చూడ్డానికి ఆయనో సాదాసీదా చాయివాలా. కానీ ఆయన బతుకు పుస్తకంలోకి తొంగిచూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సామాజిక వాస్తవికతను వెలికితీయాలనే తపన, సాహిత్యం పట్ల అపారమైన ప్రేమ అందులో కనిపిస్తాయి. ఇవన్నీ ఉండబట్టే ఆ చారువాలా రచయిత కాగలిగారు. అది అసాధ్యమేమీ కాదు సుసాధ్యమేననీ ఆయన నిరూపించారు. కేవలం రచయితగానే ఆగిపోకుండా తన పుస్తకాలకు తానే పబ్లిషర్ కూడా అయ్యారు. సామాన్యుల రచయిత అయిన ఆ అసమాన చారువాలా లక్ష్మణరావు 'జీవన' ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం.
ఢిల్లీలో ఐ.టి.ఓ.కి దగ్గర్లోని విష్ణు దిగంబర్‌మార్గ్‌లో లక్ష్మణరావు టీ స్టాల్ ఉంది. ఆ ఓపెన్ ఎయిర్ స్టాల్‌లో ఒక బెంచిపై కిరోసిన్ స్టవ్, ఒక టీ కెటిల్, రెండు గ్లాసులు, ప్లాస్టిక్ మగ్ కనిపించే వస్తువులు. తాను రాసిన పుస్తకాలను అక్కడే ఓ పక్కన డిస్‌ప్లే పెట్టారు. చినుకులు పడితే స్టాల్ మూసేయాల్సిందే. అప్పుడు పేవ్‌మెంట్ పక్కనున్న సపోర్ట్ గోడ దగ్గర వస్తువులను పెట్టి, దానిపై ప్లాస్టిక్ కవర్ కప్పుతారు. పక్కన సైకిల్‌ను నిలబెట్టి, దానిపై నుంచి కవర్‌వేసి, తానూ, తన పుస్తకాలు తడవకుండా జాగ్రత్తపడతారు. ఈయన్ని చూసిన వారెవరూ 24 పుస్తకాలు రాసిన రచయితంటే ఏమాత్రం నమ్మలేరు.
జీవన నేపథ్యం...
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని తలేగాన్ దశాశర్ గ్రామంలో లక్ష్మణరావు 1952, జులై 22న జన్మించారు. నిరుపేద కుటుంబమైనా చిన్నప్పుడే పాఠశాలలో చేరారు. అక్కడ జరిగిన ఒక సంఘటనే రచయితగా మారడానికి స్ఫూర్తినిచ్చిందని ఆయన చెబుతారు. తనకు సీనియర్‌గా ఉన్న రామ్‌దాస్ అనే విద్యార్థి అల్లరిచిల్లరగా ప్రవర్తించేవాడు. అతనిని అక్కడున్న ఒక ఉపాధ్యాయుడు సంస్కరించి, ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దారు. ఈ సంఘటన లక్ష్మణరావుని తీవ్రంగా ప్రభావితం చేసింది. అతనిపేరునే తరువాత ఒక నవల రాశారు. దీన్ని నాటకంగా కూడా మార్చారు. లక్ష్మణరావు పగలు పనిచేసి, రాత్రుళ్లు వీధిదీపాల కింద చదువుకున్నారు. నాగపూర్‌లో మరాఠీభాషలో సెకండరీ విద్యని పూర్తిచేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీలో సి.బి.ఎస్.సి.లో హయ్యర్ సెకండరీ విద్య, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, ఇగ్నూలో, హిందీభాషలో పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తిచేశారు. ఆయన విద్యా ప్రస్థానమేమీ నల్లేరు మీద నడకలా సాగలేదు. గ్రాడ్యూయేషన్ పూర్తిచేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. భవననిర్మాణ కూలీగా పనిచేస్తూ, దూరవిద్యలో డిగ్రీ చేశారు. ఆయన తన 42వ ఏట డిగ్రీ పట్టా పొందారు.
తపనే ముందుకు నడిపింది
ఢిల్లీ చేరుకుని, ఒక రచయితగా గుర్తింపు పొందాలనేది ఆయన కల. ఈ కల ఆయన్ని 1975 నుంచే వెంటాడింది. అప్పటికే ఆయన అమరావతిలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికునిగా పనిచేస్తున్నారు. కొన్ని రోజులకు ఆ మిల్లు మూతపడింది. దాంతో పొలం పనులకు వెళ్లకతప్పింది కాదు. రచయిత కావాలన్న తన కల సాకారం చేసుకోవడానికి తండ్రికి తెలియకుండా రూ.40 తీసుకుని, కట్టుబట్టలతో ఢిల్లీకి బయలుదేరారు. ఆ డబ్బులు ఆయన భోపాల్ వరకు వెళ్లడానికే సరిపోయాయి. దాంతో భోపాల్‌లోనే రైలు దిగి, ఒకరింట్లో పనివాడిగా చేరారు. అక్కడ చదువుకోవడానికి ఇంటి యజమాని అవకాశం కల్పించారు. అక్కడ పనిచేసే సమయంలోనే పదోతరగతి పూర్తిచేశారు. కొంతకాలం భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసి, కాస్త డబ్బులు సంపాదించి, జులై 1975 నాటికి ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. రెండేళ్లపాటు హైవే దాబాల్లో కప్పులు కడుక్కుంటూ, నీళ్లు మోస్తూ జీవనం సాగించారు. 1977 నుంచి విష్ణు దిగంబర్ మార్గ్‌లో పాన్‌షాపును ప్రారంభించారు. అందులో లాభం రాకపోవడంతో 1980 నుంచి టీ అమ్మడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకూ అమ్ముతూనే ఉన్నారు. కానీ లక్ష్మణరావు పుస్తకాలే ప్రపంచం. దర్యాగంజ్‌లోని ఫ్లీ మార్కెట్‌లో ఆదివారాలు పుస్తకాలను వెతకడానికి వెళ్లేవారు. గుల్షన్ నందా, మున్షీ ప్రేమ్‌చంద్, శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ తదితర భారతీయ రచయితల పుస్తకాలే కాదు కార్ల్‌మార్క్స్, వి.ఐ.లెనిన్, షేక్స్పియర్, సొఫోక్లస్, బెర్నార్డ్ షా లాంటి ప్రముఖుల రచనలను కూడా లక్ష్మణరావు బాగా ఔపోసన పట్టారు.
అవమానాలతోనే ముందడుగు
రచయిత కావాలనుకొని ఢిల్లీలో అడుగుపెట్టిన లక్ష్మణరావుకు ఉపాధి వెతుక్కునేసరికే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఒకపక్క పనిచేసుకుంటూనే తనచుట్టూ ఉన్న సమాజంలోని వివిధ అంశాలపై రచనలు చేశారు. వాటిని అచ్చు వేయించడానికి ఆర్థికస్థోమత లేక ఢిల్లీలోని ఎంతోమంది పబ్లిషర్ల చుట్టూ తిరిగారు. జీవితంలో మర్చిపోలేని అవమానమే అతనిని పబ్లిషర్‌గా మార్చింది. ఒక పబ్లిషర్ రావుని చులకనగా మాట్లాడాడు. అతని స్క్రిప్టు చూడకుండానే, ఆఫీసు నుంచి గెంటేశాడు. ఈ సంఘటన తర్వాత, రావు మరికొన్ని ప్రచురణ సంస్థల దగ్గరకు వెళ్లారు. అక్కడా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. దాంతో తన పుస్తకాన్ని తానే ముద్రించి, మార్కెట్‌లో ప్రమోట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 'భారతీయ సాహిత్య కళా పబ్లికేషన్' పేరుతో ఒక ప్రచురణ సంస్థని ప్రారంభించారు. దానిద్వారా 1979లో తొలిపుస్తకాన్ని 'నయి దునియా కీ నయి కహానీ' అనే పేరుతో ముద్రించారు. అలా ఇప్పటివరకూ 24 పుస్తకాలు రాశారు.. వీటిలో నవలలు, కథాసాహిత్యం, నాటకాలు, తత్వశాస్త్రం, జీవితచరిత్రలు తదితర అంశాలున్న పుస్తకాలున్నాయి. ఒక పుస్తకం తాలూకు వేయి ప్రతులను ముద్రించడానికి పాతిక వేలు ఖర్చు చేశారు. పుస్తకం అమ్మకంతో వచ్చిన ప్రతి రూపాయీ మరో పుస్తకం ముద్రించడానికే ఉపయోగిస్తానని రావు అంటారు. ఎలాగైనా తన మిగిలిన పుస్తకాల్నీ రాబోయే రోజుల్లో ముద్రించి తీరతానని ఆయన చెబుతున్నారు.
ప్రముఖుల ప్రశంసలు
ప్రధాని ఇందిరాగాంధీ జీవితచరిత్ర రాసే క్రమంలో లక్ష్మణరావు 27మే 1984న తీన్‌మూర్తి భవన్‌లో ఆమెను కలిశారు. అయితే ఆమె తన జీవితచరిత్ర రాయడం కన్నా దినచర్యని రాయాలని సూచించారు. ఆమె సూచనమేరకు మూడు మాసాల్లోనే 'ప్రధానమంత్రి' అనే పుస్తకం రాశారు. అయితే దానిని అందించేలోగానే ఆమె హత్యకు గురయ్యారు. ఆ తర్వాత రాసిన 'రామ్‌దాస్' అనే హిందీ నవల. 'నర్మద' నవల, 'పరంపర సే జుడీ భారతీయ రాజ్‌నీతి' అనే పుస్తకం, 'అభివ్యక్తి' నవల, 'రేణు' నవల వంటివి ఇప్పటివరకూ పలు ముద్రణలు పొందాయి. 'నర్మద' పుస్తకం ఇంగ్లీష్‌లోనూ తర్జుమా అయింది. వీటిలో కొన్ని పుస్తకాలు అంతర్జాతీయ ఖ్యాతి కూడా పొందాయి. ఈయన రచనలు చదివిన అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ 23 జులై 2009లో ఆయనను కుటుంబంతో సహా తన నివాసానికి ఆహ్వానించారు. ఆమెకు లక్ష్మణరావు తాను రాసిన 'రేణు' నవలను బహూకరించారు. ఆయన రచనల్లో 'రామ్‌దాస్' ఇంద్రప్రస్థ సాహిత్య అవార్డును పొందింది. 64 ఏళ్ల లక్ష్మణరావు తాను రాసిన గ్రంథాలకు రేఖా చిత్రాలను స్వయంగా వేసుకోవడం మరో ప్రత్యేకత. అతను చిన్నప్పటి నుంచి రేఖాచిత్రాలను వేసేవారు. ఈ రేఖాచిత్రాలు లక్ష్మణరావు పుస్తకాలకు రచయితగా గుర్తింపునిచ్చాయి.
సైకిల్ పైనే అమ్మకాలు
లక్ష్మణరావు. రోజుకి 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వాటి అమ్మకం చేస్తుంటారు. రోహిణి, వసంతకుంజ్ మార్గాల్లో సైకిల్‌పై వెళ్లడం ఆయన దినచర్య. ఉదయం టీ స్టాల్‌కి వెళ్లాక, తన ఇద్దరి కొడుకులకు స్టాల్ అప్పజెప్పి, తన ప్రయాణం మొదలుపెడతారు. దాదాపు తన లిస్టులో ఉన్న స్కూళ్లకు వెళ్లడమే ఆయన లక్ష్యం. అలా పుస్తకాలను తీసుకెళ్లడంతో మొదలైన రోజు.. వాటిలో కొన్నింటిని వెనక్కి తెచ్చుకోవడంతో ముగుస్తుంది. కొన్నిసార్లు టీచర్లు చిరాకుపడినా మళ్లీ కొన్నిరోజులకు ఆ స్కూలుకే వెళ్లి అమ్మే ప్రయత్నం చేస్తారాయన. రచనలను వారికి చూపించే దాకా ఆయన ప్రయత్నం కొనసాగుతుంది. బస్సు టిక్కెట్ కొనలేని, ఆటోలకు డబ్బులివ్వలేని తన పేదరికం వెక్కిరిస్తున్నా.. తన దగ్గర సైకిల్ ఉందనే ధీమానే జీవిత ప్రయాణాన్ని కొనసాగేలా చేస్తుందంటారు. ప్రస్తుతం లక్ష్మణరావు పుస్తకాలు ఆన్‌లైన్‌లో పెద్ద సంస్థలు కూడా అమ్ముతున్నాయి.
జనం మెచ్చిన రచయిత
లక్ష్మణరావు తన రచనలతో అన్నివర్గాల గుర్తింపూ పొందారు. ముఖ్యంగా యువతరం, విద్యార్థిలోకం ఆయన రచనలను అత్యంత మక్కువతో చదువుతారు. అతని టీ స్టాల్ దగ్గరకు వచ్చి, సాహిత్య విషయాలపైనా, సామాజిక అంశాలపైనా ఆయనతోనే చర్చిస్తుంటారు. చాలామంది ఉద్యోగులైతే తమ ఆఫీసులకు వెళ్లే ముందూ, ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత ఈ టీస్టాల్ దగ్గర కాసేపు కూర్చొని, ఆయనతో తమ పుస్తకాభిమానాన్ని పంచుకుంటారు. వివిధ విద్యాసంస్థలు కూడా తమ విద్యార్థుల కోరిక మేరకు ఆహ్వానించి, సాహిత్యోపన్యాసాలు చేయిస్తున్నాయి.
కుటుంబం
కేవలం పుస్తకాలు రాసి వాటిద్వారా డబ్బులు సంపాదించడంపై ఆయనకెలాంటి ఆసక్తీ లేదు. ధనవంతుడిగా ఉండి పుస్తకాలను ప్రేమించలేకపోవడం కంటే పేద రచయితగా ఉండటంలోనే తనకు ఆనందం ఉందంటారాయన. రాత్రి సమయంలో తూర్పు ఢిల్లీలోని శకార్‌పూర్‌లోగల తన ఇంటి దగ్గర ఆయన రచనలు చేస్తుంటారు. ఇల్లంటే అదేదో భవనం కాదు. ఒకేఒక్క అద్దె గది. అందులోనే అతని భార్య రేఖ, ఇద్దరు కొడుకులు హితేష్, పరేష్ ఉంటారు. లక్ష్మణరావుకి పెళ్లయిన కొత్తల్లో భార్య రచనలు చేయొద్దనేది. కానీ అతనిలోని పట్టుదల చూసిన తర్వాత ఆమె కాదనలేకపోయింది. పిల్లల్లో హితేష్ సి.ఏ., పరేష్ ఇగ్నూలో ఎం.కామ్ చదువుతున్నారు.
సామాజిక వాస్తవికతకు దర్పణం
- లక్ష్మణరావు
నా జీవితంపై ఆధారపడి నేను రచనలు చేయలేదు. నేను సామాజిక వాస్తవితకను వెలికితీసే ప్రయత్నం చేశాను. నా చుట్టుపక్కల నేను చూసే విషయాలనే నా రచనలు ప్రతిబింబించాయి. వాటిని చదివినవారు తమ జీవితాలను మరోసారి తామే గుర్తుచేసుకునే విధంగా అవి ఉంటాయి.
- బెందాళం క్రిష్ణారావు








కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి