6, డిసెంబర్ 2016, మంగళవారం

నాన్న‌కు ప్రేమ‌తో..

కళకు ఎల్లలు లేవు.. అందుకే, తెలుగు నాట ఆవిర్భవించిన కూచిపూడి నృత్యరీతులను ఫ్రాన్స్‌ నాట్యశైలితో మమేకం చేస్తూ.. దేశ, విదేశాలలో ప్రదర్శనలిస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్నారు యువనర్తకి కోకా విజయలక్ష్మి. కులం కట్టుబాట్లను కాదని, ఘోషా పరదాలు దాటుకుని, ఎన్ని అవరోధాలు ఎదురైనా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాట్యకళ నేర్చుకున్నారామె. కేవలం నర్తకిగానే మిగిలిపోకుండా తను నేర్చుకున్న కళకు సామాజిక అంశాలను మేళవిస్తూ.. జనజాగృతి కోసం తనవంతు కృషి చేస్తున్నారు. సంప్రదాయం, ఆధునికత, సామాజిక సందేశం కలగలుపుగా తెలుగువారి కూచిపూడి కళకు వన్నెతెస్తున్న కోకా విజయలక్ష్మి గురించి మరిన్ని విషయాలు 

నర్తకి కోకా విజయలక్ష్మి స్వస్థలం గుంటూరు జిల్లాలోని రావూరు. ఒకప్పుడు ఈమె సామాజికవర్గంలోని మహిళలు ఘోషాలో ఉండేవారట! ఆ రోజుల్లో వీరి కుటుంబంలోని ఆడపిల్లలెవరైనా రిక్షాలో కాలేజీకి వెళ్లేటప్పుడు ఆ రిక్షా చుట్టూ ఒక పరదా కట్టే వారంటారు. అలాంటి పరిస్థితులున్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన అభిరుచికి అనుగుణంగా నాట్యకళని సాధన చేయడం వారి బంధువులందరికీ విచిత్రంగాను, విడ్డూరంగాను ఉండేది. కొందరైతే చులకనగా చూసేవారు. యక్ష ప్రశ్నలతో విసిగించేవారు. అలా విమర్శించినవారే ఇప్పుడు దేశ విదేశాలలో ఆమె చేసిన నృత్య ప్రదర్శనల గురించి తెలుసుకొని ''విజయలక్ష్మి మా అమ్మాయి'' అంటూ ఎంతో గౌరవిస్తున్నారు.

ఐదో యేటనుంచే
విజయలక్ష్మి తండ్రి రాధాకృష్ణమూర్తి, తల్లి సామ్రాజ్యం. వారికి ముగ్గురు సంతానం. వారిలో విజయలక్ష్మి పెద్ద అమ్మాయి. తండ్రి ఆమెను మంచి కూచిపూడి డ్యాన్సర్‌గా చూడాలని తపనపడేవారు. అందుకే విజయలక్ష్మికి ఐదో యేట నుంచే కూచిపూడి నాట్యాన్ని నేర్పించడం మొదలుపెట్టారు. ఐ.టి.సి.లో ఉద్యోగం చేస్తున్న అతనికి ఉద్యోగరీత్యా ఎక్కువ బదిలీలుండేవి. ఏ ఊరికెళ్ళినా, మొదట ఏ స్కూల్లో కూచిపూడి నేర్పుతారు.. లేదా ఎక్కడ కూచిపూడి నేర్పుతారు.. అని తెలుసుకొనిమరీ స్కూల్లో చేర్పించేవారు. అందుకు అనుకూలంగా దగ్గర్లో ఇల్లు తీసుకునేవారు. ఎప్పుడైనా ఆమెకు జ్వరం, దగ్గులాంటివి వచ్చి, స్కూలుకు వెళ్ళకపోతే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ డ్యాన్సు క్లాసుకు వెళ్ళనంటే మాత్రం తల్లిదండ్రులు గట్టిగా మందలించి మరీ క్లాసుకు పంపేవారు. ఇంట్లో చదువుకంటే ఎక్కువుగా డ్యాన్సు క్లాసులకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చేవారు. గుంటూరులోని ప్రముఖ నాట్యాచార్యులు కాజా వెంకటసుబ్రహ్మణ్యం వద్ద విజయలక్ష్మి నృత్యంలో మెళకువలు నేర్చుకున్నారు.

తల్లి తోడుగా.. తండ్రి స్ఫూర్తితో
విజయలక్ష్మి డ్యాన్సు పోటీలకు వెళ్ళినప్పుడల్లా తల్లి ఆమెకు తోడుగా వెళ్లేవారు. తండ్రేమో.. ఆమెను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ఒకమాట చెప్పేవారు. ''గెలుపు, ఓటములను పట్టించుకోకుండా.. చేసే పనిని చిత్తశుద్ధితో చేయడమే విజయానికి ముఖ్యం'' అని చెప్పేవారు. ఆయన ఉద్యోగవిరమణ తర్వాత కొంతమంది బంధువులు ఆశలు చూపి, నమ్మించి అప్పటివరకూ కూడబెట్టిన మొత్తాన్ని వారి వ్యాపారాలలో పెట్టుబడిగా పెట్టించారు. కొన్నాళ్ల తర్వాత ఆ బంధువులే నష్టాలు వచ్చాయని చెప్పడంతో.. సర్వస్వం కోల్పోయి, జీవనోపాధి కోసం ఆయన మళ్లీ ఉద్యోగాన్ని వెతుక్కోవలసి వచ్చిందట! విజయలక్ష్మి మొదటిసారి సింగపూర్‌లో డ్యాన్సు ప్రోగ్రాముకు వెళ్లివచ్చినపుడు ఆయన చాలా సంతోషించారు. తన లక్ష్యం నెరవేరినట్లు భావించారు. తర్వాత దుబాయిలో నృత్యప్రదర్శన చేసి, వచ్చిన కొద్దిరోజులకే గుండెపోటుతో కుటుంబానికి దూరమయ్యారు. ఇప్పటికీ నాన్న ప్రేరణ నిరంతరం నడిపిస్తుందంటారు విజయలక్ష్మి.

నేను సైతం
మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కావ్యాన్ని తొలిసారిగా నృత్య రూపకంగా మలిచిన ఘనత విజయలక్ష్మిదే. అంతేకాదు, తెలుగు భాష ప్రాచీన వైభవాన్ని 'తెలుగుప్రశస్తి'గా, శ్రీకృష్ణదేవరాయల కాలంలో రైతాంగ జీవన దృశ్యాలను 'రైతురాయలు'గా నృత్యరూపకాలతో కళాభిమానులకు అందించారు. ఫ్రాన్స్‌ నర్తకి మారియా బౌతొర్స్‌తో కలసి పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విజయలక్ష్మి నృత్య ప్రదర్శనలు చేస్తున్నారు. కూచిపూడి శైలిని విదేశీ నృత్య రీతులతో మేళవించడం ఇందులోని విశేషం.

నర్తకిగా వైవిధ్యం
విజయలక్ష్మి ప్రస్తుతం నాట్యశాస్త్రంలో పి.హెచ్‌డి చేస్తున్నారు. దూరదర్శన్‌ అగ్రశ్రేణి కళాకారిణిగా కొనసాగుతున్నారు. కేవలం వినోదాత్మకమైన నత్య ప్రదర్శనలే కాక, నేటి సామాజిక సమస్యలపై చర్చించేలా, మనోవికాసానికి తోడ్పడే ప్రయోగాత్మక ప్రదర్శనల్ని తండ్రి పేరిట ఏర్పాటు చేసిన కె.ఆర్‌.కె.ఎమ్‌.మెమోరియల్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌్‌ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. వీటిలో సమైక్యభారతి, తెలుగుప్రశస్తి, మెలెంజె నృత్య ప్రదర్శనలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. తెలుగు భాషకు ప్రాచీన వైభవం లభించిన సందర్భంగా తెలుగు ప్రశస్తి గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం తరఫున, భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ప్రదర్శనలివ్వడం తనకెంతో గర్వకారణం అని చెబుతారు విజయలక్ష్మి.
వీటితో పాటు శాకుంతలం, కృష్ణలీల, యశోధర, మహోదయం, నారీ, బ్రహ్మకపాలం వంటి నృత్యరూపకాలను ప్రదర్శించారు. అస్మిత రిసోర్స్‌సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ సంస్థతో కలిసి లింగ వివక్షకు వ్యతిరేకంగా 'వార్‌ అండ్‌ పీస్‌, లక్ష్మణరేఖ' వంటి నృత్య రూపకాలను రూపొందించి, ప్రదర్శిస్తూ సామాజిక కళాకారిణిగానూ సేవలందిస్తున్నారు. ప్రదర్శించే నృత్య ప్రదర్శనలకు దాదాపుగా నృత్య కళాకారులకు అవసరమైన దుస్తులు, ఆభరణాలను కూడా విజయలక్ష్మే స్వయంగా డిజైన్‌ చేస్తుంటారు.

కళాసేవకు గుర్తింపు
చివరివరకూ వృత్తి ప్రవృత్తీ కూచిపూడి నృత్యమేనని చెప్పే విజయలక్ష్మి దేశ, విదేశాలలో ఎన్నో సంస్థల నుంచి పలు అవార్డులు, సత్కారాలు పొందారు. బంగారు, రజిత నందుల పురస్కారాలు, నాట్య ప్రవీణ, నాట్య విశారద, నాట్యసేవా శిరోమణి, బిరుదులు, గురజాడ అవార్డు, ఉగాది ప్రతిభా పురస్కారాలు, విశ్వశాంతి గౌరవ పురస్కారం ఇలా ఎన్నోరకాల పురస్కారాలు, గౌరవ సత్కారాలను విజయలక్ష్మి అందుకున్నారు.


నాన్నకు జేజేలు
నాట్యకళలో నేను చేస్తున్న ప్రయోగాలన్నీ గొప్పవని నేననుకోను. నాట్యం నేర్చుకుని, నర్తకిగా గుర్తింపు తెచ్చుకోవడానికి నాన్నపడ్డ తపనే కారణం. ఘోషా పద్ధతిలో పెరగాల్సిన నన్ను, ఆ ఆంక్షలకు విరుద్ధంగా ఒక నృత్య కళాకారిణిగా తీర్చిదిద్దారు.
- బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి