుల గురించి అనేకం చెప్పుకోవాలి. మరి దేశభక్తి అంటే ఇదేనా..? కాదు.. కానేకాదంటోంది నేటి యువత. అసలు దేశభక్తి గురించి ఈ దేశపు యువత ఏమంటోంది?! అర్థవంతమైన వారి మాటలు విందాం పదండి!!
దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా 'దేశభక్తి' అనే మాట రకరకాల ప్రభావాలకు లోనౌతోంది. బ్రిటీష్‌ పాలనను ఎదిరించి, స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడమే ఆనాటి దేశభక్తి. ఆ స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. పరాయి పాలకుల నుంచి దేశాన్ని సాధించుకుని, స్వంతంగా పరిపాలనని కొనసాగిస్తున్నాం. దానికోసం ఒక రాజ్యాంగాన్ని సరిగ్గా 67 యేళ్ల కిందట ఇదేరోజు అమలులోకి తీసుకొచ్చాం. అయితే ప్రజలంతా తమకు విధేయులుగా ఉండడమే నేటి పాలకులు చెబుతున్న దేశభక్తి. కానీ ఈ ఇలాంటి దేశభక్తిని అంగీకరించే స్థితిలో ఈ దేశపు యువత సిద్ధంగా లేదు.
దేశమంటే మట్టికాదోరు!!
''దేశభక్తి'' అనే నాలుగు అక్షరాలు దేశాన్ని ముందుకు నడిపించి ఎంతో స్ఫూర్తి రగిలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ''దేశమంటే మట్టికాదోరు.. దేశమంటే మనుషులోరు..'' అన్నాడు గురజాడ. దేశభక్తి అంటే అన్యాయాలపై ఒక ధిక్కారం, సకల దోపిడీ పీడనలపై తిరుగుబాటు, శత్రువుల గుండెల్ని బేజారెత్తించే రణ నినాదం. అంతటి దీప్తితో, వీరోచిత శౌర్యంతో నిప్పులు చెరగాల్సిన ఒక పదం నేడు పాలకుల సంకుచిత రాజకీయాలకు బలై, మొక్కుబడి ప్రహసనంగా మిగిలిపోవడం ఒక విషాదం.
68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశభక్తిపై యువతరం మనోభావాలు ఏమిటని 'జీవన' ఆరా తీసింది. పాలకులు దేశభక్తిపై ఎన్ని మౌఢ్యపు పొరలు కప్పాలని అనుకుంటున్నా ఈ విషయంలో తాము స్పష్టతతోనే ఉన్నామని యువత గొంతెత్తి చెబుతోంది. కేవలం జాతీయ గీతాన్ని ఆలపించడం, జాతీయ జెండాకు వందనం చేయడం మాత్రమే దేశభక్తి కాదని స్పష్టం చేస్తోంది.
పాలకుల దేశభక్తికి భిన్నంగా
దేశభక్తి ముసుగులో స్వంత ఎజెండాలు అమలుచేస్తున్న వైనాన్ని కూడా యువత నిలదీస్తోంది. గొడ్డు మాంసం తినేవాళ్లు, ప్రధాని మోడీని విమర్శించిన వారు, పెద్దనోట్ల రద్దుని వ్యతిరేకించిన వారు దేశద్రోహులంటూ.. ఇలా వివిధ సందర్భాలలో పాలకులు దేశభక్తికి సొంత నిర్వచనాలు చెప్పుకుంటున్నారు. కానీ దీనిని అంగీకరించే స్థితిలో నేటితరం లేదనే దానికి వీరి మాటలే ఓ ఉదాహరణ.
కుల, మత ద్వేషాలొద్దు
''విభిన్న జాతులు, విభిన్న మతాల సమాఖ్య ఈ దేశం. ఆహారం అలవాట్లు పేరుతో ఈ ప్రజలను విడదీయాలను కోవడం అర్థ రహితం. జెండా ఎగరేయడమో, భారతమాత చిత్రపటాలకు దండలేయడమో, దేశభక్తి కాదు. కుల, మత అసహనాలను తొలగించి, అందర్నీ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో మమేకం చేయడమే నిజమైన దేశభక్తి'' అని నెల్లూరుకు చెందిన సుప్రియ, దినేష్‌, డి.నవీన్‌లు చెప్పారు. ''మతాల పేరుతో దేశభక్తిని కొలిచే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. ముస్లింలంతా పాకిస్తాన్‌ వెళ్లిపోవాలన్నట్లు కొందరు మాట్లాడుతుండడం సరికాదని, అన్ని మతాలవారికీ ఇక్కడ సమానంగా జీవించడానికి హక్కులు ఉన్నాయని గుర్తించడమే దేశభక్తి'' అంటూ అనంతపురం విద్యార్థిని ఆసిఫా సుల్తానా, కడపకు చెందిన కలమల సుభాన్‌ భాషా, ఆరీఫ్‌, ఎం.వెంకయ్య తదితర విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ''అన్ని మతాల ప్రజలూ రాజ్యాంగానికి నిబద్ధులై నడుచుకోవాలి. సామాజిక హక్కులకు ప్రభుత్వాలు, ప్రైవేట్‌ వ్యవస్థలూ భంగం కలిగించకూడదు. సర్వమత సామరస్యంతో లౌకిక స్ఫూర్తిని కాపాడు కోవడమే దేశభక్తి'' అంటున్నారు కర్నూలుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు కె.ప్రియాంక, ఇ.లిఖిత, బి.ఎస్సీ విద్యార్థి బి.బాలస్వామి నాయక్‌లు. ''కులం, మతం మాట మరిచి, సాటి మనిషిని సోదర ప్రేమతో చూడాలి. కుల, మతాల పేరుతో హింసా ప్రవృత్తిని విడనాడాలి. కుల, మత వర్గ వైషమ్యాలకు వ్యతిరేకంగా పనిచేయాలి. మహిళలను గౌరవించాలి. లింగ వివక్షను విడనాడడం కూడా దేశభక్తిలో ఒక భాగమే'' అని చెబుతున్నారు ఒంగోలుకు చెందిన వి.లక్ష్మణ్‌, సిహెచ్‌. ఝాన్సీ, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి విద్యార్థి కె. సాయి తనోజ్‌, నర్సీపట్నం విద్యార్థి నరేంద్ర గోపి తదితరులు.
''దేశ ప్రజలను కుల, మతాలుగా విభజించి, విద్వేషాలు రేపుతున్న వారికి వ్యతిరేకంగా యువతరం సంఘటితమై పోరాడాలి. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ కుల వివక్షని అంతమొందించడమే దేశభక్తి'' అని తెనాలికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగిని కె.కిరణ్మయి, విజయనగరం విద్యార్థి డి.చిన్నికృష్ణ వంటివారు అభిప్రాయపడుతున్నారు.
అవినీతిని ప్రశ్నించడమే
''స్వాతంత్య్రం వచ్చాక స్వపరిపాలన కోసం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. కానీ కావాలనే దానిని తమకు అనుకూలంగా చాలామంది పాలకులు సవరించుకుంటూ అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రయత్నాలను నిలువరించి, వారి అవినీతికి అడ్డుకట్ట వేయడం కూడా దేశభక్తే'' అని ఒంగోలు విద్యార్థి ఎం.సౌమిత్‌, పాడేరు విద్యార్థి కె. సుధీర్‌లు చెబుతున్నారు. ''అన్యాయాలను ఎదిరించడం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం, ప్రతి పౌరుడూ అవినీతికి అవకాశం ఇవ్వకుండా నిజాయితీతో వ్యవహరించడం దేశభక్తి'' అంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి విద్యార్థి డి.హరిబాబు, కర్నూలు విద్యార్థి కె. ఉమామహేష్‌, అనంతపురం జిల్లా పర్వతదేవ పల్లి విద్యార్థి చల్లా నరేష్‌, తదితరులు స్పష్టం చేస్తున్నారు. ''నిజాయితీగా స్పందించే తత్వంతో ఇతరులకు సాయం అందించాలి. నాటి త్యాగధనుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, అవినీతికి దూరంగా ఉండాలి. గ్రామాల్లోని పేదలకు అమలు చేసే సంక్షేమ కార్యమ్రాల్లో అవినీతి లేకుండా చూడడం, తప్పుచేసిన వారిని నిలదీయడం కూడా దేశభక్తి'' అని చెప్పారు శ్రీకాకుళం జిల్లా కనిమెట్ట, ఇబ్రహీమ్‌బాద్‌, శ్రీముఖలింగం విద్యార్థులు చౌదరి కీర్తన, సీపాన హారతి, కె.మణికంఠ తదితరులు.
సేవాభావమే ఊపిరిగా
''సమాజాన్ని ప్రేమించి, సామాజిక సేవ చేయడమే దేశభక్తి'' అని విజయవాడ విద్యార్థులు జి.బాలకృష్ణ, ఏ.అరుణ్‌కుమార్‌ తదితరులు చెబుతున్నారు. ''తోటివారికి ఏదో ఒక మేలు కలిగించాలి. దేశానికి మేలు చేయాలనే తపన ఉండాలి. స్వార్థం లేకుండా అన్నివర్గాల ప్రయోజనాలూ కాపాడాలి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలి. ఇదంతా దేశభక్తిలో భాగమేనని'' కడప విద్యార్థి కె.వెంకటేష్‌, విజయనగరం విద్యార్థి పి.నవీన్‌, నెల్లూరుకు చెందిన ఎం.చెంచమ్మ తదితరులు స్పష్టం చేస్తున్నారు. ''ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా అభివృద్ధికి కృషి చేసి, సేవ ద్వారా అన్ని రంగాలలో రాణించడమే దేశభక్తి'' అని తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు లీలాసాయి, జి.గురుప్రసాద్‌ తదితరులు భావిస్తున్నారు. విశాఖపట్నంలోని విద్యార్థులు ఎస్‌.మాధవి, ఎల్‌. వెంకటరమణ, ఎం.జ్ఞానేష్‌, ఎం.తారకేశ్వరరావు తదితరులు ''దేశంలోని నిరుపేదలకు సేవచేయడమే నిజమైన దేశభక్తి. దాని ద్వారానే మంచి సమాజం సాధ్యమౌతుంది'' అని చెబుతున్నారు. ''దేశ ఐక్యతకు కృషి చేయడమే దేశభక్తి. రాజకీయ పార్టీల స్వార్థపూరిత అవసరాలకు ఎంతమాత్రమూ ఉపయోగపడకూడదు. దేశభక్తిపై యువత చైతన్యం పొందాలి'' అని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి జయకర్‌ అంటున్నారు.
అంతో ఇంతో సంతోషించ దగ్గ విషయమేమంటే పాలకులు, ప్రసార మాధ్యమాలు ఎంత గందరగోళాన్ని సృష్టించినా 'దేశభక్తి' అనే అంశంపై నవతరం అభిప్రాయాలు స్పష్టంగా ఉండడం ఆహ్వానించదగిన పరిణామం. వారంతా ఈ దేశంలో సరికొత్త ఆశలతో, ఆశయాలతో తపిస్తూనే ఉన్నారని వారి మాటలే తేటతెల్లం చేస్తున్నాయి.

నిరుద్యోగం లేకుండా
దేశంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఎందుకంటే, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. పాలకులు నిరుద్యోగం తగ్గించే ప్రయత్నం చేస్తే, అది కూడా దేశభక్తికి కొలమానమే అవుతుంది.
- శివ ప్రసాద్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌, ఎస్‌వియూ, తిరుపతి

ప్రశ్నిస్తే దేశద్రోహమా?!
దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే, దేశ ద్రోహులుగా నేడు చిత్రీకరిస్తున్నారు. అన్యాయాలను, నాయకుల తీరును ఎండగడితే దేశ ద్రోహులని అనడం ఘోరం. రాజకీయ నాయకులు దేశభక్తిని మాటల్లో చూపుతున్నారే తప్పా, అది చేతల్లో కనపడ్డంలేదు.
- జి.శ్రీను, పాడేరు, విశాఖజిల్లా.

దేశభక్తి పేరుతో ప్రచారం
దేశభక్తి పేరుతో కొంతమంది రకరకాల ప్రచారం చేసుకుంటుంటారు. ఈ దేశంలో చదువుకుని, డబ్బుల కోసం విదేశాల్లో పనిచేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడే ఉండి, దేశం కోసం పనిచేయాలి. అదే నిజమైన దేశభక్తి.
- పి.హేమలత, బిజెడ్‌సి తృతీయ, శ్రీకాకుళం
కుల వివక్షలేని.. దేశభక్తి
దేశాన్ని గౌరవించాలి, మత సామరస్యాన్ని కాపాడాలి. విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. కుల వివక్ష లేని సమాజం కోసం పాటుపడాలి. అప్పుడే దేశభక్తికి సార్ధకత.
- కొత్త కిరణ్మయి, ప్రయివేటు ఉద్యోగిని, తెనాలి.
హక్కులకు భంగం లేకుండా
భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనది. అన్నిమతాల వారు రాజ్యాంగానికి బద్ధులై నడుచుకోవాలి. ఏ దేశంలో ఉద్యోగం చేసినా, ఈ దేశానికి గౌరవం తేవాలి. మనకున్న హక్కులకు భంగం కలిగించకుండా ఉండడమే దేశభక్తి.
- కె. ప్రియాంక, బిటెక్‌ ఫైనల్‌, కర్నూలు
కులమతాలకు అతీతంగా
మతమేదైనా.. కులమేదైనా సాటి మనిషిని గౌరవించడం మన కర్తవ్యం. ప్రపంచ దేశాలకు ఎన్నో నేర్పించిన ఘనత మనది. కులం, మతం మాటమరచి, సాటి మనిషిని సోదర ప్రేమతో చూస్తేనే నిజమైన దేశభక్తులం.
- వి.లక్ష్మణ్‌ ఒంగోలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి