8, డిసెంబర్ 2016, గురువారం

ఆమె.. జీవిత‌మే స‌ర్వోత్త‌మ గ్రంథాల‌యం


తల్లిదండ్రులు జన్మనిస్తే సమాజంలో ఉత్తమ వ్యక్తిత్వంగల వారిగా తీర్చి దిద్దేవి పుస్తకాలే. ఆనాటి తాళపత్రాల నుంచి నేటి డిజిటల్‌ ఇ-బుక్స్‌ వరకూ పుస్తకరూపు మారుతున్నా వాటి అంతిమ లక్ష్యం విజ్ఞానాన్ని, వివేచననూ అందించడమే. నేటి తరానికి కూడా పుస్తకాల అవసరాన్ని చాటిచెప్పడంలో వారిని చైతన్యవంతంగా ముందుకు నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు డాక్టర్‌ రావి శారద. ఊహ తెలిసిన నాటి నుంచే గ్రంథాలయాభివృద్ధికి తనవంతు కృషిచేస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘానికి ప్రధానకార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ రావి శారద 'జీవన' విశేషాలు మీ కోసం.
 

పుస్తకాలు చదివి నష్టపోయామని చెప్పినవారు ఎవరూ చరిత్రలో లేరు. పుస్తకాల ప్రయోజనాన్ని పొంది, సమాజంలో ఉన్నత స్థాయికి చేరినవారే ఎంతోమంది. అయితే వ్యాపార విషసంస్కృతి విస్తరించిన నేటి కాలంలో లైబ్రరీ అంటే అదో నిషేధిత ప్రదేశం అన్నట్లుగా వ్యవహరించేవారూ లేకపోలేదు. అవకాశం దొరికితే గ్రంథాలయాలున్న స్థలాలను ఆక్రమింజేసి వాణిజ్య సముదాయాలు కట్టేసుకోవడానికి కాచుక్కూర్చొన్నవారే ఎక్కువమంది. అయితే వీరు అక్కడితో ఆగడంలేదు. ''ఇప్పుడు ఎవరు పుస్తకాలు చదువుతున్నారు? లైబ్రరీల అవసరం ఏమిటి?'' అంటూ ఈ నాటి తరాన్ని ప్రోత్సాహించడానికి బదులుగా వారిలో నిరుత్సాహాన్ని నింపుతున్నారు. ఇందుకు భిన్నంగా శారద కొన్ని దశాబ్దాల నుంచి గ్రంథాలయ ఉన్నతికోసం కృషి చేస్తున్నారు.
ఒకప్పటిలా చిన్నారులు గ్రంథాలయానికి వచ్చే రోజులు కాకపోయినా. టెక్నాలజీ అందుబాటులో ఉండే ఈ రోజుల్లో వాళ్ల చేత పుస్తకం చదివించాలంటే వాళ్లకు ఆ ఆసక్తిని పెంచాలన్నదే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారు.

తండ్రి ఆదర్శాలనే లక్ష్యాలుగా
శారద నాన్న పాతూరి నాగభూషణం. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. స్వాతంత్య్రోద్యమంతో పాటు గ్రంథాలయోద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకుడు. ఆయనకు శారదతో పాటు ఒక అక్క, ఒక అన్నయ్య. వాళ్లిద్దరికీ పెళ్లిళ్లయిన కొన్నాళ్లకే వేర్వేరు కారణాలతో ఇద్దరూ మరణించారు. దాంతో తండ్రిని చూసుకునే బాధ్యత శారద మీద పడింది. ఆయన కోసం ఆమె గుంటూరు నుంచి విజయవాడ వచ్చేశారు. ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుని, సాధారణ డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్‌లోనూ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆపై సిద్దార్థ పబ్లిక్‌ స్కూల్‌లో లైబ్రేరియన్‌గా చేరారు. గ్రంథాలయ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలు పూర్తిచేశారు. గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగే లైబ్రరీ శిక్షణా తరగతుల్లో బోధించడం కూడా తన బాధ్యతల్లో ఒకటనుకున్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉండేవి తప్ప, గ్రంథాలయమంటూ ఏమీ ఉండేది కాదు. అందరూ చదువుకోవడానికి వీలుగా ఓ లైబ్రరీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమెకు అనిపించింది. తన ఆలోచనని తండ్రి నాగభూషణంకు చెప్పారు.
అలా 1987లో కేవలం అరవై పుస్తకాలతో ఒక చిన్నగదిలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కొన్ని వారాల్లోనే అక్కడ పుస్తకాల సంఖ్య రెండువేలకు చేరుకుంది. ప్రస్తుతం సర్వోత్తమ భవన్‌ పేరుతో ఉన్న ఈ గ్రంథాలయంలో 25 వేల పుస్తకాలు, 75 రకాల పత్రికలు ఉన్నాయి. చిన్నగదిలో మొదలైన లైబ్రరీకి ఓ సొంత భవనం ఏర్పాటైంది. 2000 సంవత్సరంలో అది రెండంతస్థుల భవనంగా రూపుదిద్దుకుంది. విజయవాడ బెంజ్‌సర్కిల్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య చదువరులకు ఉల్లాసం కలిగించే రీతిలో ఈ భవనం అందర్నీ ఆకర్షిస్తుంది. ఈ గ్రంథాలయ అభివృద్ధి అంతా దాతల సాయంతోనే జరిగిందని అయితే తను చొరవ చేసి, ఇలా చేయడం ఎంతో సంతప్తినిస్తోంది అంటారు శారద. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న సర్వోత్తమ గ్రంథాలయ నిర్వహణ చూస్తూనే, ఆ సంస్థకు ప్రధానకార్యదర్శి బాధ్యతలు ఆమె తీసుకున్నారు.

పుస్తక నిధితో చైతన్యం
పుస్తకాల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడం. మంచి పుస్తకాలు అరుదుగా వస్తుండడం వల్ల పుస్తక నిధిని ఆమె ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జనవరిలో విజయవాడలో పుస్తక మహౌత్సవం జరుగుతుంది. దీన్ని వేదికగా చేసుకుని, పుస్తక పఠనం దిశగా ప్రజలలో చైతన్యం తేవాలనుకున్నారామె. అందులో భాగంగా ''మీరు చదివేసిన పుస్తకాలను మాకు ఇవ్వండి.. వాటిని చదవాలనుకున్న వారికి అందిస్తాం'' అని ప్రకటించారు. తమ దగ్గర పుస్తకాలున్నాయంటూ ఫోన్‌ చేసిన వారి ఇంటింటికీ వెళ్లి, సేకరించారు. ఎగ్జిబిషన్‌లో ప్రత్యేకించి ఓ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఆమె ప్రయత్నాలకు మంచి స్పందన వచ్చింది. వేలాది పుస్తకాలను ఇలా సేకరించారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల పుస్తకదాతల నుంచి శారదకు ఫోన్లు వచ్చాయి. అలా సేకరించగా వచ్చిన పుస్తకాలను గుంటూరు, విజయవాడ ప్రాంతాలలోని పుస్తక ప్రియులకు ఉచితంగా అందజేశారు.
పుస్తక పఠనంతోనే సంతృప్తి
పుస్తక పఠనం మాత్రమే సంతృప్తిని ఇస్తుంది. ఎంతో సమయం టీవీ చూసినా రాని సంతృప్తి, వివేకం కేవలం ఒక పుస్తకం చదవడం వల్ల మాత్రమే వస్తాయి అని శారద చెబుతారు. అంతేకాదు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అరచేతిలోకి అందుబాటులోకి వచ్చేసినా, డిజిటల్‌ పుస్తకాలెన్నున్నా కాగితం మీద చదివిందే మనసులో స్పష్టంగా నిలిచి ఉంటుందంటారు. పుస్తకాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయని ఆశాభావంతో ఉన్న ఆమె వాటిని నేటితరానికి దగ్గర చేయాలనుకున్నారు. నిజానికి చాలా స్కూళ్లల్లో లైబ్రరీలు ఉన్నా నిబంధనల ప్రకారం పుస్తకాలు పోతే లైబ్రేరియన్లు తమ జీతాల్లోంచి డబ్బులు కట్టాలనే భయంతో.. చాలామంది అసలు బీరువాలనే తెరవరు. విదేశాల్లో పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయడానికి తల్లిదండ్రులు తమ పిల్లల్ని వెంటబెట్టుకుని మరీ గ్రంథాలయాలకు వెళ్తుంటారు. దీనివల్ల పిల్లల్లో పదసంపద పెరుగుతుంది. వారి ఊహాశక్తి మెరుగుపడుతుంది. సమస్యలను సానుకూలంగా ఆశావహ దృక్పథంతో ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. రోజూ రాత్రిపూట చదివేందుకు సమయాన్ని కూడా కేటాయించుకుంటారు. ఇక్కడ కూడా పిల్లలకు ఆ అవకాశాన్ని కల్పించడానికి గతేడాది ఏప్రిల్‌ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని శారద ఎంచుకున్నారు. ఆరోజు పుస్తక బహుమతిని చదువరులకు అందించడానికి సంకల్పించారు. సర్వోత్తమ గ్రంథాలయంలో అదనంగా ఉన్న పుస్తకాలన్నింటినీ బహుమతులుగా పంచాలనుకున్నారు. మరి ఎవరికి ఇవ్వాలి? అందుకే బాగా ఆలోచించి ముందుగా ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. ఆ తేదీన పుస్తకాలు పంచుతున్నాం. నచ్చినవి పట్టుకెళ్లండని. అసలు కొందరైనా వస్తారా? అనుకున్న వారి అంచనాలను తలకిందులు చేస్తూ పుస్తకాల కోసం జనం తండోపతండాలుగా వచ్చారు. ప్రాథమికంగా వర్గీకరించిన పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు కేవలం గంట వ్యవధిలోనే అయిపోయాయి. అలా ఆరువేలకు పైగా పంచిపెట్టేశారు. అన్నీ ఒకరికే ఏకమొత్తంగా ఇచ్చేయలేదు. పెద్దలకు రెండు, పిల్లలకు ఒకటి చొప్పున ఇచ్చారు.

మొబైల్‌ లైబ్రరీలు, పాఠశాల లైబ్రరీలు
యువతరానికి, పిల్లలకు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి గతేడాది మొబైల్‌ లైబ్రరీలను ప్రారంభించారు. విజయవాడలోని పటమట, మొగల్రాజపురం, శ్యామలాపురం వంటి చోట్ల మొబైల్‌ గ్రంథాలయాలను ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు. బ్రెడ్‌ సొసైటీలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్న శారద ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 1800 గ్రామాల్లో గ్రంథాలయాలు నెలకొల్పారు. ఏడువందల అరవై పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. ఈ సర్వోత్తమ గ్రంథాలయంలో చదువుకొని సివిల్స్‌, గ్రూప్స్‌లో విజయం సాధించిన వారు ఎందరో ఉన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఎక్కువ మంది ఈ గ్రంథాలయానికే వస్తారు. వారి అవసరాలకు అనుగణంగా పుస్తకాలను సిద్ధం చేస్తారు. ఈ గ్రంథాలయంలో ప్రవేశం పూర్తిగా ఉచితం.


గ్రంథాలయాలతోనే ప్రజాచైతన్యం
ప్రజా చైతన్యాన్ని పెంచేవి గ్రంథాలయాలే. హైబ్రీడ్‌ లైబ్రరీలు, వర్చువల్‌ లైబ్రరీలు, కిండెల్‌ లైబ్రరీలు వంటివి ఎన్ని వచ్చినా కాగితాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలే సామాజిక చైతన్యానికి ఊపిరులూదుతాయి. ఎన్నో ఉద్యమాలకు, ఎంతో ప్రగతికి గ్రంథాలయాలే మూలాలుగా నిలిచాయి. మానవ నాగరికతలో వీటి ప్రాముఖ్యత ఎవరూ సందేహించలేనిది.
- డాక్టర్‌ రావి శారద
ఫోన్‌ : 9393477313
                                                                                                               - బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి