6, డిసెంబర్ 2016, మంగళవారం

అపురూప సోయ‌గాల అజంతా



అజంతా' అంటేనే అందమైన శిల్ప, చిత్రకళాప్రజ్ఞకు చక్కని నిదర్శనం. కొండను తొలిచి రూపొందించిన గుహలూ, అందులోని చిత్రాలు, శిల్పాలూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. ప్రకృతిని ప్రేమించేవారికీ, కళాభిమానులకూ ఎన్నో తరాలుగా అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతున్న అజంతా గుహల విశేషాలు ఈ వారం 'జర్నీ'లో..

'మా బస్సు ఎల్లోరా నుంచి అజంతా బస్‌స్టేషన్‌కు చేరుకునేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. అక్కడ నుంచి అజంతా గుహల వరకూ వెళ్లే ప్రత్యేక బస్సు ఎక్కాం. దూరంగా సుమారు 250 అడుగుల ఎత్తులో గుర్రపునాడా అకారంలోగల కొండచరియ మొత్తం అంతా కలిపి ఒకటే రాయిగా కన్పిస్తోంది. అందులోనే అజంతా గుహలున్నాయి. క్రీస్తు పూర్వపు కాలానికి చెందినవీ, తర్వాత తొలిచినవీ మొత్తం ముప్పై గుహలు ఉన్నాయి.











సునిశిత శిల్పకళ
అజంతాలోని మొదటి గుహ విహార శిల్పకళకు ప్రతీకగా కనిపించాయి. దీని ముందు భాగం నగిషీ చెక్కడాలతో అత్యంతరమణీయంగా ఉంది. సుందరంగా మలిచిన ఆరు స్తంభాలు వరండాలో అందంగా కనిసిస్తున్నాయి. ఈ స్తంభాల దూలాలు

అనురేఖన (ట్రేసరీ) కళతోనూ, స్తంభాల పైభాగాన ఎగురుతున్న భంగిమల్లో విగ్రహాలను చెక్కారు. చక్కటి నగిషీ పనితనంగల ఈ వరండాద్వారానే మొదటి గుహలోకి వెళ్లాం. విశాలంగా ఉన్న గుహ వరండాలో అన్ని స్తంభాలకున్నట్లే అలంకృత శిల్పాలున్నాయి. ఇరువైపులా వరుసగా కొట్టాల్లాంటి గదులున్నాయి. ఇందులో ముందుగది తర్వాత ముఖద్వారానికి ఎదురుగా ఒక పెద్ద బుద్ధవిగ్రహం ఉంది. దానిని పక్కనే అతని ప్రథమశిష్యులైన పంచవర్గీయ బిక్షువుల విగ్రహాలున్నాయి. వాటితో పాటు బుద్ధుని బోధనలు వినడానికి వచ్చిన ప్రజల విగ్రహాలు కూడా ఉన్నాయి. హాలులో కుడివరుసలోని మధ్యస్తంభంపై ఒక విచిత్ర ఆకృతిని వినూత్న శైలిలో ఎంతో వాస్తవికంగా మలిచారు. పైకప్పులో ఇప్పటికీ మిగిలున్న చిత్రాలు కొన్ని అత్యుత్తమంగా కనిపించాయి. ఈ చిత్రాల్లో చాలా వరకూ జాతకకథల సన్నివేశాలున్నాయి. ముందు గదిలోని పక్కగోడలపై బుద్ధుని జీవితంలో ప్రధాన సంఘటనలను ప్రముఖంగా చిత్రించారు. కుడివైపు గోడమీద మరో చిత్రం ఉంది. ఈ చిత్రంలో బుద్ధుడు అనేక భంగిమల్లో గల బుద్ధునిగా వందల సంఖ్యలో కనిపించేలా ఉంటుంది.

ఆకట్టుకునే కుడ్య చిత్రాలు
రెండో గుహ వరండా పైకప్పులో అందమైన శిల్పాలు, కుడ్యచిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఎడమవైపు గోడపై బుద్ధుని జీవితగాధలను వివిధ ఫలకాలపై రకరకాలుగా చిత్రించారు. దిగువ ఎడమవైపున గల ఫలకంపై మాయాదేవికి వచ్చిన చిత్రమైన కలను కళాత్మకంగా చిత్రించారు. ఈ గుహలో వరండా కుడి గోడపై చాలా వరకూ శిధిలమై ఉన్న ఒక చిత్రం ఉంది. ఇది కూడా అజంతాకు చెందిన అత్యుత్తమ కళాఖండంగా గుర్తింపు పొందింది. ఇందులో విశేషం ఏమంటే ఖడ్గాన్ని ధరించిన ఒక రాజు ఒక స్త్రీని శిక్షిస్తున్నట్లుగా చిత్రించారు. ఆ స్త్రీ మోకరిల్లి దయాభిక్ష కలిగించాలని వేడుకుంటూ ఉంటుంది. ఈ చిత్రంలో ఆమె ముఖం దు:ఖపూరితమై ఉంటుంది. సన్నని నాజూకైన శరీరంతో ఉన్న ఆమె అపురూప లావణ్యంతో చిత్రంలో కన్పిస్తోంది. ఇందులో అనేక రకాల వస్త్రాలు నలిగిపోయి నేలమీద కుప్పలుగా కన్పిస్తాయి. కుడి పక్కనగల చిత్రాల్లో స్త్రీ మూర్తుల చిత్రణ అద్భు తంగా ఉంది. పైకప్పున ఉన్న చిత్రాల్లో ఒకదానివెనుక మరొకటి మొత్తం ఇరవై మూడు హంసలు వరుసగా బారులు తీరి వెళుతున్నట్లు అపూర్వంగా చిత్రించారు.

ఆనాటి జీవన చిత్రాలు
నాలుగో గుహ అతిపెద్ద విహారం. విస్తృతంగా అలంకృతమైన ముఖ్య ద్వారం దాటగానే ఇరవై ఎనిమిది స్తంభాలు గల ఒక పెద్ద మండపం వచ్చింది. దీని మూలల్లో, తలుపుల మధ్యలో ఎన్నో వివరణాత్మకమైన శిల్పాలు కనువిందు చేశాయి. ఈ శిల్పాలలో మదపుటేనుగు బారి నుంచి పరుగులు తీస్తున్న స్త్రీ, పురుషులు, చెట్టుని ఆనుకుని ఉన్న ఒక యువతి ఉడుతతో ఆడుకోవడం వంటి చిత్రాలను సునిశితమైన పనితనంతో మలిచారు. ఐదో గుహలో ముఖద్వారానికి ఇరువైపులా సాలభంజికల విగ్రహాలున్నాయి. ఆరో గుహ రెండు అంతస్తులున్న ఏకైక విహారం. రకరకాల భంగిమల్లో ఉన్న బుద్ధుని విగ్రహాలున్నాయి. తొమ్మిదో నంబరు గుహ ఒక చైత్య మంటపం. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ధం నాటి ప్రజల దైనందిన జీవితాన్ని ప్రతిబింబించే కుడ్యచిత్రాలిక్కడ ఉన్నాయి. పశువుల కాపరులు తమ ఆలమందలను కాసుకుంటున్న చిత్రం, నిరాడంబరంగా ఉన్న బుద్ధుని విగ్రహాలు, స్తంభాలపైనా, వెనుక గోడలపైనా, గవాక్షాలపైనా ఉన్న చిత్రాలు ఆనాటి థేరవాద బౌద్ధానికి, ఆ తర్వాత వచ్చిన మహాయానానికి నిదర్శనాలుగా కనిపిస్తాయి.

ప్రాచీన చైత్యం
పదో గుహ క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందింది. ఇది చైత్యాలన్నింటిలోకీ ప్రాచీనమైంది. ప్రాచీన బారత చిత్రకళకు ప్రతిబింబాలుగా ఈ చిత్రాలు ఉన్నాయి. ఇందులో మూడో స్తంభానికి ఎదురుగా ఉన్న గోడపైన గల చిత్రంలో ఒక రాజ వంశస్థుడు సైనిక, నృత్య గాయక బృందంతో కనిపిస్తాడు. ఆనాటి వారి దుస్తులు, నగలు, కేశాలంకరణ వంటివి విభిన్నంగా కన్పిస్తాయి. పన్నెండో గుహలో బౌద్ధ విహారం ఉంది. ఈ గుహకు మూడు పక్కలా బౌద్ధ సన్యాసుల నివాస స్థానాలు వాటిలో రాతి పడకలున్నాయి.

అత్యంత రమణీయం
పదహారో గుహ ముఖ్య ద్వారానికి ఇరువైపులా చెక్కిన ఏనుగుల విగ్రహాలున్నాయి. ఇక్కడి నుంచి నదిని చేరడానికి మెట్ల వరుస దిగువన ఉంది కానీ అది శిధిలమైపోయింది. ఈ గుహాలయాలన్నింటిలోనూ ఇది అత్యంత రమణీయంగా ఉంది. వాస్తుశిల్ప కళావైభవం అపురూపంగా అలరారుతోంది. క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో నిర్మించిన ఈ గుహలో కూడా అపురూపమైన శిల్పాలు, చిత్రాలు బుద్ధుని జీవితగాథలను పరిచయం చేస్తాయి. ఈ గుహలో అతి సుందరమైన చిత్రం ఒకటుంది. దానిని అంతర్జాతీయ చిత్రకళావిమర్శకులు ''ది డైయింగ్‌ ప్రిన్సెస్‌ '' (మరణిస్తున్న రాకుమారి)గా వ్యవహరిస్తున్నారు. విషాదానికి సజీవరూపంగా ఈ చిత్రాన్ని చిత్రించారు. పదిహేడో గుహలో అదనంగా ఒక ముందు గది ఉండడం ఓ ప్రత్యేకత. నగిషీలతో ఉన్న ఫలకాలతో ముఖద్వారాన్ని అలంకరించారు. వీటిలో బుద్ధుని జీవిత విశేషాలను, జాతక కథలలోని సన్నివేశాలను వివరించేవే అత్యధికం. సింహళరాజు విజయాన్ని చిత్రించే చిత్రాలు కూడా ఎంతో రమణీయంగా కన్పించాయి. పందొమ్మిదో గుహ ఒక చైత్య మంటపం. ఇందులో చిత్రాల కన్నా బుద్ధుని శిల్పాలే వివిధ భంగిమల్లో అత్యధికంగా ఉన్నాయి. ఇరవయ్యో గుహ కూడా శిల్పకళకు చక్కని నిదర్శనం.

ప్రత్యేకమైన కళాకృతులు
ఇరవయ్యారో గుహ అజంతాలో చివరిదీ, అత్యంత విశిష్టమైనది. ఇందులో శిల్పాల సంఖ్య చాలా ఎక్కువ. ఇందులోనే బుద్ధుని మహాపరినిర్యాణాన్ని అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. అజంతా గుహల్లో కొండరాళ్లపై ఎలా శిల్పాలను తొలిచారో సూచించడానికి తగిన ఔట్‌లైన్‌ శిల్పరచన కూడా ఇందులో ఒక చోట ఆనాటి శిల్పులు చూపించారు. రాతి పైభాగంపై గీతలు గీసి, వాటి అంచనామేరకు శిల్పాలను చెక్కినట్లు స్పష్టమైంది.

ఇలా వెళ్లాలి
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు 106 కిలోమీటర్ల దూరంలో ఈ అజంతా గుహలున్నాయి. దేశంలోని అన్ని ప్రధానరైల్వే స్టేషన్ల నుంచి ఔరంగాబాద్‌ చేరుకోవచ్చు. అక్కడ నుంచి వాహనాలు ఏర్పాటు చేసుకుని అజంతా సందర్శించవచ్చు. అజంతాలో బస చేయడానికి తగిన హోటళ్లున్నప్పటికీ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వాటి ధరలు కూడా కాస్తా అధికంగానే ఉంటాయి.

- బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి