ఆకాశంలో పట్టపగలే.. చంద్రుడ్ని చూసినప్పుడో... కాలిమువ్వలు మోగంగా.. ఆమెవరో.. మయూరమై బ్రహ్మాండంగా నర్తించినప్పుడో.. లీడ్ గిటార్‌పై.. ఇళయరాజానో, రెహమ్మానో.. వీనుల విందుగా పాటయినప్పుడో..
అప్రయత్నంగానే.. మనసు, శరీరం ఉప్పొంగి.. ''అద్భుతహా.. అనేస్తాం.
చిత్రకారిణి స్వప్న అగస్టీన్‌ని చూసినప్పుడు కూడా ఇంకా పెద్దగా 'అద్భుతహో..' అంటారంతా. ఆమె.. గొప్పగా పాడదు.. గొప్పగా మాట్లాడదు. నర్తించదు.. కానీ.. అవన్నీ కలబోసుకున్న చిత్రంగా మెరవడం మాత్రం ఆమెకు బాగా తెలుసు.
వేలికొనలమాటున చిత్రాలు హరివిల్లవ్వడం సర్వసాధారణం.
కానీ ఈ స్వప్నంకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు.
ఉన్నదల్లా.. కాళ్ళుమాత్రమే.. వాటితోనే.. అద్భుతమైన చిత్రాలు గీసేస్తుంది.
వేళ్ళమధ్య.. పెన్నో, పెన్సిల్‌తోనే.. ఏదో నాలుగు గీతలు గీయడం వేరు. ఈమె అలాక్కాదు.. ఉద్దండ చిత్రాకారులకు కంటే మిన్నగా కాన్వాస్‌పై ఆక్రిలిక్, ఆయిల్ కలర్స్‌తో అద్భుతాలు చేస్తోంది. అసలు ఇదెలా సాధ్యమైంది. అందుకే.. స్వప్న చిత్రాలను వెదుక్కుంటూ అలా కేరళదాకా వెళ్ళొద్దాం పదండి!!
ఆమె పేరు స్వప్న అగస్టీన్. ప్రస్తుతం ఉండేది కేరళలోని ఎర్నాకుళం. పుట్టిపెరిగింది త్రివేండ్రం దగ్గర్లోని పొతానికడ్. అయితే జన్యు సంబంధ లోపాల వలన చేతులు లేకుండానే పుట్టిన ఆమెను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అసలే ఆడపిల్ల, అన్ని అవయవాలు సరిగా ఉన్న ఆడప్లిలలకే అగచాట్లు తప్పడం లేదు. అటువంటిది చేతుల్లేని మొండెంలా కన్పిస్తున్న ఈ పిల్ల ఎలా ఈ సమాజాన్ని నెగ్గుకు రాగలదనే ఆవేదన వారిని మరింత కుంగదీసింది.
కాళ్ళతో.. కళాసాధన
స్వప్న పెరుగుతున్న కొద్దీ తల్లి దండ్రులు ఆమె భవిష్యత్ కోసం సానుకూలంగా ఏదైనా చేయాలని బాగా ఆలోచించేవారు. ఆమె ఊహ తెలిసేనాటికి తనకు అందరిలా చేతులు లేవన్న విషయం అర్ధమై బాధపడకూడదనేది వారి ఉద్దేశ్యం. అందరి పిల్లల్లా ఆమె తినలేకపోవడం, కాలకృత్యాలు తీర్చుకోలేకపోవడం, రాయలేకపోవడం, ఆడుకోలేకపోవడం వంటివన్నీ మానసికంగా మరింత దయనీయంగా మారుస్తాయని వారు ముందుగానే గుర్తించారు. తమ కూతురుకు చేతులతో చేయాల్సిన ప్రతి పనినీ కాళ్లతో ఎలా చేయాలో నేర్పారు. ఇలా చిన్నతనం నుంచే తన కాళ్లతోనే ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించింది స్వప్న. ఇంట్లో తల్లిదండ్రులతోపాటు స్కూల్లో టీచర్స్ కూడా అనునిత్యం ప్రోత్సాహిస్తూ ముందుకు నడిపారు. వారి సహకారంతో స్వప్న కాళ్ళతో రాయడమే కాకుండా చిన్న చిన్న బొమ్మలు వేసేది. ఇలా చిత్రకళపై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతుండడంతో తల్లిదండ్రులు ఆ దిశగా ఆమెను ప్రోత్సహించారు. అలా చిన్న వయసు నుంచే చిత్రకళలో ప్రతిభ చూపించేది స్వప్న. సాధారణ చిత్రకారులకు భిన్నంగా కాలి వేళ్ల మధ్య కుంచెను ఇరికించుకుని ఎంతో నైపుణ్యంతో బొమ్మలు గీయడంలో పట్టుసాధించింది. కొందరు గురువుల శిక్షణ కూడా అందుకు తోడ్పడింది.
ఎల్లలుదాటిన విచిత్రాలు
తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో స్వప్న చిత్రకళతో ఆంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆమె కాళ్లతో వేసిన వర్ణ చిత్రాలు ఇప్పటికే పలు ప్రదర్శనల్లో ఉత్తమ చిత్రాలుగా కళా విమర్శకుల ప్రశంసలు పొందాయి. తొలిసారిగా స్వప్న చిత్రాలు చూసినవారంతా ఎవరో చేయి తిరిగిన చిత్రకారుడు వాటిని గీసి ఉంటాడని అనుకునేవారు. కానీ చేతులు లేని స్వప్న వాటిని గీసిందంటే మరింత ఆశ్చర్యానికి లోనయ్యేవారు. చేతులతో బొమ్మలు గీసేవారి చిత్రాల సరసన తన చిత్రాలనుంచి కూడా వారికన్నా ఎక్కువగా విమర్శకుల మెప్పును పొందారు స్వప్న. తన చిత్రాలను పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల లోనే ఎక్కువగా ప్రదర్శనకు పెడుతుందామె. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. విద్యార్ధులు తమ భవిష్యత్‌ను అందంగా మలచుకోవడానికి కలలు కంటుంటారు, వాటిని నిజం చేసుకోవాలంటే పట్టుదల, విశ్వాసం ఎంతో అవసరం. వాటిని విద్యార్ధులకు, యువతకు అందించి వారిలో స్ఫూర్తిని నింపాలన్నదే ఆమె ధ్యేయం. స్వప్న గీసిన చిత్రాలు వందలాది అంతర్జాతీయ, జాతీయ యూత్ మేగజైన్స్ లోనూ, న్యూస్ లెటర్స్‌లోనూ ప్రచురించారు. మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వెబ్‌సైట్లలో కూడా ఆమె గీసిన చిత్రాలు ఉంటాయి.
ప్రకృతిలో కుంచెనద్ది
స్వప్న గీసిన చిత్రాలలో అత్యధికం ప్రకృతి దృశ్యాలే. అయితే అన్నిరకాల చిత్రాలు గీయడంలోనూ ఈమె అందవేసిన కాలే. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో స్వప్న చిత్రాలు గీసింది. అయితే ప్రకృతి మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో సహజమైన వర్ణ చిత్రాలను చిత్రించారు. అందరూ పెయింటింగ్ స్టాండ్‌కు కాన్వాస్‌ని అమర్చి చిత్రాలు గీస్తే స్వప్న మాత్రం తనకు అనుకూలంగా ఒక బల్లపైనే కాన్వాస్‌ను పెట్టుకుని కాలి వేళ్ల మధ్య కుంచెను బలంగా పట్టుకుని చిత్రాలు గీస్తుంది. రకరకాల రంగుల్ని కాళ్ల దగ్గర అందుబాటులో ఉంచుకుని అందులో కుంచెను ముంచి వర్ణచిత్రాలను రూపొందిస్తుంది.
స్వప్నకు 1999లో 'మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'లో సభ్యురాలిగా అవకాశం లభించింది. తన లాంటి కొంతమంది చిత్రకారులను ఆమె కలుసుకుంది. అప్పట్నుంచీ మరింత రెట్టించిన ఉత్సాహం, సహచరుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతోంది.
స్ఫూర్తికి చిరునామా
నిరాశ, నిస్పృహలతో యుక్తవయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న కొంతమంది యువతరానికి.. స్వప్న ఒక స్ఫూర్తి. ప్రేరణ. పట్టుదల ఉంటే చాలు.. అనితర సాధ్యమనుకునే ఎన్నింటినో సాధ్యం చేసుకోవచ్చన్నది స్వప్న నిరూపించింది. శారీరక లోపం ఉన్నంతమాత్రాన.. నిరాశతో కుమిలిపోకుండా నాలా మీరూ సాధించొచ్చని తనలాంటివారెందరికో స్వప్న ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
లోపం.. సమస్య కాకూడదు
''నేను అందరిలా చేతులతో పుట్టలేదన్న వాస్తవాన్ని అమ్మానాన్నా నాకు చిన్పప్పుడే అవగాహన కలిగించారు. వారి ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతో చిత్రకళలలో ఒక గుర్తింపుని పొందాను. కృషికి పట్టుదలను జోడిస్తే ఎలాంటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. దృఢమైన సంకల్పం ఉంటే శారీరక లోపం పెద్ద సమస్యేకాదు''
- స్వప్న అగస్టీన్, ఎర్నాకుళం
---- బెందాళం క్రిష్ణారావు






కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి