6, ఫిబ్రవరి 2017, సోమవారం

అక్ష‌ర ప్రపంచంలో హ‌రివిల్లు‌లు



ఎంతో ఇష్టంగా గ్రంథాలయాలకు వెళ్లి, సైలెన్స్‌ ప్లీజ్‌ బోర్డుల కింద కూర్చుని చదువుకునేంత తీరికా ఓపికా తగ్గిపోతున్న రోజులివి. ఇంటిల్లిపాదీ ఆనందంగా ఒక మంచి పుస్తకాన్ని గురించి మాట్లాడుకునే పరిస్థితీ ఎక్కడా లేదు. కేవలం వేలి కొసలతో చిటికెలో బ్రౌజైపోయి, కావల్సిన వాటిని డౌన్లోడ్‌ చేసిపెట్టే స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ల కాలంలో ఉన్నాం. కానీ మనిషి ఆకాశమంత ఎత్తు ఎదిగినా.. కాళ్లు నేలమీదే ఉండాలి.. ఉండక తప్పదు. శరవేగంతో పరుగులు తీస్తున్న కాలంలో మనసుతో మాట్లాడే నేస్తాలు నిజంగా పుస్తకాలే. వాటిని పసిమనసులకు పరిచయం చేసి, వారికి అవసరమైనవి కానుకగా ఇచ్చే అవకాశాన్ని తల్లిదండ్రులకు అందిస్తున్నాయి పుస్తక మహోత్సవాలు. విజయవాడలో గత రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రతియేటా పుస్తక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలో తిరుపతి, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కూడా పుస్తకమహోత్సవాలు జరిగాయి. ఇటీవలే హైదరాబాద్‌లోనూ జరిగాయి. ఈ పుస్తక సంబరాల్లో పిల్లల సందడి విశేషాలు నేటి 'జీవన'లో....


పిల్లలు పెరిగే క్రమంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కనిపించే ప్రతి విషయం మీదా ఆసక్తిని పెంచుకుంటారు. వాటి గురించి తమ తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు వివేకవంతులైతే తమ చిన్నారుల సందేహాలను నివృత్తి చేస్తూ, వారికి విషయ పరిజ్ఞానం కలిగిస్తారు. అదే వివేక శూన్యులైన తల్లిదండ్రులైతే 'ఏమిటీ నస?' అంటూ తమ పిల్లలపై విసుక్కుంటూ వారి ఆసక్తిని ఆదిలోనే సమాధి చేసేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లలకు తగినంత విజ్ఞానం అందించాలన్న తపన తల్లిదండ్రుల్లో ఎక్కువగానే కన్పిస్తోంది. కానీ అందుకోసం సరైన ఆచరణ మాత్రం కన్పించడం లేదు. పిల్లలకు అవసరమైన పుస్తకాలు అందించి, వారిచేత చదివించాలన్న తల్లిదండ్రులూ ఎక్కువమందే ఉన్నారు. నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి పిల్లలు అమాయకంగా కనపడతారేగానీ పెద్దలు నేర్పించే దానికంటే త్వరగానే అన్నీ నేర్చుకుంటారు పిల్లలు. కంప్యూటర్ల వల్ల, అంతర్జాలం వల్ల విషయాలు తెలుస్తాయేమోగానీ జ్ఞానం పెరగదు. అందుకు పుస్తకాలు చదవడం ఒక్కటే మార్గం.


ఎదిగే మనసులకు
పిల్లలు ఎదిగే వయసులో వారి మనసులకు ప్రపంచాన్ని అర్థంచేసుకునే విధంగా ఆసక్తి కలిగించాలి. సమాజం పట్ల, మానవ సంబంధాల పట్ల తగిన విషయ పరిజ్ఞానం, సజనాత్మకత పెంచాలి. తాము చదివిన పుస్తకాల సాయంతో పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. పిల్లల కోసం ప్రస్తుతం అనేకరకాల పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది అవసరమో? ఏది అవసరం లేనిదో? ఎంపికచేసి పిల్లలకు ఇచ్చి, వాటిని చదివించేలా చూసే బాధ్యత పెద్దవాళ్లదే. ఎందుకంటే పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేస్తున్నారు. అందులోని విశాలతత్వానికి, మానసిక అభివృద్ధికి దోహదపడకుండా, కేవలం పరీక్షలకు అవసరమయ్యే ప్రశ్న, జవాబులనే బట్టీ పట్టిస్తున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలకాలంటే పిల్లల్లో పఠనాసక్తిని పెంచాలి. పుస్తక పఠనం ఎన్నో జీవిత సత్యాలను నేర్పిస్తుంది. పదేళ్ల వయసులోపు బాలమిత్ర, చందమామ, కామిక్స్‌ పుస్తకాలను చదివించి... తర్వాత హాస్యాన్ని అందిస్తూ, ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే పంచతంత్ర, నీతి కథలు, సమాజాన్ని అర్థం చేయించే కథలు, సుప్రసిద్ధుల జీవిత చరిత్రలు వంటి పుస్తకాలు చదివేలా చూడాలి.

ఎంతో ప్రయోజనం
పుస్తకం ప్రపంచ వీక్షణానికి తొలిమెట్టు. అసమాన ప్రతిభా పాటవాలను నేర్పించే గురువు. తెలియని విషయాలను విశదీకరించే మిత్రుడు. మేధస్సు పెరగాలంటే పుస్తక పఠనం తప్పనిసరి. సమాజాన్ని అర్థంచేసుకునే రచనలు, కథలు, కథానికలు ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పుస్తకాలు తప్పకుండా ఉండేవి. ఇప్పుడు ఉరుకులు, పరుగుల జీవితం పుస్తక పఠనాన్ని తగ్గిస్తోంది. అప్పట్లో పిల్లలు చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలను ఆసక్తిగా చదివేవారు. దానివల్ల విజ్ఞానంతో పాటు భాషా పరిజ్ఞానం పెంపొందేది. పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంది.

పిల్లల్లో పఠనాసక్తి పెరగాలంటే
నేటి తరం పిల్లల్లో పుస్తకాలు చదవాలన్న ఆలోచనని పెంచాలి. టీవీలు, ఇంటర్నెట్‌లతో పిల్లలపై రకరకాల దుష్ప్రభావాలు పడతాయని గుర్తించాలి. వాటికి ప్రత్యామ్నాయంగా వారితో పుస్తకాలు చదివించడాన్ని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయించాలి. కథలు, కామిక్స్‌ పుస్తకాల్ని పెద్దవాళ్లే పెద్దగా చదివి, పిల్లలకు వినిపిస్తుంటే వారికి ఆసక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు విన్న విషయాన్నే మళ్ళీ మళ్లీ చెప్పించుకోవటం.. నచ్చిన బొమ్మల్ని పదే పదే చూడటం.. అనే అలవాటు ఉంటుంది. అందుకోసం అమ్మో, నాన్నో చదివిన పుస్తకాన్ని వాళ్ళు మళ్లీ తెరిచే ప్రయత్నాలూ చేస్తారు. వీలైనంత వరకూ పిల్లలకు ఎక్కువ పుస్తకాల్ని అందుబాటులో ఉంచాలి. దాంతో వాళ్లల్లో వాటిని చూడాలన్న, చదవాలన్న కుతూహలం పెరుగుతుంది. మొదట్లో ఎక్కువగా బొమ్మలుండే పుస్తకాలైతే వారికి ఆసక్తిగా ఉంటుంది. బొమ్మల్ని చూపించి, కొద్దిగా కథ చెప్పి వదిలేస్తే, ఆపైన వారే వాటిని చదవటం ప్రారంభిస్తారు. పిల్లలు నిద్రపోయే ముందు కథలు వినేందుకు ఇష్టపడతారు. అలా కథలు చదివి వినిపిస్తూ ఉంటే, కొన్నాళ్లకు వారికీ అది అలవాటైపోతుంది. ఇంట్లోని పెద్దలంతా అలా చదివే అలవాటు ఉంటే పిల్లలకూ అది అలవడుతుంది.

పిల్లలతో చర్చించాలి
పిల్లలు చదివే పత్రికలు, కథలు, బొమ్మల పుస్తకాల గురించి వీలైనంతవరకు వారితో చర్చించాలి. వాటి గురించి వివరించాలి. చదివే అలవాటును నెమ్మదిగా వారిలో కొనసాగించాలేగానీ.. ఒక్కసారే అది సాధ్యపడదన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తెరిగి, ప్రవర్తించాలి. వారికి పుట్టినరోజులకు, ఇతర సందర్భాల్లో మంచి మంచి పుస్తకాలను కానుకలుగా ఇవ్వాలి. ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో రకం పుస్తకం అవసరం. ప్రారంభంలో బొమ్మలున్న కథల పుస్తకాలతో మొదలుపెట్టి, ప్రపంచ నాగరికతలు, వింతలు, శాస్త్రవేత్తలు, పరికరాలు, సాహసగాథలు ఇలా ఒక్కోరోజు ఒక్కో కొత్త విషయాన్ని తెలిపే పుస్తకాలను చదివించాలి. అలా చదివించి, పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి.

ఎన్నో రకాల పుస్తకాలు
బాల్యం నుంచి భాషపై పట్టు సాధించడం, గణితం, సైన్స్‌ మూలసూత్రాలు తెలుసుకోవడం పిల్లలకు ఎంతో అవసరం. పిల్లల్లో భాషా సామర్థ్యాన్ని పెంచే డిక్షనరీలతోపాటు, పదాలతో ప్రయోగాలు చేసే కథలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్‌, తెలుగులో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఉపయుక్తమైన జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం డిక్షనరీలు ఉన్నాయి. ఇంకా నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, స్కాలస్టిక్‌, డ్రీమ్‌ల్యాండ్‌, ఏకలవ్య, అమరచిత్ర, నవరత్న, పీకాక్‌, ప్రగతి, అలకనంద, ప్రజాశక్తి, మంచిపుస్తకం, ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, కొలిన్స్‌, తెలుగు అకాడమి, డి. బోస్‌ తదితర సంస్థల ప్రచురణలు ఆకర్షణీయమైన రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోని ప్రముఖుల జీవిత చరిత్రలు పిల్లలను బాగా ఆకర్షిస్తున్నాయి. షార్ట్‌ స్టోరీస్‌, చిత్రకథలు, యాక్టివిటీ బుక్స్‌, ఆయా ప్రచురణ సంస్థల క్లాసిక్స్‌ ఈ పుస్తక ప్రదర్శనల్లో అందుబాటులో ఉంటున్నాయి.

పుస్తకాలే గొప్ప ఆస్తి
మన తర్వాత్తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? మా పిల్లలు చిన్నప్పటి నుంచే పుస్తకాలపై ఆసక్తి ఉండడం చూసి మాకు అనందం కలిగింది. అందుకే వారికి ఏ పుస్తకం అడిగినా వెంటనే తెచ్చి ఇస్తాం.
- వి.ఆర్‌.కె.రావు, మొగల్రాజపురం, విజయవాడ.

పిల్లలలో సృజన
పిల్లలతో రకరకాల పుస్తకాలు చదివించడం వలన వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. వారిని కేవలం సిలబస్‌ పుస్తకాలకే పరిమితం చేయకూడదు. ఈ పుస్తక మహోత్సవంలో పిల్లలకు అవసరమైన పుస్తకాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా పిల్లల కోసమే పుస్తకాల స్టాల్స్‌ ఏర్పాటు చేయడం బావుంది.
- సుహాసిని, విజయవాడ.

కామిక్స్‌ కథలంటే ఇష్టం
నాకు కామిక్స్‌, కథల పుస్తకాలంటే చాలా ఇష్టం. అలాంటి పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. బొమ్మలతో ఉన్న పుస్తకాలు చాలా ఉన్నాయి. స్కూల్‌ బుక్స్‌ చదువుతూనే ఖాళీ టైములో ఇలాంటి పుస్తకాలు చదువుతాను.
- శ్రీ వల్లభ్‌, 3వ తరగతి, విజయవాడ.

సైన్స్‌, జికె పుస్తకాలు బాగున్నాయి
ఈ ఎగ్జిబిషన్‌లో మంచి పుస్తకాలు దొరుకుతున్నాయి. చాలా స్టాల్స్‌లో మాలాంటి వారికి అవసరమైన పుస్తకాలే ఉన్నాయి. ఎక్కువగా సైన్స్‌, జనరల్‌ నాలెడ్జి పుస్తకాలు బాగున్నాయి.
- సాత్విక్‌, 5వ తరగతి, విజయవాడ.


                                                                                               - బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి