10, డిసెంబర్ 2016, శనివారం

ఆటో డ్రైవ‌ర్ రాసిన విసార‌ణై




ప్రతి కన్నీటి వెనకా ఎన్నో కారణాలుంటాయి. వలసలు, ఆకలి, అవమానం, అక్రమ కేసుల్లో ఇరుక్కోవడం, చిత్ర హింసలు, పోలీసుల రికార్డుల్లోకి ఎక్కని చట్టబ(విరు)ద్ధ హత్యలు, కంటికి కనిపించని న్యాయం, వెలుగు చూడని నిజాలు, సభ్య సమాజాన్ని అనకొండలా మింగేసిన అవినీతి, కనీస హక్కులకు నోచుకోని దిక్కులేని బతుకు.. ఏదైనా సరే ఆ కన్నీటికి కారణం కావొచ్చు. కానీ ఆ కన్నీళ్ల వెనకున్న నిజాలను 'లాకప్‌' పేరుతో నవలగా చిత్రించాడు ఓ ఆటోడ్రైవర్‌. పోలీసు లాకప్పుల్లో గుట్టుచప్పుడు కాకుండా మానవహక్కుల ఉల్లంఘన ఎలా సాగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ నవల 'విసారణై' పేరుతో సినిమాగా రూపుదిద్దుకుని, 'ఆస్కార్‌' బరిలోకి దిగి విశ్వవేదిక మీద సంచలనాన్ని సృష్టించనుంది. ఆ 'విసారణై' విశేషాలు
'జీవన' పాఠకుల కోసం..

 
భారతీయ సినిమా అంటే కొన్ని ప్రేమకథలు, కొన్ని వారసత్వ కథలు, మరికొన్ని రాచరికపు కథలు, మాఫియా కథలు, ఫ్యాక్షన్‌ కథలు, మూఢ నమ్మకాలను ప్రేరేపించే కథలు, ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న కిచిడీ కథలు, ఆంగ్ల సినిమాల నుంచి కాపీకొట్టే గ్రాఫిక్స్‌ మాయాజాలాలు మాత్రమే కాదని నిరూపించిందీ సినిమా. ఆ సినిమా పేరు 'విసారణై'. ఇది తమిళంలో తీసిందే. కానీ దీని నేపథ్యమంతా తెలుగు నేలతో ముడిపడి ఉంది. ఆంధ్రా పోలీసుల కర్కశత్వాన్నీ, కాఠిన్యాన్నీ ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాకు మూలం ''లాకప్‌'' అనే తమిళ నవల. రాసింది ఎవరో పెద్ద పాపులర్‌ రచయిత కాదు. సాదాసీదా ఓ ఆటోడ్రైవర్‌. అసలు పేరు ఎం.చంద్రకుమార్‌. ఈ నవలలో జరిగిన సంఘటనలన్నీ గుంటూరు జిల్లాలోని ఒక గ్రామీణ ప్రాంతంలో వాస్తవంగా జరిగినవే కావడం విశేషం.
హింస నుంచి ప్రజ్వరిల్లిన కథ
చంద్రకుమార్‌ తన జీవితంలో ఎదుర్కొన్న పోలీసు హింస నుంచే ఈ నవల రూపుదిద్దుకుంది. 52 ఏళ్ల ఎం.చంద్రకుమార్‌ ఆటో చంద్రన్‌గా కోయంబత్తూర్‌ ప్రజలకు సుపరిచితుడు. పదో తరగతి చదువుతున్న సమయంలోనే పేదరికం కారణంగా పదిహేనేళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయాడు. అప్పుడే చదువుకు స్వస్తి చెప్పాడు. బతుకుతెరువు కోసం ఎన్నో రాష్ట్రాలు తిరిగాడు. కడుపు నింపుకోవడానికి రకరకాల కాయకష్టం చేశాడు. జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు వచ్చాడు. అక్కడ దొరికిన పనల్లా చేశాడు. ఓ హోటల్లో కూలీగా పనిచేశాడు. ఆ సమయంలోనే తన స్నేహితులతో కలిసి ఓరాత్రి సెకెండ్‌షో సినిమా చూసి వస్తుండగా వారిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అన్యాయంగా పదిహేను రోజుల పాటు లాకప్‌లో ఉంచారు. ఎఫ్‌.ఐ.ఆర్‌. రాయకుండా చిత్రహింసలు పెట్టారు. ఆపై నిర్దోషిగా బయటకు వచ్చిన చంద్రకుమార్‌ మధురై వెళ్లిపోయాడు. అయితే స్వతహాగా రచనాసక్తి ఉన్న చంద్రకుమార్‌.. తనకు ఎదురైన ఆ చేదు అనుభవాలను ''లాకప్‌'' పేరుతో ఒక నవల రాశాడు. ఇందులోని వాస్తవిక అంశాలు నచ్చడంతో దర్శకుడు వెట్రిమారన్‌ ఈ కథను సినిమాగా తెరకెక్కించాడు.

గుంటూరు జిల్లా నేపథ్యమే
గుంటూరులోని బృందావన్‌ కాలనీలో జరిగిన ఒక దోపిడీ కేసుకు సంబంధించి పోలీసులు తమపై అధికారుల ఒత్తిడితో తమిళనాడు నుంచి వచ్చిన నలుగురు అమాయకులైన వలస కూలీలను ఇందులో ఇరికించారు. వారి చుట్టూ ఎన్నో అభియోగాల కథలు అల్లేశారు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష తెలియని ప్రాంతం, ఈ కూలీలకు తమిళమొక్కటే తెలుసు, పోలీసులకు తెలిసిందల్లా తమ ఖాకీ దుస్తుల మాటున నిజాలను సమాధిచేసి ఏదో విధంగా కేసును పూర్తిచేయడమే. ఈ దేశంలో పేదలకు పెదవివిప్పే స్వాతంత్య్రం కూడా లేదని, నిస్సహాయులైన పేదలకు ఈ సమాజంలో రక్షణ లేదనే విషయాన్ని ఆ నవలలో కళ్లకు కట్టినట్టు చూపించాడు. లాకప్‌ గదుల్లో మానవహక్కుల హననం ఎలా జరుగుతుందో ప్రత్యక్షసాక్షిగా, బాధితునిగా ఉన్న రచయిత నిస్సంకోచంగా చిత్రించాడు. మన పోలీసువ్యవస్థ ముఖచిత్రాన్ని నగంగా బట్టబయలు చేశాడు.
తెలుగు.. తమిళ భాషల్లో
తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి కూలి చేసుకుని, ఉండటానికి చిన్న గది కూడా అద్దెకు తీసుకోలేక ఫుట్‌పాత్‌లపై పడుకునే నలుగురి కుర్రాళ్లను పోలీసులు తీసుకెళ్లి ఏం చేశారు? అనేదే ఈ చిత్ర కథ. తమ మీద ఉన్న ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడం కోసం పోలీసులు నిరపరాధులపై కేసులు మోపి, వారు వాటిని అంగీకరించేంత వరకూ ఎలా హింస పెడతారన్నదాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. తమిళ చిత్రమే అయినా తెలుగు మాట్లాడే పాత్రలతో సినిమా మొదలవుతుంది. తెలుగు, తమిళం కలగలుపుగా డైలాగులు వినిపిస్తుంటాయి. గుంటూరులోనూ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో విలన్‌ (కరడుగట్టిన పోలీస్‌)గా తెలుగు నటుడు అజరుఘోష్‌ నటించాడు. అతని సంభాషణలన్నీ తెలుగులోనే ఉంటాయి.

అవార్డులందుకున్న కథనం
పదేళ్ల కిందటే 2006లో ఈ నవలకు 'బెస్ట్‌ డాక్యుమెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌' అవార్డు కూడా వచ్చింది. ఆ నవల గురించి మిత్రుల ద్వారా తెలుసుకున్న వెట్రిమారన్‌ ఈ నవల ఆధారంగా తమిళంలో 'విసారణై' పేరుతో గతేడాదే సినిమా తీశాడు. ఎవరివో కథలు కాపీ కొట్టేసి, తమ పేర్లు వేసుకునే కొంతమంది తెలుగు దర్శక, నిర్మాతల్లా కాకుండా ఈ సినిమా టైటిల్స్‌లో చంద్రన్‌కు క్రెడిట్‌ కూడా ఇచ్చాడు. సినీనటుడు ధనుష్‌ దీనికి నిర్మాతగా వ్యవహరించగా, అట్టకతి దినేశ్‌, తెలుగమ్మాయి ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. 2016 ఫిబ్రవరిలో విడుదలై విజయ ఢంకా మోగించిన ఈ సినిమా విడుదలకు ముందే గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన 72వ వెనిస్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అవార్డుని పొందింది. ఇలా ఇప్పటిదాకా మూడు జాతీయ అవార్డులు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అవార్డు, తమిళనాడులో బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం అవార్డ్‌లను ఈ సినిమా దక్కించుకుంది. ఇప్పుడు 2017 ఫిబ్రవరిలో లాస్‌ఏంజల్స్‌లో జరగబోయే 89వ ఆస్కార్‌ ఆవార్డుల వేడుకలో ఇండియా నుంచి ఎంపికైనా సినిమాగా సత్తా విసారణై చాటనుంది.
భారీ హంగుల్ని దాటుకుని
కోట్లాది రూపాయల భారీ ఖర్చుతో తీసే సినిమాల్లోనే కళ్లు మిరుమిట్లుగొలిపే గ్రాఫిక్స్‌ హంగులు ఉంటాయి. వాటిని ప్రమోట్‌ చేసే ప్రచార, ప్రసార సాధనాలు కూడా ఉంటాయి. అయితే జీవన వాస్తవిక కథా నేపథ్యంతో వచ్చేవి మాత్రం దూరదర్శన్‌లో ఎప్పుడో వచ్చే ఆదివారం సినిమాగా మిగిలిపోతాయి. కానీ 'విసారణై' ఆస్కార్‌ వరకూ వెళ్ళిందంటే 'లాకప్‌' నవలలోని కథాంశం, దానిని కళ్లకు కట్టినట్లుగా తీయడం, నటీనటుల పాత్ర పోషణవల్లే సాధ్యమైందని సినీ విమర్శకులు అంటున్నారు. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, మణిరత్నం ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది 13 మంది జ్యూరీ సభ్యులూ ఏకగ్రీవంగా ఆమోదించి, ఆస్కార్‌కు పంపిన సినిమా. మొత్తం 29 సినిమాలను దాటుకుని వెళ్లిన సినిమా కూడా ఇదే. సుల్తాన్‌, బాజీరావ్‌ మస్తానీ, ప్యాసా, ఉడ్తా పంజాబ్‌, కపూర్‌ అండ్‌ సన్స్‌ వంటి భారీ చిత్రాలను పక్కనపెట్టి 'విసారణై' సినిమాను ఎంపిక చేయడం చెప్పుకోదగ్గ విషయం.

ప్రజా రచయితగా
'ప్రజల జీవితాన్ని, దానిచుట్టూ మూగిన చీకటిని గుర్తించడం ద్వారా సాహిత్యం, కళలు సామాన్య జనంలో పేరు తెచ్చుకుంటాయి' అని అంటాడు ఆటో చంద్రన్‌. ఆయన ఇప్పటి వరకు ఆరు విభిన్నమైన నవలలు రాశాడు. టెర్రరిజంపై, కమ్యూనిస్టు నాయకుడు పి. జీవానందం జీవిత చరిత్రపై పుస్తకాలు రాశాడు. తాను సాధారణంగా ఆటో నడిపే సమయంలో ట్రాఫిక్‌ జాముల్లో ఇరుక్కున్నప్పుడు, ప్రయాణికుల కోసం నిరీక్షిస్తున్న సమయాల్లో నవలలు రాస్తానని ఆయన చెబుతున్నారు.
ఇంకా గమ్యం మిగిలే ఉంది
                              - ఎం. చంద్రకుమార్‌, రచయిత 
ఈ సినిమా ఓ సాధారణ ఆటోడ్రైవర్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే బలం ఈ సినిమాకి ఉంది. అయితే నేను ఊహించినట్టు ఈ సినిమా ఇంకా గమ్య స్థానం చేరలేదు. ఆస్కార్‌ బరిలోకి ప్రస్తుతం ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత జరిగే రెండు రౌండ్లలో కూడా నిలిస్తే.. నేను అనుకున్న లక్ష్యాన్ని చేరతాను. నన్ను, నా కథని నమ్మి, సినిమాగా తీసిన నిర్మాత ధనుష్‌కి, నా కథలోని ఆర్తికి ప్రాణం పోసిన దర్శకుడు వెట్రిమారన్‌కు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.


                                                                                                      --- బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి