6, డిసెంబర్ 2016, మంగళవారం

ఎడారి దారుల్లో విహ‌రిద్దాం


రాజస్థాన్‌.. ఈ పేరు వినగానే అందరికీ విశాలమైన ఎడారి గుర్తొస్తుంది. కానీ, ఆ ఎడారి దారుల్లో ఎన్నో పర్యాటక అందాలూ ఉంటాయి. అయితే, అక్కడి వాతావరణాన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే కానీ, అక్కడి విశేషాలు.. దాన్ని మరిపించేలా చేస్తాయి. అందుకే ఆ ఇసుకతిన్నల మాటున దాగివున్న చారిత్రక విశేషాలను ఈ వారం జర్నీలో తెలుసుకుందాం పదండి!!
 

గతేడాది అనుకోకుండా రాజస్థాన్‌ ఎడారిలో విహరించే అవకాశం దొరికింది. గతంలో రెండుసార్లు రాజస్థాన్‌ వెళ్ళినప్పటికీ, ఎడారి చూడలేకపోయాం. ఈసారి మౌంట్‌ అబూలో జరిగే మీడియా కాన్ఫరెన్స్‌కు పిలుపు రావడంతో నాతోపాటు మరికొందరు మిత్రులు అక్కడి ఎడారి ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించాం. థార్‌ ఎడారి దేశ వాయువ్య భాగంలో ఇండియా - పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ ఎడారి రాజస్థాన్‌లో ఎక్కువగా, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో కొద్దిగా విస్తరించి ఉంటుంది. దీనిని 'గ్రేట్‌ ఇండియన్‌ డెసర్ట్‌' అని పిలుస్తారు. చుట్టూ ఆరావళి పర్వతాలు, సట్లెజ్‌ నది, సింధూ నది, రాణాఫ్‌ కచ్‌లు సరిహద్దులుగా ఉన్నాయి. విస్తృతమైన జంతు, వృక్ష జాలంతో నిండి ఉన్న ఈ ఎడారిలో పర్యాటకులు ఆకట్టుకొనే ఎన్నో టూరిస్ట్‌ ప్రదేశాలు ఉన్నాయి. రాజస్థాన్‌ ప్రాంతంలో అభయారణ్యాలు, ఒయాసిస్సులు, అరుదైన పక్షులు ఉన్నాయని గైడ్‌ ద్వారా తెలుసుకున్నాం. మూడురోజుల కాన్ఫరెన్స్‌ చివరిరోజు ఎడారి చూడడానికి మౌంట్‌ అబూలో ఒక వాహనాన్ని తీసుకుని బయలుదేరాం.


జోద్‌పూర్‌
నీలి రంగు నివాసాలు, ఆహ్లాదకర వాతావరణం, అందమైన రాజ భవనాలు, చారిత్రాత్మక కోటలు అన్నీ కలగలిసిన సుందర నగరమే జోద్‌పూర్‌. ముందుకు అక్కడికే చేరుకున్నాం. రాచరికపు హంగులతో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది ఈ ప్రాంతం. నగర సందర్శనలో రాజస్థాన్‌ ఎడారిలోని ఆకర్షణీయ, ప్రసిద్ధ ప్రదేశాలు చూసినట్లే. ఈ ప్రదేశాల అందాలు ఆస్వాదించేందుకు వాస్తవానికి ఒకరోజు చాలదు. కానీ సమయం తక్కువగా ఉండడంతో ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్న ఉమైద్‌ భవన్‌ని సందర్శించాం. నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న 'చిత్తర్‌ హిల్‌' అనే కొండపై ఉండడంతో దీనిని చిత్తర్‌ పాలస్‌ అని కూడా అంటారు. చిత్తర్‌ ఇసుక రాయిని ఖరీదైన భవనాల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఈ పాలస్‌లో మూడు విభాగాలున్నాయి. అవి ఒకటి ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, రెండోది మ్యూజియం, మూడోది జోధపూర్‌ రాజ కుటుంబం నివసించే నివాసం. ఏ రకమైన సిమెంట్‌ వంటి బిల్డింగ్‌ మెటీరియల్‌ ఉపయోగించకుండా నిర్మించిన ఈ అరుదైన నిర్మాణ చాతుర్యం మమ్మల్ని మైమరిపించింది. ఈ రాష్ట్రంలోని కోటలలో అతి పెద్దదైన మేహరాన్‌ ఘర్‌ఫోర్ట్‌ ఈ నగరంలోనే 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట కాంప్లెక్స్‌లో అనేక పేలస్‌లు, ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. శీష మహల్‌, మోతీ మహల్‌, ఫూల్‌ మహల్‌, జానకి మహల్‌ వంటివి ఇక్కడ చూడొచ్చు. ఉమైద్‌ భవన్‌ పాలస్‌ జస్వంత్‌ తాడ మేహ్రాన్‌ ఘర్‌ఫోర్ట్‌ నుంచి ఒక కి.మీ. దూరంలో ఉంది. ఇది జోద్‌పూర్‌ 33వ పాలకుడైన మహారాజ జస్వంత్‌సింగ్‌ 2కి స్మారకంగా ఉన్న ఒక అందమైన మార్బుల్‌ స్తూపం. ఈ స్తూపాన్ని ఆయన కుమారుడు నిర్మించాడు. ఈ నిర్మాణంలో అనేక నగిషీలు, చెక్కడాలు ఉండటం చే దీనిని 'మార్వార్‌ తాజ్‌ మహల్‌' అని కూడా పిలుస్తారు. ప్రధాన నిర్మాణం ఒక ఆలయాన్ని పోలి వుంటుంది. జోద్‌పూర్‌లో మరొక ఆకర్షణ మందోర్‌ గార్డెన్‌ మందోర్‌ . ఈ గార్డెన్‌లో జోద్‌పూర్‌ రాజుల జ్ఞాపకార్థ్ధం చేసిన అనేక నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. గార్డెన్‌లోని ఒక కొండపై నుంచి చూసిన మాకు మందోర్‌ నగర పురాతన అవశేషాలు, రాణులకు కట్టిన స్మారక చిహ్నాలు కన్పించాయి.


ఉదయపూర్‌
ఆ తర్వాత ఉదయపూర్‌ చేరుకున్నాం. మౌంట్‌ అబూనుంచి నేరుగా ఉదయపూర్‌ వాహన సౌకర్యాలు పుష్కలంగా ఉంటాయి. అక్కడ కూడా చాలా పర్యాటక ప్రదేశాలు సందర్శించాం. వాటిలో సిటీ పేలస్‌, జగ్‌ మందిర్‌, రాణాప్రతాప్‌ సింగ్‌ సమాధి స్థలం, సహేలియోంకిబారి అనే రాజోద్యానవనం, అందులో దూత్‌తాలై అనే రాక్‌ ఫౌంటెన్‌, పతేసాగర్‌, పిచోలా సరస్సులు, ఆసియాలోనే ఏకైక సోలార్‌ అబ్జర్వేటరీ ఫతేసాగర్‌ సరస్సు మధ్యలోగల ద్వీపంలో ఉంది. దానిని కూడా చూశాం.


క్యాంప్‌ఫైర్‌ నృత్యాలు
ఎడారిలోని గ్రామాల సంస్కృతి ఉట్టిపడేలా కనిపించే క్యాంప్‌ఫైర్‌ నృత్యాల్లో ఎంతో ఆస్వాదించాం. గిరిజనులు చేసే సంప్రదాయ, జానపద నృత్యం థార్‌ ఎడారికే ప్రత్యేక ఆకర్షణ. రాత్రి క్యాంపు ఫైర్‌లో వారు చేసే నత్యం ఎంతో ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి ఈ నృత్యం చేస్తారు. థార్‌ ఎడారిలో వివిధ జాతుల గిరిజనులు సమీప గ్రామాలలో నివశిస్తున్నారు. అందులో బిష్ణోరు గ్రామం బాగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడున్న స్థానికులు వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని పరిరక్షించడం వారి బాధ్యతగా భావిస్తారు.
ఎలా వెళ్లాలి?
రాజస్థాన్‌ రాష్ట్రానికి వెళ్లే ప్రతీ ట్రైన్‌, బస్సు ద్వారా ఈ ఎడారి ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఏఏ ప్రాంతాలను సందర్శించాలన్న దానిని అనుసరించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. బస చేయడానికి జోధ్‌పూర్‌, ఉదరుపూర్‌, జైసల్మీర్‌ వంటి నగరాల్లో హోటళ్లు అందుబాటులో ఉన్నాయి.


ఒంటెల సఫారీ
థార్‌ ఎడారిలో ఒంటెలపై, జీప్‌పై ఇలా రెండు రకాలుగా సఫారీ చేయొచ్చు. జీప్‌ సఫారీ ఒంటె సఫారీలా ప్రజాదరణ పొందలేదు. ఎందుకంటే, ఒంటె సఫారీ ఎడారి అందాల్ని నిదానంగా చూపిస్తుంది. జైసల్మీర్‌ నగరంలో ఈ సఫారీ మరిచిపోలేని అనుభూతినిచ్చింది.


అరుదైన జీవజాతులు
థార్‌ఎడారి ఎన్నో అరుదైన జీవజాతులకు ఆవాసంగా నిలుస్తుంది. అయితే, ఈ ఎడారిలో పార్క్‌లు, అభయారణ్యాలు 11 వరకూ ఉన్నాయని తెలిసినా అన్నీ చూడడానికి వీలుకాలేదు. ముళ్ళు కలిగిన చెట్లు, మొక్కలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు ఔషధ మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు భలే కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతంలో వలస పక్షులు, ప్రాంతీయ పక్షులు చాలా రకాల జాతులున్నాయి. ఇక్కడ గ్రద్దలు, రాబందులు, హర్రియర్లు, ఫాల్కన్లు, బుజ్జార్డులు, కెస్ట్రల వంటి పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. జింకలు, చింకారా, అడవి గాడిద, పాములు, ఎర్ర నక్కలు, తోడేళ్ళు వంటి జంతువులు అక్కడక్కడా మా వాహన ప్రయాణంలో ఎదురుపడ్డాయి. ఇక్కడ ప్రత్యేకమైన ఆహారాన్ని మనం తినొచ్చు. దీనిని 'కెర్‌ సాంగ్రి' అంటారు. ఈ స్పెషల్‌ డిష్‌. ధర ప్లేట్‌ 150 రూపాయలు ఉంటుంది. పుల్లపుల్లగా, కారంకారంగా దీని రుచి ఉంటుంది.

కొన్ని జాగ్రత్తలు
థార్‌ ఎడారి ప్రపంచములోనే 18వ అతిపెద్ద ఎడారి. దీని విస్తీర్ణం రెండు లక్షల చదరపు కిలోమీటర్లు. రాజస్థాన్‌ రాష్ట్రంలో 40 శాతం జనాభా ఈ ఎడారి ప్రాంతంలోనే ఉంది. అలాంటి ప్రాంతంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముందుగా రూట్‌మ్యాప్‌ని రూపొందించుకోవాలి. లేకుంటే తప్పిపోయే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫోన్‌ సిగల్స్‌ కూడా ఉండవు. వేసవి కాలంలో సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పైగా ఉంటుంది, చలికాలంలో 7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంత పర్యాటకం ప్రమాదకరం.
- బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి