ఒకప్పుడు మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. వద్ధులకు చివరి రోజుల్లో మంచి ఆసరా ఉండేది. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురైన ఆధునిక జీవన పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా అరుదుగా కన్పిస్తున్నాయి. వ్యష్టి కుటుంబాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో వృద్ధులకు రక్షణ కూడా కరువౌతున్నది. వృద్ధులంటే అనుభవం గలవారు. వారి అనుభవం ముందు తరాలకు ఎంతగానో అవసరముంటుంది. నేటి ఆధునికతతో వారి అనుభవాన్ని మేళవించినప్పుడు ఎంతో మేలు కలుగుతుంది. అలాంటిది వారి అనుభవాలు పంచుకునేవారు తక్కువయ్యారు. అదే సమయంలో ఉద్యోగాల కోసమో, ఉపాధి కోసమో ఎక్కువ మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతుండడం వల్ల వృద్ధులకు నిరాదరణ ఎదురౌతోంది. మన దేశంలో పట్టణ జనాభాలో దాదాపు 80 శాతం మంది ప్రజలు అసంఘటిత రంగంలోనే పని చేస్తున్నారు. వారికి వచ్చే అల్పమైన ఆదాయాలతో తమ కుటుంబంతో పాటు తల్లిదండ్రులను పోషించగలిగే పరిస్థితి లేదు. దీని వల్ల యవ్వనంలో తమ శక్తినంతా కుటుంబానికి ధారపోసిన వృద్ధులు జీవితపు చివరి రోజుల్లో తమ ఆలనాపాలనా చూసేవారు లేక గ్రామీణ ప్రాంతాల్లో అనాథలుగా మిగులుతున్నారు. కొందరు తమ తల్లిదండ్రులను తమ వద్దనే ఉంచుకొని చూసుకుంటున్నా కూడా వారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. నేటి వృత్తి, ఉద్యోగాల మూలంగా ఒకే ఇంట్లో ఉన్నా అందరూ ఒకచోట కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. వృద్ధులైన తమ కుటుంబంలోని పెద్దలకు అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నామని నేటి తరం అనుకుంటోంది. కానీ కేవలం తిండి, సదుపాయాలు మాత్రమే గాక తమకు కొంత ఆప్యాయత, అనురాగాలు కూడా అందించాలని వృద్ధులు ఆశిస్తున్నారు. అవే వారికి దక్కడం లేదు. ఆర్థిక సంబంధ కారణాల వల్ల కుటుంబాల్లో స్పర్థలు, దూరాలు పెరుగుతుంటే ఎక్కువగా తల్లడిల్లేది కూడా వృద్ధులే కావడం గమనార్హం.
కూడు, గూడు ఉంటే సరా..
వృద్ధుల సమస్యలకు వృద్ధాశ్రమాలు పరిష్కారాలు చూపలేవని చాలా సందర్భాలలో రుజువైంది. కన్నకొడుకు కన్నా అతని భార్య ఆధిపత్యం కొనసాగే చాలా కుటుంబాల్లో, వద్ధాప్య దశలో ఉన్నవారు అనుభవించే యాతన వర్ణనాతీతం. తమ జీవన గమనంలో చివరి దశలోకి వచ్చిన వీరు పిల్లల దష్టిలో పూర్తిగా ప్రాధాన్యతను కోల్పోయి, కంటకప్రాయ జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఇటువంటి వారికి వృద్ధుల వసతిగృహాలు పరిష్కారమా? కానేకాదు. ఎందుకంటే ఆ వయసులో వారికి కావలసింది తమ బిడ్డల నుంచి ప్రేమ, భావాత్మకమైన అనుబంధం మాత్రమే. దానిని ఈ ఆశ్రమాలు ఏ విధంగా కూడా అందించలేవు. మనదేశంలో ప్రతి పది వృద్ధ జంటల్లో ఆరుగురు తమ పిల్లల చేత బలవంతంగా ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళగొట్టబడినవారేనన్నది చేదు నిజం. ఏ దారిలేని ఇటువంటి అభాగ్య జీవులు చివరకు వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు. కొందరు దిక్కులేని వారిలా, రోడ్లపై భిక్షమెత్తే ఓపిక లేక పడి ఉంటున్నారు. గుండెను మెలిపెట్టే ఎన్నో దృశ్యాలు ఓ ప్రయాణంలో మనకు ఎదురవుతుంటాయి. కుటుంబమంటే భార్య, పిల్లలే కాదు కన్న తల్లిదండ్రులు కూడా. అది భార్య తరపు అయినా, భర్త తరపు అయినా. ఎందుకంటే ఒకప్పుడు వారి కుటుంబంలో మీరున్నారు. మీ కుటుంబంలో వీరూ ఉండాలి. మిగతా తోబుట్టువులతో వంతులేసుకునే వారికో మాట. అంత మంది కలసి ఇద్దరి బాగోగుల్ని చూసుకోలేకపోతే చిన్నప్పటి నుంచి వారిద్దరే మీ అందరి బాధ్యతలు భుజానమోశారన్న మాట జ్ఞాపకముంచుకుంటే వంతులనే మాట ఉండదు. అయినా అమ్మానాన్న మా ఇంట్లో అంటే మా ఇంట్లో ఎక్కువ రోజులుండాలనే ఆశ, పోటీలుండాలి. ఆ ఆప్యాయతల్లో వారికి అంతులేని ఆనందం ఉంటుంది. ఏ వృద్ధాశ్రమ ఏసీ సౌకర్యాలూ వారిని కుదుటపరచలేవు. తృప్తి పరచలేవు.
పెరుగుతున్న వృద్ధుల జనాభా
ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు పరిశీలిస్తే ప్రపంచ జనాభాలో 60 ఏళ్ళు దాటిన వారి జనాభా 11 శాతం ఉంది. 2050 నాటికి వీరి జనాభా 19 శాతానికి చేరుకుంటుందని అంచనా. నిజానికి 60 అంతకంటే ఎక్కువ వయసున్న వారి జనాభా వర్థమాన దేశాల్లో చాలా వేగంగా పెరుగుతుండటం విశేషం. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా వ ద్ధుల జనాభా 20కోట్లకు చేరుకోనున్నదని 'యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్' (యు.ఎన్.ఎఫ్.పి.ఎఫ్) నివేదిక స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం భారత్, చైనాల్లో 2050 నాటికి ప్రపంచంలోని 80 శాతం మంది వృద్ధులు ఉండనున్నారు. ఇక భారతీయుల విషయానికి వస్తే.. అరవయ్యేళ్ళు దాటినవారి జనాభా 360 శాతం పెరగనున్నదని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేస్తోంది. యు.ఎన్.ఎఫ్.పి.ఎ మనదేశంలోని ఏడు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది.Ä భారత్‌లో ప్రస్తుతం 10 కోట్ల మంది వద్ధుల జనాభా ఉండగా, 2050 నాటికి వీరి సంఖ్య 32.3 కోట్లకు చేరుకుంటుంది. అంటే మొత్తం దేశ జనాభాలో వృద్ధుల జనాభా 20 శాతం ఉండబోతున్నదని యు.ఎన్.ఎఫ్.పి.ఎఫ్. నివేదిక అంచనా. దేశంలో నూటికి 70 మంది సీనియర్ సిటిజన్లు పల్లెల్లోనే నివసిస్తున్నారు. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతివత్తుల వారు 60 సంవత్సరాల తర్వాత శరీర సత్తువ తగ్గి ఆదాయాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. వీళ్లకు ఏ విధమైన ఆర్థిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్నారు.
గుర్తుంచుకోండి
మానసికంగా రిటైర్ కావడం అనేది వృద్ధాప్యంలో మంచిగా గడపడానికి పెద్ద ఆటంకమని వారు తెలుసుకోకపోవడం మరో సమస్య. వారు చురుగ్గా ఉన్న తమ మెదడును మరింతగా పనిచేయిస్తూ, సరికొత్త కార్యకలాపాలపై దృష్టిపెడితే మరింత ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ ఉత్సాహమే వృద్ధాప్య సమస్యలను అధిగమించడానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గేమాట కొంత వాస్తవమే అయినా ఇది అందరికీ రావాలనేం లేదు. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లో కూడా ఇలాంటి లక్షణాలు కన్పిస్తాయి. వద్ధాప్యంలో కుంగుబాటు (డిప్రెషన్) చాలా ఎక్కువ. గుర్తింపును కోల్పోవడం, తీవ్ర నైరాశ్యానికి లోనవడాన్ని మనం గమనిస్తాం. ఎంత వయసు వచ్చినా శరీరాన్నీ, మెదడునూ చురుకుగా ఉంచుకోవటం అవసరం. ఇందుకోసం ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని, కొత్త విద్య నేర్చుకోవటానికి ప్రయత్నించటం, కొత్త పుస్త్తకాలు చదవటం, చదరంగం-పదకేళి-చిన్నచిన్న లెక్కలు చెయ్యటం వంటి పనుల్లో తలమునకలు కావటం మంచిది. సాంత్వన, ఏకాగ్రత పెంచే ధ్యానం వంటి వాటిని ఆశ్రయించొచ్చు. ముఖ్యంగా- అల్జీమర్స్ వంటి కొన్నికొన్ని తీవ్ర సమస్యల్లో కనబడే మొదటి లక్షణం కూడా మతిమరుపే కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. వృద్ధులకు నిద్ర తక్కువ పడుతుందన్న దాంట్లో నిజం లేదు. అందరిలాగే వారికీ రోజుకి 7-8 గంటల నిద్ర అవసరం.
మలివయసుకు వచ్చేసరికి చాలామందిలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, పక్షవాతం వంటి రకరకాల సమస్యలు వెంటాడతాయి. కాబట్టి తరచూ పరీక్షలు చేయించుకుంటూ, చికిత్స కొనసాగిస్తూ వీటిని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. అలాగే మలివయసులో ఎదురయ్యే మరో పెద్ద సమస్య క్యాన్సర్. స్త్రీలలో రొమ్ము, గరాÄ్భశయ ముఖద్వార క్యాన్సర్లు, పురుషుల్లో ప్ర్రోస్టేటు గ్రంథి క్యాన్సర్ల వంటివి ఎక్కువ. ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ల వంటివి ఇద్దరిలోనూ కనబడుతుంటాయి. కాబట్టి ఒంట్లో ఎక్కడెనా గడ్డలు రావటం, ఎక్కువరోజుల పాటు దగ్గు వేధించటం, మలవిసర్జన అలవాట్లు మారిపోవటం, రక్తం కనబడటం, బరువు తగ్గిపోవటం, పుండ్లు మానకపోవటం వంటి లక్షణాలేవైనా కనబడితే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
వృద్ధులకూ వ్యాయామాలు
నాలుగు అక్షరాలు రాద్దామంటే వేళ్లు సహకరించవు. డబ్బాల మూతలు తియ్యాలంటే చేతుల బలం సరిపోదు. కిందపడిన వస్తువులు తీసుకుందామంటే ఎక్కడ ముందుకు పడిపోతామోనన్న భయం. ఇలా దైనందిన జీవితంలో ఏ పని చేసుకోవాలన్నా వృద్ధులకు శక్తి చాలక అశక్తత ఆవరిస్తుంటుంది. దీనికి విరుగుడు సూత్రం ఒక్కటే. 'యూజ్ ఇట్.. ఆర్.. లూజ్ ఇట్' వాడుతుంటేనే ఒంటికి చేవ తగ్గకుండా ఉంటుంది. ఉపయోగిస్తుంటేనే పదును తగ్గకుండా ఉంటుంది. అందుకే పాశ్చాత్య దేశాల్లో దీనిపై ఇప్పుడు విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. వ్యాయామాల వల్ల త్వరగా అలసిపోకుండా ఎక్కువ దూరం నడవటం, బరువులను తేలికగా ఎత్తటంతో పాటు గుండె రక్తనాళాల పనితీరూ మెరుగుపడినట్టు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. ఆత్మవిశ్వాసమూ పెరుగుతుండటం విశేషం. నొప్పులు కూడా తగ్గుతున్నాయి. వ్యాయామం మూలంగా రోగ నిరోధకశక్తి పెరగటంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పూ తగ్గుతున్నట్టు ఇతర అధ్యయనాల్లో బయటపడింది. ఎక్కువసేపు కదలకుండా కూచునే వృద్ధులకు తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా, అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు మరో పరిశోధనలో బయటపడింది. మధుమేహం, హైబీపీ, హైకొలెస్ట్రాల్ వంటి సమస్యలను అధిగమించేందుకూ వ్యాయామాలు అవసరమని వైద్యులు చెబుతున్నారు. నడక, ఈత వంటి సామర్థ్యాన్ని (ఎండ్యూరెన్స్) పెంచే వ్యాయామాలతో కొత్త శక్తిని పుంజుకోవచ్చు. తోటపని, ఇంటిపని వంటివి తేలికగా చేసేయొచ్చు. కండరాలను దృఢపరిచే, కండరాలు సాగే, శరీర బ్యాలెన్స్ మెరుగుపరచుకునే వ్యాయామాలు ఎలా చేయాలో సంబంధిత వైద్యులను సంప్రదించాలి. వ్యాయామం ఎంత అవసరమో.. వాటి మూలంగా గాయాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటమూ అంతే ముఖ్యమని మరిచిపోకూడదు. యవ్వనంలో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకుంటే మలి వయసు కూడా చక్కటి ఆరోగ్యంతో ఎంతో ఆహ్లాదంగా, హాయిగా గడిచిపోతుంది. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాల వంటివి ఎక్కువగా తినాలి. నీరు సమృద్ధిగా తాగాలి. వినికిడి, కంటి సమస్యలు వస్తే వైద్యులకు చూపించుకుని చక్కటి సామాజిక జీవితాన్ని గడపొచ్చు. పెద్దవయసులో సాధ్యమైనంత వరకూ బరువు పెరగకుండా చూసుకోవటం మంచిది. బరువు తగ్గితే మోకాళ్లు అరిగిపోయే ముప్పు కూడా తగ్గుతోందని 'ఫ్రేమింగ్‌హ్యామ్ ఆస్టియో ఆర్త్థ్రెటిస్' అధ్యయనంలో స్పష్టంగా గుర్తించారు. రోజువారీ ఓ మోస్తరు నడక, వ్యాయామాలు కొనసాగించాలి. ఎముక సాంద్రత తగ్గటం వల్ల చిన్నపాటి ప్రమాదాలకే ఎముకలు, వెన్నుపూ సలు విరిగిపోవటం కూడా వీరిలో ఎక్కువే. పొగ తాగకుండా ఉండటం, క్యాల్షియం ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బాత్రూముల్లో పడిపోకుండా నేల నునుపుగా జారిపోయేలా లేకుండా చూసుకోవటం, ఇంట్లో నడిచేటప్పుడు పరిస్థితిని బట్టి నాలుగుకోళ్ల కర్ర సాయం తీసుకోవటం, తల తిప్పు, తూలు రావటం వంటి లక్షణాలు కనబడుతుంటే తక్షణం వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి.
ఆఖరి మజిలీ
వయసులో ఉన్నప్పుడు, సాధించినవన్నీ, ఉడిగిన వయసులో గత కాలపు 'కథ'లుగా స్మతిపథంలో మిగిలిపోతాయి. ఎవరైనా ఏదో ఒకనాడు వృద్ధాప్య దశకు చేరుకోవలసిందే. శరీరం ముడుతలు పడిపోవచ్చు. కానీ మనసు సంపూర్ణ వికాసాన్ని పొంది ఉంటుంది. జీవితపు అన్ని పార్శ్వాలపై స్పష్టమైన ద క్కోణం ఏర్పడుతుంది. కేవలం తన జీవితంలో సాధించిన అనుభవాలు మాత్రమే కాదు, ఇతరుల జీవితానుభవాల నుంచి నేర్చుకున్నవి కూడా చాలా ఉంటాయి. జీవితంలో ఎన్నో ఘన విజయాలు, విషాదాలు అన్నింటిని అనుభవించి పండిపోయిన వయసే వృద్ధాప్యం. ఎన్నో ఎగుడుదిగుళ్ళు దాటుకొని మనసు రాటుతేలిపోయి ఉంటుంది. దీర్ఘకాలపు జీవన చిత్రాన్ని, చరిత్రను చాలా స్పష్టంగా వీక్షించడానికి వీలయ్యేది వృద్ధాప్యంలో మాత్రమే. ఎప్పటికప్పుడు క్షణం తీరిక లేకుండా సమయం తెలియకుండా పరుగుల జీవనం నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛ, దేన్నయినా అన్వేషించగల సామర్థ్యం కూడా వృద్ధాప్యంలోనే ఉంటుంది. జీవితాన్ని తుదికంటా ఫలవంతం చేసుకుంటూ ఓపికున్నంత వరకు శ్రమిస్తూనే ఈ జీవితం నుంచి విముక్తం కావాలని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు. వృద్ధాప్య దశలో ఎదురయ్యే అడ్డంకులను సాధ్యమైనంత వరకు అధిగమించి, ప్రశాంత జీవనాన్ని గడపడానికే ప్రాధాన్యతనివ్వడం ఎంతో అవసరం.
తెగిపోతున్న అనుబంధం
ఒకప్పుడు కుటుంబాల్లో బాలలు తమ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతోనే ఎంతో అనుబంధాలను పెనవేసుకునేవారు. వారి అమ్మానాన్న ఇంటిపనుల్లో తలమునకలై ఉంటే బాలలు వృద్ధులైన తమ తాతయ్య, నానమ్మ, ఆమ్మమ్మలను విడిచి ఉండేవారు కాదు. వీరి మధ్య ఉన్న అనుబంధం పిల్లల మానసిక ఎదుగుదలకు, పెద్దలంటే గౌరవానికి, తోటి మనుషుల్లో మానవత్వాన్ని చూడడానికీ, నైతిక విలువలు ఆచరించడానికీ ఎంతో దోహదపడేది. విద్యావిషయాల్లో చురుకుదనాన్ని కూడా పెంచేది. కానీ ఇప్పుడు చిన్నారులను మూడేళ్ల నుంచే ప్రైవేటు విద్యాసంస్థలకు పంపించి వారి బంగారు బాల్యాన్ని హరించేస్తున్నారు. తమ ఇంటిలో ఉన్న పెద్దవారితో వారి సంబంధాలు అక్కడితో తెగిపోతున్నాయి. దీంతో పిల్లలు మానవ విలువల పట్ల పూర్తి అవగాహనకు దూరమౌతున్నారు. మానవ సంబంధాలంటే కేవలం ఆర్థిక సంబంధాలనే భ్రమలో పడి తాము వత్తిడికి గురౌతూ అభద్రతలో అలమటించి పోతున్నారు.
జీవన వైరుధ్యాలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల జీవితాల మధ్య ఉన్న వైరుధ్యాలు వృద్ధుల జీవితాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాలలో వృద్ధులుగా ఉన్నవారు చాలా మంది వివిధ రకాల ఉద్యోగాలు చేసి విశ్రాంత జీవితాన్ని అనుభవిస్తున్నవారే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధుల జీవనశైలితో పోలిస్తే వీరు కొంతైనా మెరుగ్గా ఉన్నారని చెప్పొచ్చు. సీనియర్ సిటిజన్స్ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు వంటివాటిని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పార్కుల్లోనూ, ఇతర ప్రదేశాలలోనూ కలుసుకుంటూ తమ అనుభవాలు పంచుకుంటూ, సమస్యలని విన్పించుకుంటూ ఉంటారు. వృద్ధాప్యంలో కాస్త ఉల్లాసంగా ఉండడానికి అనువైన వ్యాయామాలు వంటివి కూడా వీరికి అందుబాటులో ఉంటున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తగిన వైద్య సదుపాయాలు కూడా వీరికి అందేటంత దూరంలో ఉంటున్నాయి. కొంతవరకూ పింఛన్ వంటి ఆర్థిక భద్రత వీరికి ఉండడం వల్ల వృద్ధాప్యం పెద్ద భారంగా ఉండదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. వృద్ధాప్యానికి పేదరికం కూడా తోడు కావడం వారి జీవితాలకు శాపంగా మారుతోంది. గ్రామాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిన తర్వాత ఉపాది óకరువై ఇతర ప్రాంతాలకు వలసలు బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో వృద్ధులైన తల్లిదండ్రులను గ్రామాల్లోనే విడిచిపెట్టి భార్యాపిల్లలతో బతుకు సమరానికి బయలుదేరుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వృద్ధులు సంఘాలుగా ఏర్పడటానికి తగిన చైతన్యం, అందుకు అనువైన పరిస్థితులు కూడా ఎక్కడాలేవు. దీనికి తోడు వయోభారం వల్ల రకరకాల అనారోగ్యాలు, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు అక్కడి వృద్ధులను జీవచ్ఛవాలుగా మిగులుస్తున్నాయి.
ఒంటరి సమస్యలు
వృద్ధుల్లో అత్యధిక శాతం మంది ఒంటరిగానో లేక జీవన సహచరులతోనో జీవనం వెళ్ళదీస్తున్నారు. 70 శాతం మంది వృద్ధులు నిరక్షరాస్యులు. చాలామంది విద్యావంతులైన వారికి కూడా వృద్ధాప్యం పెను శాపంగా మారుతోంది. ఒంటరితనం, నిస్సారమైన జీవితం వారిని పీడిస్తోంది. జీవితం పొడిగిస్తున్న కొద్దీ వారు ప్రతి అంశం నుంచి తమను తాము ఉపసంహరించు కుంటూ రావాల్సి రావడం ఎంత దయనీయం. మరింత ఒంటరితనాన్ని అనుభవించేది 75 సంవత్సరాల వయసు పైబడినవారు. ముఖ్యంగా మహిళలు, వితంతువులు ఇటువంటి పరిస్థితికి లోనవుతున్నారు. చాలా మంది వృద్ధులు జీవన చరమాంకంలో జీవితాలకు స్నేహ హస్తాన్ని అందించే తోడు కోసం ఎదురుచూస్తున్నారు. తమలాగే నిరాదరణకు గురైన వృద్ధులను జీవనసహచరులుగా కూడా కొంతమంది చేరదీస్తున్నారు. ఈ విషయంలో లైంగికాంశాల కన్నా మానసికంగా ఓదార్పును వారు వెతుక్కుంటున్నారు. ఇలాంటివి అందరి విషయంలో సాధ్యం కాకపోయినా కొంత ఆర్థిక భద్రత ఉన్న వారికి వీలు కలుగుతోంది. తమ పిల్లల నుంచి ఎదురయ్యే నిరాదరణను వీరు ఇలా కొత్త జీవిత భాగస్వామి ద్వారా పొందాలని భావిస్తుంటారు. అయితే ఒంటరి వృద్ధుల కన్నా, కుటుంబాలు ఉన్న వృద్ధులకు ఆస్తులు, ఆర్థిక విషయాల్లో కొత్త సమస్యలు ఎదురౌతున్నాయి.
వృద్ధులకూ ఒక రోజు
సమాజం, కుటుంబ సభ్యుల నుంచి ఎదురౌతున్న నిరాదరణపై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కొంతమంది వృద్ధులు గొంతు విప్పుతున్నారు. తమ హక్కుల సాధనకు నినదిస్తున్నారు. సంఘాలుగా ఏర్పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 2400 వృద్ధుల సంఘాలు (ఒ.పి.ఎ)లు పనిచేస్తున్నాయి. ఈ సంఘాల ద్వారా వృద్ధులు తమ గళాన్ని ప్రపంచం వినాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఎల్లవేళలా సహాయం పొందుతున్న నిష్క్రియా పరులం కామని, కేవలం మార్పునకు చురుకైన కారకులం కూడా అంటూ ఎలుగెత్తి చాటడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వృద్ధుల కోసం ఐక్యరాజ్య సమితి ఏటా అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా జరుపుకోవాలని 1990లో తీర్మానించింది.
వృద్ధుల కోసం చట్టాలు
దేశానికి మార్గదర్శకుల్లాంటి వృద్ధుల సమస్యలపై చాలా దేశాలు దష్టిసారించాయి. 2004లో స్పెయిన్‌లో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశంలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వం కూడా వృద్ధులకు తమ హక్కుల పట్ల చైతన్యం కలిగించడంతో పాటు వారి ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను అమలు చేయాలి. దేశంలో మొత్తం 8.1 కోట్ల మంది వృద్ధులు ఉండగా వీరిలో 11 లక్షల మంది కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నారు. కుటుంబాలతో కలిసి జీవిస్తున్న సీనియర్ సిటిజన్లలో 40 శాతం మంది వేధింపులను ఎదుర్కొం టున్నట్టు తేలింది. కానీ అటువంటి వారిలో ప్రతి ఆరు కేసుల్లో ఒకటి మాత్రమే వెలుగులోకి వస్తున్నది. ''మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్'' ప్రస్తుతం మనదేశంలో అమల్లో ఉంది. దీని ప్రకారం తల్లిదండ్రులను వదిలేసిన లేదా పట్టించుకోని సంతానానికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థల సర్వే ప్రకారం వృద్ధాప్యంలో తల్లిదండ్రుల చేత వారి ఇళ్ళను సంతానం బలవంతంగా అమ్మించడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఆస్తి వివాదాలు వచ్చిన సందర్భంలో, భార్యలు పిల్లలనే సమర్థించడంతో తాము తీవ్ర నిస్సహాయతకు లోనవుతున్నామని కొందరు వద్ధులు చెప్పిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే వృద్ధుల హక్కులు, వారి పరిరక్షణకు చట్టాలు కాదు కావలసింది.. కేవలం నైతిక పునాది మాత్రమేనని స్పష్టమవుతోంది.
- బెందాళం క్రిష్ణారావు,









కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి