పిల్లలు.. పిల్లల్లాగానే ఉండాలి. పిల్లల్లాగా అంటే.. అల్లరి చేయాలి. ఆడుకోవాలి. పాడుకోవాలి. పరుగెత్తాలి. ఆనందంతో గంతులు వేయాలి. విజ్ఞానపు వీధుల్లో చురకత్తులవలే విహరించాలి. ఇవన్నీ కలిస్తేనే 'పిల్లలు' అవుతారు. ఎవ్వరికైనా.. బాల్యం ఓ అందమైన జ్ఞాపకం. ఆ బాల్యం అందంగా.. అర్ధవంతంగా సాగాలంటే పెద్దలు పిల్లల్లా మారాలి. పిల్లల్లో కలిసిపోవాలి. ప్రేమగా పిల్లల మనస్తత్వాలను చదవాలి. పిల్లలంటే.. కేవలం ఆటబొమ్మలతో ఆడుకునే బుజ్జాయిలేకాదు..ఆంక్షలు లేని బాల్యాన్ని కాంక్షించే 'పెద్దమనసు'గల పిల్లలు కూడా. ప్రపంచీకరణకు ముందు గడిపిన బాల్యం వేరు.. ఇప్పటి పిల్లల బాల్యం వేరు. వారి బాల్యపు ప్రయాణాలూ వేరు. మట్టిబలపం పోయి.. ప్లాస్టిక్ బలపాలొచ్చాయి. అవికూడా పోయి ట్యాబ్‌లు. కిండిల్ పలకలొచ్చేశాయి. అక్షరాలు దిద్దేరోజునే.. త్రిపుల్ ఐటీ.. సిలబస్‌నూ మోయాల్సిన పరిస్థితులు. కానీ ఇవన్నీ బాలల హక్కుల్ని హరిస్తున్నవే. అందుకే.. కాసేపు 'పెద్ద మనసు' చేసుకుని.. బాలల ప్రపంచంలో విహరిద్దాం!! బాలల దినోత్సవం సందర్భంగా నచ్చినట్టుగా ఉంటామని.. మన పిల్లలకు మాటిద్దాం!!
పిల్లల లోకం వేరు. వాళ్ళ ఊహలూ, భావనలూ, చేష్టలూ వేరు. వాళ్ళ మనస్తత్వం వేరు. కానీ, ఇంట్లో వాతావరణం మరోలా ఉంటుంది. పెద్దలంతా తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. వాళ్ళేదో చేస్తారు, అది తప్పో ఒప్పో మంచో చెడో వాళ్లకే తెలియదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే.. వారన్నీ వెంటనే నేర్చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. నిజానికి, పిల్లల నుంచే పెద్దలు ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటున్నారు మానసిక విశ్లేషకులు.
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని అత్యంత శక్తిమంతులుగా తయారు చేయాలి, సెలబ్రిటీలుగా మార్చాలనే అభిమతం, ఆకాంక్షలతో వారిని అనవసరంగా అనేక కష్టాలకు గురిచేస్తుంటారు. తాము జీవితంలో ఏమి సాధించాలనుకొని సాధించలేకపొయారో, అది తమ పిల్లలు సాధించాలని కోరుకుంటారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై రకరకాలుగా ఒత్తిడి తెస్తుంటారు. ఇలా చేయడం బాలల హక్కుల్ని హరించడమే అన్నది పెద్దల మాట.
రాను రాను.. బాలల ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. గతంలో బడికి సెలవులు వస్తే చాలు.. బంధు మిత్రుల ఇళ్లకు వెళ్లి ఉల్లాసంగా గడిపేవారు. ఇప్పుడు పెద్దలతో కలవడానికి కూడా పిల్లలు అంతగా ఇష్ట పడటం లేదు. ఇంటర్నెట్, వీడియో గేమ్స్ వంటివాటికి అలవాటు పడి బాలల్లో పఠనాసక్తి పూర్తిగా తరిగి పోతోంది. వ్యాపార పత్రికల్లో, ప్రసారమాధ్యమాల్లో అవసరానికి మించి దొరికే అభ్యంతరకరమైన సమాచారం వారి వికాసానికి మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తోంది.
పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా పరిశీలించనివ్వాలి. ప్రకతి ఒడిలో కాలాన్ని గడపనివ్వాలి. వారిని స్వేచ్చగా పెరగనివ్వాలి.. పెద్దలుగా ఈమాత్రం చేస్తే చాలు.. బాల్యం ఎప్పటికీ తరిగిపోని ఓ అందమైన జ్ఞాపకమే అవుతుంది.
జిజ్ఞాసకు తోడ్పాటు ఇవ్వాలి పిల్లలో చిన్నప్పటి నుంచే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులూ మిగిలిన పెద్దలూ ఆందుకు తోడ్పాటునివ్వాలి. పిల్లలతో గడిపేసమయం పెరగాలి. దాన్ని కేవలం వారికి తిండి తిన్పించడానికి, కాలకృత్యాలు తీర్చడానికి, హోమ్‌వర్క్ చేయించడానికి మాత్రమే పరిమితం చేయకూడదు. పిల్లలకు ఏ విషయంలో ఆసక్తి ఉందో గమనించి అందుకు ప్రోత్సాహమివ్వాలి. అలా కాకుండా తమ ఇష్టాలను పిల్లలపై రుద్దితే వారు మానసికంగా కుంగుబాటుకు గురౌతారు. నడక వచ్చేసమయానికే ప్లే-స్కూల్..తర్వాత నర్సరీ, ఆ తర్వాత ఎల్.కె.జి, యు.కె.జి ఇలా వారి గమనాన్ని శాసిస్తున్నారు. ఇలా పిల్లల నైపుణ్యాన్ని ఆదిలోనే చెరిపేయడం తగదు.
- డాక్టర్ పద్మజ, సైకాలజిస్ట్, విజయవాడ
ప్రకృతితో మమేకం కానివ్వండి
బాలల సమగ్ర వికాసమే లక్ష్యంగా పెద్దలు కృషి చేయాలి. ఇక్కడ సమగ్ర వికాసం అంటే అన్ని రకాలుగా సంపూర్ణ వికాసమనే అర్థం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. దీన్లో చదువు అనేది ఒక చిన్న విషయం మాత్రమే. దీనిని మించి ఎన్నో అంశాలు బాలల వికాసంలో కీలకంగా ఉంటాయి. చదువుతో పాటు ఆటలు ప్రతిరోజూ పిల్లలకు ఉండాల్సిందే. సాంస్కృతిక విషయాలపై కూడా అవగాహన పెంపొందించాలి. పిల్లల భావాలకు తగిన అవకాశం ఇవ్వాలి. వారికి కథలు అంటే చాలా ఇష్టం. ప్రకృతినీ, సమాజాన్ని వారికి పరిచయం చేయాలి. ఏదీ నిర్భంధంగా జరగకూడదు. అన్నీ సహజసిద్ధంగా ఉండాలి.
- ఎస్.ఆర్.పరిమి, వ్యవస్థాపకులు, వికాస విద్యావనం,పోరంకి
ఆడుకోడానికి టైమ్ కావాలి
చదువుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. అమ్మానాన్నలతో ఎక్కువసేపు ఉండాలంటే కుదరడంలేదు. నాకైతే రోజూ ఆడుకోవాలి అనిపిస్తుంటుంది. కానీ స్కూల్, ట్యూషన్ ఉంటుది కదా. నాకు చదువుతోపాటు పాటలు, ఆటలు, పద్యాలు అంటే చాలా ఇష్టం. అందుకే.. వాటికి కూడా టైమ్ ఉంటే బావుంటుంది కదా?!
- రోజా సాహితి, శ్రీకాకుళం
హాలీడేస్‌లో ఆటలే ఉండాలి
రోజూ స్కూల్‌కెళ్తున్నాం కదా.. స్కూల్ అవ్వగానే ట్యూషన్‌కీ వెళ్తాం. ఆడుకోడానికి టైమ్ ఉండటం లేదు. అందుకే.. సెలవుల్లో ఆడుకోవాలని ఉంటుంది. కానీ ఆ సెలవుల్లోకూడా హోమ్‌వర్క్ చేస్తేగానీ.. ఆ వర్క్ పూర్వవ్వదు. అందుకే.. సెలవురోజుల్లో హోమ్‌వర్క్‌్ చేయాలని కండిషన్ పెట్టకుండా ఉంటే.. ఎంచక్కా టెన్షన్ లేకుండా ఆడుకుంటాం!
- చైతన్య, ధనుష్, ఉండవల్లి.
విలువలు నేర్పాలి
తల్లిదండ్రులు పిల్లలకు జీవితం విలువ, డబ్బు విలువ తెలియచేయాలి. అతి గారాబం చేయడం వలన పిల్లలకు కష్టాలు తట్టుకొనే శక్తి సడలుతుంది.. అలాగే అతి భయం, బెదిరింపు, కొట్టడం, తిట్టడం చేయడం వలన పిల్లలు మొండిగా, మూర్ఖంగా తయారయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఈ రెండింటినీ బాలన్స్ చేస్తూ పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొనే శక్తి కలిగే వారిగా చేసి వారికి మార్గదర్శకంగా నిలవాలి. ఈ లోకం తీరు తెలిసేలా చేసి, సమాజంలో బతికగలిగే అవగాహన వారిలో పెంచాలి.
- రవికుమార్ దుప్పల, శ్రీకాకుళం
భవితకు బంగారు బాట వేయాలి
పిల్లలకు చదువు ఒక్కటే ఉంటే ఈ కాలంలో సరిపోదు. ప్రతీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సరైన అవగాహన, సరైన శిక్షణ, పోషణ అందిస్తే వాళ్ళు తప్పకుండా గొప్పవాళ్ళు అవుతారు. ఒకవేళ గొప్పవాళ్ళు కాకపోయినా మంచి మనుషులుగా మిగులుతారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్‌కు బంగారు బాట వేయాలి.
- సంగీత ముద్దపు, విశాఖపట్నం









కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి