8, డిసెంబర్ 2016, గురువారం

బాల్య‌వివాహాల‌పై పోరాడే ఆకృతి



ఆధునిక విజ్ఞానం ఎంతో పురోగమిస్తున్న రోజులివి. అయినా సంప్రదాయాల ముసుగులో ఛాందసత్వమే చాలాచోట్ల చెలామణి అవుతోంది. ముక్కుపచ్చలారని వయసులో మూడుముళ్లతో బంధీలుగా చేసి, ఈ దేశంలో అమాయకమైన బాలికల భవిష్యత్తును నాశనం చేస్తున్న వారెందరో. అలాంటి వారికి ఎదురు నిలిచి, ఆ ఊబిలో దిగబడిపోతున్న వారికి చేయూతనందిస్తూ వారందరికీ అండగా నిలుస్తున్నారు రాజస్థాన్‌కు చెందిన కృతిభారతి. ఈమె చేపట్టిన ఈ సామాజిక చైతన్య ఉద్యమంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రాణాలు తీస్తామని ఎంతో మంది బెదిరించారు. అయినా కృతిభారతి భయపడలేదు. అడ్డొచ్చిన వారిని కోర్టుకీడ్చడానికీ వెనుకడుగు వేయలేదు. ఇలా ఒక మంచి పనిచేసే విషయంలో ఆమెకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అయినా పోరాటం ఆగలేదు. ఆ ఆడపిల్లల మోములో ధైర్యమూ సడలలేదు. కృతిభారతి జీవన యానంలో ఇంకా అనేక స్ఫూర్తిదాయక విశేషాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి!!
దేశంలోనే అత్యధికంగా బాల్యవివాహాలు జరిగే రాష్ట్రం రాజస్థాన్‌. ఇక్కడ బాల్య వివాహాల పేరుతో జరిగే అరాచకాలకు హద్దూ, అదుపూ ఉండదు. వయసు, మనసు ఎదగని సమయంలోనే ఇక్కడ పసిపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నవారు అనేకం. చిన్నప్పటి నుంచి ఇలాంటి దురాగతాలను కళ్లారా చూస్తున్న కృతిభారతి ఈ దుష్ట సంప్రదాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నారు. ఇలా బాల్యవివాహాలను అడ్డుకోవడంతోపాటు బాలికలకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ వందల సంఖ్యలో బాల్యవివాహాలను అడ్డుకుని, వెయ్యి మందికి పైగా బాలికలకు పునరావాసం కల్పించి, 'లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో కూడా చోటు దక్కించుకున్నారు కృతిభారతి.

కడుపులో ఉండగానే కష్టాలు
బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కృతిభారతి జీవితం వడ్డించిన విస్తరేం కాదు. బాల్యమంతా కష్టాలతోనే సహవాసం చేశారు. తల్లి కడుపులో ఉండగానే ఈమెకు కష్టాలు ఎదురయ్యాయి. ఆమె తండ్రి ఓ డాక్టర్‌. కానీ కృతి తల్లి కడుపులో ఉండగానే ఆమె అమ్మానాన్న విడిపోయారు. కృతిని కడుపులోనే చంపేసి ( అబార్షన్‌ చేయించుకుని), రెండో పెళ్లి చేసుకోవాలని కృతి తల్లికి ఆమె బంధువులు సూచించారు. పుట్టిన తర్వాత కూడా కృతికి కష్టాలు మరింత పెరిగాయి. బుడిబుడి అడుగులు వేసే సమయంలోనే ఆమెపై విష ప్రయోగం జరిగింది. దీంతో ఆమె చాలాకాలం పాటు చదువుకు దూరమైంది. పూర్తిగా కోలుకున్న తర్వాతగానీ స్కూలుకు వెళ్లలేకపోయింది. తన చుట్టూ ఉన్న సమాజంలో చిన్న వయసులోనే బాలికలకు బలవంతంగా పెళ్లి చేయడం చూసింది. ఆ తర్వాత వారిని చిత్రహింసలు పెట్టడం వంటి అరాచకాలను కళ్లారా చూసిన ఆమె మనసు వికలమైంది. యుక్త వయస్సుకు రాకుండా పెళ్లి చేయడంతో వారు పిల్లలు పుట్టే సమయంలో అర్ధాంతరంగా చనిపోతున్నారు. కొన్నిచోట్ల వారు మృతశిశువులకు జన్మనిస్తున్నారు. బాల్యవివాహాలు చేసుకున్నవారికి అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి చదువు, భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా తయారవుతోంది. ఇవన్నీ కృతిభారతిని ఆహ్వానింపజేశాయి.
కలిసి.. నచ్చజెప్పి
సంప్రదాయం ముసుగులో ఆచారంగా మారిన బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయడం అంటే చాలా కష్టమైన పని. బాల్యవివాహం జరుగబోతున్నట్లు తెలిస్తే కృతి, అమె ట్రస్ట్‌ ప్రతినిధులు ఆ అమ్మాయి కుటుంబాన్ని ముందుగా కలిసి, పెళ్లి వద్దని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. బాల్యవివాహాల వలన జరిగే నష్టాలను వివరిస్తారు. పలు సందర్భాలలో అమ్మాయి తల్లిదండ్రులు వీరు చెప్పే మాటలకు ప్రభావితం అవుతున్నారు. ఆ తర్వాత వీరు పెళ్లికొడుకు కుటుంబాన్ని కూడా కలిసి, ఈ వివాహం వల్ల జరిగే అనర్ధాలను వివరిస్తారు. అయితే గ్రామ పెద్దలను, కుల పెద్దలను బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఒప్పించడమే సారథి బృందానికి చాలా కష్టమైన పని. ఎందుకంటే గ్రామ సంప్రదాయాలు, పరువు ప్రతిష్టలు, కుల కట్టుబాట్లు అంటూ వితండవాదనలు చేస్తుంటారు. అందుకే వీరిలో సామాజిక చైతన్యం తీసుకురావడానికి సారథి బృందం ఎంతగానో శ్రమించాల్సి వస్తుంది.
రెండు లక్ష్యాలు
కృతి నేతృత్వంలోని సారథి ట్రస్ట్‌ సభ్యులు రెండు బృందాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఒక బృందం చట్టాలపై తగిన అవగాహన కలిగించి, బాల్యవివాహాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరో బృందం బాల్యవివాహాల నుండి విముక్తి పొందిన బాలికలకు పునరావాసం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తుంది. వీరికి చదువు, వృత్తివిద్యలో శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించడం లాంటివి చేస్తుంటారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సదస్సులు, శిబిరాలు నిర్వహిస్తోంది 'సారథి' ట్రస్ట్‌. గ్రామాల్లోని అంగన్‌వాడీల్లో నిర్వహించే సదస్సుల్లో బాల్యవివాహాల గురించి చర్చలు జరుపుతుంటారు. వాటివల్ల జరిగే అనర్ధాలను, పిల్లలకు తలెత్తే ఆరోగ్య సమస్యలపైనా అవగాహన కల్పిస్తారు. ఆ సమస్యలను ఎదుర్కొన్న వారి అనుభవాలను వారితోనే చెప్పిస్తారు. ఆ రాష్ట్రంలో ఎక్కడ బాల్యవివాహాలు జరుగుతున్నా తమకు తెలియజేసే విధంగా ఓ హెల్ప్‌లైన్‌ కూడా ఏర్పాటు చేసిందీ ట్రస్ట్‌.
ఎన్నో దాడులు ఎదుర్కొని
బాల్యవివాహాలను అడ్డుకోవడం అన్ని సమయాల్లోనూ అంత సులభం కాదు. సారథి బృందంపై అనేకసార్లు దాడులు కూడా జరిగాయి. చాలాసార్లు కోర్టు దాకా వెళ్లారు. చంపేస్తామంటూ పలుమార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. చేసేది మంచి పని అయినప్పుడు, ఇలాంటి బెదిరింపులకు భయపడేదీ లేదు అంటారు కృతి. రాజస్థాన్‌లో జరిగే బాల్యవివాహాలంటే పదేళ్ల వయసులో జరిగేవి అనుకుంటే పొరపాటే. తొమ్మిది నెలల వయసున్న ఓ బాలికకు తొమ్మిదేళ్ల కుర్రాడితో పెళ్లి చేశారు. పెళ్లయిన విషయం అమ్మాయికి యుక్త వయసు వచ్చేవరకు గానీ తెలియదు. ఒకసారి ఒక అమ్మాయి తనకు చిన్నప్పుడే పెళ్లయిందని తెలుసుకుని, సారథి ట్రస్టును ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు కృతిని బెదిరించారు. పెళ్లి విషయంలో జోక్యం చేసుకుంటే, చంపేస్తామంటూ బెదిరించారు. కానీ కృతి భయపడలేదు సరికదా, రెండు కుటుంబాలను ఒప్పించి మరీ ఆ పెళ్లిని రద్దు చేయించారామె.
చిన్నారుల సంక్షేమం
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కృతి సాగిస్తున్న ఉద్యమం, ఆమె చేస్తున్న పోరాటానికి ఎన్నో అవార్డులు వరించాయి. బ్రిటీష్‌ గవర్నమెంట్‌ ఫెల్లోషిప్‌, థామ్సన్‌ రాయిటర్స్‌ కార్పొరేషన్‌ అవార్డులు ఇలా ఎన్నో సంస్థలు సత్కరించాయి. ఓ టీమ్‌ వర్క్‌గా ప్రాజెక్ట్‌లోని ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషి కారణంగానే రాజస్థాన్లో ప్రస్తుతం బాల్య వివాహాలకు అడ్డకట్ట పడింది. అంతేగానీ కేవలం తన వ్యక్తిగత కృషి మాత్రమే కాదని ఎంతో వినయంగా చెబుతుంటారు కృతిభారతి. ఆమె చిన్నారుల సంక్షేమం, రక్షణ అంశంలో పీహెచ్‌డీ చేశారు. ఇప్పటివరకూ ఆరువేల మంది పిల్లలకు మరో ఆరు వేలమంది మహిళలకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. కృతిభారతి స్ఫూర్తి వంతమైన జీవన గమనాన్ని సి.బి.ఎస్‌.ఈ. విద్యాప్రణాళికలో పాఠ్యాంశంగా కూడా చేర్చడం విశేషం.
ఆ'కృతి'దాల్చిన సారథి
బాల్యవివాహాలను అడ్డుకోవాలనే లక్ష్యంతో కృతిభారతి 2011లో 'సారథి' పేరుతో ట్రస్టును ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌ ఏకైక లక్ష్యం మహిళలకు సామాజిక న్యాయం అందించడమే. బాల్యవివాహాలను అడ్డుకునేందుకు చేసే ప్రయత్నంలో చాలాసార్లు తన ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఈ ట్రస్ట్‌ కేవలం బాల్యవివాహాలను అడ్డుకోవడానికే పరిమితం కాలేదు. వారికి మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి కృషి చేస్తోంది. ఈ విషయంలో బాలికలకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు ఈ ట్రస్ట్‌ కౌన్సెలింగ్‌ కూడా నిర్వహిస్తోంది. వారిలో ధైర్యం కల్గించేందుకు పునరావాస కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు.
ఇది నిరంతరం జరగాల్సిందే
బాల్యవివాహాలను ఆపడం, ఆపదలో ఉన్న ఆడపిల్లల్ని రక్షించడం.. ఇదంతా వ్యక్తిగతంగా సాధిస్తున్న విజయమేమీ కాదు. సమష్టి కృషితోనే ఇదంతా సాధ్యమైంది. అయితే ఈ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూ ఉండాల్సిందే. కేవలం రాజస్థాన్‌లోనే మాత్రమేకాదు, ఇక్కడ చేస్తున్నట్టుగానే అన్నిచోట్లా.. అందరూ చేయాలి. అప్పుడే మార్పుకు శ్రీకారం చుట్టేది, బాలికల సమస్యలు పరిష్కారమయ్యేది.
- కృతిభారతి


                                                                                                                 - బెందాళం క్రిష్ణారావు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి