అడుగడున వివక్ష, పురుషాధిక్యత, రాజ్యమేలుతున్న వర్తమాన సమాజంలో మహిళల మనుగడ విషయంలో ఎన్నో సవాళ్లు. సామాన్య మహిళలకే కాదు, వివిధ హోదాల్లో ఉన్న మహిళలూ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే కొంతమంది చైతన్యవంతులైన మహిళలు మాత్రం అదరం.. బెదరం.. అన్నట్టుగా వారికి ఎదురవుతున్న అవమానాలను, వివక్షను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. అంతేకాదు, తమలా వివక్షను ఎదుర్కొంటున్న అనేకమందిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైతన్యాన్ని నింపుతున్నారు. అలా సోషల్ మీడియాలో మగ వేధింపులపై పోరాటం చేసిన, చేస్తున్న కొందరు ధీర వనితలపై 'జీవన' ప్రత్యేక కథనం..
సంచలనం సృష్టించిన వనజ వాసుదేవ్
ఒక మహిళను 14 సెకన్ల పాటు కన్నార్పకుండా చూసిన పురుషుల మీద కేసు పెట్టొచ్చని కేరళ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే! అయితే దీనికి కేరళ అమ్మాయి వనజ వాసుదేవ్ ఫేస్‌బుక్‌లో ఘాటైన పోస్ట్‌తో నిరసన తెలిపింది. ఆ పోస్టుకు చాలామంది అసభ్యకరమైన కామెంట్లు పెట్టినా.. ఆమె వాటికి ఏమాత్రం జంకలేదు. అంతకంటే బలమైన వాదనతో అందరి నోళ్లూ మూయించింది. ఇప్పుడీమె పోస్ట్ ఫేస్‌బుక్‌తో సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో సంచలనం సష్టిస్తోంది.
వనజ వాసుదేవ్. కేరళలోని అలెప్పీ (అలప్పుజ) పట్టణంలో నివసిస్తోంది. ఈ నెల 16న రిషిరాజ్ సింగ్ మహిళల విషయంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆమెకు నచ్చలేదు. కొన్ని సెకన్లపాటు పురుషుడు ఒక స్త్రీని చూసినంత మాత్రాన అతని మీద కేసు నమోదు చేయొచ్చు అన్నమాట.. ఆమెకు అన్యాయంగా తోచింది. ఈ విషయం మీద ఫేస్‌బుక్‌లో నిర్భయంగా, ముక్కుసూటిగా తన మనసులోని ఆలోచనల్ని పోస్ట్ చేస్తూ.. 'స్త్రీ పురుషులు ఒకర్నొకరు చూసుకోవటం అనేది అత్యంత సహజమైన చర్య. పబ్లిక్‌లో మగవాళ్లు నా వంక కొంతసేపు చూడడాన్ని నేనూ ఎంజారు చేస్తాను. అయితే అంతమాత్రాన వాళ్లు నన్ను చూసి అసభ్యకరమైన కామెంట్లు చేస్తే సహించను. ఎంతసేపు చూడాలి? ఎంతసేపట్లో చూపు మరల్చుకోవాలి? అనే వాటికి కొలమానం ఏమిటి?' అని పేర్కొంది. ఈ పోస్ట్‌కు ఎన్నో రకాల ప్రతిస్పందనలు వచ్చాయి. ఎక్కువమంది పురుషులే ప్రతిస్పందించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే తమకు మద్దతుగా వనజ పెట్టిన పోస్టుని వారు సరిగా అర్థం చేసుకోకుండానే హద్దూ అదుపూ లేకుండా విమర్శలు చేశారు. కొంతమందైతే ఆమెను వ్యభిచారిగా ముద్ర వేశారు.. మరికొంతమంది ఆమె రేటు ఎంత? అంటూ అసభ్యకరంగా ప్రైవేట్ మెసేజ్‌లలో అడిగారు. తన పోస్టుపై స్పందించిన వారందరికీ వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వడం అనవసరం అనుకున్న వనజ రెండో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో పురుషాధిక్యవాదుల చెంపచెళ్లు మన్పిస్తోంది.
'నా ఆత్మవిశ్వాసాన్ని, జీవితాన్ని మీ నాలుగు అంగుళాల కొలబద్ధతో కొలిచే ప్రయత్నం చేయకండి. ఓ కేరళ విధవరాలి సంతానంగా పెరిగే క్రమంలో నేనెన్ని కష్టాలను అనుభవించానో మీలో ఒక్కరికి తెలుసా?' అంటూ సాగిన ఆమె పోస్ట్‌లో తన జీవన నేపథ్యాన్ని వివరించింది. తనూ, తన తమ్ముడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తండ్రి పోయాడు. అమ్మ ఒంటిచేత్తో పిల్లలను పెంచింది. ఆర్థిక ఇబ్బందులు, అభద్రతాభావం వల్ల పిల్లలను పెంచే శక్తి లేక, తల్లి ఎంతో వ్యథకు లోనయ్యేది. ఆ బాధతో, చిరాకుతో పిల్లలను బెల్ట్‌తో తీవ్రంగా కొట్టేది. పిల్లలు నిద్రపోయిన తర్వాత పశ్చాత్తాపంతో కుమిలిపోతూ కొట్టడానికి వాడిన బెల్టును పట్టుకుని, వెక్కి వెక్కి ఏడ్చేది. వితంతు పునర్వివాహం పట్ల సమాజానికున్న చిన్నచూపుకు జంకి, వయసులో చిన్నదే అయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందామె. అటువంటి దయనీయ పరిస్థితుల్లో పెరిగిన వనజ.. చదువు ముగించి, చిరుద్యోగాలు చేసుకుంటూ తల్లికి చేదోడుగా ఉంటోంది. ఆ క్రమంలో తనలో గూడు కట్టుకున్న మనుషుల పట్ల ఉన్న ఏహ్యభావాన్ని వదిలించుకుంది. ఆ స్థానంలో ప్రేమను నింపుకుంది. జీవితాన్ని తనదైన కోణంలో చూడటం మొదలుపెట్టింది. దాని పర్యవసానమే రిషిరాజ్ సింగ్ స్టేట్‌మెంట్‌కు ఆమె పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్. ఇక అసభ్యకరమైన కామెంట్లకు సమాధానంగా ఆమె పెట్టిన రెండో పోస్ట్‌లో... ముఖ్యంగా భారతీయ సోదరులను ఉద్దేశించి 'నా మర్మాయవాల గురించి మాట్లాడే సోదరులారా!.. నాకు సంస్కారం నేర్పించే అర్హత మీకు లేదు' అంటూ నేరుగా అనకపోయినా.. ఫేస్‌బుక్ పోస్ట్‌తో చెంప పగులగొట్టేసింది. అంతేకాదు 'నా స్వీయ గౌరవానికి వెలకట్టాలని అనుకున్నవారికి ఎన్ని గుండెలు?' అని కూడా నిలదీసింది. ఇప్పుడిదే పోస్ట్ కేరళలో తీవ్ర సంచలనమైంది. కోజికోడ్ జిల్లా కలెక్టర్ ప్రశాంత నాయర్, కేరళ ఫిల్మ్‌మేకర్ ఆషిక్ అబుతో ఇంకొంతమంది ప్రముఖులు వనజ చేసిన ఈ పోస్టింగ్‌ని షేర్ చేశారు.
లింగ వివక్షపై నిలదీస్తున్న ఫర్హాన్
కర్ణాటక రాష్ట్రం బళ్లారి పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గాయత్రి ఫర్హాన్ రెండు రోజుల కిందట తాజాగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు కర్ణాటక పోలీస్‌శాఖలోని పురుషాధిక్యతని బయటపెట్టింది. 'మహిళలను అధికారులుగా గుర్తించడం పురుషులకు కష్టతరంగా కనిపిస్తోంది. నా కెరీర్ మొదలైన నాటి నుంచి నేను దీనిని స్వయంగా అనుభవిస్తున్నా. డిపార్ట్‌మెంట్‌లో మహిళలు ఎంతగా శ్రమించినా.. వారి పనితీరుకు పురు షులకు లభించినంతగా గుర్తింపు రావడం లేదు' అంటూ గాయత్రి అందులో ఆవేదన వ్యక్తం చేశారు. 'డిపార్ట్‌మెంట్‌లో వారానికి ఏడు రోజులు, 24 గంటలూ పనిచేసినా అంతా వృథా అవుతోంది. డిపార్ట్ మెంట్‌లోని పరిస్థి తులకు అలవాటు పడేందుకు నాకు ఏడేళ్లు పట్టింది. కొన్ని ఘటనలు చూస్తే కన్నీళ్లు వచ్చేవి. కానీ అవి నన్ను, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయని ఎప్పుడూ నా కన్నీళ్లను చూపలేదు. ఇప్పుడు సమర్థతపైనే నాలో ప్రశ్నలు రేకెత్తు తున్నాయి. మా బ్యాచ్ డిపార్ట్ మెంట్‌లో అడుగుపెట్టి, సెప్టెంబర్ 1తో పన్నెండేళ్లు పూర్తికావొస్తోంది. అయినా ఉద్యోగంలో సంతృప్తి లేదు. సమా జంలోనూ, వృత్తి జీవితంలోనూ మహిళ తన ఉనికిని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. 'చెయ్యి లేదా చావు' అన్న పరిస్థితి నెలకొంది'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుశాఖలో మహిళల పట్ల తీవ్ర లింగ వివక్ష పాటిస్తు న్నారంటూ గాయత్రి ఫర్హాన్ ఆవేదన వ్యక్తం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది.
వేధింపులను వ్యతిరేకించిన షెనాయ్
ఇదే కర్నాటక రాష్ట్రం కూడ్లిగి డిఎస్పీ అనుపమ షెనాయ్ ఈ ఏడాది జూన్ నెలలో రాష్ట్ర కార్మికశాఖా మంత్రి పి.టి. పరమేశ్వర్ నాయక్ తనని లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపేసిన ఘటన విదితమే. ఇందుకు నిరసనగా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె విసిరిన సవాళ్లతో పరమేశ్వర్‌నాయక్ మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు. ఇదే వివాదంపై విచారణ జరిపిన మహిళాకమిషన్ సభ్యుల ముందు ఆమె వినిపించిన వాదనలలో బళ్లారి ఎస్పీ చేతన రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పనిచేయాలంటూ వేధింపులకు గురి చేసేవారన్నారు. మంత్రి ఒత్తిడి వలన తనకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషాధిక్య సమాజంలో అవినీతి రాజకీయాలకు, మహిళా ఉద్యోగులు వేధింపుల బారిన పడకుండా తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుత సమాజం పురుషుల ఆలోచనల ప్రకారమే నడుస్తోందన్నారు. తనకు ఉద్యోగం ఎలాంటి మానసిక ప్రశాంతతను ఇవ్వలేదని చెప్పారంటే.. ఆమె ఎంతటి వేధింపులకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు.
అందం కొలమానం కాదంటున్న జోసఫ్
ఇటీవల ఒక హిందీ పత్రికకు చెందిన భాస్కర్.కాం ఒక నివేదికను తయారుచేసింది. పది చూడదగ్గ ప్రదేశాలు, పది తినదగ్గ వంటలు... అని జాబితాలు రూపొందించినట్లు 'అందమైన పదిమంది మహిళా అధికారులు' అంటూ ఓ జాబితాను తయారుచేసి వదిలింది. ఈ జాబితాలో కేరళకు చెందిన మెరిన్ జోసెఫ్ ఒకరు. కేరళ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన మెరిన్... అత్యంత చిన్న వయసులో ఆ హోదాను దక్కించుకున్న వ్యక్తిగా, ప్రతిభావంతురాలైన అధికారిణిగా ఇప్పటికే వార్తల్లో నిలిచారు. కానీ ఆమెను తరచూ ప్రతిభతో కాకుండా అందంతో గుర్తించడం మెరిన్‌కు మొదటి నుంచీ బాధగా ఉండేది. 'ఇలాంటి అందమైన అధికారి ఎదుట ఎవరైనా లొంగిపోతారు!' తరహా వ్యాఖ్యలు ఆమెను ఇబ్బందిపెట్టేవి. అలాంటిది ఇప్పుడు ఏకంగా 'అందమైన అధికారుల' పేరుతో ఒక జాబితాను విడుదల చేసేసరికి మెరిన్ కోపం కట్టలు తెంచుకుంది. పోలీసు, రక్షణ శాఖలో ఉండే అధికారులు సాధారణంగా వివాదాలకు అతీతంగా ఉంటారు. కానీ మెరిన్ ఇలాంటి వెకిలి మీడియా జాబితాలకు ఒక ముగింపు పలకాలని అనుకున్నారు. తన ఫేస్‌బుక్ ద్వారా గతవారం ఆ వార్త మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ దేశంలోని పత్రికలు, ముఖ్యంగా ప్రాంతీయ పత్రికల వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ వార్తను చూస్తే తెలిసిపోతుందన్నారు మెరిన్. మహిళల ప్రతిభను, భౌతికమైన అందం స్థాయికి ఈ వార్త దిగజార్చిందన్నారు. కష్టతరమైన పరిస్థితుల మధ్య బాధ్యతలను నిర్వహిస్తూ, నానారకాల రాజకీయాలను ఎదుర్కొంటున్న సదరు ఆఫీసర్లను గుడ్లప్పగించుకుని చూసేలా మార్చేశారన్నారు. తెలివితోనూ, స్వయంకృషితోనూ పైకెదిగిన తమలాంటి వారికి నిజంగా ఇది తీవ్ర అవమానమంటూ ఉతికిపారేశారు. చివరగా... 'అందమైన మగ అధికారులు అంటూ ఏనాడన్నా మనం ఓ జాబితాను చూశామా?' అంటూ జవాబు లేని ప్రశ్న వేశారు.
పురుషుడితో సమానంగా ఆధునిక మహిళ ప్రతి రంగంలో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు వెళుతున్న సమయమిది. ఇప్పుడు ఆమెకు కావాల్సింది సాటి పురుషుల నుంచి కనీస సంస్కారం. అంతేకాదు సమాన హక్కులు, వివక్ష చూపని స్వేచ్ఛా సమాజం. మహిళలు తమపై జరుగుతున్న వివక్షను ప్రశ్నించడానికి, హింసను నిరసించడానికి, వక్రభాష్యాలను ఖండించడానికి సామాజిక మాధ్యమం వేదిక కావడం ఆహ్వానించదగ్గ పరిణామం.
---- బెందాళం క్రిష్ణారావు






కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి