10, డిసెంబర్ 2016, శనివారం

నాన్న‌.. ఐ ల‌వ్‌యూ...


కన్న పేగు ప్రేమ అమ్మదైతే.. కను రెప్ప రక్ష నాన్నది. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో నాన్న నీతి పాఠం అలాగ. నాది అని బిడ్డ భావించే ప్రతి దానికి పునాదిగా ఉండి సాధనకు తోడ్పడేవి బాల్యంలో తండ్రితో కలసి ప్రేరణ పొందిన మధుర క్షణాలే. లోకంలో ఏ నాన్న కైనా కన్నబిడ్డల తోటే లోకం. కాలం బాట మీద కనిపించని సాధకుడు నాన్న. జూన్‌ 19 పితృ దినోత్సవం సందర్భంగా అట్టమీది కథ. 
నాన్న కోసం ''ఓ నాన్నా... నీ మనసే వెన్నా... అమృతం కన్నా అది ఎంతో మిన్నా....!'' అని ఒక సినీ కవి అన్నా,
''ఔదార్యాన్ని గాంభీర్యాన్ని అనురాగాన్ని త్యాగాన్ని రంగరిస్తే
తయారయ్యే ఆత్మీయ రూపం నాన్న'' అని మరో కవి వర్ణించినా,
''బ్రతుకు నావ వ్యసనాల గాలికి కొట్టుకు పోకుండా క్రమ శిక్షణల తెర చాపలను పైకెత్తి
గమ్యం వైపు నడిపించే దీప స్థంభం నాన్న '' అని సాహిత్యంలో కవితాత్మకంగా వివరించినా అంతా 'నాన్న' గొప్పతనం గురించే. నాన్న జ్ఞాపకాలలో కలాన్ని ముంచి ఎందరో ప్రముఖులు కథలు, కవిత్వం, వ్యాసాలు ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియల్లో నాన్నను ఆవిష్కరించారు. అంతేకాదు. పాతతరం నుంచి వర్తమానం వరకూ ఎన్నో సినిమాలు కుటుంబంలో, సమాజంలో నాన్నకు గల ప్రాముఖ్యతను వివరిస్తూ వచ్చినవే. ''నాన్న, ఆకాశమంతా, నాన్నకు ప్రేమతో, సన్నాఫ్‌ సత్యమూర్తి, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, దూకుడు, రాజాబాబు......'' ఇలా ఎన్నో సినిమాలు నాన్నతో ఉన్న అనుబంధాన్నీ, ఆత్మీయతనూ వివరిస్తూ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. 'నాన్న' అనే మాట జీవితానికి పెన్నిధి.

 
             ''నాన్న''.....అనే పదం. 'అమ్మ' అనే పదం తర్వాతదైనా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన భావన. 'అమ్మ' వాస్తవం, 'నాన్న' నమ్మకం అంటారు. నవ మాసాలూ మోసి ఎంతో ప్రసవ వేదననుభవించి ఒక శిశువును తల్లి భూమి మీదకు తీసుకొస్తే.. ఆ శిశువు యుక్తవయసుకు వచ్చే వరకూ, ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దే వరకూ కంటికి రెప్పలా భరోసాగా నిలిచేది కన్న తండ్రి లాలించి.. లాలపోసి.. అడుగులేయించి.. అక్షరాలు పలికించి అన్నీ తానై తోడూ నీడగా ఉండే 'నాన్న'కు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక స్థానముంటుంది. చిన్నతనంలో నాన్న చెప్పుల జతలో తప్పటడుగులతోనే ఏ బిడ్డయినా జీవిత పరుగు పందాన్ని మొదలు పెడుతుంది. ఉద్యోగం, ఉపాధి అంటూ ఉదయాన్నే లేచి వెళ్లే 'నాన్న'.. ఇంటి పట్టున ఉండలేడు. కంటి నిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తు కోసం వారిని కష్టపెట్టినా అది వారి ఉన్నతి కోసమే. నాన్న అనురాగానికీ, ఆప్యాయతలకు ప్రతీక మాత్రమే కాదు. మార్గదర్శిగా ఉంటూ పిల్లల బంగారు భవితకు బాటలు వేయడానికి నిరంతరం తపన పడుతుంటాడు. పెళ్లయి అత్తారింటికి వెళ్లినా ఆడపిల్లకు తండ్రి లాలన పట్లే మక్కువ ఎక్కువ. ఉద్యోగాలొచ్చి ఎక్కడెక్కడో స్థిరపడే మగ పిల్లలను కూడా బాల్యంలో తండ్రి నేర్పిన క్రమశిక్షణే ముందుకు నడిపిస్తుంది. 

ఆత్మీయతకు ఆలంబనై..
ప్రస్తుత సమాజంలో కుటుంబ నిర్వహణలో అమ్మతోపాటు బాధ్యతలను పంచుకోవడానికి నాన్న పోటీ పడుతున్నాడు. వంట పనిలో, ఇంటి పనిలో అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లల సంరక్షణలో తన వంతు సహాయం చేసేందుకు నాన్న సిద్ధంగా ఉండటాన్ని నేడు చాలా ఇళ్లలో చూస్తున్నాం. వంట పనిలో అమ్మ బిజీగా ఉంటే పిల్లల్ని నిద్ర లేపడం, స్నానం చేయించడం, వారిని స్కూల్‌కు సిద్ధం చేయడంలో నాన్న సహకరిస్తున్నాడు. తల్లి కన్నా పిల్లలు తండ్రికే ఎక్కువ చేరిక అవుతున్నారు. తల్లి దగ్గర భయాన్ని చూపించే ఆడ పిల్లలు కూడా తండ్రి దగ్గర స్వేచ్ఛగా తమ మనోభావాలను బయటపెట్టడంలో వెనుకంజ వేయడం లేదు. పిల్లలు తండ్రిని తమ మొదటి స్నేహితునిగా అభిమానిస్తున్నారు. పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి గొప్పలకూ పోకుండా భార్యకు సహకరిస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. చదువుల్లో పిల్లల ప్రగతి, వైఫల్యాల గురించి ఆరా తీస్తూ వారి భవిష్యత్‌ కలలను సాకారం చేసేందుకు నాన్న ఎంతగానో ఆలోచిస్తున్నాడు. పరీక్షల సమయంలో అనుక్షణం పిల్లలను మానసికంగా సన్నద్ధం చేస్తూ, వారికి ధైర్యాన్ని నూరిపోయడంలో నాన్న చేస్తున్న కషి తక్కువేమీ కాదు.

వాత్సల్యానికి ప్రతిరూపం...
బిడ్డలకు తల్లి అవసరం ఎంత ఎక్కువ కావాలని చెబుతామో తండ్రి చేయూత కూడా అంతే స్థాయిలో అందాలన్నది నిజం. తల్లి బిడ్డలను పొత్తిళ్లలో పొదువుకుని స్థైర్యాన్ని.. ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అదే బిడ్డలకు తండ్రి తన చిటికెన వేలు అందించి నడకను.. మనోధైర్యాన్ని నింపుతాడు. ఒక వయసు వరకు బిడ్డలు తల్లిలో అంతర్భాగమై నడుచుకున్నప్పటికీ నాన్నతో జట్టు కట్టడం కూడా మొదలెడతారు. మానసిక శాస్త్రం ప్రకారం ఆడపిల్లలు తన తల్లినే పోటీగా భావిస్తూ తండ్రి నుండి ఎక్కువ స్థాయిలో ప్రేమాను రాగాలు పొందడానికి ప్రయత్నిస్తూ తండ్రికి మరింత చేరువ కావడాన్ని 'ఎలక్ట్రా కాంప్లెక్స్‌' అంటారు. మగ పిల్లలు తండ్రిని తమకు పోటీగా భావిస్తూ తల్లి నుండి ప్రేమాను రాగాలను అధిక స్థాయిలో కోరుకుంటారు. దీనిని 'ఎడిపస్‌ కాంప్లెక్స్‌' అంటారు. స్త్రీవాదుల ప్రకారం పిల్లలు తల్లి చెప్పిన దాని ప్రకారమే తండ్రిని గుర్తిస్తారని తెలుస్తుంది. కాని విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనలను బట్టి పుట్టిన పాపాయి కళ్లు తెరిచినప్పటి నుండి తల్లిలో అంతరాÄ్భగంగా వుంటూనే తండ్రి కోసం వెతుకుతుందట. అందువల్లే తండ్రి ప్రాధాన్యత పాపాయి జీవితంలో తొలి రోజు నుంచే మొదలౌతుంది. ఆత్మీయతకు అమ్మ ప్రతిబింబమైతే.. అంతులేని వాత్సల్యానికి నాన్న ఓ ప్రతిరూపం. పిల్లల్లో ధైర్యాన్ని నింపి, వారు దర్జాగా బతికేందుకు అనుక్షణం ఆసరా ఇచ్చేది నాన్న.

మారుతున్న తరం...
ఒకప్పుడు పిల్లలంతా తండ్రి మాటను జవదాటని వారే! కానీ నేటికాలంలో తమకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా వ్యతిరేకించడానికి పిల్లలు ఏమాత్రం సందేహించడం లేదు. ఆధునిక విజ్ఞాన వికాసం వల్ల పిల్లల మనసులపై రకరకాల ప్రభావాలు పడుతున్నాయి. అందుకు అనుగుణంగా పిల్లల మనోభావాలను తెలుసుకుంటూ వారి ఇష్టాలను లెక్కలోకి తీసుకుని వారికి నచ్చిందే చేయాలని ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది తండ్రులు భావిస్తున్నారు. పిల్లల అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించినప్పుడు మేలే జరుగుతుందన్న విషయాన్ని నాన్నలు గ్రహిస్తున్నారు. చదువు, పెళ్ళి విషయాల్లో పిల్లల మనోభావాలకే తండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయాన్నే నిద్ర లేపి పిల్లల చేత పద్ధతి ప్రకారం చదివించడం, పరీక్షలు రాసేందుకు తగిన మనోధైర్యాన్నిస్తూ వారిని పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువెళ్ళడం, మంచి మార్కులొస్తే అభినందించడం, తక్కువ మార్కులొస్తే ధైర్యం చెప్పడం, వారికి నచ్చిన కోర్సులు చదివించడం, వారికి నచ్చిన ఉద్యోగానికి వెళ్లేలా ప్రోత్సహించడం, యుక్త వయసుకొచ్చి ప్రేమలో పడితే నిండు మనుసుతో అంగీకరించడం, నచ్చిన వారితో పెళ్ళి జరిపించడం...ఈ బాధ్యతలన్నీ తండ్రులు నేడు మనస్ఫూర్తిగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు నచ్చని పనులు చేయాలని తల్లిదండ్రులు భావించకపోవడం... కుటుంబ వ్యవస్థలో వచ్చిన మంచి పరిణామం. చాలా మంది తండ్రులు బూర్జువా మనస్తత్త్వాల నుంచి బయటపడి విశాల దృక్పథాన్ని అలవర్చుకుని కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇలాంటి మార్పులే కుటుంబంలో మమతానురాగాలు వెల్లివిరియడానికి దోహదం చేస్తున్నాయి.

మీసాల అమ్మలు...
గతంలో సంపాదించడం ఒక్కటే నాన్న ప్రధాన బాధ్యత అన్న భావం ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నడిచే రోజుల్లో తండ్రి అంటే అత్యంత భయభక్తులుండేవి. ఎదిరించి మాట్లాడటం కాదు కదా.. కావాల్సింది అడగడానికీ జంకేవారు. ఏది కావాలన్నా తల్లిని మాత్రమే అడిగేవారు. అయితే.. కాల చక్రంలో అనేక మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాలు చెదిరిపోయాయి. చిన్న కుటుంబాల్లో తండ్రి స్నేహితుడిగా మారిపోయాడు. పిల్లలకు మార్గదర్శిగా ఉంటూనే స్నేహితుడిలా నడిపిస్తున్నాడు. ఇప్పుడు నాన్న కొత్త బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. మహిళా చైతన్యం పెరిగి ఉద్యోగాల్లో పోటీపడటంతో కాలం మారి భార్యభర్తలిరువురూ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. అందుకే ఇంటి పనుల్లో సగం బాధ్యతను తండ్రి తీసుకుంటున్నాడు. నిరుద్యోగ సమస్య తీవ్రమవడంతో ఉద్యోగం కోల్పోయిన భర్త ఇంటి పట్టునే ఉండి పిల్లల బాధ్యతలు చూసుకుంటూ భార్య వృత్తి జీవితానికి ప్రోత్సాహాన్నిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వీరిని 'హౌస్‌ హజ్బెండ్స్‌' అని పిలవడం పశ్చిమ దేశాల్లో ఎక్కువవుతోంది. తండ్రి సంపాదనాపరుడైతే తల్లి ఎలా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తుందో అంతకంటే ఎక్కువగా ఈ హౌస్‌ హస్బెండ్స్‌ తమ పిల్లల పెంపకంలో తలమునకలై ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఉన్న తల్లిదండ్రుల్లో చాలామంది ఈ విధమైన పనిని కూడా సర్దుబాటు చేసుకుంటున్నారు. తండ్రి నైట్‌షిఫ్టులో ఉద్యోగం చేసి పగటి సమయంలో పిల్లల బాధ్యతలను తీసుకుంటున్నాడు. తల్లి పగటి సమయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో పిల్లల పెంపకం, వారికి కావాల్సినవి అందించడం, వారిని స్కూళ్లకు పంపించడం, లంచ్‌ సిద్ధం చేయడం వంటి బాధ్యతలను తండ్రి తీసుకొంటున్నాడు. ఇంకా చిన్న పిల్లలను ఇంటి దగ్గరే సాకడంలో నాన్న తల్లి పాత్రను పోషిస్తున్నాడు. వారికి నేపీలు మార్చడం నుంచి జోలపాటలతో నిద్రపుచ్చడం వరకూ అన్ని పనులూ నాన్న చేస్తున్నాడు. ఇందు కోసం విదేశాలలో అయితే ఉద్యోగాలు చేసే నాన్నలకు ఆయా యాజమాన్యాలు పెయిడ్‌ లీవ్స్‌ కూడా మంజూరు చేస్తున్నాయి. అంటే ఇక్కడ నాన్న అంటే అచ్చంగా 'మీసాల అమ్మ'.

నాన్నే స్ఫూర్తి సంతకం
జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలోని వ్యక్తులను తమకు ఆదర్శంగా ఎంపిక చేసుకుని అనుసరించడం సహజం. అలాంటి ఆదర్శ వ్యక్తిగా నాన్నే కనిపించగలిగితే ఆ పిల్లలకు అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. కుటుంబాన్ని 'లీడ్‌' చేయడంలో నాన్నను పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా? ఎన్ని సమస్యలు ఉత్పన్నమైనా? ఎన్ని అవరోధాలు నిరోధించినా? ఆయా సందర్భాల్లో కుటుంబ నౌకను ముందుకు నడిపించే కెప్టెన్‌గా నాన్న వారి పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తాడు. అమ్మ పట్ల నాన్న ప్రవర్తించే తీరు కూతుళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. తమకు రాబోయే భర్తల నుండి ఎలాంటి ప్రేమాభిమానాలను పొందాలో వారు దానిని బట్టే నిర్ణయించుకోగలుగుతారు. ప్రతి నాన్న ప్రతి అమ్మాయికి తొలి హీరో. తాను వేసే ప్రతి అడుగులో నాన్న ఇచ్చే ధైర్యం ఆమెను ధీర వనితగా మార్చేస్తుంది. ఎటువంటి పరిస్థితులనైనా నాన్న వెనుక వున్నాడనే ధైర్యంతో ఆమె ఎదుర్కొంటుంది. అందువల్లే 'ఐ లవ్‌ యూ డాడీ...' అనే అమ్మాయిల సంఖ్య నేటి తరంలో ఎక్కువే. 'మై డాడీ ఈజ్‌ మై బెస్ట్‌ఫ్రెండ్‌' అని అమ్మాయిలు ఎక్కువగా చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహించడం లేదు. తన కూతురు జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా వుండాలని కోరుకునే తండ్రి కూతురి దృష్టిలో బెస్ట్‌ ఫ్రెండే వారు. తండ్రినే ఎక్కువ ప్రేమిస్తారు. ఆరాధిస్తారు.
నాన్న వంట అదుర్స్‌
ప్రస్తుతం పట్టణాల్లోని చాలా ఇళ్లలో ఉదయం పూట కన్పించే దృశ్యాలను చూస్తే నాన్న పిల్లల కోసం వంట బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నట్లు కన్పిస్తోంది. భార్య ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లిపోతే ఒక పక్క వంట చేస్తూ, మరో పక్క పిల్లలని స్కూళ్లకు సిద్ధం చేస్తూ ఉన్న నాన్నలే ఎక్కువ మంది కన్పిస్తారు. ''డాడీ! మా స్కూల్‌ బస్‌ వచ్చేస్తోంది..'' అని పిల్లలు అరుస్తుంటే...''ఇదిగో లంచ్‌ బాక్స్‌ రెడీ'' అంటూ ఆదరాబాదరాగా కిచెన్‌ నుంచి బయటకు వస్తూ వారికి దానిని అందించే నాన్న.. బస్సులో వాళ్లు వెళ్లిపోతుంటే టాటా చెప్పే దృశ్యాలు ఎన్నో మనకు కన్పిస్తుంటాయి. నవతరం తండ్రులు అమ్మలుగా మారిపోతున్నారు. పిల్లలు కోరినది కిచెన్‌లో తయారు చేసి ఇవ్వడానికి నేటి నాన్నలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అంతకు ముందు వంట రాకపోయినా తండ్రులు కూడా వివిధ పత్రికలు చదివి, టీవీ చానళ్లు చూసి కొత్త కొత్త రకాల వంటలు ట్రై చేస్తూ నలభీముల్లా మారిపోతున్నారు. తమ పిల్లల చేత ''నాన్న వంట అదుర్స్‌'' అని మెప్పు పొందుతూ సంబరపడుతున్నారు.
జడలు వేస్తున్న నాన్నలు
ఎక్కడైనా అమ్మే ఆమ్మాయిలకు జడలు వేస్తుందని అనుకుంటుంటాం. కానీ నేటి నాన్నలు మాత్రం తమ కూతుళ్లకి తామే జడలు వేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వారిని స్కూళ్లకు పంపించే సమయంలో భార్య అందుబాటులో లేకపోతే నాన్నే ఆడపిల్లలకు జడలు వేసి, సాక్సులు తొడిగి, షూష్‌ బిగించి స్కూల్‌ బస్సెక్కిస్తున్నాడు. ఈ పనులను నాన్నలు సమర్థవంతంగా చేయడానికి వారికి విదేశాలలో శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. ఆడ పనీ, మగ పనీ అంటూ వేర్వేరుగా ఉండవనీ అన్ని పనులూ అందరూ చేయవచ్చనే విశాల దృక్పథాన్ని చిన్న వయసు నుంచే నేటి నాన్నలు తమ పిల్లల్లో కలిగిస్తున్నారు. అంతే కాకుండా పిల్లలకు అవసరమైవన్నీ చేసి పెట్టడం తమ బాధ్యత కన్నా ఎక్కువగా నాన్నలు భావిస్తున్నారు. అందువల్ల అమ్మ ఊరెళ్లినా, ఉద్యోగానికి వెళ్లినా నాన్న తమ చెంతన ఉంటే ఎంతో ధీమాగా పిల్లలు ఫీలౌతున్నారు. ఇది తండ్రితో వారి అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తోంది.

పిల్లలతో విహారానికి
కేవలం ఇంటి దగ్గరే పిల్లలను సాకుతూ వారి ఆలనా పాలనా చూడడానికి పరిమితం కావడం లేదు నేటి నాన్నలు. అవకాశం, ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడల్లా పిల్లలతో విహార యాత్రలకు వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇటీవల ఈశాన్య చైనాలోని తంగసాన్‌ అనే పట్టణంలో నివసించే క్విహైలియంగ్‌ అనే వ్యాపారవేత్త తన ఊపిరి సలపని వ్యాపారాల్లో తలమునకలైపోతూనే.. కూతురు పట్ల ఎంతో ప్రేమతో ఎవరూ ఊహించని గొప్ప విహార యాత్ర చేశాడు. అతని కుమార్తె పేరు లియు. ఆ అమ్మాయి వయసు నాలుగేళ్లే, కానీ ఆమెకు తమ దేశాన్ని చూపించాలనే సంకల్పంతో ఒక సైకిల్‌పైనే విహారయాత్రకు అతను శ్రీకారం చుట్టాడు. చైనాలో ఏకంగా ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం వరకూ సైకిల్‌ మీదనే ఆ తండ్రీ కూతుళ్లు విహార యాత్ర చేసేశారు. కేవలం రోడ్డు మీదనే వారి విహార యాత్ర సాగలేదు. తాము వెళ్లే దారిలో కన్పించిన పర్వతాలను కూడా అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈ స్థాయిలో కాకపోయినా నేటి తండ్రులు తమ పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లి కొత్త కొత్త ప్రాంతాలను, అక్కడి మనుషుల అలవాట్లను, వింతలు, విశేషాలు పరిచయం చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం ప్రతీ యేటా తమ ఆదాయంలో కొంతమొత్తాన్ని కూడా పక్కన పెట్టి పిల్లల సంతృఫ్తే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఆటపాటలు నేర్పుతూ
నేటి నాన్నలు తమ చిన్నప్పుడు తగిన అవకాశాలు లేక తాము కోల్పోయినవన్నీ తమ పిల్లలు కోల్పోకూడదనే పట్టుదలతో ఉన్నారు. తమ పిల్లలను చిన్నవయసు నుంచే ఆటపాటల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. తప్పటడుగుల వయసులోనే సైకిల్‌ నేర్పించడం, నడక వస్తున్న తరుణంలోనే ఫుట్‌బాల్‌ నేర్పిస్తుండడం, డ్యాన్సులు నేర్పిస్తుండడం, కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో వంటివాటిలో శిక్షణ ఇప్పిస్తుండడం .....ఇలా ఒకటేమిటి? ఎక్కడ ఏ చిన్న అంశం తమ పిల్లలకు ఉపకరిస్తుందని అన్పించినా దానిని వెంటనే తమ పిల్లలకు నేర్పించడానికి ఏమాత్రం వెనుకంజవేయడం లేదు. తమ కన్నా తమ పిల్లలు మరింత ఉన్నతంగా ఎదగాలన్న తపన నేటి నాన్నల్లో చాలా ఎక్కువగా కన్పిస్తోంది.

నేటి మగపిల్లలంతా రేపటి తండ్రులే.  రేపటి నాన్నలు
చిన్నవయసులోనే చదువును, సంస్కారాన్ని నేర్పే నాన్న నుంచే పిల్లలు కొత్త ఆదర్శాలను అంది పుచ్చుకుంటారు. సమాజ గమనంలో తమ ఉనికిని పదిలపరచుకుంటూనే నాన్న నేర్పిన ఆదర్శాల వెలుగుల్లో ముందుకు సాగుతారు. తాము యుక్త వయసుకు వచ్చిన తర్వాత వివాహాలు చేసుకుని తండ్రి బాధ్యతలలోకి మారిన సందర్భంలో అంతకు ముందు తమ నాన్న తమకు నేర్పిన సంస్కారాన్ని గుర్తు చేసుకుంటారు. తమ పిల్లలకు అప్పటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా నైతిక సంస్కారాన్ని అందిస్తుంటారు. ఇదంతా ఒక జీవన చక్రం.

క్రమశిక్షణ నేర్పించే నాన్న
అమ్మ ఆలనా పాలనా చూసుకుంటే నాన్న క్రమశిక్షణ నేర్పించారు. విద్యతో పాటు వినయాన్ని పెంపొందించుకోవాలని నాన్న చెబుతారు. వినయంతో ఉన్న విద్య వలనే ఉన్నత శిఖరాలకు వెళ్లగలం. అందుకే నాన్న మాటలే నాకు శిరోధార్యం.

- బమ్మిడి అవంతి
ణ/శీ రుక్మాంగధరావు, సోంపేట

సమాజంపై గౌరవం పెంచిన నాన్న
అమ్మ ఉద్యోగ బాధ్యతలలో బిజీగా ఉంటే నాన్న నా బాధ్యతలను ఎక్కువగా తీసుకున్నారు. నా భవిష్యత్‌కు ఏది మంచిదో నాన్నే నిర్ణయించి నన్ను ముందుకు నడిపిస్తారు. సమాజంపట్ల ఒక గౌరవాన్ని పెంపొందించి సామాజిక బాధ్యత అంటే ఏమిటో నాన్నే నాకు నేర్పించారు. ఆయన మాటే నా బాట.
- పామర్తి అనిమిష,
S/Oపామర్తి రవి, మంగళగిరి, గుంటూరు జిల్లా

నాన్నంటే చాలా ఇష్టం
 
నాన్నంటే చాలా ఇష్టం. అమ్మ అన్నీ చూసుకుంటుంది. కానీ నాన్న ఎంతో ప్రేమతో స్కూలుకు తీసుకువెళ్తారు. దగ్గరుండి హోమ్‌వర్క్‌ చేయిస్తారు. ఎంత అల్లరి చేసినా ఏమాత్రం కోపం పడకుండా దగ్గరికి తీసుకుంటారు. ఎంత పనివత్తిడితో బయటనుంచి నాన్న వచ్చినా నేను పలకరిస్తే చాలు వాటన్నింటినీ నాన్న మర్చిపోతారు.
- బరాటం హరిణి 
 రవి, శ్రీకాకుళం
````````````````````
నాన్నే నాకు ప్రేరణ
మా నాన్నే నాకు ప్రేరణ. నిరంతరం సమాజంకోసం ఏదో ఒకటి చేయాలని ఆయన తపన. ప్రజాఉద్యమాల్లో పాల్గొ వడమే కాకుండా ప్రజా గీతాలను ఆలాపిస్తూ జనచైతన్యం కోసం కృషి చేస్తుంటారు. ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
- కంచర్ల క్రాంతి, S/O కంచర్ల కాశయ్య, కుంచనపల్లి,



ఒక కూతురి సంకల్పమే...
తండ్రి పాత్రకు తగిన గుర్తింపు కోసం ఒక కూతురు పడిన తపన నుంచి పుట్టిందే ఈ ఫాదర్స్‌ డే (పితృ దినోత్సవం). ఆ దిశగా ప్రయత్నాలు చేసింది వాషింగ్టన్‌కు చెందిన సొనారా. వాషింగ్టన్‌లోని స్పోక్యాన్‌ అనే గ్రామంలో నివాసముండే హెన్నీ జాక్సన్‌ స్మార్ట్‌, విలియమ్‌ స్మార్ట్‌ అనే దంపతులకు ఆరో సంతానం సొనారా. సొనారాకి 6 నెలల వయసున్నప్పుడే తల్లి మరణించింది. అప్పట్లోను (1895లో) విలియమ్‌కు మరో పెళ్లి చేసుకునే హక్కు, అవకాశం వారి సమాజంలో ఉన్నాయి. కానీ తండ్రిగా తన పాత్రకు న్యాయం చేయడానికే ఆయన మక్కువ చూపారు. వ్యవసాయం చేస్తూ తన బిడ్డలకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచారు. ఆరు నెలల పసిపాపకు పాలు పట్టడం, స్నానం చేయించడం, జోలపాడి నిద్రపుచ్చడం.. ఇలా అన్నీ విలియం చేశారు. తల్లి ఉంటుందని కూడా ఆ చిన్న వయసులో సొనారాకి తెలియదు. ఇలా పెరిగిన సొనారాకి 27 ఏళ్ల వయసులో ఒక ఆలోచన వచ్చింది. తన తండ్రి పుట్టిన రోజునే తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆమె భావించింది. అయితే తన తండ్రి జన్మించింది జూన్‌లో అని తెలుసుగానీ, ఏ రోజునో సొనారాకి తెలియదు. దీంతో తన తండ్రి జన్మించిన జూన్‌లో ఏదో ఒక రోజు ఈ వేడుకలను జరపాలని భావించింది. అనుకున్నట్టు ఆ నెలలో ఒక రోజు ఆ ఊరిలో వారందరినీ ఆహ్వానించింది. తండ్రులు పోషించే పాత్రను మొత్తం సమాజానికి, ఇతర పిల్లలకు తెలియజెప్పే రోజని అందుకే ఈ రోజును ఫాదర్స్‌డేగా జరుపుదామని సొనారా ప్రకటించింది. ఆ ఆలోచన గ్రామస్తులకు కూడా నచ్చడంతో అప్పటి నుంచి వారు ఆ గ్రామంలో ఈ వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు. 1910 జూన్‌ 19న ప్రపంచంలోనే తొలిసారిగా అధికారికంగా అమెరికాలో ఫాదర్స్‌డే వేడుకలు నిర్వహించారు. తర్వాత అది ప్రపంచ వ్యాప్తమైంది.


    ( ప్రజాశక్తి "స్నేహ" Posted On:                                                                    -                                                                                                           ---బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి