9, మార్చి 2017, గురువారం

మనువుల‌ రాజ్యంలో మానవి (కవిత)


‍‍‍‍__బెందాళం క్రిష్ణారావు
----------------------------------


మనువాదానికి సామ్రాజ్యవాదం తోడై
ప్రపంచీకరణ నీడై
అవధులు లేని స్వార్ధంలో
కనుమరుగైపోతున్న మనిషితనంలో
చిత్రహింసల పాలౌతున్న సగంలో ‘ఆమె’


అనాది కాలం నుంచీ
ఆధునిక జీవనం వరకూ
ఆమెది నిత్యం క్షతగాత్రగానమే

పెట్టుబడిదారుల‌ కబంధ హస్తాల్లో చిక్కి
కొన ఊపిరితో విల‌విల్లాడుతూ
ప్రసార మాధ్యమాల్లో మార్కెట్‌ సరుకౌతోంది
ఆమె శరీరమేకాదు, హృదయం కూడా...

ప్రపంచమంతా కుగ్రామంగా
మారిపోతున్న వేళ
తన జీవితపు పూరింట్లో
అగచాట్ల ఆటుపోట్లకు
రెపరెపలాడే మానవత్వపు
చిరుదీపపు వెలుతురును
చెదిరిపోనివ్వకుండా
సంరక్షిస్తోంది సమానత్వపు చేతుల‌తో...

కుల‌ మతాలుగా, వర్గాలుగా
తెగిపోయిన మనుషులు
విడిపోతున్న హృదయాల సాక్షిగా
చరిత్ర యవనికపై
మౌన చిత్తరువు కాదామె...

ఆమె....
జాతిని జాగృతం చేసిన
ఒక సైమన్‌ ది బోవర్‌
బతుకు పోరాటాన్ని
తీర్చిదిద్దిన గోర్కీ‘అమ్మ’
సామ్యవాద తత్వవేత్తకు
జీవనసహచరి జెన్నీమార్క్స్‌
శ్రామిక మహిళల పోరాటానికి
దిక్సూచి క్లారాజెట్కిన్‌
అతివల్లో అక్షర చైతన్యాన్ని
నింపిన సావిత్రీబాయి పులే
తెలంగాణ దొరతనానికి
ఎదురునిలిచిన ఐల‌మ్మ
సిక్కోలు విప్లవాగ్ని
రగిలించిన పంచాది నిర్మల‌
జాతివివక్షకు బలైన రోహిత్‌
మాతృమూర్తి రాధిక

ఆమె ఒక్కరు కాదు..ఒంటరి కాదు
అందరూ కలిసిన అన్నీ
ఆమె సమాయత్తమౌతోంది
కల్లోలిత సమాజం నుంచి
దూసుకొస్తున్న కాంతి పుంజంలా
విముక్తి గీతాన్ని విశ్వవ్యాప్తంగా
విప్లవ నినాదంలా మార్మోగించడానికి

విరామమెరుగక శ్రమిస్తోంది
తరతరాల‌ భావదాస్యపు
బానిస బంధనాలు తెంచుకోవడానికి

బహుజన వర్గ చైతన్యంతో
సామాజిక సమతాదీపిక ధరించి
మనువుల‌ రాజ్యంలో మానవిగా
విమోచన వైపు అడుగేస్తోంది.
```````````````````````````````
ఫొటోః విరసం (వెబ్ సైట్) సౌజన్యం తో

6, ఫిబ్రవరి 2017, సోమవారం

ఎన్నో ప్ర‌త్యే‌క‌త‌ల చిల్కా స‌ర‌స్సు‌




కనుచూపు మేరంతా నీలిరంగు పరుచుకున్న నీళ్ల తివాచీ.. ఎక్కడికక్కడ కిలకిలారావాలతో సందడి చేసే దేశ, విదేశ పక్షులు, అరుదైన జీవజాతులు. ఊగిసలాడే సన్నని అలలపై ఆహ్లాదాన్ని అందించే బోటు షికార్లు. నోరూరించే తాజా చేపల ఆహారం. అలాంటి మైమరపించే అనుభూతులను ఒకేచోట పొందాలంటే ఒడిసాలోని చిల్కా సరస్సును సందర్శించాల్సిందే. ప్రకృతి అందాలను నిండా కలబోసుకొని.. ఓ పారవశ్యగీతంలా ఆలపించే 'చిల్కా సరస్సు' విశేషాలు
ఒడిసా రాష్ట్రానికి ఎన్నిసార్లు వెళ్లినాసరే, అవకాశాన్ని బట్టీ చిల్కాసరస్సు సందర్శనకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఎప్పటికప్పుడు సరికొత్తగా కన్పించే పర్యాటక ప్రాంతం అది. సుమారు 1,100 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ సరస్సు ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పునీటి సరస్సుల్లో రెండోదిగా గుర్తింపు పొందింది. పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల తూర్పు తీరంలో దయా నది ప్రవేశ ద్వారం వద్ద బంగాళాఖాతంలో ప్రవహిస్తోంది. ఇది శీతాకా లంలో సరికొత్త అందాలను సంతరించుకుం టుంది. అందుకు కారణం ఆ సమయంలో దూర తీరాల నుంచి ఇక్కడికి వచ్చే విదేశీ వలస పక్షులే. సుమారు పదివేల యేళ్ల కిందటే ఈ సరస్సు ప్రకృతి సిద్ధంగా రూపుదిద్దుకుంది. దయానదికి గల ఉపనదుల్లో ఒకటైన మలగుని నది పశ్చిమ తీరంలో ఈ సరస్సు విస్తరించింది. దీని ఉత్తర తీరం ఖుర్ధా జిల్లాలో, పశ్చిమ తీరం గంజాం జిల్లాలో భాగంగా ఉన్నాయి.

ఎన్నో దీవులు
చిల్కా సరస్సు లోపల అనేక చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేరోజులో సందర్శించడానికి వీలు కాదు. వీటిలో పక్షుల దీవి, హనీమూన్‌ దీవి, పారికుడ్‌ దీవి, బ్రేకాస్ట్‌ దీవి, మాలుడ్‌ దీవి, నిర్మలఝార దీవి, నువపరా దీవి, రిఝాన్స్‌ కాళిజై దీవి, ఫుల్బరి దీవి, బెరహ్పుర దీవి, నల్బానా దీవి వంటివి ముఖ్యమైనవి. కాళీజై దీవిలో ఒక ఆలయం ఉంది, అందువల్ల ఇది ఒక యాత్రాస్థలంగా మారింది. ఏడాది పొడుగునా భక్తులు ఇక్కడికి గుంపులుగా వస్తారు. ఈ ఆలయంలో మకర సంక్రాంతి పండుగను నిర్వహిస్తుండడం విశేషం. సరస్సు, సముద్ర సంగమం అంచుల్లో రిఝాన్స్‌ దీవి అనే విశాలమైన బీచ్‌ ఉంది. ఈ సరస్సుని సత్పద, బలుగాన్‌, రంభ, బర్కుల్‌్‌ తదితర ప్రాంతాల నుంచి బోటు ద్వారా చేరుకోవచ్చు. పెద్ద దీవులను జలమార్గాలు వేరు చేస్తున్నాయి. చిల్కా సరస్సు చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు వార్షిక ఉత్సవమైన ''బాలి యాత్ర '' (బాలికు ప్రయాణం) జరుపుకుంటారు.

హుషారుగా బోటు షికారు
చిల్కా సరస్సు పరిసరాల్లోని సుమారు నూటా ఏభై గ్రామాల మత్స్యకారులు దీనిపై ఆధారపడుతున్నారు. వేల సంఖ్యలో బోట్లు షికారు చేసే సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తే, మరి కొన్ని స్థానికులు ప్రైవేట్‌గా నిర్వహిస్తున్నారు. ఒడిసా టూరిజం బోట్ల ధర ప్రైవేట్‌ బోట్ల ప్రయాణ ధరలతో పోలిస్తే బాగా ఎక్కువనే చెప్పాలి. అందుకే ఎక్కువమంది ప్రైవేట్‌ బోట్లనే ఆశ్రయి స్తుంటారు. అయితే టూరిజం బోట్లలో సందర్శకుల భద్రతకు సంబంధించి, అన్ని ఏర్పాట్లుంటాయి. బోటులో ప్రయాణిస్తూ సరస్సు మధ్యలో ఉన్న దీవులను సందర్శించడం మర్చిపోలేని అనుభూతనే చెప్పాలి. సరస్సు నీటిలోతు 12 అడుగుల వరకూ ఉంటుంది.

వలస పక్షుల సందడి
ఈ సరస్సు శీతాకాలంలో సుదూరంలో ఉన్న కాస్పియన్‌ సముద్రం, ఇరాన్‌, రష్యా, సైబీరియా, బైకాల్‌ సరస్సు, అరల్‌ సముద్రం, మంగోలియా, ఆగేయాసియా, లడఖ్‌, హిమాలయాలు వంటి స్థలాల నుంచి వచ్చిన అనేక వలసపక్షులకు ఆవాసంగా మారింది. ఈ సీజన్లో 205 పక్షిజాతులను సందర్శించవచ్చు. కొన్ని జాతుల పక్షులు ఈ చిల్కా సరస్సును చేరటానికి దాదాపు పన్నెండు వేల కి.మీ ప్రయా ణిస్తాయి. లెస్సర్‌ రాజహంసలు, తెల్లటి ఉదరభాగాలుండే సముద్ర గద్దలు, బూడిదరంగు రెక్కలు కల పెద్దబాతు, ఊదారంగు అడవికోడి, ఉష్ణ మండల పక్షి, నారాయణ పక్షి, తెల్లకొంగలు, బూడిద, ఊదారంగుల ఉష్ణపక్షులు, పాలపిట్టలు, కొంగలు, తెల్లటి కంకణ పక్షి, తెడ్డుమూతి కొంగలు, బ్రాహ్మిణీ కొంగలు, పెద్దముక్కున్న కొంగలు, సూదివంటి తోకకల కొంగలు ఇలా అనేకరకాల దేశ, విదేశీ పక్షులను ఒకేచోట చూడాలంటే చిల్కా సరస్సుకు రావాల్సిందే. నల్బాన దీవిని పక్షి సంరక్షణ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. సరస్సులో అరుదుగా కనిపించే పక్షులలో ఏషియాటిక్‌ డోవిచర్లు, డాల్మేటియన్‌ పెలికాన్‌, పల్లాస్‌ ఫిష్‌-ఈగల్స్‌, చాలా అరుదుగా వలసవచ్చే తెడ్డు-మూతి ఏటుగట్టు పిట్టలు, గూడకొంగలు, రీవరీ పక్షులు వంటి అరుదైన పక్షి జాతులతో పాటు పొట్టికాళ్ళు ఉన్న అనేక తీరపక్షులు సరస్సు, దీవుల తీరప్రాంతాలలో ఇరుకైన ప్రదేశాలలో కనిపిస్తాయి. ఇందులో ఉల్లంకి పిట్టలు, ఏటిగట్టు పిట్టలు, ఉల్లాము పిట్టలు, బురదనేలల మీద భరతపక్షులు, తోకలు ఆడించే నీటి జంతువులు, తీతువపిట్టలు వంటివి కూడా చూడొచ్చు.

అరుదైన జీవజాతులు
ఈ సరస్సులోని నీటిలో, దీవుల్లో అరుదైన జీవజాతులు చాలా రకాలున్నాయి. ఆకుపచ్చ సముద్ర తాబేలు, డుగాంగ్‌, ఇరవాడి డాల్ఫిన్లు, నల్లమగజింక, తెడ్డుమూతి సాండ్‌పైపర్‌, అవయవాలు లేని స్కింక్‌, వేటాడే పిల్లి తదితర రకాల జంతువులు, సరీసృహాలున్నాయి. వృక్షాలు, మొక్కల్లో 496 తెగలకు, 120 కుటుంబాలకు చెందిన 726 పుష్పజాతులను ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఇక్కడ దాదాపు 2900 వృక్ష జాతులను గుర్తించి పరిరక్షిస్తున్నారు.


ఇరవాడి డాల్ఫిన్ల ప్రత్యేకత
ఇరవాడి డాల్ఫిన్‌ అనేది చిల్కా సరస్సులో మాత్రమే కన్పించే ముఖ్య జాతి. ప్రపంచంలోని రెండు సరస్సులలో మాత్రమే ఈ అరుదైన డాల్పిన్లుండగా అందులో ఇది ఒకటి కావడం విశేషం. వీటిని వేటాడడాన్ని పూర్తిగా నిషేధించారు. జాలరుల వలలకు ఇవి చిక్కితే వెంటనే నీట్లోకి విడిచి పెట్టేస్తుంటారు. డాల్ఫిన్‌ పర్యాటకం అనేకమంది స్థానికులకు ప్రత్మామ్నాయ ఉపాధిగా ఉంది. వీటిని చూడటానికి ఆసక్తి చూపే పర్యాటకులను సరస్సులోకి తీసికువెళ్లటానికి చాలా పెద్దవైన మోటారు బోట్లున్నాయి. నాలుగు పర్యాటక సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. దాదాపు వెయ్యికి పైగా జాలరుల కుటుంబాలు వీటిపై ఆధారపడి ఉన్నాయి. ఏడాదికి సుమారు లక్షమంది పర్యాటకులు కేవలం డాల్పిన్లను చూడడానికే ఇక్కడకు వస్తారని వారు చెబుతున్నారు.


సందర్శనీయ ప్రాంతాలు
చిల్కా సరస్సులో సందర్శనీయ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో నల్బాన దీవి పక్షుల కేంద్రం గుర్తింపు పొందింది. అయితే వర్షాకాలంలో ఈ దీవి అదృశ్యమైపో తుంది. నీరు తిరిగి వానాకాలం తరువాత కనిపిస్తుంది. విహార శిబిరాన్ని వేసుకోవడానికి తగిన ప్రదేశం నిర్మల్‌ఝార్‌ జలపాతం. ఇది చిల్కా సరస్సు నుంచి 12 కిమీ దూరంలో ఉంది. సాత్పదా ద్వీపకల్పం చిల్కా సరస్సు తూర్పు భాగంలో ఉంది. ఈ ప్రాంతం మూడువైపులా సరస్సులతో చుట్టబడి ఉంది, అందుచే అవి ఈ ప్రాంతాన్ని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా ప్రకృతి ఆరాధకులు భావిస్తారు. ది బ్రేక్‌ఫాస్ట్‌ ఐల్యాండ్‌ సంకుద దీవి, హనీమూన్‌ ఐల్యాండ్‌ వంటి ప్రదేశాలను ఎన్నింటినో చూసి ఆనందించవచ్చు


వసతులు-ఆహారం
అక్టోబర్‌ నుంచి మార్చి నెల వరకూ చిల్కా సరస్సు సందర్శనకు అనుకూలమైన కాలం. పర్యాటకుల సౌకర్యార్థం ఎక్కడికక్కడ రిసార్టులు, హోటళ్లు అందుబాటు ధరల్లోనే లభిస్తాయి. చేపలు, రొయ్యలతో తయారుచేసిన ప్రత్యేకమైన వంటకాలు సందర్శకులను ఆకర్షిస్తుంటాయి.

ఎలా చేరుకోవాలి?
దేశంలో ఎక్కడి నుంచైనా చిల్కా సరస్సుకు చేరుకోవడం చాలా సులభం. విశాఖపట్నం నుంచైతే ట్రైన్లో కేవలం ఆరు గంటల వ్యవధిలోనే చిల్కా రైల్వేస్టేషన్‌కు చేరుకోవచ్చు. చెన్నై- హౌరా జాతీయ రహదారి, రైలు మార్గాలకు సమీపంలోనే ఇది ఉంది. అతి దగ్గరలోనే భువనేశ్వర్‌ విమానాశ్రయం ఉంది. కేవలం చిల్కా సరస్సు మాత్రమే కాకుండా పూరీ, కోణార్క్‌, నందన్‌కానన్‌, లింగరాజ దేవాలయం వంటివాటిని కూడా ఈ పర్యటనలో చూసే అవకాశం ఉంటుంది.

- బెందాళం క్రిష్ణారావు

అక్ష‌ర ప్రపంచంలో హ‌రివిల్లు‌లు



ఎంతో ఇష్టంగా గ్రంథాలయాలకు వెళ్లి, సైలెన్స్‌ ప్లీజ్‌ బోర్డుల కింద కూర్చుని చదువుకునేంత తీరికా ఓపికా తగ్గిపోతున్న రోజులివి. ఇంటిల్లిపాదీ ఆనందంగా ఒక మంచి పుస్తకాన్ని గురించి మాట్లాడుకునే పరిస్థితీ ఎక్కడా లేదు. కేవలం వేలి కొసలతో చిటికెలో బ్రౌజైపోయి, కావల్సిన వాటిని డౌన్లోడ్‌ చేసిపెట్టే స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ల కాలంలో ఉన్నాం. కానీ మనిషి ఆకాశమంత ఎత్తు ఎదిగినా.. కాళ్లు నేలమీదే ఉండాలి.. ఉండక తప్పదు. శరవేగంతో పరుగులు తీస్తున్న కాలంలో మనసుతో మాట్లాడే నేస్తాలు నిజంగా పుస్తకాలే. వాటిని పసిమనసులకు పరిచయం చేసి, వారికి అవసరమైనవి కానుకగా ఇచ్చే అవకాశాన్ని తల్లిదండ్రులకు అందిస్తున్నాయి పుస్తక మహోత్సవాలు. విజయవాడలో గత రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రతియేటా పుస్తక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలో తిరుపతి, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కూడా పుస్తకమహోత్సవాలు జరిగాయి. ఇటీవలే హైదరాబాద్‌లోనూ జరిగాయి. ఈ పుస్తక సంబరాల్లో పిల్లల సందడి విశేషాలు నేటి 'జీవన'లో....


పిల్లలు పెరిగే క్రమంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కనిపించే ప్రతి విషయం మీదా ఆసక్తిని పెంచుకుంటారు. వాటి గురించి తమ తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు వివేకవంతులైతే తమ చిన్నారుల సందేహాలను నివృత్తి చేస్తూ, వారికి విషయ పరిజ్ఞానం కలిగిస్తారు. అదే వివేక శూన్యులైన తల్లిదండ్రులైతే 'ఏమిటీ నస?' అంటూ తమ పిల్లలపై విసుక్కుంటూ వారి ఆసక్తిని ఆదిలోనే సమాధి చేసేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లలకు తగినంత విజ్ఞానం అందించాలన్న తపన తల్లిదండ్రుల్లో ఎక్కువగానే కన్పిస్తోంది. కానీ అందుకోసం సరైన ఆచరణ మాత్రం కన్పించడం లేదు. పిల్లలకు అవసరమైన పుస్తకాలు అందించి, వారిచేత చదివించాలన్న తల్లిదండ్రులూ ఎక్కువమందే ఉన్నారు. నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి పిల్లలు అమాయకంగా కనపడతారేగానీ పెద్దలు నేర్పించే దానికంటే త్వరగానే అన్నీ నేర్చుకుంటారు పిల్లలు. కంప్యూటర్ల వల్ల, అంతర్జాలం వల్ల విషయాలు తెలుస్తాయేమోగానీ జ్ఞానం పెరగదు. అందుకు పుస్తకాలు చదవడం ఒక్కటే మార్గం.


ఎదిగే మనసులకు
పిల్లలు ఎదిగే వయసులో వారి మనసులకు ప్రపంచాన్ని అర్థంచేసుకునే విధంగా ఆసక్తి కలిగించాలి. సమాజం పట్ల, మానవ సంబంధాల పట్ల తగిన విషయ పరిజ్ఞానం, సజనాత్మకత పెంచాలి. తాము చదివిన పుస్తకాల సాయంతో పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. పిల్లల కోసం ప్రస్తుతం అనేకరకాల పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది అవసరమో? ఏది అవసరం లేనిదో? ఎంపికచేసి పిల్లలకు ఇచ్చి, వాటిని చదివించేలా చూసే బాధ్యత పెద్దవాళ్లదే. ఎందుకంటే పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేస్తున్నారు. అందులోని విశాలతత్వానికి, మానసిక అభివృద్ధికి దోహదపడకుండా, కేవలం పరీక్షలకు అవసరమయ్యే ప్రశ్న, జవాబులనే బట్టీ పట్టిస్తున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలకాలంటే పిల్లల్లో పఠనాసక్తిని పెంచాలి. పుస్తక పఠనం ఎన్నో జీవిత సత్యాలను నేర్పిస్తుంది. పదేళ్ల వయసులోపు బాలమిత్ర, చందమామ, కామిక్స్‌ పుస్తకాలను చదివించి... తర్వాత హాస్యాన్ని అందిస్తూ, ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే పంచతంత్ర, నీతి కథలు, సమాజాన్ని అర్థం చేయించే కథలు, సుప్రసిద్ధుల జీవిత చరిత్రలు వంటి పుస్తకాలు చదివేలా చూడాలి.

ఎంతో ప్రయోజనం
పుస్తకం ప్రపంచ వీక్షణానికి తొలిమెట్టు. అసమాన ప్రతిభా పాటవాలను నేర్పించే గురువు. తెలియని విషయాలను విశదీకరించే మిత్రుడు. మేధస్సు పెరగాలంటే పుస్తక పఠనం తప్పనిసరి. సమాజాన్ని అర్థంచేసుకునే రచనలు, కథలు, కథానికలు ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పుస్తకాలు తప్పకుండా ఉండేవి. ఇప్పుడు ఉరుకులు, పరుగుల జీవితం పుస్తక పఠనాన్ని తగ్గిస్తోంది. అప్పట్లో పిల్లలు చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలను ఆసక్తిగా చదివేవారు. దానివల్ల విజ్ఞానంతో పాటు భాషా పరిజ్ఞానం పెంపొందేది. పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంది.

పిల్లల్లో పఠనాసక్తి పెరగాలంటే
నేటి తరం పిల్లల్లో పుస్తకాలు చదవాలన్న ఆలోచనని పెంచాలి. టీవీలు, ఇంటర్నెట్‌లతో పిల్లలపై రకరకాల దుష్ప్రభావాలు పడతాయని గుర్తించాలి. వాటికి ప్రత్యామ్నాయంగా వారితో పుస్తకాలు చదివించడాన్ని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయించాలి. కథలు, కామిక్స్‌ పుస్తకాల్ని పెద్దవాళ్లే పెద్దగా చదివి, పిల్లలకు వినిపిస్తుంటే వారికి ఆసక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు విన్న విషయాన్నే మళ్ళీ మళ్లీ చెప్పించుకోవటం.. నచ్చిన బొమ్మల్ని పదే పదే చూడటం.. అనే అలవాటు ఉంటుంది. అందుకోసం అమ్మో, నాన్నో చదివిన పుస్తకాన్ని వాళ్ళు మళ్లీ తెరిచే ప్రయత్నాలూ చేస్తారు. వీలైనంత వరకూ పిల్లలకు ఎక్కువ పుస్తకాల్ని అందుబాటులో ఉంచాలి. దాంతో వాళ్లల్లో వాటిని చూడాలన్న, చదవాలన్న కుతూహలం పెరుగుతుంది. మొదట్లో ఎక్కువగా బొమ్మలుండే పుస్తకాలైతే వారికి ఆసక్తిగా ఉంటుంది. బొమ్మల్ని చూపించి, కొద్దిగా కథ చెప్పి వదిలేస్తే, ఆపైన వారే వాటిని చదవటం ప్రారంభిస్తారు. పిల్లలు నిద్రపోయే ముందు కథలు వినేందుకు ఇష్టపడతారు. అలా కథలు చదివి వినిపిస్తూ ఉంటే, కొన్నాళ్లకు వారికీ అది అలవాటైపోతుంది. ఇంట్లోని పెద్దలంతా అలా చదివే అలవాటు ఉంటే పిల్లలకూ అది అలవడుతుంది.

పిల్లలతో చర్చించాలి
పిల్లలు చదివే పత్రికలు, కథలు, బొమ్మల పుస్తకాల గురించి వీలైనంతవరకు వారితో చర్చించాలి. వాటి గురించి వివరించాలి. చదివే అలవాటును నెమ్మదిగా వారిలో కొనసాగించాలేగానీ.. ఒక్కసారే అది సాధ్యపడదన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తెరిగి, ప్రవర్తించాలి. వారికి పుట్టినరోజులకు, ఇతర సందర్భాల్లో మంచి మంచి పుస్తకాలను కానుకలుగా ఇవ్వాలి. ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో రకం పుస్తకం అవసరం. ప్రారంభంలో బొమ్మలున్న కథల పుస్తకాలతో మొదలుపెట్టి, ప్రపంచ నాగరికతలు, వింతలు, శాస్త్రవేత్తలు, పరికరాలు, సాహసగాథలు ఇలా ఒక్కోరోజు ఒక్కో కొత్త విషయాన్ని తెలిపే పుస్తకాలను చదివించాలి. అలా చదివించి, పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి.

ఎన్నో రకాల పుస్తకాలు
బాల్యం నుంచి భాషపై పట్టు సాధించడం, గణితం, సైన్స్‌ మూలసూత్రాలు తెలుసుకోవడం పిల్లలకు ఎంతో అవసరం. పిల్లల్లో భాషా సామర్థ్యాన్ని పెంచే డిక్షనరీలతోపాటు, పదాలతో ప్రయోగాలు చేసే కథలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్‌, తెలుగులో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఉపయుక్తమైన జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం డిక్షనరీలు ఉన్నాయి. ఇంకా నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, స్కాలస్టిక్‌, డ్రీమ్‌ల్యాండ్‌, ఏకలవ్య, అమరచిత్ర, నవరత్న, పీకాక్‌, ప్రగతి, అలకనంద, ప్రజాశక్తి, మంచిపుస్తకం, ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, కొలిన్స్‌, తెలుగు అకాడమి, డి. బోస్‌ తదితర సంస్థల ప్రచురణలు ఆకర్షణీయమైన రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోని ప్రముఖుల జీవిత చరిత్రలు పిల్లలను బాగా ఆకర్షిస్తున్నాయి. షార్ట్‌ స్టోరీస్‌, చిత్రకథలు, యాక్టివిటీ బుక్స్‌, ఆయా ప్రచురణ సంస్థల క్లాసిక్స్‌ ఈ పుస్తక ప్రదర్శనల్లో అందుబాటులో ఉంటున్నాయి.

పుస్తకాలే గొప్ప ఆస్తి
మన తర్వాత్తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? మా పిల్లలు చిన్నప్పటి నుంచే పుస్తకాలపై ఆసక్తి ఉండడం చూసి మాకు అనందం కలిగింది. అందుకే వారికి ఏ పుస్తకం అడిగినా వెంటనే తెచ్చి ఇస్తాం.
- వి.ఆర్‌.కె.రావు, మొగల్రాజపురం, విజయవాడ.

పిల్లలలో సృజన
పిల్లలతో రకరకాల పుస్తకాలు చదివించడం వలన వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. వారిని కేవలం సిలబస్‌ పుస్తకాలకే పరిమితం చేయకూడదు. ఈ పుస్తక మహోత్సవంలో పిల్లలకు అవసరమైన పుస్తకాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా పిల్లల కోసమే పుస్తకాల స్టాల్స్‌ ఏర్పాటు చేయడం బావుంది.
- సుహాసిని, విజయవాడ.

కామిక్స్‌ కథలంటే ఇష్టం
నాకు కామిక్స్‌, కథల పుస్తకాలంటే చాలా ఇష్టం. అలాంటి పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. బొమ్మలతో ఉన్న పుస్తకాలు చాలా ఉన్నాయి. స్కూల్‌ బుక్స్‌ చదువుతూనే ఖాళీ టైములో ఇలాంటి పుస్తకాలు చదువుతాను.
- శ్రీ వల్లభ్‌, 3వ తరగతి, విజయవాడ.

సైన్స్‌, జికె పుస్తకాలు బాగున్నాయి
ఈ ఎగ్జిబిషన్‌లో మంచి పుస్తకాలు దొరుకుతున్నాయి. చాలా స్టాల్స్‌లో మాలాంటి వారికి అవసరమైన పుస్తకాలే ఉన్నాయి. ఎక్కువగా సైన్స్‌, జనరల్‌ నాలెడ్జి పుస్తకాలు బాగున్నాయి.
- సాత్విక్‌, 5వ తరగతి, విజయవాడ.


                                                                                               - బెందాళం క్రిష్ణారావు

యువ గ‌ళాల్లో‌... దేశ‌భ‌క్తి

 

చీపుర్లు పట్టుకుని వీధులన్నీ శుభ్రం చేయడాన్నే దేశభక్తి అంటాడొకాయన. డిజిటిల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా అనడమే అసలు సిసలైన దేశభక్తి అంటాడు మరోకాయన. సినిమా థియేటర్లలో బొమ్మ పడేముందు 'జనగణమన' వేయగానే.. నిలబడి గొంతెత్తి సెల్యూట్‌ చేయడమే నిఖార్సైన దేశభక్తి అని కదం తొక్కుతాడు ఇంకొక పెద్దాయన. పార్కులో ఆడామగ జంటగా కనిపిస్తే చాలు.. బలవంతంగా తాళి కట్టించేసి... ఇదే హిందూస్థాన్‌ దేశభక్తి అంటూ హడల్‌ గొడతాడు మరొకడు. మేము చెప్పిందే 'వేదం'... మేము చేసేదే 'ధర్మం'.. కాదన్నవారంతా దేశద్రోహులే అంటాడు ఇంకొకాయన. ఇలా చెప్పుకుంటూపోతే దేశంలో పెట్రేగుతున్న దేశభక్తి, దేశభక్తుల గురించి అనేకం చెప్పుకోవాలి. మరి దేశభక్తి అంటే ఇదేనా..? కాదు.. కానేకాదంటోంది నేటి యువత. అసలు దేశభక్తి గురించి ఈ దేశపు యువత ఏమంటోంది?! అర్థవంతమైన వారి మాటలు విందాం పదండి!!
దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా 'దేశభక్తి' అనే మాట రకరకాల ప్రభావాలకు లోనౌతోంది. బ్రిటీష్‌ పాలనను ఎదిరించి, స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడమే ఆనాటి దేశభక్తి. ఆ స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. పరాయి పాలకుల నుంచి దేశాన్ని సాధించుకుని, స్వంతంగా పరిపాలనని కొనసాగిస్తున్నాం. దానికోసం ఒక రాజ్యాంగాన్ని సరిగ్గా 67 యేళ్ల కిందట ఇదేరోజు అమలులోకి తీసుకొచ్చాం. అయితే ప్రజలంతా తమకు విధేయులుగా ఉండడమే నేటి పాలకులు చెబుతున్న దేశభక్తి. కానీ ఈ ఇలాంటి దేశభక్తిని అంగీకరించే స్థితిలో ఈ దేశపు యువత సిద్ధంగా లేదు.
దేశమంటే మట్టికాదోరు!!
''దేశభక్తి'' అనే నాలుగు అక్షరాలు దేశాన్ని ముందుకు నడిపించి ఎంతో స్ఫూర్తి రగిలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ''దేశమంటే మట్టికాదోరు.. దేశమంటే మనుషులోరు..'' అన్నాడు గురజాడ. దేశభక్తి అంటే అన్యాయాలపై ఒక ధిక్కారం, సకల దోపిడీ పీడనలపై తిరుగుబాటు, శత్రువుల గుండెల్ని బేజారెత్తించే రణ నినాదం. అంతటి దీప్తితో, వీరోచిత శౌర్యంతో నిప్పులు చెరగాల్సిన ఒక పదం నేడు పాలకుల సంకుచిత రాజకీయాలకు బలై, మొక్కుబడి ప్రహసనంగా మిగిలిపోవడం ఒక విషాదం.
68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశభక్తిపై యువతరం మనోభావాలు ఏమిటని 'జీవన' ఆరా తీసింది. పాలకులు దేశభక్తిపై ఎన్ని మౌఢ్యపు పొరలు కప్పాలని అనుకుంటున్నా ఈ విషయంలో తాము స్పష్టతతోనే ఉన్నామని యువత గొంతెత్తి చెబుతోంది. కేవలం జాతీయ గీతాన్ని ఆలపించడం, జాతీయ జెండాకు వందనం చేయడం మాత్రమే దేశభక్తి కాదని స్పష్టం చేస్తోంది.
పాలకుల దేశభక్తికి భిన్నంగా
దేశభక్తి ముసుగులో స్వంత ఎజెండాలు అమలుచేస్తున్న వైనాన్ని కూడా యువత నిలదీస్తోంది. గొడ్డు మాంసం తినేవాళ్లు, ప్రధాని మోడీని విమర్శించిన వారు, పెద్దనోట్ల రద్దుని వ్యతిరేకించిన వారు దేశద్రోహులంటూ.. ఇలా వివిధ సందర్భాలలో పాలకులు దేశభక్తికి సొంత నిర్వచనాలు చెప్పుకుంటున్నారు. కానీ దీనిని అంగీకరించే స్థితిలో నేటితరం లేదనే దానికి వీరి మాటలే ఓ ఉదాహరణ.
కుల, మత ద్వేషాలొద్దు
''విభిన్న జాతులు, విభిన్న మతాల సమాఖ్య ఈ దేశం. ఆహారం అలవాట్లు పేరుతో ఈ ప్రజలను విడదీయాలను కోవడం అర్థ రహితం. జెండా ఎగరేయడమో, భారతమాత చిత్రపటాలకు దండలేయడమో, దేశభక్తి కాదు. కుల, మత అసహనాలను తొలగించి, అందర్నీ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో మమేకం చేయడమే నిజమైన దేశభక్తి'' అని నెల్లూరుకు చెందిన సుప్రియ, దినేష్‌, డి.నవీన్‌లు చెప్పారు. ''మతాల పేరుతో దేశభక్తిని కొలిచే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. ముస్లింలంతా పాకిస్తాన్‌ వెళ్లిపోవాలన్నట్లు కొందరు మాట్లాడుతుండడం సరికాదని, అన్ని మతాలవారికీ ఇక్కడ సమానంగా జీవించడానికి హక్కులు ఉన్నాయని గుర్తించడమే దేశభక్తి'' అంటూ అనంతపురం విద్యార్థిని ఆసిఫా సుల్తానా, కడపకు చెందిన కలమల సుభాన్‌ భాషా, ఆరీఫ్‌, ఎం.వెంకయ్య తదితర విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ''అన్ని మతాల ప్రజలూ రాజ్యాంగానికి నిబద్ధులై నడుచుకోవాలి. సామాజిక హక్కులకు ప్రభుత్వాలు, ప్రైవేట్‌ వ్యవస్థలూ భంగం కలిగించకూడదు. సర్వమత సామరస్యంతో లౌకిక స్ఫూర్తిని కాపాడు కోవడమే దేశభక్తి'' అంటున్నారు కర్నూలుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు కె.ప్రియాంక, ఇ.లిఖిత, బి.ఎస్సీ విద్యార్థి బి.బాలస్వామి నాయక్‌లు. ''కులం, మతం మాట మరిచి, సాటి మనిషిని సోదర ప్రేమతో చూడాలి. కుల, మతాల పేరుతో హింసా ప్రవృత్తిని విడనాడాలి. కుల, మత వర్గ వైషమ్యాలకు వ్యతిరేకంగా పనిచేయాలి. మహిళలను గౌరవించాలి. లింగ వివక్షను విడనాడడం కూడా దేశభక్తిలో ఒక భాగమే'' అని చెబుతున్నారు ఒంగోలుకు చెందిన వి.లక్ష్మణ్‌, సిహెచ్‌. ఝాన్సీ, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి విద్యార్థి కె. సాయి తనోజ్‌, నర్సీపట్నం విద్యార్థి నరేంద్ర గోపి తదితరులు.
''దేశ ప్రజలను కుల, మతాలుగా విభజించి, విద్వేషాలు రేపుతున్న వారికి వ్యతిరేకంగా యువతరం సంఘటితమై పోరాడాలి. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ కుల వివక్షని అంతమొందించడమే దేశభక్తి'' అని తెనాలికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగిని కె.కిరణ్మయి, విజయనగరం విద్యార్థి డి.చిన్నికృష్ణ వంటివారు అభిప్రాయపడుతున్నారు.
అవినీతిని ప్రశ్నించడమే
''స్వాతంత్య్రం వచ్చాక స్వపరిపాలన కోసం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. కానీ కావాలనే దానిని తమకు అనుకూలంగా చాలామంది పాలకులు సవరించుకుంటూ అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రయత్నాలను నిలువరించి, వారి అవినీతికి అడ్డుకట్ట వేయడం కూడా దేశభక్తే'' అని ఒంగోలు విద్యార్థి ఎం.సౌమిత్‌, పాడేరు విద్యార్థి కె. సుధీర్‌లు చెబుతున్నారు. ''అన్యాయాలను ఎదిరించడం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం, ప్రతి పౌరుడూ అవినీతికి అవకాశం ఇవ్వకుండా నిజాయితీతో వ్యవహరించడం దేశభక్తి'' అంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి విద్యార్థి డి.హరిబాబు, కర్నూలు విద్యార్థి కె. ఉమామహేష్‌, అనంతపురం జిల్లా పర్వతదేవ పల్లి విద్యార్థి చల్లా నరేష్‌, తదితరులు స్పష్టం చేస్తున్నారు. ''నిజాయితీగా స్పందించే తత్వంతో ఇతరులకు సాయం అందించాలి. నాటి త్యాగధనుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, అవినీతికి దూరంగా ఉండాలి. గ్రామాల్లోని పేదలకు అమలు చేసే సంక్షేమ కార్యమ్రాల్లో అవినీతి లేకుండా చూడడం, తప్పుచేసిన వారిని నిలదీయడం కూడా దేశభక్తి'' అని చెప్పారు శ్రీకాకుళం జిల్లా కనిమెట్ట, ఇబ్రహీమ్‌బాద్‌, శ్రీముఖలింగం విద్యార్థులు చౌదరి కీర్తన, సీపాన హారతి, కె.మణికంఠ తదితరులు.
సేవాభావమే ఊపిరిగా
''సమాజాన్ని ప్రేమించి, సామాజిక సేవ చేయడమే దేశభక్తి'' అని విజయవాడ విద్యార్థులు జి.బాలకృష్ణ, ఏ.అరుణ్‌కుమార్‌ తదితరులు చెబుతున్నారు. ''తోటివారికి ఏదో ఒక మేలు కలిగించాలి. దేశానికి మేలు చేయాలనే తపన ఉండాలి. స్వార్థం లేకుండా అన్నివర్గాల ప్రయోజనాలూ కాపాడాలి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలి. ఇదంతా దేశభక్తిలో భాగమేనని'' కడప విద్యార్థి కె.వెంకటేష్‌, విజయనగరం విద్యార్థి పి.నవీన్‌, నెల్లూరుకు చెందిన ఎం.చెంచమ్మ తదితరులు స్పష్టం చేస్తున్నారు. ''ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా అభివృద్ధికి కృషి చేసి, సేవ ద్వారా అన్ని రంగాలలో రాణించడమే దేశభక్తి'' అని తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు లీలాసాయి, జి.గురుప్రసాద్‌ తదితరులు భావిస్తున్నారు. విశాఖపట్నంలోని విద్యార్థులు ఎస్‌.మాధవి, ఎల్‌. వెంకటరమణ, ఎం.జ్ఞానేష్‌, ఎం.తారకేశ్వరరావు తదితరులు ''దేశంలోని నిరుపేదలకు సేవచేయడమే నిజమైన దేశభక్తి. దాని ద్వారానే మంచి సమాజం సాధ్యమౌతుంది'' అని చెబుతున్నారు. ''దేశ ఐక్యతకు కృషి చేయడమే దేశభక్తి. రాజకీయ పార్టీల స్వార్థపూరిత అవసరాలకు ఎంతమాత్రమూ ఉపయోగపడకూడదు. దేశభక్తిపై యువత చైతన్యం పొందాలి'' అని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి జయకర్‌ అంటున్నారు.
అంతో ఇంతో సంతోషించ దగ్గ విషయమేమంటే పాలకులు, ప్రసార మాధ్యమాలు ఎంత గందరగోళాన్ని సృష్టించినా 'దేశభక్తి' అనే అంశంపై నవతరం అభిప్రాయాలు స్పష్టంగా ఉండడం ఆహ్వానించదగిన పరిణామం. వారంతా ఈ దేశంలో సరికొత్త ఆశలతో, ఆశయాలతో తపిస్తూనే ఉన్నారని వారి మాటలే తేటతెల్లం చేస్తున్నాయి.

నిరుద్యోగం లేకుండా
దేశంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఎందుకంటే, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. పాలకులు నిరుద్యోగం తగ్గించే ప్రయత్నం చేస్తే, అది కూడా దేశభక్తికి కొలమానమే అవుతుంది.
- శివ ప్రసాద్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌, ఎస్‌వియూ, తిరుపతి

ప్రశ్నిస్తే దేశద్రోహమా?!
దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే, దేశ ద్రోహులుగా నేడు చిత్రీకరిస్తున్నారు. అన్యాయాలను, నాయకుల తీరును ఎండగడితే దేశ ద్రోహులని అనడం ఘోరం. రాజకీయ నాయకులు దేశభక్తిని మాటల్లో చూపుతున్నారే తప్పా, అది చేతల్లో కనపడ్డంలేదు.
- జి.శ్రీను, పాడేరు, విశాఖజిల్లా.

దేశభక్తి పేరుతో ప్రచారం
దేశభక్తి పేరుతో కొంతమంది రకరకాల ప్రచారం చేసుకుంటుంటారు. ఈ దేశంలో చదువుకుని, డబ్బుల కోసం విదేశాల్లో పనిచేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడే ఉండి, దేశం కోసం పనిచేయాలి. అదే నిజమైన దేశభక్తి.
- పి.హేమలత, బిజెడ్‌సి తృతీయ, శ్రీకాకుళం
కుల వివక్షలేని.. దేశభక్తి
దేశాన్ని గౌరవించాలి, మత సామరస్యాన్ని కాపాడాలి. విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. కుల వివక్ష లేని సమాజం కోసం పాటుపడాలి. అప్పుడే దేశభక్తికి సార్ధకత.
- కొత్త కిరణ్మయి, ప్రయివేటు ఉద్యోగిని, తెనాలి.
హక్కులకు భంగం లేకుండా
భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనది. అన్నిమతాల వారు రాజ్యాంగానికి బద్ధులై నడుచుకోవాలి. ఏ దేశంలో ఉద్యోగం చేసినా, ఈ దేశానికి గౌరవం తేవాలి. మనకున్న హక్కులకు భంగం కలిగించకుండా ఉండడమే దేశభక్తి.
- కె. ప్రియాంక, బిటెక్‌ ఫైనల్‌, కర్నూలు
కులమతాలకు అతీతంగా
మతమేదైనా.. కులమేదైనా సాటి మనిషిని గౌరవించడం మన కర్తవ్యం. ప్రపంచ దేశాలకు ఎన్నో నేర్పించిన ఘనత మనది. కులం, మతం మాటమరచి, సాటి మనిషిని సోదర ప్రేమతో చూస్తేనే నిజమైన దేశభక్తులం.
- వి.లక్ష్మణ్‌ ఒంగోలు

30, డిసెంబర్ 2016, శుక్రవారం

వంశ‌ధార తీరాన సైక‌త సందేశం

ఏ కళ అయినా కేవలం జీవనోపాధికి మాత్రమే పరిమితం కాకూడదు. దానికి విస్తృత సామాజిక ప్రయోజనం ఉండాలి. అతడు తన జీవికకూ, ఆశయానికీ సైకత శిల్పాలను సృజించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అందుకు వంశధార నదీ తీరాన్నే వేదికగా చేసుకున్నాడు. అలా పుష్కర కాలంగా మొదలైన అతని సైకత శిల్పకళా నైపుణ్యం దేశంలోనే పేరెన్నికగన్న కళాకారుల్లో ఒకరిగా నిలిపింది. అతనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైకత శిల్ప కళాకారుడు తరణీ ప్రసాద్‌ మిశ్రో. సైకత శిల్పకళలో మిశ్రో 'జీవన' ప్రస్థానం ఆయన మాటల్లోనే..
 
రాష్ట్రానికి ఈ కొసనున్న శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీనర్సుపేట మా ఊరు. నేను సైకత శిల్ప కళాకారుడిగా ఎదగడం ఒక్కరోజులో జరిగేపనీ కాదు. కుటుంబపరంగా ఎన్నో కష్టాల్ని అధిగమించి, నాదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ జీవన సమరం చేస్తున్నాను. కళని ఒక సాధనంగా మలచుకుని, ముందుకు కొనసాగుతున్నాను.
మాది అతి సాధారణమైన కుటుంబం. సైన్స్‌ గ్రూపుతో 1997లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినా.. ఆర్థిక ఇబ్బందులతో ఆపై చదవలేకపోయా. నాన్న కాశీవిశ్వనాథ్‌కు మానసిక ఆరోగ్యం బాగోదు. దాంతో ఆయన చికిత్సకే ఉన్న నాలుగెకరాలూ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పటికి వయస్సులో చిన్నవాడినైనా తప్పనిసరై, ఉద్యోగాల వేటలో పడ్డాను. ఉద్యోగం రాలేదు. ఓవైపు నాన్న అనారోగ్యం, మరోవైపు కుటుంబపోషణ ఓ సవాల్‌గా మారాయి. అప్పటికే చిత్రలేఖనంలో కొంత ప్రవేశం ఉన్నా, దానివల్ల పెద్దగా లాభం లేకపోయింది. చేసేది లేక ఉపాధి కోసం విశాఖకి వలసపోయాను. అక్కడే ఆటోమొబైల్‌ గ్యారేజ్‌లో పెయింటర్‌గా మొదట జీవితాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కాంట్రాక్టర్‌ దగ్గర వెల్డర్‌గా కొంతకాలం పనిచేశాను. ఎంత కష్టపడినా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దాంతో కష్టాలూ ఎటూ తప్పవని అర్థమై, తిరిగి 2004లో సొంతూరుకు వచ్చేశాను. స్థానికంగా ఒక డ్రాయింగ్‌ టీచర్‌ దగ్గర చిత్రలేఖనంలో మెలకువలు తెలుసుకున్నా. బ్యానర్లు రాసుకుంటూ, పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడిని.

పూరీలో మలుపు తిరిగింది
పక్కనే ఉన్న ఒడిసా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ యాత్రకు మా కుటుంబసభ్యులతో కలసి వెళ్లా. అక్కడ సముద్రతీరంలో ఒక దృశ్యం నన్ను ఆకర్షించింది. అది ఒక మహిళ సైకత శిల్పం. అది నాకు ఎంతో ప్రేరణ కలిగించింది. అప్పుడే నేనూ సైకత శిల్పాలు రూపొందించాలనే నిర్ణయానికొచ్చాను. ఊరికి తిరిగొచ్చాక వంశధార నదీ తీరాన్ని అభ్యాసానకి వేదికగా చేసుకున్నాను. కొన్నినెలలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాకు నేనే గురువుగా భావించుకున్నా. నా ఊహలకు, ఆలోచనలకు రూపాల్ని ఇచ్చేవాడిని. అలా ఏకాగ్రతతో నేను చేసిన సాధన ఫలితమే నన్నీరోజు ఓ సైకత శిల్పికారుడిగా తీర్చిదిద్దింది. బ్రెజిల్‌ దేశానికి చెందిన సైకత శిల్పి అండ్రియన్‌ వజస్కీ కృషిని మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఆయన గురించి వివరాలు సేకరించి, కొత్త అధ్యయనం చేశాను. వివిధ దేశాల్లోని సైకత శిల్పాలపై ఇంటర్నెట్‌ సాయంతో పరిశీలన చేశాను. వాటిని భారతీయ సంస్కృతికి అన్వయిస్తూ, విభిన్నమైన శైలితో రూపకల్పన చేయాలని అనుకున్నా. ఆ క్రమంలో అలాంటి సైకత శిల్పిగా గుర్తింపునూ పొందాను.

కుటుంబ ప్రోత్సాహంతో
నా కళను అన్ని వేళలా కుటుంబసభ్యులు ప్రోత్సాహించడం జరుగుతోంది. ఈ కళతో కొంత ఆదాయం రావడం వల్ల డిగ్రీ పూర్తిచేశాను. నాన్న మరణించారు. ప్రస్తుతం నా కుటుంబం అమ్మ వసంతకుమారి, భార్య భారతి, ఇద్దరు పిల్లలు. వీరిని పోషించడమే నా ప్రధాన కర్తవ్యం. అందుకు ఈ కళే నాకు ప్రధానమైన ఉపాధి కూడా. కేవలం మా గ్రామం దగ్గరున్న నదీతీరమే నా సైకత శిల్పాలకు పరిమితం కాదు. జనావాసాల్లోనూ సైకత శిల్పాలు రూపొందిస్తుంటాను. పలుచోట్ల పెళ్లిళ్లు, వివిధ కంపెనీలు, సంస్థల ప్రమోటింగ్‌ ఈవెంట్లకూ లోగోలు, సృజనాత్మకమైన సైకత శిల్పాల్ని రూపొందింస్తుంటాను. సామాజికాంశాలతో ఉన్న వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి ప్రదర్శనలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక రోజుల్నీ శిల్పాలుగా మలుస్తాను. అవి నాకు ప్రముఖ గుర్తింపునూ తెచ్చిపెట్టాయి.

కళాత్మక విలువలతో
సైకత శిల్పాల్ని కొంతమంది ఔత్సాహికులు తయారుచేస్తున్నారు. అయితే కళాత్మక విలువలు కలిగిన వాటికే మంచి గుర్తింపు. ఒక్కో సైకత శిల్పం తయారీకి దాని పరిమాణాన్ని, విన్యాసాల్ని అనుసరించి నాలుగు గంటల నుంచి 36 గంటల వరకూ సమయం పడుతుంది. అతి తక్కువ సంభావ్యత గల వాలు తలంలో శిల్పాన్ని రూపొందించాలి. అవసరమైన చోట చిన్న చిన్న రంధ్రాలు కూడా చేస్తాను. శిల్పం కంటే వర్ణానికి ప్రాముఖ్యత ఉన్నచోట మాత్రమే రంగులు వాడతాను. ఈ సైకత శిల్పాన్ని భద్రంగా కాపాడగలిగితే ఎనిమిది రోజుల వరకూ అలానే ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటివి 400కి పైనే రూపొందించాను.

సందేశాలిచ్చే శిల్పాలు
ఏ ఊరు వెళ్లినా ఆ ఊరిలోని ప్రధానమైన సామాజిక రుగ్మత ఏదో గుర్తిస్తాను. దాని నుంచి బయటపడడానికి, అక్కడివారు చైతన్యం పొందేలా సందేశాలు రాస్తూ, సైకత శిల్పాన్ని రూపొందించడం నాకున్న ఒక అలవాటు. నూతన సంవత్సరం, రిపబ్లిక్‌ డే, ఉగాది, మహిళా దినోత్సవం, సంక్రాంతి, దసరా, దీపావళి, అక్షరాస్యతా దినోత్సవం, ఆగస్టు పదిహేను, కొత్త సంవత్సరాది వేడుకలు ఇలా ఏ సందర్భం వచ్చినా వెంటనే స్పందించి దాని సందేశాన్ని సైకత శిల్పం ద్వారా ప్రజలకు వివరిస్తాన. క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ గతంలో 200 పరుగుల నాటౌట్‌ రికార్డును సాధించిన సందర్భంలోనూ సైకత శిల్పం ద్వారా ప్రజలకు తెలియజేశాను. అది అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా రూపొందించిన సైకత శిల్పమూ ఎంతగానో ఆలోచింపజేసింది.

అక్షరాస్యతా ఉద్యమం, వయోజన విద్య, సంక్షేమ పథకాలు, బహుళార్థక ప్రాజెక్టులు, వందేమాతరం, వివిధ రకాల దేవుళ్ల సైకత శిల్పాలు, గాంధీ, అబ్దుల్‌ కలామ్‌ తదితర ప్రముఖులు... ఇలా నేను రూపొందించిన సైకత శిల్పాలు వంశధార నదీ తీరానికి వచ్చే సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టునేవి. ఈ సైకత శిల్పాల్ని చూసేందుకు ఒడిసా, ఉత్తరాంధ్ర జిల్లాల నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో వివాహాలు, ఇతర శుభ కార్యాలకు వివిధ వర్గాల వారు ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి, సందర్భానికి తగిన విధంగా అక్కడికక్కడే సైకత శిల్పాల్ని తయారు చేయించుకుంటుంటారు. దీనివల్ల నాకు ఆర్థికంగా ప్రయోజనం కలగడమే కాకుండా, వ్యక్తిగతంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో
ఢిల్లీలోని 'కింగ్‌డమ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌' పేరుతో ఉన్న థీమ్‌ పార్కులో మూడు సైకత శిల్పాల్ని ఏర్పాటు చేయడానికి ఆరేళ్ల కిందట పార్క్‌ నిర్వాహకులు నాతో ఒప్పందం చేసుకుని రూ.25 వేలు పారితోషికంగా ఇచ్చారు. అప్పటి నుంచీ అవసరమైనవారికి వారు కోరిన విధంగా సైకత శిల్పాల్ని రూపొందించి, అందిస్తుండడంతో జాతీయ స్థాయిలోనూ నా శిల్పాలకు మంచి గుర్తింపు లభిస్తోంది. దేశంలో న్యూ ఢిల్లీ, ముంబయి, పూనె, గోవా, హైదరాబాద్‌, అలంపూర్‌, పర్లాకిమిడి, మన ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల సైకత శిల్పాలను రూపొందించాను. సైకత శిల్పాల ప్రదర్శనలు కూడా నిర్వహించాను.


వారం ఉంటే గొప్పే
                           - తరణీ ప్రసాద్‌ మిశ్రో
సైకత శిల్పాల జీవితకాలం చాలా తక్కువ అయినప్పటికీ ఎంతో శ్రద్ధతో రూపొందించాలి. తగిన విధమైన ఇసుక, తేమ వంటివి అనుకూలంగా లేకపోతే వీటిని రూపొందించడం కష్టమే. అంతేకాదు వారం వ్యవధి దాటి అవి అలాగే ఉంటే, ఎంతో గొప్ప విషయం. నీటి ప్రవాహం వల్ల, తీవ్రమైన ఎండ వల్ల, పిల్లలు తొక్కి పాడుచేయడం వల్ల రూపురేఖలు మారి, మళ్లీ ఇసుకలో కలిసిపోతాయి. అప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది. కానీ తప్పదు. ఈ కళే మా కుటుంబానికి ఉపాధిని అందిస్తోంది.

                                                                                                                    ----- బెందాళం క్రిష్ణారావు
 

24, డిసెంబర్ 2016, శనివారం

నులక మంచంపై దాబా రుచులు



కాస్తంత ఊరికి దూరంగా.. కాసేపు అలా కారులోనో.. బస్సులోనో.. ఆటోలోనో లేదంటే బైక్‌పైనో ఫ్యామిలీతో నేషనల్‌ హైవే మీదుగా ప్రయాణం చేశాక.. నులక మంచం మీద బాసింపట్టు వేసుకుని చపాతీనో, పరాటానో తింటే ఎలా ఉంటుంది..? ''ఎందుకు బాగుండదూ.. చాలా చాలా బావుంటుంది'' అనేగా మీ మాట. రోటీన్‌కి భిన్నంగా ఏ వారంతంలోనో అలా గడపాలని అనుకునేవాళ్ళకు ఇప్పుడు 'దాబా'లు చక్కటి వేదికలు అవుతున్నాయి. ఒకప్పుడు రవాణా రంగంలో పనిచేసేవారికి మాత్రమే అన్నట్టుగా ఉండే దాబాలు ఇప్పుడు సామాన్యజనాల్నీ తనవైపుకి తిప్పుకునేలా చేస్తున్నాయి. ఇడ్లీ, ఉప్మా పెసరట్టు మొదలుకుని.. థమ్‌ బిర్యానీ, చికెన్‌ జాయింట్ల వరకూ.. ఎన్నో వెరైటీ రుచులకు, ఆటవిడుపు సాయంత్రాలకు దాబాలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి.

బాటసారులకు భోజన, విశ్రాంతి సదుపాయాలు కల్పించడానికి ఒకప్పుడు పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. ప్రస్తుతకాలంలో ఆధునిక పూటకూళ్ల ఇళ్లుగా దారిపక్కన దాబాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆధునికతను సంతరించుకుంటూ సరికొత్త రుచుల సమ్మేళనంతో దాబాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు దాబాలలో తినడానికి లారీలు, ట్రక్కుల డ్రైవర్లే ఎక్కువగా కన్పించేవారు. కానీ రోజులు మారాయి. కుటుంబాలతో సహా దాబాలకు వెళ్లి తినడం కొత్త ట్రెండ్‌గా తయారైంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుండంతో కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రధానమార్గంలో భోజన ప్రియుల్ని ఆకర్షిస్తున్న దాబాలు అనేకం.

ఉత్తరాది నుంచి
ఒకప్పుడు ఏదో వందో, ఏభైౖ కిలోమీటర్ల దూరంలో అదీ జాతీయ రహదార్ల పక్కన మాత్రమే దాబాలు ఉండేవి. జాతీయ రహదారిపై సుదూర ప్రాంతాలకు రేయింబవళ్ళు తిరిగే వాహనాల సిబ్బంది ఆకలి తీర్చేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడేవి. మొదట్లో పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు ఇటువంటి హోటళ్లను ప్రారంభించేవారు. ఉత్తరాది ప్రజల స్థానిక భాషలో వీటిని 'దాబాలు' అని పిలిచేవారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరే వీటికి స్థిరపడిపోయింది. అప్పట్లో పంజాబీలు ఎంతో ఇష్టంగా తినే రోటీలు, పుల్కాలు వంటివి, వాటికి కాంబినేషన్‌గా తడకా, రకరకాల కుర్మాలు లభించేవి. రాను రానూ తందూరీ వంటకాలు, బిర్యానీ, ఫ్రైడ్‌రైస్‌ వంటివి కూడా దాబాల్లో రాజ్యమేలుతున్నాయి.

పెరుగుతున్న ఆదరణ
వివిధ రాష్ట్రాల ప్రజల ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా దాబాల్లో వంటకాలు తయారీ జరుగుతున్నాయి. దాంతో వాటిని ఆస్వాదించడానికి వచ్చే స్థానిక, స్థానికేతర ప్రజలతో అవి కళకళలాడుతున్నాయి. పగటి సమయాల్లో కన్నా సాయంత్రం నుంచీ రాత్రి పది, పదకొండు గంటల వరకూ నిత్యం రద్దీగా కన్పిస్తున్నాయి. అందులోనూ కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి, పనిచేసేవారికి దాబాల్లో లభించే ఫుడ్‌ అనుకూలంగా ఉంటోంది.
కుటుంబ సమేతంగా
ఇటీవలి కాలంలో సకుటుంబ సమేతంగా ఈ దాబాలకు రావడం పెరుగుతోంది. స్టార్‌ హోటళ్లలో మాత్రమే లభించే వెరైటీఫుడ్‌ కూడా తమ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉండడం వల్ల చాలామంది దాబాలకు రావడానికి ఇష్టపడుతున్నారు. సాయంత్రమైతే చాలు ఎక్కువ మంది తమ టూవీలర్లు, కార్లపై దాబాలకు చేరుకుంటున్నారు. దీంతో దాబాల దగ్గర వాహనాల పార్కింగ్‌ సదుపాయాలను కూడా దాబాల నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. కావాల్సినంత సమయం దాబాల దగ్గర గడపడానికి అవకాశం ఉండడం వల్ల పిల్లలు, పెద్దలు, స్నేహబృందాలు ఇలా అన్నివర్గాలవారూ దాబాలలో గడపడానికి ఇష్టపడుతున్నారు.

వెరైటీ రుచుల కోసం
పంజాబీల ప్రత్యేక వంటకాలైన సర్సన్‌ కా సాగ్‌ అండ్‌ మక్కీ ది రోటీ, తందూరి కుక్కడ్‌, పిండీ చోలే, కడీ పకోడి, పన్నీర్‌ మఖనీ, ఇమ్మర్తీ, ఫిర్నీ, కేసర్‌ కుల్ఫీ, బటర్‌ చికెన్‌, ఆలూ ద ప్రంత, రాజ్మా చావల్‌ వంటి వెరైటీ ఫుడ్‌ దాబాల్లోనో తినగలం. అంతేకాదు నూనె లేకుండా కాల్చే తందూరీ రోటీతో పనీర్‌ బట్టర్‌ మసాలానో, జింజర్‌ చికెనో నంజుకోవడంలో ఉన్న మజా దేనిలోనూ ఉండదు. అదేవిధంగా కబాబ్స్‌, టిక్కాలు ఇలా ఒకటేమిటి తందూరీ ఐటెమ్స్‌ రుచే వేరు. తందూరీ చికెన్‌, తందూరీ మటన్‌, ఫిష్‌ తందూరీ, తందూరీ ఫ్రాన్స్‌, వెజిటేరియన్‌ వెరైటీలు...ఇలా రకరకాల వంటకాలు మంచి సువాసనతో ఘుమఘుమలాడిస్తూ నోరూరిస్తుంటాయి.
విస్తరిస్తున్న దాబాలు
దాబాలకు ఆహారరీత్యా పెరుగుతున్న డిమాండ్‌ చూసి, చాలా మంది ఈ వ్యాపార రంగంలోకి వస్తున్నారు. రహదారి పక్కన కాకుండా పట్టణ, నగరాల మధ్యన, శివారు ప్రాంతాల్లో కూడా వీరు దాబాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి రహదార్ల పక్కనున్న దాబాలకు కాస్తా భిన్నంగా ఉంటున్నాయి. రహదార్ల పక్కనున్న దాబాల్లో నులక మంచాలే భోజన టేబుళ్లుగా ఉంటే ఈ దాబాల్లో మాత్రం హోటళ్ల మాదిరిగా కుర్చీలు, ప్లాస్టిక్‌, టైల్స్‌తో తయారుచేసిన డైనింగ్‌ టేబుళ్లు ఉంటున్నాయి. ఆ దాబాల్లో అయితే భోజనానంతరం ఆయా వాహనాల సిబ్బంది కొంత సొమ్ము చెల్లించి, అక్కడే మంచాలపై ఆరాత్రి విశ్రాంతి తీసుకునే వీలుంది.

పండుగలు.. పార్టీలు
పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలను స్నేహితులు, సన్నిహితుల మధ్య జరుపుకోవడానికి చాలా మంది హోటళ్లను వేదికలుగా ఎంచుకుంటూ ఉంటారు. ఇటువంటివారు పట్టణాల్లోని హోటళ్ల కన్నా, దరిదాపుల్లో ఉన్న దాబాల్లో జరుపుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పట్టణాల్లోని హోటళ్లలోనైతే ఇలాంటివి జరుపుకోవడానికి అదనంగా సొమ్ము చెల్లించాలి. అదే దాబాల్లో అయితే అలాంటి ఖర్చులేమీ ఉండవు.
దాబాకి మరోవైపు
నాణేనికి మరోకోణం ఉన్నట్టుగానే కొన్ని దాబాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. చాలా దాబాలు బార్లని తలపిస్తూ మద్యం తాగేవారికి ఇవి అడ్డాలుగా మారుతున్నాయి. వీరి వలన చికెన్‌, మటన్‌ వంటి ఐటెమ్స్‌ కూడా బాగా అమ్ముడవుతాయని దాబా నిర్వాహకులు కూడా మందుబాబుల్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యభిచారం, జూదం వంటి కార్యకాలపాలు కూడా కొన్ని దాబాల్లో కొనసాగుతున్నాయనేది మరో ఆరోపణ. ఆహారం నాణ్యత పాటించని దాబాలూ ఉన్నారు. ఇలాంటి వాటిని సంబంధిత అధికారులు నివారించగలిగితే దాబాలు చక్కటి విందు, కాలక్షేపపు కేంద్రాలుగా ప్రజల ఆదరాభిమానాలను పొందగలవు.


నచ్చిన వంటలు
నాతో పాటు 20 మంది వరకూ ఒడిసాలోని బాలాసోర్‌ నుంచి వచ్చి, ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రజల ఆదరణ బాగుంది. తినేవారి అభిరుచులను బట్టి వారికి నచ్చినట్లు వంటలు చేసి, అందించడమే మా పని.
- ముస్సా బెహరా, వంటమాస్టర్‌.

ఆదరణ పెరిగింది
గత ఏడేళ్ల నుంచీ ఈ దాబాను నిర్వహిస్తున్నాను. అన్ని వర్గాల వారూ దాబాలకు వస్తున్నారు. మా దాబాలో అయితే కేవలం శాఖాహారానికే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తుండడంతో ఇటీవల కాలంలో దాబాలకు వచ్చేవారి సంఖ్య పెరిగింది.
- ప్రేమ్‌ కుమార్‌, డిలైట్‌ దాబా యజమాని, గుంటూరు హైవే
మంచి ఆహారం లభిస్తుంది
ఎప్పుడు డిన్నర్‌కు రావాలన్నా నేను దాబానే ప్రిఫర్‌ చేస్తా. విజయవాడ-గుంటూరు హైవేలో మంచి దాబాలున్నాయి. స్టార్‌ హోటళ్లకు దాబాలు ఏ మాత్రం తీసిపోవు. నచ్చిన రుచుల్లో కావాల్సిన ఆహారపదార్థాలెన్నో ఇక్కడ లభిస్తున్నాయి.
- ఎస్‌. సందీప్‌,
                                                                                            - బెందాళం క్రిష్ణారావు

ర‌మ‌ణీయ సంగీతం



ఏదైనా కళలో రాణించాలంటే కచ్ఛితంగా రోజుకి నాలుగు గంటలు నిరంతరాయంగా కష్టపడాలి. అదే.. ఆ కళలో నిష్ణాతులు కావాలంటే కనీసంగా ఎనిమిది గంటలైనా సాధన చేయాలి. అలా చేస్తేనే ఏ కళైనా అబ్బేది. అంతో ఇంతో వంటబట్టేది. ప్రపంచ కళాసాధకులంతా అలా కష్టపడి ఎదిగినవారే. అలాంటిది రెండు విభిన్నమైన కళల్లో సమర్ధనీయమైన ప్రవేశం ఉండటం మాటలు కాదు. అందునా సశాస్త్రీయమైన సంగీతంలోనూ, వాయులీన నాదంలోనూ సరిసమాన ప్రతిభ దక్కాలంటే ఎంతో సాధన కావాలి. అలాంటి సాధనకు ప్రతిరూపమే విశాఖపట్నానికి చెందిన సంగీత కళాకారిణి డాక్టర్‌ పంతుల రమ. మూడున్నర దశాబ్దాలకుపైగా దేశ, విదేశాల్లో సంగీత రంగంలో రాణిస్తున్న కళాకారిణి రమ సంగీత ప్రస్థానం 'జీవన' పాఠకుల కోసం.

విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ పంతుల రమ అంటే తెలుగునాట శాస్త్రీయ సంగీతంలో మంచి పేరున్న కళాకారిణి. అంతేకాదు, దేశ, విదేశాల్లోనూ అనేక కచేరీలు చేసి సంగీతజ్ఞుల మన్ననలు పొందుతున్నారు. ఎనిమిదో యేట తొలి సంగీత కచేరీతో ప్రారంభమై, మూడు దశాబ్దాలకు పైగా సంగీత రంగంలో రసజ్ఞులను తన గాన మాధుర్యంతో, వాయిలీన విన్యాసంలో అలరిస్తూనే ఉన్నారు.

సంగీత కుటుంబం
రమ తల్లిదండ్రులు కూడా సంగీత కళాకారులు కావడం వల్ల పసితనం నుంచే సంగీత స్వరాలతో పరిచయం ఏర్పడింది. తండ్రి పంతుల గోపాలరావు స్వస్థలం విజయనగరం. తల్లి పద్మావతి వీణా విద్వాంసురాలు. గోపాలరావు ఆల్‌ ఇండియా రేడియోలో ఇంజనీర్‌గా పనిచేశారు. ఉద్యోగరీత్యా గోపాలరావు కుటుంబం కాలికట్‌, రాంచీ, కటక్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా తల్లిదండ్రులిద్దరూ రమకు తగిన సంగీత శిక్షణ ఇచ్చారు. అప్పటికే గోపాలరావు ''సంగీత సాగర'' బిరుదు పొందిన వాయులీన విద్వాంసుడు ఇవటూరి విజయేశ్వరరావు వద్ద సంగీతంలో ఎన్నో మెళకువలు నేర్చుకుని ఉన్నారు. ఆమెను కూడా ఇవటూరి విజయేశ్వరరావు వద్ద ఉంచి, గురుకుల శిక్షణ ఇప్పించారు. అలా నడక నేర్చుకునే వయసులోనే సంగీత శిక్షణ పొందిన పంతుల రమ తన ఎనిమిదో యేటనే తొలి సంగీత కచేరి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో బి.ఎ., ఎం.ఎ. డిగ్రీలను అందుకున్నారు. గాత్ర సంగీతంలో రమను ఆకాశవాణి 'ఎ-టాప్‌ గ్రేడ్‌' ఇచ్చి ఆమె ప్రతిభను గుర్తించింది. గాత్రంతో పాటుగా వాయులీన, వయోలా వాయిద్యాలలో 'బి-హై' గ్రేడ్‌ని ఆమె సాధించారు. అనంతరం ''సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం'' అన్న అంశంపై పరిశోధనతో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. ఆంగ్ల భాషలో ఉన్న ఈ ప్రామాణిక పరిశోధన గ్రంథాన్ని న్యూఢిల్లీలోని జ్ఞాన్‌ పబ్లిషర్స్‌ ప్రచురించింది. సంగీతంతోపాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కూడా రమ డిప్లమో పొందడం మరో విశేషం.


గాత్రం.. వాయులీనం
పంతుల రమ సంగీత కళాప్రదర్శనలు కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈమె దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంపై జరిగిన ఎన్నో సెమినార్లలో కూడా ఆమె పాల్గొన్నారు. ''శ్యామశాస్త్రి సంగీత గొప్పదనం'' , ''కర్ణాటక సంగీత సాధన'' , ''రాగం-తానం-పల్లవి'' వంటి అంశాలపై సంగీత ఉపన్యాసాలిచ్చారు. రమ భర్త ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరుగా ఉన్నప్పటికీ ఈయన కూడా సంగీత విద్వాంసుడు కావడం మరో విశేషం. వాయులీనపై పలు రాగాలను పలికించడంలో ఆయన సంగీత ప్రపంచంలో ఎంతోమంది ప్రశంసలందుకున్నారు. సంగీత క్షేత్రంలో దంపతులిద్దరూ అగ్రశ్రేణి కళాకారులు కావడమన్నది ఎంతో అరుదైన విషయం. ఆ అవకాశం ఈ దంపతులకు దక్కింది. నిరంతర సంగీత సాధనకు, కచ్చేరీలకూ వీలుకల్గింది. రాగం తానం పల్లవి విద్యలోనూ, స్వరకల్పనలోనూ తన మధుర కంఠస్వరంతో సంగీత సభను రక్తి కట్టించడంలో పంతుల రమ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె తన భర్తతో కలిసీ, విడిగానూ దేశవిదేశాలకు వెళ్లి, తమ సంగీత విద్యను ప్రదర్శించారు. సింగపూర్‌, థారులాండ్‌, అమెరికా వంటి అనేక దేశాలలో రమ కచ్చేరీలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంగీత సభలలో ఆమె కచ్చేరీలు చేసి, ఖ్యాతి గడించారు. ముంబయి, ఢిల్లీలోని షణ్ముఖానంద సభ, మద్రాస్‌ సంగీత అకాడమీ, నారద గానసభ, శార్వాణీ సంగీత సభ, నాదోపాసన, హంసధ్వని, కృష్ణ గానసభ, టి.టి.డి, సరస్వతీ వాగ్గేయకార ట్రస్ట్‌, కార్తీక్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, కాపాలి ఫైన్‌ ఆర్ట్స్‌, నాద ఇంబమ్‌ (చెన్నయి), త్యాగరాజ ఆరాధన ట్రస్ట్‌ (తిరుపతి), కళాంగన్‌ (ల్లీ) సంగీత విద్వద్పరిషత్‌ (బెంగళూరు) వంటి అనేక సంగీత సభలలో ఆమె అగ్రశ్రేణి గాయనిగా పాల్గొన్నారు.

సంగీత విద్యానిధిగా
శ్యామశాస్త్రి సంగీత ఔన్నత్యాన్ని గురించి పంతుల రమ ఎన్నో సోదాహరణ ప్రసంగాలు చేశారు. 'కర్ణాటక సంగీత సాధన' మీద 'రాగం తానం పల్లవి' మొదలైన విద్యాంశాల మీద అమె ఆనేక ఉపన్యాసాలిచ్చారు. దక్షిణాది సంగీతంపై 2000లో జరిగిన జాతీయ గోష్టిలో 'సంగీతంలో విశేష ప్రయోగాలపై గాఢ అధ్యయనం' అనే అంశంపై ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. 'నవరస మాలిక' అన్న శీర్షికతో త్యాగరాజ రచనలలో నవరసాల గురించి వివరించారు. త్యాగరాజు రాసిన 'నౌకాచరితా'న్ని సంగీత రూపకంగా నిర్వహించారు.

వరించిన పురస్కారాలెన్నో
ప్రపంచ ప్రఖ్యాత సంగీతజ్ఞురాలు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి చేతుల మీదుగా 1992, డిసెంబర్‌ 4న సికింద్రాబాద్‌లోని కళాసాగరం సంస్థ ద్వారా తంబూరాని బహుమతిగా అందుకున్నారు. 1993లో మద్రాసు సంగీత అకాడమీ నిర్వహించిన పల్లవి పాటల పోటీలలో మొదటి బహుమతిని పొందారు. 1998లో నారా చంద్రబాబునాయుడు ద్వారా ప్రముఖ సంగీతకారిణిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవార్డు అందుకున్నారు. 2007లో మద్రాసు సంగీత అకాడమీ ద్వారా విశేష ప్రతిభ కలిగిన మహిళా వాయులీన విద్వాంసురాలి అవార్డు ఆమెకు లభించింది. 2006లో మద్రాస్‌ సంగీత అకాడమీ నుంచి 'అవుట్‌ స్టాండింగ్‌ లేడీ వోకలిస్టు'గా అవార్డుని పొందారు. ఇదే సంస్థ నుంచి 2008లో 'ఉత్తమ పల్లవి గాయని'గా అవార్డు అందుకున్నారు. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌ త్యాగరాజ ఆరాధన సమితి నుంచి 2010లో 'రాగం తానం పల్లవి'కి అవార్డుని పొందారు. 2011లో 'ఇసాయి పెరోలి' అవార్డును కార్తీక్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అనే సంస్థ నుంచి అందుకున్నారు. అంతకుముందు భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి 1992-94 సంవత్సరాలకు సీనియర్‌ స్కాలర్‌షిప్‌నీ, 1996-97 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ అవార్డుని పొందారు. గాయత్రీ సంగీత విద్వన్మణి, నాదవల్లభ, ఇశై పెరోలి తదితర బిరుదులు ఆమె సంగీత ప్రతిభకు గుర్తింపుగా లభించాయి. రమ ప్రస్తుతం విశాఖపట్నం ఆకాశవాణిలో ఆడిషన్‌ కమిటీ ప్రతినిధిగా ఉన్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్‌ (ఐ.సి.సి.ఆర్‌)లో కళాకారిణిగా గుర్తింపు పొందారు. ఇలా అనేక ప్రతిభా పురస్కారాలు గుర్తింపు పొందిన డాక్టర్‌ రమ అగ్రశ్రేణి సంగీత కళాకారిణిగా ఈ రంగంలో రాణిస్తూ, వర్ధమాన, ప్రవర్థమాన కళాకారులకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు.



బోధన పద్ధతులు మెరుగుపడాలి
సంగీత జ్ఞానం అందరికీ అందాలి. సంగీత కళాశాలల్లో బోధనా పద్ధతులు, సిలబస్‌ ఇంకా మెరుగుపడాలి. శ్రోతలు మంచి సంగీతాన్ని ఆస్వాదించగలిగే స్థాయికి వారిని చైతన్యవంతం చేయాలి. ఈ రంగంలో ఉన్నత స్థితికి చేరాలంటే నిరంతర సాధన ఒక్కటే మార్గం.
- డాక్టర్‌ పంతుల రమ

                                                                                                            - బెందాళం క్రిష్ణారావు