ఏదైనా కళలో రాణించాలంటే కచ్ఛితంగా రోజుకి నాలుగు గంటలు నిరంతరాయంగా కష్టపడాలి. అదే.. ఆ కళలో నిష్ణాతులు కావాలంటే కనీసంగా ఎనిమిది గంటలైనా సాధన చేయాలి. అలా చేస్తేనే ఏ కళైనా అబ్బేది. అంతో ఇంతో వంటబట్టేది. ప్రపంచ కళాసాధకులంతా అలా కష్టపడి ఎదిగినవారే. అలాంటిది రెండు విభిన్నమైన కళల్లో సమర్ధనీయమైన ప్రవేశం ఉండటం మాటలు కాదు. అందునా సశాస్త్రీయమైన సంగీతంలోనూ, వాయులీన నాదంలోనూ సరిసమాన ప్రతిభ దక్కాలంటే ఎంతో సాధన కావాలి. అలాంటి సాధనకు ప్రతిరూపమే విశాఖపట్నానికి చెందిన సంగీత కళాకారిణి డాక్టర్ పంతుల రమ. మూడున్నర దశాబ్దాలకుపైగా దేశ, విదేశాల్లో సంగీత రంగంలో రాణిస్తున్న కళాకారిణి రమ సంగీత ప్రస్థానం 'జీవన' పాఠకుల కోసం.
విశాఖపట్నానికి చెందిన డాక్టర్ పంతుల రమ అంటే తెలుగునాట శాస్త్రీయ సంగీతంలో మంచి పేరున్న కళాకారిణి. అంతేకాదు, దేశ, విదేశాల్లోనూ అనేక కచేరీలు చేసి సంగీతజ్ఞుల మన్ననలు పొందుతున్నారు. ఎనిమిదో యేట తొలి సంగీత కచేరీతో ప్రారంభమై, మూడు దశాబ్దాలకు పైగా సంగీత రంగంలో రసజ్ఞులను తన గాన మాధుర్యంతో, వాయిలీన విన్యాసంలో అలరిస్తూనే ఉన్నారు.
సంగీత కుటుంబం
రమ తల్లిదండ్రులు కూడా సంగీత కళాకారులు కావడం వల్ల పసితనం నుంచే సంగీత స్వరాలతో పరిచయం ఏర్పడింది. తండ్రి పంతుల గోపాలరావు స్వస్థలం విజయనగరం. తల్లి పద్మావతి వీణా విద్వాంసురాలు. గోపాలరావు ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీర్‌గా పనిచేశారు. ఉద్యోగరీత్యా గోపాలరావు కుటుంబం కాలికట్, రాంచీ, కటక్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా తల్లిదండ్రులిద్దరూ రమకు తగిన సంగీత శిక్షణ ఇచ్చారు. అప్పటికే గోపాలరావు ''సంగీత సాగర'' బిరుదు పొందిన వాయులీన విద్వాంసుడు ఇవటూరి విజయేశ్వరరావు వద్ద సంగీతంలో ఎన్నో మెళకువలు నేర్చుకుని ఉన్నారు. ఆమెను కూడా ఇవటూరి విజయేశ్వరరావు వద్ద ఉంచి, గురుకుల శిక్షణ ఇప్పించారు. అలా నడక నేర్చుకునే వయసులోనే సంగీత శిక్షణ పొందిన పంతుల రమ తన ఎనిమిదో యేటనే తొలి సంగీత కచేరి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో బి.ఎ., ఎం.ఎ. డిగ్రీలను అందుకున్నారు. గాత్ర సంగీతంలో రమను ఆకాశవాణి 'ఎ-టాప్ గ్రేడ్' ఇచ్చి ఆమె ప్రతిభను గుర్తించింది. గాత్రంతో పాటుగా వాయులీన, వయోలా వాయిద్యాలలో 'బి-హై' గ్రేడ్‌ని ఆమె సాధించారు. అనంతరం ''సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం'' అన్న అంశంపై పరిశోధనతో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఆంగ్ల భాషలో ఉన్న ఈ ప్రామాణిక పరిశోధన గ్రంథాన్ని న్యూఢిల్లీలోని జ్ఞాన్ పబ్లిషర్స్ ప్రచురించింది. సంగీతంతోపాటు ఫ్యాషన్ డిజైనింగ్‌లో కూడా రమ డిప్లమో పొందడం మరో విశేషం.
గాత్రం.. వాయులీనం
పంతుల రమ సంగీత కళాప్రదర్శనలు కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈమె దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంపై జరిగిన ఎన్నో సెమినార్లలో కూడా ఆమె పాల్గొన్నారు. ''శ్యామశాస్త్రి సంగీత గొప్పదనం'' , ''కర్ణాటక సంగీత సాధన'' , ''రాగం-తానం-పల్లవి'' వంటి అంశాలపై సంగీత ఉపన్యాసాలిచ్చారు. రమ భర్త ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరుగా ఉన్నప్పటికీ ఈయన కూడా సంగీత విద్వాంసుడు కావడం మరో విశేషం. వాయులీనపై పలు రాగాలను పలికించడంలో ఆయన సంగీత ప్రపంచంలో ఎంతోమంది ప్రశంసలందుకున్నారు. సంగీత క్షేత్రంలో దంపతులిద్దరూ అగ్రశ్రేణి కళాకారులు కావడమన్నది ఎంతో అరుదైన విషయం. ఆ అవకాశం ఈ దంపతులకు దక్కింది. నిరంతర సంగీత సాధనకు, కచ్చేరీలకూ వీలుకల్గింది. రాగం తానం పల్లవి విద్యలోనూ, స్వరకల్పనలోనూ తన మధుర కంఠస్వరంతో సంగీత సభను రక్తి కట్టించడంలో పంతుల రమ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె తన భర్తతో కలిసీ, విడిగానూ దేశవిదేశాలకు వెళ్లి, తమ సంగీత విద్యను ప్రదర్శించారు. సింగపూర్, థారులాండ్, అమెరికా వంటి అనేక దేశాలలో రమ కచ్చేరీలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంగీత సభలలో ఆమె కచ్చేరీలు చేసి, ఖ్యాతి గడించారు. ముంబయి, ఢిల్లీలోని షణ్ముఖానంద సభ, మద్రాస్ సంగీత అకాడమీ, నారద గానసభ, శార్వాణీ సంగీత సభ, నాదోపాసన, హంసధ్వని, కృష్ణ గానసభ, టి.టి.డి, సరస్వతీ వాగ్గేయకార ట్రస్ట్, కార్తీక్ ఫైన్ ఆర్ట్స్, కాపాలి ఫైన్ ఆర్ట్స్, నాద ఇంబమ్ (చెన్నయి), త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ (తిరుపతి), కళాంగన్ (ల్లీ) సంగీత విద్వద్పరిషత్ (బెంగళూరు) వంటి అనేక సంగీత సభలలో ఆమె అగ్రశ్రేణి గాయనిగా పాల్గొన్నారు.
సంగీత విద్యానిధిగా
శ్యామశాస్త్రి సంగీత ఔన్నత్యాన్ని గురించి పంతుల రమ ఎన్నో సోదాహరణ ప్రసంగాలు చేశారు. 'కర్ణాటక సంగీత సాధన' మీద 'రాగం తానం పల్లవి' మొదలైన విద్యాంశాల మీద అమె ఆనేక ఉపన్యాసాలిచ్చారు. దక్షిణాది సంగీతంపై 2000లో జరిగిన జాతీయ గోష్టిలో 'సంగీతంలో విశేష ప్రయోగాలపై గాఢ అధ్యయనం' అనే అంశంపై ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. 'నవరస మాలిక' అన్న శీర్షికతో త్యాగరాజ రచనలలో నవరసాల గురించి వివరించారు. త్యాగరాజు రాసిన 'నౌకాచరితా'న్ని సంగీత రూపకంగా నిర్వహించారు.
వరించిన పురస్కారాలెన్నో
ప్రపంచ ప్రఖ్యాత సంగీతజ్ఞురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి చేతుల మీదుగా 1992, డిసెంబర్ 4న సికింద్రాబాద్‌లోని కళాసాగరం సంస్థ ద్వారా తంబూరాని బహుమతిగా అందుకున్నారు. 1993లో మద్రాసు సంగీత అకాడమీ నిర్వహించిన పల్లవి పాటల పోటీలలో మొదటి బహుమతిని పొందారు. 1998లో నారా చంద్రబాబునాయుడు ద్వారా ప్రముఖ సంగీతకారిణిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవార్డు అందుకున్నారు. 2007లో మద్రాసు సంగీత అకాడమీ ద్వారా విశేష ప్రతిభ కలిగిన మహిళా వాయులీన విద్వాంసురాలి అవార్డు ఆమెకు లభించింది. 2006లో మద్రాస్ సంగీత అకాడమీ నుంచి 'అవుట్ స్టాండింగ్ లేడీ వోకలిస్టు'గా అవార్డుని పొందారు. ఇదే సంస్థ నుంచి 2008లో 'ఉత్తమ పల్లవి గాయని'గా అవార్డు అందుకున్నారు. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ త్యాగరాజ ఆరాధన సమితి నుంచి 2010లో 'రాగం తానం పల్లవి'కి అవార్డుని పొందారు. 2011లో 'ఇసాయి పెరోలి' అవార్డును కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ అనే సంస్థ నుంచి అందుకున్నారు. అంతకుముందు భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి 1992-94 సంవత్సరాలకు సీనియర్ స్కాలర్‌షిప్‌నీ, 1996-97 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ అవార్డుని పొందారు. గాయత్రీ సంగీత విద్వన్మణి, నాదవల్లభ, ఇశై పెరోలి తదితర బిరుదులు ఆమె సంగీత ప్రతిభకు గుర్తింపుగా లభించాయి. రమ ప్రస్తుతం విశాఖపట్నం ఆకాశవాణిలో ఆడిషన్ కమిటీ ప్రతినిధిగా ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ (ఐ.సి.సి.ఆర్)లో కళాకారిణిగా గుర్తింపు పొందారు. ఇలా అనేక ప్రతిభా పురస్కారాలు గుర్తింపు పొందిన డాక్టర్ రమ అగ్రశ్రేణి సంగీత కళాకారిణిగా ఈ రంగంలో రాణిస్తూ, వర్ధమాన, ప్రవర్థమాన కళాకారులకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు.
బోధన పద్ధతులు మెరుగుపడాలి
సంగీత జ్ఞానం అందరికీ అందాలి. సంగీత కళాశాలల్లో బోధనా పద్ధతులు, సిలబస్ ఇంకా మెరుగుపడాలి. శ్రోతలు మంచి సంగీతాన్ని ఆస్వాదించగలిగే స్థాయికి వారిని చైతన్యవంతం చేయాలి. ఈ రంగంలో ఉన్నత స్థితికి చేరాలంటే నిరంతర సాధన ఒక్కటే మార్గం.
- డాక్టర్ పంతుల రమ
- బెందాళం క్రిష్ణారావు



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి