ఈ భూమి మీద మానవ పరిణామం జరిగిన తర్వాత మనుషులు స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుని సమూహాలుగా ఏర్పడి ఆహార ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టిన నాటి నుంచి అదనపు ఉత్పత్తులను సమాజంలో వేరొకరికి అందించి దానికి ప్రతిఫలాన్ని అశించడం మొదలైంది. ఇదే వ్యాపారానికి నాందీ ప్రస్తావన. తమ దగ్గర ఉన్న వస్తువులను, అదనపు సరుకులను ఇతరులకు విక్రయించడం. దానికి బదులుగా వారిచ్చినదానితో తమకు అవసరమైనవి సంపాదించడం అనే ప్రక్రియలు ఈ డబ్బు ఆవిర్భావానికి ప్రేరణగా నిలిచాయి. చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే డబ్బు అనేది ఎన్నో పరిణామాలకు లోనై నేడున్న రూపానికి చేరినట్లు స్పష్టమౌతోంది. నాగరికత పెరుగుతున్న కొలదీ డబ్బు రకరకాల రూపాల్లోకి మారుతూ వచ్చింది.
ప్రాచీన కాలంలో అంటే ఇంకా గణతంత్ర రాజ్యాలు, రాజరికాలు లేని రోజుల్లో తెగలుగా జీవించిన కాలంలో వస్తుమార్పిడి పద్ధతి ద్వారా క్రయ విక్రయాలు జరిపేవారు. ఈ రూపాన్ని ఇప్పటికీ కొన్ని ఆదివాసీ సమూహాల్లోనూ, గిరిజన సంతల్లోనూ చూడొచ్చు. అయితే వస్తుమార్పిడి సమయంలో తమకు అవసరమైనవి కొనేవారి దగ్గర లేనప్పుడు, అమ్మకందారుకు మార్పిడి చేయగలిగిన వస్తువులను కొనేవారు ఇవ్వలేనపుడు ఈ విధానంలో లావాదేవీలు జరగడం కష్టమయ్యేది. అప్పుడు అరుదైన వస్తువులను వాటికి బదులుగా ఇచ్చేవారు. ఇలా కాలక్రమేణా అనేక రకాల విలువైన వస్తువులు, ఆల్చిప్పలు, గవ్వలు, బార్లీ, పూసలు మొదలైనవి డబ్బుగా చలామణి అయ్యాయి. సహజంగా అతి తక్కువగా లభించే విలువైన లోహాలు, మణి, మాణిక్యాలు, బంగారం, వెండి లాంటివాటిని డబ్బుగా ఉపయోగించేవారు. కొన్నాళ్లకు ఇది కూడా అంత ప్రయోజనకరంగా లేకపోయింది. ఒక ప్రాంతంలో ఇలా లభించే వస్తువులకు మరో ప్రాంతంలో తక్కువ విలువ ఉండడం, కొన్ని చోట్ల అది కూడా లేకపోవడంతో ఒకే విలువైన కొన్ని రకాల వస్తువులను రూపొందించుకోవాల్సి వచ్చింది. అదే డబ్బు. ఈ దేశంలో ఆర్యులు అడుగుపెట్టక ముందు నుంచే రాతి నాణేలు చెలామణిలో ఉన్నాయి. ఆవి చతురస్రాకారంలోని ముద్రికల రూపంలో ఉండేవి.
హరప్పా కాలం నుంచే...
హరప్పా-మొహంజదారో నాగరికతలో వెలుగు చూసిన పశుపతి, ఎద్దు బొమ్మల ముద్రికలు ఆనాటి డబ్బు అనే దానికి ప్రాథమిక రూపాలుగా చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.పూ.3000 నుంచి క్రీ.పూ. 1500 వరకూ విలసిల్లిన ఈ నాగరికతలో లభించిన ఈ చిహ్నాల వంటివే సమకాలీనమైన ప్రపంచ నాగరికతల్లో లభించాయి. ఆనాటి కాలంలో దీనినే వ్యాపార లావాదేవీలకు ప్రధానమైన ద్రవ్యంగా వినియోగించేవారని స్పష్టమౌతోంది. ఆర్యుల దాడుల వల్ల మళ్లీ కొంతకాలం వస్తుమార్పిడి వ్యవస్థ కొనసాగింది. వస్తుమార్పిడి చేసుకున్న సరుకులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకువెళ్లడం కష్టం కావడం, అవి ఎక్కువ కాలం మన్నికగా, నాణ్యతగా ఉండక పోవడం వంటి సమస్యలుండేవి. వాటికి బదులుగా నాణేలను తయారుచేసుకుంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తేలిగ్గా తీసుకువెళ్లడానికి వీలౌతుందని భావించారు. మహాజనపదాలు రూపొందడంతో వాటి ఆధ్వర్యంలో టంకశాలలు ఏర్పడి నాణేల ముద్రణ ఆరంభమైనట్లు తెలుస్తోంది. అప్పటికే వివిధ రకాల లోహాలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో వాటిని కరిగించి నాణేలుగా ముద్రించారు. క్రీ.పూ. 1000 నుంచి భారతదేశంలో లోహపు నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం. మనదేశంలో క్రీ.పూ. 6-7 శతాబ్దాలలో లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని పి ఎల్ గుప్తాతో పాటు ఎక్కువ మంది చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. కచ్చితంగా నిర్ధారించ లేకపోవడానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. మౌర్య సామ్రాజ్య కాలానికి చెందిన కౌటిల్యుడు తాను రాసిన అర్థశాస్త్రంలో దొంగ నాణేలను గురించి సీసం గనుల గురించి ప్రస్తావించాడు. గ్రీకులు, చైనీయులు, రోమన్లు, పర్షియన్లు క్రీస్తు పూర్వం 6,7 శతాబ్దాల్లో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
జనపదాల్లో మొదలై...
పోత పోసిన, ముద్రించిన నాణేలను ఎక్కువగా వాడుకలోకి తీసుకొచ్చింది స్థానిక 'జనపదాలే'. అప్పటికే ఈ దేశంలో చిన్నా పెద్ద వంద జనపదాలుండేవి. వాటిలో ఆంధ్ర జనపదం కూడా ఒకటి. చారిత్రక తొలికాలానికి చెందిన ఆంధ్ర జనపద నాణేలు కృష్ణా జిల్లా సింగవరంలో బయల్పడ్డాయి. ఈ వెండి నాణేలను స్థానిక రాజులే విడుదల చేశారని చరిత్రకారులు భావిస్తున్నారు. వీటిపై తెలుగు లిపి ఉండడాన్ని బట్టి తెలుగు భాష ప్రాచీనతకు కూడా ఉదాహరణలుగా ఇవి నిలిచాయి. ఈ నాణేల మీద అనేక ముద్రలు కనిపిస్తున్నాయి. జనపదాలలో సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కూడా బయల్పడినాయి. ఆంధ్ర జనపదమే ఇందుకు గొప్ప ఉదాహరణ. అమరావతిలో దొరికిన 7668 నాణేలలో కనిపించిన రకాలు దేశంలో ఇంకెక్కడా కనిపించవు.
అణాలు.. మొహర్లు
మొఘల్ చక్రవర్తుల తర్వాత అధికంగా నాణేలు ముద్రించినవారు బ్రిటిష్ పాలకులే. వీరు ముద్రించిన నాణేలను బ్రిటీష్ ఇండియా నాణేలు, వీరి పాలన తర్వాత ముద్రించిన నాణేలను రిపబ్లిక్ ఇండియా నాణేలు అని వ్యవహరిస్తారు. 1834 నాటికి కొన్ని సంస్థానాలు, ఫ్రెంచ్, డచ్ ప్రాంతాలు మినహా మిగిలిన దేశమంతా ఈస్టిండియా కంపెనీ పాలన కిందకు వచ్చింది. అప్పటికే బ్రిటిష్ పాలకులు నాణేలను ముద్రిస్తున్నప్పటికి, వాటిని మూడు ప్రెసిడెన్సీల నుంచి (మద్రాసు, బొంబాయి, కలకత్తా) మూడు రకాలుగా వెలువడుతుండేవి, వాటి పేర్లు, బరువులు, రూపాలు రకరకాలుగా వుండేవి. మూడు ప్రెసిడెన్సీల నుంచి ఒకే రకమైన నాణేలను ముద్రించాలని నిర్ణయించి కలకత్తా మింట్ కమిటి సూచనలు అమలు చేశారు. దీని ప్రకారం జరిగిన ముఖ్యమైన మార్పు బంగారు, వెండి నాణేల మీద బ్రిటిష్ రాజు బొమ్మని ముద్రించడం. అలా భారతదేశ నాణేల చరిత్రలో 1835 ప్రాముఖ్యత పొందింది. మొత్తం ఐదుగురు రాజుల బొమ్మలతో నాణేలు వచ్చాయి. క్వీన్ విక్టోరియా బొమ్మ గల నాణేలు 1840 -1901 వరకు ముద్రించారు. మొహర్, రూపాయి, అర్ధ రూపాయి, పావు రూపాయి, అణా, అర్ధ అణా, పావు అణా తదితర విలువలు గల నాణేలను బ్రిటీష్ పాలకులు ముద్రించారు. వీటిలో ఎక్కువగా వెండి నాణేలు కూడా ఉండేవి. అణాలు మాత్రం రాగి లోహంతో ఉండేవి.
రూపాయి.. రూపాలు
భారత అధికారిక ద్రవ్యం రూపీని తెలుగులో రూపాయి అంటారు. దీనిని షేర్ షా సూరి క్రీస్తుశకం 1540-45లో విడుదల చేసాడు. రూపాయి చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. సంస్కత పదమైన రూప్యకం (వెండి నాణెం) నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రుపయ్యా అని పలుకుతారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో మాత్రం రూపాయిని టాకా అని పిలుస్తారు. మొదట్లో రూపాయి అంటే ఓ వెండి నాణెం. 19వ శతాబ్దంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడి ఉండేవి. ఆ సమయంలో అమెరికాలోను, ఇతర ఐరోపా ఆక్రమిత దేశాల్లోను అపారమైన వెండి నిల్వలను కనుక్కున్నారు. బంగారంతో పోలిస్తే వెండి విలువ పడిపోయింది. హఠాత్తుగా రూపాయి కొనుగోలు శక్తిని కోల్పోయింది. ఈ ఘటనను 'రూపాయి పతనం'గా పిలుస్తారు. బ్రిటిషు వారి కాలంలో రూపాయికి 16 అణాలు. ఒక్కో అణాకు 6 పైసలు లేదా 12 పై లు. 1815 వరకు, మద్రాసు ప్రెసిడెన్సీ ఫానం అనే ద్రవ్యాన్ని చెలామణీ చేసేది. 12 ఫానంలు ఒక రూపాయికి సమానం. స్వాతంత్య్రానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ రూపాయి ఇలా పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉండేది. 1947లో స్వాతంత్య్రం వచ్చాక, వీటన్నిటినీ రద్దు చేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. 1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో ''కొత్త'') పైసలుగా పిలిచారు. 'డేనిష్ ఇండియన్ రూపాయి'ని 1845 లోను, 1954 లో 'ఫ్రెంచి ఇండియన్ రూపాయి'ని, 1961లో 'పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడో'ను తొలగించి ఆ స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్టారు.
రుపీ... రుపయ్యా
దేశవిభజన తరువాత మొదట్లో పాకిస్తాన్ భారత రూపాయినే వాడేది. దానిపై పాకిస్తాన్ ముద్ర వేసుకునేవారు. గతంలో కువైట్, బహ్రెయిన్, కతర్, యు.ఎ.ఇ, మలేసియాలలో కూడా భారత రూపాయినే అధికారిక ద్రవ్యంగా వాడేవారు. దేశం బయట చెలామణీ కోసమై, ప్రత్యేకంగా గల్ఫ్ రూపీని 1959 మే 1 నాటి చట్టసవరణ ద్వారా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బంగారం దొంగ రవాణా ద్వారా దేశ విదేశీ మారక ద్రవ్యంపై వస్తున్న వత్తిడిని తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నారు. 1966 జూన్ 6న భారత్ తన ద్రవ్య విలువను తగ్గించినపుడు అప్పుడు గల్ఫ్ రూపీని వాడుతున్న ఒమన్, కతర్, ఇప్పటి యు.ఎ.ఇ లోని దేశాలు దీని స్థానంలో తమ తమ ద్రవ్యాలను ప్రవేశపెట్టాయి. కువైట్ 1961 లోను, బహ్రెయిన్ 1965 లోను అదే పని చేసేసాయి. నేపాల్‌లో భారత్ సరిహద్దుకు దగ్గరి పట్టణాల్లో భారత రూపాయిని తీసుకుంటారు. భారతదేశం పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవులు, ఇండోనేషియా ద్రవ్య కొలమానానికి సాధారణ నామంగా రూపీని ఉపయోగిస్తున్నారు. పూర్వం బర్మా, ఆఫ్గనిస్తాన్లలో కూడా ద్రవ్య కొలమానానికి రూపీని సాధారణ నామంగా ఉపయోగించారు. అమెరికన్ డాలర్ అంటే ఇప్పుడు ఎంతో గొప్పగా చూస్తాం. కానీ స్వతంత్రం వచ్చేనాటికి భారత్ రూపాయి, డాలర్ విలువ ఇంచుమించు సమానం. అప్పటి డాలర్ విలువ రూపాయలల్లో కేవలం ఒక రూపాయి 30 పైసలు మాత్రమే.
కాగితాల్లోకి ఎక్కి...
లోహ నాణేల స్థానంలోనే కాగితం కరెన్సీని తొలిసారిగా చైనా దేశంలో ముద్రించారు. క్రీ.శ, 7వ శతాబ్దంలోనే చైనాలో కాగితం కరెన్సీ చెలామణిలో ఉందని చరిత్ర చెబుతోంది. రాగి, వెండి తదితర లోహాలతో తయారైన నాణేలే చలామణిలో ఉన్న భారత దేశంలో రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు 'బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్' (1770-1832), 'జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్' (1773-75), వారన్ హేస్టింగ్స్ స్థాపించిన బెంగాల్ బ్యాంక్ (1784-91)లు. దీని తర్వాత అన్ని రకాల కాగితపు కరెన్సీ నోట్లు 1861లో తొలిసారిగా బ్రిటిష్ ఇండియా కాలంలో వచ్చాయి. బ్రిటిష్ ఇండియా నోట్లలో మొదటిగా వచ్చిన 'విక్టోరియా పోర్ట్రెయిట్ సిరీస్' నోట్లను ముద్రించి, భద్రత కోసం రెండు ముక్కలుగా మధ్యలోకి కత్తిరించి, రెండు సెట్‌లుగా చేసేవారు. చింపినవాటిలో మొదటిసెట్ పార్శిల్‌ను బ్యాంకులకు పంపి, అది అందిందనే సమాచారం తెలిశాకే రెండో సెట్‌ని పంపించేవారట. తరవాత వాటిని మళ్లీ అంటించేవారు. 1861-1947 వరకూ బ్రిటిష్ ఇండియా రూపొందించిన రూ.1, రూ.5, రూ.10, రూ.50, రూ.100, రూ.500, రూ.1,000ల తోపాటు రూ.10,000 విలువైన నోట్లు చలామణిలో ఉండేవి. భారత ప్రభుత్వపు నోట్లను ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో ప్రారంభమైంది. ఆర్‌బీఐ విడుదల చేసిన మొదటి కాగితపు నోటు రూ.5. దాని మీద ఐదవ జార్జ్ చిత్రం ఉండేది. స్వాతంత్రానంతరం 1949లో ద్రవ్య వ్యవస్థ ఆర్.బి.ఐ అధీనంలోకి వచ్చింది. ఇది గత నోట్లతోపాటు రూ.5,000 నోట్లను కూడా చెలామణిలోకి తెచ్చింది. దేశ సార్వభౌమాధికారం, స్వతంత్రతకు చిహ్నంగా ఉండేలా నోట్ల రూపాన్ని ప్రభుత్వం క్రమంగా మార్చేస్తూ వచ్చింది.
నోటు పదివేలు.. నాణేం వేయి..
ఆర్‌బిఐ చరిత్రలో ఎక్కువ విలువ గల నోటు రూ. పదివేలదే. 1938, 1946ల మధ్య ఇవి చలామణిలో ఉండేవి. మళ్లీ 1954లో రూ.1000, రూ.5000, రూ.10,000 నోట్లను ప్రవేశపెట్టారు. ఆర్‌బీఐ చట్టాల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 10,000 నోటుకి మించి ముద్రించడానికి వీల్లేదు. అంతకు తక్కువలో ఏ సంఖ్యతో అయినా నోట్లను విడుదల చెయ్యొచ్చు. నాణాల విషయానికొస్తే రూ. వెయ్యి విలువ వరకూ ఏ సంఖ్యతో అయినా ముద్రించే వీలుంది. ఈ నేపథ్యంలోనే 1978లో రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేసిన భారత ప్రభుత్వం వివిధ రకాల నోట్లను అమల్లోకి తెచ్చింది. ఇందులోభాగంగానే 1970లో కొత్తగా రూ.20, రూ.50 నోట్లను, 1978లో రూ.100 నోటును, 1987లో రూ.500 నోటును, 2000వ సంవత్సరంలో రూ.1,000 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చింది. ఇప్పుడు 2000 నోటు వచ్చింది. గతంలో రద్దు చేసిన చిన్న నోట్ల స్థానంలో రూ.1, రూ.2, రూ.5, రూ.10 విలువ గల నాణేలను విరివిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ యేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం అప్పటికి ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పెద్ద నోట్లు వలన నకిలీ నోట్లు, నల్ల ధనం పెరిగిపోతోందని ప్రధానమంత్రి మోడీ ప్రకటిస్తూ కొత్తగా రూ.2000 నోటును ప్రవేశ పెట్టారు. కొత్త రూపుతో రూ.500 నోటును కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. మిగిలిన రూ.100, రూ.50, రూ.20 విలువ గల నోట్లని రద్దు చేయకుండా అవి చెలామణిలో ఉంచుతూ వాటి విలువతో కొత్త నోట్లని ప్రవేశపెడుతున్నట్లు ఆర్.బి.ఐ ప్రకటించింది. అయితే రద్దుచేసిన నోట్ల స్థానంలో అందుబాటులో ఉంచాల్సిన నోట్లకు మధ్య పొంతన లేకపోవడంతో అన్ని వ్యవస్థలూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.
గాంధీగిరి...
ప్రస్తుతం అమల్లో ఉన్న బ్యాంకింగ్ సీరిస్ నోట్లను మహాత్మాగాంధీ సీరిస్‌గా వ్యవహరిస్తున్నారు. 1996 నుంచి భారత కరెన్సీలోని అన్ని నోట్లపై మహాత్మ గాంధీని తప్పక ముద్రించాలనే ఆదేశాన్ని కేంద్రం ప్రభుత్వం అధికారికంగా జారీ చేయడంతో ఆర్.బి.ఐ దానిని అమలు చేస్తోంది. రూపాయి నోటును కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ జారీ చేస్తుంది. ప్రస్తుతం ఈ నోట్లు అంతగా చలామణిలో లేవు. మిగిలిన అన్ని నోట్లని, నాణేలనీ భారతీయ రిజర్వ్‌బ్యాంకు జారీ చేస్తుంది. ఆయా నోట్ల మీద ఆ నోటు విలువ 17 భారతీయ భాషల్లో ముద్రిస్తారు. నాణేలన్నిటినీ భారత ప్రభుత్వపు నాలుగు మింట్లలో ముద్రిస్తారు. నోట్లను నాసిక్, దేవాస్, సల్బోని, మైసూరు, హౌషంగాబాద్‌లలో ముద్రిస్తారు. నోట్లూ, నాణేలు వేరువేరు పరిమాణాలు, రంగుల్లో ఉంటాయి. చదువురానివారు, దష్టిలోపాలు కలవారు గుర్తించడానికి వీలుగాను, ఇతర భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.
సిత్రాలు.. అంతాలు
నాణేలు కేవలం వాణిజ్యపరమైన అవసరాల్లోనే కాదు. ఇతర ప్రయోజనాలకు కూడా కొన్ని సార్లు వినియోగించారు. ఇవి చరిత్రలో చిత్రాలు చేశాయి. చరిత్ర పుటల్లోకి మరోసారి తొంగిచూస్తే... బుద్ధునితోపాటు భిక్షువుల నివాసం కోసం సుదత్తుడు అనే వ్యాపారి శ్రావస్తి పరిసరాల్లో గల జేత రాజుకు చెందిన తోటని కొని కానుకగా ఇచ్చేందుకు ఆ మొత్తం విస్తీర్ణంలో ఎన్ని బంగారు నాణేలు పడతాయో అంత ధనం కోసం తన సర్వస్వాన్ని అర్పించాడు. ఆ కాలానికే బంగారు నాణేలు చెలామణిలో ఉన్నాయని, రాజ వంశీయులు కన్నా సమాజంలో వ్యాపారులు సంపన్నులుగా ఉండేవారని తెలుస్తోంది.
14వ శతాబ్దికి చెందిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ తన సామ్రాజ్యంలో అప్పటి వరకూ ఉన్న పాత నాణేల నగదు రద్దు చేసి కొత్త నగదును ప్రవేశపెట్టాడు. నిర్దిష్ట పరిమాణాల్లోని బంగారం, వెండికి అంతే విలువ కలిగిన రాగి, కంచు నాణేలు మారకం చేసుకోవడానికి తుగ్లక్ అనుమతించాడు. ఈ కొత్తనాణేలను 'టంకా'లని అనేవారు. ఈ టంకాలను రూపొందించడంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. నకిలీ టంకాలను నిరోధించడంలో తుగ్లక్ ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు. దీంతో మార్కెట్‌లో నకిలీ టంకాలు వెల్లువెత్తాయి. ప్రజలు రాగి, కంచుతో దొంగ నాణేలు తయారు చేసి ప్రభుత్వం నుంచి విలువైన బంగారం, వెండి నాణేలను తీసుకోసాగారు. తుగ్లక్ సామ్రాజ్యంలో ప్రతి గహమూ ఒక టంకశాలగా మారిపోయిందని ఆనాటి చరిత్రకారుడు ఒకరు రాశారు. అంతా అస్తవ్యస్తమై, టంకాలు రద్దు కాబడి ఆ తర్వాత దౌలతాబాద్ కోట బయట కుప్పలుగా పోశారని మరొకరు రాశారు.
మూడో ఘటన విజయనగర సామ్రాజ్య పతనానికి సంబంధించినది. 1565 జనవరి 23న రక్కసి తంగడి యుద్ధంలో దక్కన్ సుల్తానులు, ఆళియ రామరాయల పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి తన బంగారు నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. వారి దాడులతో సుల్తానుల కూటమి సైన్యం వెనక్కు కొంచెం తగ్గింది. ఎవరో ఆలోచనో కానీ మధ్యభాగంలోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం అంతా చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ ఏనుగు పరిగెత్తుకుంటూ రామరాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకీని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రామరాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించింది. హుసేన్ షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు. అలా విజయనగర సామ్రాజ్యం అంతమైంది.
ప్రమాణ పత్రాలే పెద్ద నోట్లు
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కరెన్సీ అంటే వాస్తవానికి రూపాయి నోటు మాత్రమే. మిగిలిన నోట్లన్నీ ప్రామిసరీ నోట్లు. రూపాయి నోటు వరకు కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. రూపాయి కరెన్సీ నోటు తప్ప మిగిలిన నోట్లకు ఆర్.బి.ఐ గవర్నర్ బాధ్యత వహిస్తారు. అందువలన ఈ నోట్లపై 'ఐ ప్రామిస్ టు పే' అన్న ప్రామిస్ తో గవర్నర్ సంతకం ఉంటుంది. రూపాయి నోటుపైన మాత్రం గవర్నర్ సంతకం ఉండదు. రూపాయి అనేది భారత దేశం యొక్క ప్రాథమిక కరెన్సీ. మిగిలిన డినామినేషన్‌తో కూడిన నోట్లన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క కరెన్సీ అధికారం తరపున ఆర్.బి.ఐ బాధ్యత వహిస్తూ ప్రామిసరీ నోట్లుగా జారీ చేస్తుంది. రూపాయి కరెన్సీ అయితే మిగిలిన నోట్లు దానికి ప్రతిబింబాలు అన్నమాట. ప్రామిసరీ నోటు ద్వారా దానిపై ఎంత అంకె ఉంటే అన్ని (రూపాయి) కరెన్సీ నోట్ల విలువ చెల్లిస్తున్నట్లుగా బేరర్‌కు ఆర్.బి.ఐ హామీ ఇస్తుంది. బ్యాంకులు జారీ చేసే డి.డిలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు, సావరిన్ బాండ్లు, బ్యాంకులు పోస్టాఫీసులు జారీ చేసే వివిధ బాండ్లు, ఫిక్సుడ్ డిపాజిట్ బాండ్లు, సెక్యూరిటీలు మొదలైనవన్నీ కూడా డబ్బుకు వివిధ రూపాలే. వీటన్నిటినీ కలిపి విస్త త అర్థంలో ద్రవ్యం అని అంటారు. డబ్బు అన్న పదాన్ని కరెన్సీని సూచించే అర్థంలో వాడుతారు. నాణేలు కూడా కరెన్సీయే. అవి ఆ విలువకు సమానమైన లోహంతో తయారు చేస్తారు. కనుక వాటి విలువ నిజమైనది. రూపాయికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించే కరెన్సీ కనుక అది లోహం కాకపోయినా తన విలువను వ్యక్తం చేస్తుంది.
పాలీమర్ నోట్లు..
నాటి రాజుల కాలం నుంచి వస్తున్న నాణేల స్థానాన్ని ఆక్రమించిన కాగితపు నోట్లను వెనక్కి నెట్టి వాటి స్థానంలోకి ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి. 2009లో ఇటు దొంగ నోట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతోపాటు అటు కాగితపు నోట్లతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నేందుకు ప్లాస్టిక్ కరెన్సీనే సరైందని ఆర్‌బిఐ భావించింది. ఈ క్రమంలోనే 2009 సెప్టెంబర్‌లోనే ఆర్‌బిఐ రూ.100 కోట్ల విలువైన రూ.10 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా ఓ గ్లోబల్ సంస్థకు టెండర్ ఇచ్చింది. తర్వాత ఏం జరిగిందో గానీ ఇప్పటి వరకూ ఇవి చెలామణిలోకి మాత్రం రాలేదు. భారత్‌లో ఇలా జరిగితే ఈ పాలీమర్ నోట్లు విదేశాల్లో మాత్రం ఏనాడో చలామణిలోకి వచ్చేశాయి. న్యూజిలాండ్, పపువా న్యూగినియా, రొమేనియా, బెర్ముడా, బ్రూనై, వియత్నాం వంటి దేశాలలో ఇప్పటికే విస్త తంగా వినియోగంలో ఉన్నాయి. సాధారణ నోట్లతో పోల్చితే ద్రవ్య మార్పిడికి అనుకూలంగా ఉంటుందనే ఆయా దేశాలు స్పష్టం చేస్తున్నాయి.
పాలీమర్ నోట్ల దశ దాటేసి ఇక డబ్బు డిజిటల్ రూపంలోకి మార్చేసే ప్లాస్టిక్ కార్డులు, కరెన్సీ ఇతర పద్ధతుల్లోకి మారే శకం రానుందని అంటున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా సాంకేతికతను సామాన్యుడికి చేర్చాలి. అంతే కానీ ప్రచారం కోసమో, ప్రయోగం కోసమో మనీతో ఆటలాడుకుంటే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదాలుంటాయి. సామాన్యుడి బతుకుకు పూరించలేని చిల్లు పడుతుంది. ద్రవ్యం అవసరం లేని సమాజం కోసం అభ్యుదయ శక్తులు ఆలోచిస్తుంటే ఇంకా మనీ మాయలోనే పడేసే ఎన్నో ప్రయోగాలు, కార్యక్రమాలు రకరకాల రంగులు మారుతున్నాయి.. రూపాల్లోకి చేరుతున్నాయి.
రూపాయి-చరిత్ర
జనపదాల కాలం తర్వాత తొలిగా అవిర్భవించిన మగధ సామ్రాజ్యం, తర్వాత వచ్చిన గుప్తులు, కుషానులు, పల్లవుల పరిపాలనా దక్షత, చోళుల వైభవం, నవాబుల విలాసం, మొఘల్ పాదుషాల పరిపాలన, క ష్ణదేవరాయల కీర్తి, ఆంగ్లేయుల రాజభక్తిని చాటేవి నాణేలే. ఇలా ఎన్నో రకాల చారిత్రక అంశాలకు ఇవి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మౌర్యుల కాలం నాటి నాణేలపై ఏనుగు, సూర్యుని బొమ్మలను ఎక్కువగా ముద్రించారు. వివిధ రాజుల కాలాల్లో విదేశీయులు ఇక్కడి ప్రజలతో విస్తృతమైన వ్యాపార సంబంధాలు కొనసాగించేవారని చెప్పడానికి ఎన్నో రకాల విదేశీ నాణేలు కూడా లభించాయి. కుషాణుల రాజు, కనిష్క వంశపు సామ్రాజ్యాధి పతులలో చివరివాడైన వాసుదేవుడు (క్రీ.శ. 202-233) ముద్రించిన నాణెం చూస్తే ఒక వైపున తన బొమ్మను, మరో వైపున 'ఓషో' అనే దేవత బొమ్మను వేయించాడు. సముద్ర గుప్తుని కాలం నాటి నాణేలపై గరుడ స్తంభపు బొమ్మలు, పడవల బొమ్మలు ముద్రించారు. శాతవాహన అనంతర కాలం నాటి ఉద్యోగ వర్గానికి చెందిన 'మహాతలవర', 'మహాసేనాపతి' అనే నాణేలు కోటిలింగాలలో లభించాయి. మగధ రాజ్యాన్ని మౌర్యుల తర్వాత శుంగులు, కాణ్వులు, తర్వాత అంధ్ర రాజులు వరుసగా పాలించారని ఈ నాణేలు స్పష్టం చేస్తున్నాయి. సుల్తానుల పాలనలో కూడా రకరకాల నాణేలు ముద్రించారు. మొఘల్ చక్రవర్తుల పాలనలో కూడా ఎన్నో రకాల నాణేలను ముద్రించారు. అవి ఇప్పటికీ ఆ కాలం నాటి చరిత్రని కళ్ల ముందుంచుతాయి. ఆంగ్లేయుల పాలన ప్రారంభం కాక ముందు నుంచీ ఈ దేశంలో వినియోగిస్తున్న 'రూపాయి' అనే నాణేన్ని తొలిసారిగా షేర్‌షా సూరి (1540-1545) ప్రవేశపెట్టాడు. ఆ రూపాయికి 40 రాగి నాణేల విలువ ఉండేది. ఆ తర్వాత కాలంలో ఇది రూపం, విలువ మారుతూ వచ్చింది. కానీ ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతోంది.
విశిష్ట నాణేలు
సాధారణ చెలామణి కోసం కాకుండా విభిన్నమైన సందర్భాలలో వివిధ వ్యక్తుల, సంస్థల గౌరవార్థం ఆర్.బి.ఐ. ప్రత్యేక నాణేలను ముద్రిస్తోంది. ఆర్‌బీఐ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గౌరవ సూచికంగా రూ.75 నాణాన్ని ముద్రించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా రూ.150 నాణాన్ని ముద్రించారు. తంజావూరులోని బ హదీశ్వరాలయాన్ని నిర్మించి వెయ్యేళ్లు పూర్తైనందుకు సూచికంగా వెయ్యి రూపాయల నాణాన్నీ ముద్రించారు.
- సమత
9493043888






కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి