డాబు.. దర్పం ఉండదు. పర్యావరణానికి ముప్పు అని తెలిస్తే.. కీకారణ్యందాకైనా నడుచుకుంటూ వెళ్తారామె. మానవహక్కుల ఉల్లంఘనకు భంగం కలుగుతుందని ఉప్పందితే.. సామాన్య జనాలతో కలిసి నడిరోడ్డుపై బైఠాయిస్తారామె. ఒకప్పుడు భౌతికదాడుల్ని సైతం లెక్క చేయకుండా 'నర్మదా బచావో' అని దేశమంతా ఎలుగెత్తిన పోరాటస్ఫూర్తి మేధా పాట్కర్. 'ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో సామాన్యుల కనీస అవసరాల కోసం, జీవించే హక్కులను సాధించుకోవడం కోసం గాంధీయిజం నుంచి మార్క్సిజం వైపు అడుగులు వేయాల్సిందే' అన్నది మేధాపాట్కర్ మాట. తాజాగా మద్యం మహమ్మారిపై పోరాటం చేస్తూ 'నాశా ముక్తిభారత్ ఆందోళన్' నిర్వహిస్తున్న జాతీయ యాత్రలో భాగంగా విజయవాడ వచ్చిన సందర్భంగా మేధా పాట్కర్‌తో 'జీవన'
ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం.
కుటుంబ నేపథ్యం గురించి?
మా కుటుంబ నేపథ్యం, నేను పెరిగిన పరిస్థితులు, సామాజిక అవగాహన నన్ను ఈ వైపుకు మళ్లించాయి. నేను పుట్టింది ముంబయిలో. నా తల్లిదండ్రులు ఇందు, వసంత్ కనోల్కర్. ఆయన కార్మిక నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. మా అమ్మ 'స్వదార్' అనే సంస్థలో సభ్యురాలు. ఆర్థిక, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో నిరుపేద మహిళలకు ఈ సంస్థ తోడ్పాటు అందించేది. వారిద్దరూ నాకు ఊహ తెలిసేనాటికే సామాజిక కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. వారిద్దరూ విద్యార్థిదశలో ప్రజా ఉద్యమాలను నాకు మరింత దగ్గరగా పరిచయం చేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నందు సామాజిక సేవలో ఎం.ఏ. చదువుతున్నప్పటికే వాటితో నేను మమేకం అయ్యాను.
రాజకీయ ప్రస్థానం గురించి?
మా కుటుంబం మొదటి నుంచీ సోషలిస్టు భావజాలంతో ఉంది. అప్పట్లో మహారాష్ట్రలో ఆర్.ఎస్.ఎస్.కు వ్యతిరేకంగా వామపక్షాలు ఏర్పాటు చేసిన రాష్ట్రీయ సేవాదళ్‌లో చేరాను. సామాజిక సేవను ఆధ్యయనం చేశాక టి.ఐ.సి.సి.లో అధ్యాపకురాలిగా పనిచేశాను. ఆ తర్వాత పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాను. ప్రజాసమస్యలపై సుదీర్ఘకాలం నుంచి పోరాటాలు చేస్తున్నాను. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ తరుఫున పాల్గొన్నాను. అంతే.
మీ జీవనశైలి గురించి తెలుసుకోవచ్చా?
అతి సాధారణమైనది. ఎక్కడికక్కడ ప్రజల్లో కలిసిమెలిసి ఉండడం నా అలవాటు. ఎంత దూరమైనా నడిచి వెళ్లడానికే నేనెప్పుడూ ఇష్టంగా, సిద్ధంగా ఉంటాను. సాధారణంగా అందరూ తీసుకునే ఆహారమే తీసుకుంటాను. ప్రత్యేకించి జీవనశైలి అంటూ నాకేమీ ఉండదు.
పర్యావరణం, మానవహక్కులు వంటి అంశాలపై ఉద్యమాలు చేస్తూ.. ఇప్పుడు మద్యం మహమ్మారిపై పోరాటం ప్రకటించడానికి కారణం?
మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందులో వాస్తవం లేదు. మద్యపాన వ్యసనం కోట్లాది కుటుంబాలను ఈ దేశంలో ఆర్థికంగా, అనారోగ్యపరంగా కుంగదీస్తోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఆర్థికంగా సామాజికంగా నష్టపోతున్నారు. మద్యం వ్యాపారం పేరుతో ప్రభుత్వాలే మాఫియాగా మారాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు 'మద్యం ప్రజల బతుకులను నాశనం చేస్తుంది. కాబట్టి దానిని నిషేధించి, ప్రజలకు పౌష్టికాహారం ఇవ్వాలి.. అని'. అయితే ప్రభుత్వాలు నడిపేవారు మాత్రం ఆయన విగ్రహాలకు, ఫోటోలకు దండలేస్తారు. కానీ ఆయన చెప్పింది మాత్రం పట్టించుకోరు. భారత రాజ్యాంగంలోని 47వ అధికరణంలోనే ప్రజారోగ్యాన్ని కబళించే మత్తు పదార్థాలను నిషేధించాలని స్పష్టంగా ఉంది. సంపూర్ణ మద్యనిషేధం ప్రజల హక్కు.. అందుకోసమే ఈ పోరాటం.
భారీ ప్రాజెక్టుల వల్ల రైతుల సమస్యలు పరిష్కారమౌతాయని పాలకులు చెబుతుంటే.. వాటిని అడ్డుకోవడంలో మీ లక్ష్యం ఏమిటి?
ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారీ ప్రాజెక్టులు ఎక్కడా సత్ఫలితాలు ఇవ్వవు. ఇందులోని భారీ జలాశయాలు కలిగించే విపత్తులను గుర్తించి 1958లోనే వీటిని 'మహాకాయవ్యాధి' గా పేర్కొంటూ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకి లేఖ రాశాను. అప్పట్లో ఏం జరుగుతుందని భయపడ్డానో.. ఇప్పుడూ భారీ ప్రాజెక్టుల వలన అదే జరుగుతోంది. ఎన్నో రకాలుగా పర్యావరణ సమస్యలు, నిర్వాసితుల సమస్యలు, రకరకాల ఆర్థిక అసమానతల సమస్యలు చుట్టుముడుతున్నాయి.
నర్మదాబచావో ఆందోళన్ ఎంతవరకూ సత్ఫలితాలను ఇచ్చింది?
నర్మదాబచావో ఆందోళన్ ఆన్నది మా ఉద్యమానికి పెట్టుకున్న పేరు. నర్మదానదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సహా మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం వల్ల లక్షలాది మంది అక్కడ నుంచి నిర్వాసితులుగా వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి పునరావాసం కోసమే 1985లో 'నర్మదాబచావో ఆందోళన్' ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం చర్చని రేకెత్తించింది. ప్రజాస్వామ్యవాదుల మద్దతు ఉద్యమానికి లభించింది. గుజరాత్ ప్రభుత్వం నాతో సహా ఉద్యమకారులపై భౌతికదాడులకు కూడా తెగబడింది. ఎన్నోరకాలుగా ఉద్యమానికి విఘాతాలు కల్గించింది. ఆయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. నిర్వాసితుల పునరావాసం తర్వాతే ప్రాజెక్టు నిర్మించాలని చెప్పిన న్యాయస్థానం తన తీర్పుని తానే వెనక్కి తీసుకొంది. ఈ ప్రాజెక్టు అనేక విధాలుగా విఫలమైంది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరుతో జరిగిన భూసేకరణపై మీ వైఖరి?
రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవడాన్ని మొదట్నుంచీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా రైతులపై రకరకాలుగా వత్తిడి తీసుకొచ్చి, భూమిని లాగేసుకున్నారు. అమరావతి నిర్మాణంలో కూడా పర్యావరణ ఆంశాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. కృష్ణానదికి వరదలొస్తే అమరావతి అంతా మునిగిపోవడం ఖాయం. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయాన్ని కూడా ఆలోచించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు.
అమరావతి నిర్మాణంలో రైతులకు జరిగిన అన్యాయంపై మీ ఉద్యమం ఉంటుందా?
అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి బలవంతపు భూసమీకరణలోనే వారికి అన్యాయం జరిగింది. ఇప్పటికీ చాలామందికి పరిహారం కూడా సక్రమంగా అందలేదు. సహజవనరులను ధ్వంసంచేసి, రాజధాని నిర్మాణం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు భూమిని ధారాదత్తం చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో రైతులకు అండగా నిలవాల్సిందే. అక్కడ జరిగే ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలపాల్సిందే. కార్పొరేట్ శక్తుల చేతుల్లో రాజధాని ఉంటే, సాధారణ ప్రజలు అక్కడ అడుగుపెట్టడం కూడా కష్టమే. పేదలకు అండగా ఉద్యమం కొనసాగుతుంది.
మీ సామాజిక ఉద్యమాలు, ప్రజా పోరాటాల గురించి?
ఒడిసాలో పోస్కో ఉక్కు పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమం, ఢిల్లీలో మురికివాడల్లో నివసిస్తున్న పేదల ఇళ్ల తొలగింపుకు వ్యతిరేకంగా ఉద్యమం, ముంబయిలో మురికివాడల తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమం. సింగూరులో పంటపొలాలను పరిశ్రమలకు ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమం. నందిగ్రామ్ ఆందోళన. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు.. ఇలా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాను. జీవితమే పోరాటం లాంటిది.. ఆది ఎక్కడో ఒకచోట ఆగేదికాదు.
దళితులపై జరుగుతున్న దాడులపై మీ స్పందన?
ఎన్.డి.ఏ. ప్రభుత్వం తాలూకా అండదండలతో కొంతమంది కావాలనే దళితులపై దాడులు చేస్తున్నారు. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. దళితులపై దాడులు చేసి ప్రజాపోరాటాల్లో ఉన్నవారికి, అణగారిన వర్గాల వారికి భయాన్ని కలిగించాలన్నదే వారి లక్ష్యం. అందుకోసం గొడ్డుమాంసం ఒక నెపం మాత్రమే. ఏ ఆహారం తీసుకోవాలన్న విషయాన్ని రాజ్యం నిర్దేశించకూడదు.
ప్రజా ఉద్యమాల్లో ఎదురయ్యే సవాళ్లని ఎలా అధిగమించాలి?
సవాళ్లను ఎదుర్కోవడానికే ప్రజాఉద్యమాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి పాలకవర్గాలు, కార్పొరేట్ శక్తులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఎన్నో ప్రతిబంధకాలు సృష్టిస్తాయి. ఉద్యమాలు చేసేవారిపై అపనిందలు వేస్తాయి. పుకార్లు పుట్టించి, రెచ్చగొడతాయి. అన్ని సందర్భాలలోనూ సంయమనంగా వ్యవహరించాలి. వాస్తవాలపట్ల ఆవగాహన పెంచుకొని, ఉద్యమాలను కొనసాగించాలి. తద్వారానే ఆ సమస్యలను అధిగమించాలి.
ఇంటర్వూ: బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి