24, డిసెంబర్ 2016, శనివారం

నులక మంచంపై దాబా రుచులు



కాస్తంత ఊరికి దూరంగా.. కాసేపు అలా కారులోనో.. బస్సులోనో.. ఆటోలోనో లేదంటే బైక్‌పైనో ఫ్యామిలీతో నేషనల్‌ హైవే మీదుగా ప్రయాణం చేశాక.. నులక మంచం మీద బాసింపట్టు వేసుకుని చపాతీనో, పరాటానో తింటే ఎలా ఉంటుంది..? ''ఎందుకు బాగుండదూ.. చాలా చాలా బావుంటుంది'' అనేగా మీ మాట. రోటీన్‌కి భిన్నంగా ఏ వారంతంలోనో అలా గడపాలని అనుకునేవాళ్ళకు ఇప్పుడు 'దాబా'లు చక్కటి వేదికలు అవుతున్నాయి. ఒకప్పుడు రవాణా రంగంలో పనిచేసేవారికి మాత్రమే అన్నట్టుగా ఉండే దాబాలు ఇప్పుడు సామాన్యజనాల్నీ తనవైపుకి తిప్పుకునేలా చేస్తున్నాయి. ఇడ్లీ, ఉప్మా పెసరట్టు మొదలుకుని.. థమ్‌ బిర్యానీ, చికెన్‌ జాయింట్ల వరకూ.. ఎన్నో వెరైటీ రుచులకు, ఆటవిడుపు సాయంత్రాలకు దాబాలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి.

బాటసారులకు భోజన, విశ్రాంతి సదుపాయాలు కల్పించడానికి ఒకప్పుడు పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. ప్రస్తుతకాలంలో ఆధునిక పూటకూళ్ల ఇళ్లుగా దారిపక్కన దాబాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆధునికతను సంతరించుకుంటూ సరికొత్త రుచుల సమ్మేళనంతో దాబాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు దాబాలలో తినడానికి లారీలు, ట్రక్కుల డ్రైవర్లే ఎక్కువగా కన్పించేవారు. కానీ రోజులు మారాయి. కుటుంబాలతో సహా దాబాలకు వెళ్లి తినడం కొత్త ట్రెండ్‌గా తయారైంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుండంతో కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రధానమార్గంలో భోజన ప్రియుల్ని ఆకర్షిస్తున్న దాబాలు అనేకం.

ఉత్తరాది నుంచి
ఒకప్పుడు ఏదో వందో, ఏభైౖ కిలోమీటర్ల దూరంలో అదీ జాతీయ రహదార్ల పక్కన మాత్రమే దాబాలు ఉండేవి. జాతీయ రహదారిపై సుదూర ప్రాంతాలకు రేయింబవళ్ళు తిరిగే వాహనాల సిబ్బంది ఆకలి తీర్చేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడేవి. మొదట్లో పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు ఇటువంటి హోటళ్లను ప్రారంభించేవారు. ఉత్తరాది ప్రజల స్థానిక భాషలో వీటిని 'దాబాలు' అని పిలిచేవారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరే వీటికి స్థిరపడిపోయింది. అప్పట్లో పంజాబీలు ఎంతో ఇష్టంగా తినే రోటీలు, పుల్కాలు వంటివి, వాటికి కాంబినేషన్‌గా తడకా, రకరకాల కుర్మాలు లభించేవి. రాను రానూ తందూరీ వంటకాలు, బిర్యానీ, ఫ్రైడ్‌రైస్‌ వంటివి కూడా దాబాల్లో రాజ్యమేలుతున్నాయి.

పెరుగుతున్న ఆదరణ
వివిధ రాష్ట్రాల ప్రజల ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా దాబాల్లో వంటకాలు తయారీ జరుగుతున్నాయి. దాంతో వాటిని ఆస్వాదించడానికి వచ్చే స్థానిక, స్థానికేతర ప్రజలతో అవి కళకళలాడుతున్నాయి. పగటి సమయాల్లో కన్నా సాయంత్రం నుంచీ రాత్రి పది, పదకొండు గంటల వరకూ నిత్యం రద్దీగా కన్పిస్తున్నాయి. అందులోనూ కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి, పనిచేసేవారికి దాబాల్లో లభించే ఫుడ్‌ అనుకూలంగా ఉంటోంది.
కుటుంబ సమేతంగా
ఇటీవలి కాలంలో సకుటుంబ సమేతంగా ఈ దాబాలకు రావడం పెరుగుతోంది. స్టార్‌ హోటళ్లలో మాత్రమే లభించే వెరైటీఫుడ్‌ కూడా తమ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉండడం వల్ల చాలామంది దాబాలకు రావడానికి ఇష్టపడుతున్నారు. సాయంత్రమైతే చాలు ఎక్కువ మంది తమ టూవీలర్లు, కార్లపై దాబాలకు చేరుకుంటున్నారు. దీంతో దాబాల దగ్గర వాహనాల పార్కింగ్‌ సదుపాయాలను కూడా దాబాల నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. కావాల్సినంత సమయం దాబాల దగ్గర గడపడానికి అవకాశం ఉండడం వల్ల పిల్లలు, పెద్దలు, స్నేహబృందాలు ఇలా అన్నివర్గాలవారూ దాబాలలో గడపడానికి ఇష్టపడుతున్నారు.

వెరైటీ రుచుల కోసం
పంజాబీల ప్రత్యేక వంటకాలైన సర్సన్‌ కా సాగ్‌ అండ్‌ మక్కీ ది రోటీ, తందూరి కుక్కడ్‌, పిండీ చోలే, కడీ పకోడి, పన్నీర్‌ మఖనీ, ఇమ్మర్తీ, ఫిర్నీ, కేసర్‌ కుల్ఫీ, బటర్‌ చికెన్‌, ఆలూ ద ప్రంత, రాజ్మా చావల్‌ వంటి వెరైటీ ఫుడ్‌ దాబాల్లోనో తినగలం. అంతేకాదు నూనె లేకుండా కాల్చే తందూరీ రోటీతో పనీర్‌ బట్టర్‌ మసాలానో, జింజర్‌ చికెనో నంజుకోవడంలో ఉన్న మజా దేనిలోనూ ఉండదు. అదేవిధంగా కబాబ్స్‌, టిక్కాలు ఇలా ఒకటేమిటి తందూరీ ఐటెమ్స్‌ రుచే వేరు. తందూరీ చికెన్‌, తందూరీ మటన్‌, ఫిష్‌ తందూరీ, తందూరీ ఫ్రాన్స్‌, వెజిటేరియన్‌ వెరైటీలు...ఇలా రకరకాల వంటకాలు మంచి సువాసనతో ఘుమఘుమలాడిస్తూ నోరూరిస్తుంటాయి.
విస్తరిస్తున్న దాబాలు
దాబాలకు ఆహారరీత్యా పెరుగుతున్న డిమాండ్‌ చూసి, చాలా మంది ఈ వ్యాపార రంగంలోకి వస్తున్నారు. రహదారి పక్కన కాకుండా పట్టణ, నగరాల మధ్యన, శివారు ప్రాంతాల్లో కూడా వీరు దాబాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి రహదార్ల పక్కనున్న దాబాలకు కాస్తా భిన్నంగా ఉంటున్నాయి. రహదార్ల పక్కనున్న దాబాల్లో నులక మంచాలే భోజన టేబుళ్లుగా ఉంటే ఈ దాబాల్లో మాత్రం హోటళ్ల మాదిరిగా కుర్చీలు, ప్లాస్టిక్‌, టైల్స్‌తో తయారుచేసిన డైనింగ్‌ టేబుళ్లు ఉంటున్నాయి. ఆ దాబాల్లో అయితే భోజనానంతరం ఆయా వాహనాల సిబ్బంది కొంత సొమ్ము చెల్లించి, అక్కడే మంచాలపై ఆరాత్రి విశ్రాంతి తీసుకునే వీలుంది.

పండుగలు.. పార్టీలు
పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలను స్నేహితులు, సన్నిహితుల మధ్య జరుపుకోవడానికి చాలా మంది హోటళ్లను వేదికలుగా ఎంచుకుంటూ ఉంటారు. ఇటువంటివారు పట్టణాల్లోని హోటళ్ల కన్నా, దరిదాపుల్లో ఉన్న దాబాల్లో జరుపుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పట్టణాల్లోని హోటళ్లలోనైతే ఇలాంటివి జరుపుకోవడానికి అదనంగా సొమ్ము చెల్లించాలి. అదే దాబాల్లో అయితే అలాంటి ఖర్చులేమీ ఉండవు.
దాబాకి మరోవైపు
నాణేనికి మరోకోణం ఉన్నట్టుగానే కొన్ని దాబాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. చాలా దాబాలు బార్లని తలపిస్తూ మద్యం తాగేవారికి ఇవి అడ్డాలుగా మారుతున్నాయి. వీరి వలన చికెన్‌, మటన్‌ వంటి ఐటెమ్స్‌ కూడా బాగా అమ్ముడవుతాయని దాబా నిర్వాహకులు కూడా మందుబాబుల్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యభిచారం, జూదం వంటి కార్యకాలపాలు కూడా కొన్ని దాబాల్లో కొనసాగుతున్నాయనేది మరో ఆరోపణ. ఆహారం నాణ్యత పాటించని దాబాలూ ఉన్నారు. ఇలాంటి వాటిని సంబంధిత అధికారులు నివారించగలిగితే దాబాలు చక్కటి విందు, కాలక్షేపపు కేంద్రాలుగా ప్రజల ఆదరాభిమానాలను పొందగలవు.


నచ్చిన వంటలు
నాతో పాటు 20 మంది వరకూ ఒడిసాలోని బాలాసోర్‌ నుంచి వచ్చి, ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రజల ఆదరణ బాగుంది. తినేవారి అభిరుచులను బట్టి వారికి నచ్చినట్లు వంటలు చేసి, అందించడమే మా పని.
- ముస్సా బెహరా, వంటమాస్టర్‌.

ఆదరణ పెరిగింది
గత ఏడేళ్ల నుంచీ ఈ దాబాను నిర్వహిస్తున్నాను. అన్ని వర్గాల వారూ దాబాలకు వస్తున్నారు. మా దాబాలో అయితే కేవలం శాఖాహారానికే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తుండడంతో ఇటీవల కాలంలో దాబాలకు వచ్చేవారి సంఖ్య పెరిగింది.
- ప్రేమ్‌ కుమార్‌, డిలైట్‌ దాబా యజమాని, గుంటూరు హైవే
మంచి ఆహారం లభిస్తుంది
ఎప్పుడు డిన్నర్‌కు రావాలన్నా నేను దాబానే ప్రిఫర్‌ చేస్తా. విజయవాడ-గుంటూరు హైవేలో మంచి దాబాలున్నాయి. స్టార్‌ హోటళ్లకు దాబాలు ఏ మాత్రం తీసిపోవు. నచ్చిన రుచుల్లో కావాల్సిన ఆహారపదార్థాలెన్నో ఇక్కడ లభిస్తున్నాయి.
- ఎస్‌. సందీప్‌,
                                                                                            - బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి