కనుచూపు మేరంతా నీలిరంగు పరుచుకున్న నీళ్ల తివాచీ.. ఎక్కడికక్కడ కిలకిలారావాలతో సందడి చేసే దేశ, విదేశ పక్షులు, అరుదైన జీవజాతులు. ఊగిసలాడే సన్నని అలలపై ఆహ్లాదాన్ని అందించే బోటు షికార్లు. నోరూరించే తాజా చేపల ఆహారం. అలాంటి మైమరపించే అనుభూతులను ఒకేచోట పొందాలంటే ఒడిసాలోని చిల్కా సరస్సును సందర్శించాల్సిందే. ప్రకృతి అందాలను నిండా కలబోసుకొని.. ఓ పారవశ్యగీతంలా ఆలపించే 'చిల్కా సరస్సు' విశేషాలు
ఒడిసా రాష్ట్రానికి ఎన్నిసార్లు వెళ్లినాసరే, అవకాశాన్ని బట్టీ చిల్కాసరస్సు సందర్శనకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఎప్పటికప్పుడు సరికొత్తగా కన్పించే పర్యాటక ప్రాంతం అది. సుమారు 1,100 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ సరస్సు ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పునీటి సరస్సుల్లో రెండోదిగా గుర్తింపు పొందింది. పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల తూర్పు తీరంలో దయా నది ప్రవేశ ద్వారం వద్ద బంగాళాఖాతంలో ప్రవహిస్తోంది. ఇది శీతాకా లంలో సరికొత్త అందాలను సంతరించుకుం టుంది. అందుకు కారణం ఆ సమయంలో దూర తీరాల నుంచి ఇక్కడికి వచ్చే విదేశీ వలస పక్షులే. సుమారు పదివేల యేళ్ల కిందటే ఈ సరస్సు ప్రకృతి సిద్ధంగా రూపుదిద్దుకుంది. దయానదికి గల ఉపనదుల్లో ఒకటైన మలగుని నది పశ్చిమ తీరంలో ఈ సరస్సు విస్తరించింది. దీని ఉత్తర తీరం ఖుర్ధా జిల్లాలో, పశ్చిమ తీరం గంజాం జిల్లాలో భాగంగా ఉన్నాయి.
ఎన్నో దీవులు
చిల్కా సరస్సు లోపల అనేక చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేరోజులో సందర్శించడానికి వీలు కాదు. వీటిలో పక్షుల దీవి, హనీమూన్ దీవి, పారికుడ్ దీవి, బ్రేకాస్ట్ దీవి, మాలుడ్ దీవి, నిర్మలఝార దీవి, నువపరా దీవి, రిఝాన్స్ కాళిజై దీవి, ఫుల్బరి దీవి, బెరహ్పుర దీవి, నల్బానా దీవి వంటివి ముఖ్యమైనవి. కాళీజై దీవిలో ఒక ఆలయం ఉంది, అందువల్ల ఇది ఒక యాత్రాస్థలంగా మారింది. ఏడాది పొడుగునా భక్తులు ఇక్కడికి గుంపులుగా వస్తారు. ఈ ఆలయంలో మకర సంక్రాంతి పండుగను నిర్వహిస్తుండడం విశేషం. సరస్సు, సముద్ర సంగమం అంచుల్లో రిఝాన్స్ దీవి అనే విశాలమైన బీచ్ ఉంది. ఈ సరస్సుని సత్పద, బలుగాన్, రంభ, బర్కుల్‌్ తదితర ప్రాంతాల నుంచి బోటు ద్వారా చేరుకోవచ్చు. పెద్ద దీవులను జలమార్గాలు వేరు చేస్తున్నాయి. చిల్కా సరస్సు చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు వార్షిక ఉత్సవమైన ''బాలి యాత్ర '' (బాలికు ప్రయాణం) జరుపుకుంటారు.
హుషారుగా బోటు షికారు
చిల్కా సరస్సు పరిసరాల్లోని సుమారు నూటా ఏభై గ్రామాల మత్స్యకారులు దీనిపై ఆధారపడుతున్నారు. వేల సంఖ్యలో బోట్లు షికారు చేసే సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తే, మరి కొన్ని స్థానికులు ప్రైవేట్‌గా నిర్వహిస్తున్నారు. ఒడిసా టూరిజం బోట్ల ధర ప్రైవేట్ బోట్ల ప్రయాణ ధరలతో పోలిస్తే బాగా ఎక్కువనే చెప్పాలి. అందుకే ఎక్కువమంది ప్రైవేట్ బోట్లనే ఆశ్రయి స్తుంటారు. అయితే టూరిజం బోట్లలో సందర్శకుల భద్రతకు సంబంధించి, అన్ని ఏర్పాట్లుంటాయి. బోటులో ప్రయాణిస్తూ సరస్సు మధ్యలో ఉన్న దీవులను సందర్శించడం మర్చిపోలేని అనుభూతనే చెప్పాలి. సరస్సు నీటిలోతు 12 అడుగుల వరకూ ఉంటుంది.
వలస పక్షుల సందడి
ఈ సరస్సు శీతాకాలంలో సుదూరంలో ఉన్న కాస్పియన్ సముద్రం, ఇరాన్, రష్యా, సైబీరియా, బైకాల్ సరస్సు, అరల్ సముద్రం, మంగోలియా, ఆగేయాసియా, లడఖ్, హిమాలయాలు వంటి స్థలాల నుంచి వచ్చిన అనేక వలసపక్షులకు ఆవాసంగా మారింది. ఈ సీజన్లో 205 పక్షిజాతులను సందర్శించవచ్చు. కొన్ని జాతుల పక్షులు ఈ చిల్కా సరస్సును చేరటానికి దాదాపు పన్నెండు వేల కి.మీ ప్రయా ణిస్తాయి. లెస్సర్ రాజహంసలు, తెల్లటి ఉదరభాగాలుండే సముద్ర గద్దలు, బూడిదరంగు రెక్కలు కల పెద్దబాతు, ఊదారంగు అడవికోడి, ఉష్ణ మండల పక్షి, నారాయణ పక్షి, తెల్లకొంగలు, బూడిద, ఊదారంగుల ఉష్ణపక్షులు, పాలపిట్టలు, కొంగలు, తెల్లటి కంకణ పక్షి, తెడ్డుమూతి కొంగలు, బ్రాహ్మిణీ కొంగలు, పెద్దముక్కున్న కొంగలు, సూదివంటి తోకకల కొంగలు ఇలా అనేకరకాల దేశ, విదేశీ పక్షులను ఒకేచోట చూడాలంటే చిల్కా సరస్సుకు రావాల్సిందే. నల్బాన దీవిని పక్షి సంరక్షణ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. సరస్సులో అరుదుగా కనిపించే పక్షులలో ఏషియాటిక్ డోవిచర్లు, డాల్మేటియన్ పెలికాన్, పల్లాస్ ఫిష్-ఈగల్స్, చాలా అరుదుగా వలసవచ్చే తెడ్డు-మూతి ఏటుగట్టు పిట్టలు, గూడకొంగలు, రీవరీ పక్షులు వంటి అరుదైన పక్షి జాతులతో పాటు పొట్టికాళ్ళు ఉన్న అనేక తీరపక్షులు సరస్సు, దీవుల తీరప్రాంతాలలో ఇరుకైన ప్రదేశాలలో కనిపిస్తాయి. ఇందులో ఉల్లంకి పిట్టలు, ఏటిగట్టు పిట్టలు, ఉల్లాము పిట్టలు, బురదనేలల మీద భరతపక్షులు, తోకలు ఆడించే నీటి జంతువులు, తీతువపిట్టలు వంటివి కూడా చూడొచ్చు.
అరుదైన జీవజాతులు
ఈ సరస్సులోని నీటిలో, దీవుల్లో అరుదైన జీవజాతులు చాలా రకాలున్నాయి. ఆకుపచ్చ సముద్ర తాబేలు, డుగాంగ్, ఇరవాడి డాల్ఫిన్లు, నల్లమగజింక, తెడ్డుమూతి సాండ్‌పైపర్, అవయవాలు లేని స్కింక్, వేటాడే పిల్లి తదితర రకాల జంతువులు, సరీసృహాలున్నాయి. వృక్షాలు, మొక్కల్లో 496 తెగలకు, 120 కుటుంబాలకు చెందిన 726 పుష్పజాతులను ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఇక్కడ దాదాపు 2900 వృక్ష జాతులను గుర్తించి పరిరక్షిస్తున్నారు.
ఇరవాడి డాల్ఫిన్ల ప్రత్యేకత
ఇరవాడి డాల్ఫిన్ అనేది చిల్కా సరస్సులో మాత్రమే కన్పించే ముఖ్య జాతి. ప్రపంచంలోని రెండు సరస్సులలో మాత్రమే ఈ అరుదైన డాల్పిన్లుండగా అందులో ఇది ఒకటి కావడం విశేషం. వీటిని వేటాడడాన్ని పూర్తిగా నిషేధించారు. జాలరుల వలలకు ఇవి చిక్కితే వెంటనే నీట్లోకి విడిచి పెట్టేస్తుంటారు. డాల్ఫిన్ పర్యాటకం అనేకమంది స్థానికులకు ప్రత్మామ్నాయ ఉపాధిగా ఉంది. వీటిని చూడటానికి ఆసక్తి చూపే పర్యాటకులను సరస్సులోకి తీసికువెళ్లటానికి చాలా పెద్దవైన మోటారు బోట్లున్నాయి. నాలుగు పర్యాటక సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. దాదాపు వెయ్యికి పైగా జాలరుల కుటుంబాలు వీటిపై ఆధారపడి ఉన్నాయి. ఏడాదికి సుమారు లక్షమంది పర్యాటకులు కేవలం డాల్పిన్లను చూడడానికే ఇక్కడకు వస్తారని వారు చెబుతున్నారు.
సందర్శనీయ ప్రాంతాలు
చిల్కా సరస్సులో సందర్శనీయ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో నల్బాన దీవి పక్షుల కేంద్రం గుర్తింపు పొందింది. అయితే వర్షాకాలంలో ఈ దీవి అదృశ్యమైపో తుంది. నీరు తిరిగి వానాకాలం తరువాత కనిపిస్తుంది. విహార శిబిరాన్ని వేసుకోవడానికి తగిన ప్రదేశం నిర్మల్‌ఝార్ జలపాతం. ఇది చిల్కా సరస్సు నుంచి 12 కిమీ దూరంలో ఉంది. సాత్పదా ద్వీపకల్పం చిల్కా సరస్సు తూర్పు భాగంలో ఉంది. ఈ ప్రాంతం మూడువైపులా సరస్సులతో చుట్టబడి ఉంది, అందుచే అవి ఈ ప్రాంతాన్ని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా ప్రకృతి ఆరాధకులు భావిస్తారు. ది బ్రేక్‌ఫాస్ట్ ఐల్యాండ్ సంకుద దీవి, హనీమూన్ ఐల్యాండ్ వంటి ప్రదేశాలను ఎన్నింటినో చూసి ఆనందించవచ్చు
వసతులు-ఆహారం
అక్టోబర్ నుంచి మార్చి నెల వరకూ చిల్కా సరస్సు సందర్శనకు అనుకూలమైన కాలం. పర్యాటకుల సౌకర్యార్థం ఎక్కడికక్కడ రిసార్టులు, హోటళ్లు అందుబాటు ధరల్లోనే లభిస్తాయి. చేపలు, రొయ్యలతో తయారుచేసిన ప్రత్యేకమైన వంటకాలు సందర్శకులను ఆకర్షిస్తుంటాయి.
ఎలా చేరుకోవాలి?
దేశంలో ఎక్కడి నుంచైనా చిల్కా సరస్సుకు చేరుకోవడం చాలా సులభం. విశాఖపట్నం నుంచైతే ట్రైన్లో కేవలం ఆరు గంటల వ్యవధిలోనే చిల్కా రైల్వేస్టేషన్‌కు చేరుకోవచ్చు. చెన్నై- హౌరా జాతీయ రహదారి, రైలు మార్గాలకు సమీపంలోనే ఇది ఉంది. అతి దగ్గరలోనే భువనేశ్వర్ విమానాశ్రయం ఉంది. కేవలం చిల్కా సరస్సు మాత్రమే కాకుండా పూరీ, కోణార్క్, నందన్‌కానన్, లింగరాజ దేవాలయం వంటివాటిని కూడా ఈ పర్యటనలో చూసే అవకాశం ఉంటుంది.
- బెందాళం క్రిష్ణారావు









కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి