30, డిసెంబర్ 2016, శుక్రవారం

వంశ‌ధార తీరాన సైక‌త సందేశం

ఏ కళ అయినా కేవలం జీవనోపాధికి మాత్రమే పరిమితం కాకూడదు. దానికి విస్తృత సామాజిక ప్రయోజనం ఉండాలి. అతడు తన జీవికకూ, ఆశయానికీ సైకత శిల్పాలను సృజించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అందుకు వంశధార నదీ తీరాన్నే వేదికగా చేసుకున్నాడు. అలా పుష్కర కాలంగా మొదలైన అతని సైకత శిల్పకళా నైపుణ్యం దేశంలోనే పేరెన్నికగన్న కళాకారుల్లో ఒకరిగా నిలిపింది. అతనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైకత శిల్ప కళాకారుడు తరణీ ప్రసాద్‌ మిశ్రో. సైకత శిల్పకళలో మిశ్రో 'జీవన' ప్రస్థానం ఆయన మాటల్లోనే..
 
రాష్ట్రానికి ఈ కొసనున్న శ్రీకాకుళం జిల్లాలోని లక్ష్మీనర్సుపేట మా ఊరు. నేను సైకత శిల్ప కళాకారుడిగా ఎదగడం ఒక్కరోజులో జరిగేపనీ కాదు. కుటుంబపరంగా ఎన్నో కష్టాల్ని అధిగమించి, నాదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ జీవన సమరం చేస్తున్నాను. కళని ఒక సాధనంగా మలచుకుని, ముందుకు కొనసాగుతున్నాను.
మాది అతి సాధారణమైన కుటుంబం. సైన్స్‌ గ్రూపుతో 1997లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినా.. ఆర్థిక ఇబ్బందులతో ఆపై చదవలేకపోయా. నాన్న కాశీవిశ్వనాథ్‌కు మానసిక ఆరోగ్యం బాగోదు. దాంతో ఆయన చికిత్సకే ఉన్న నాలుగెకరాలూ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పటికి వయస్సులో చిన్నవాడినైనా తప్పనిసరై, ఉద్యోగాల వేటలో పడ్డాను. ఉద్యోగం రాలేదు. ఓవైపు నాన్న అనారోగ్యం, మరోవైపు కుటుంబపోషణ ఓ సవాల్‌గా మారాయి. అప్పటికే చిత్రలేఖనంలో కొంత ప్రవేశం ఉన్నా, దానివల్ల పెద్దగా లాభం లేకపోయింది. చేసేది లేక ఉపాధి కోసం విశాఖకి వలసపోయాను. అక్కడే ఆటోమొబైల్‌ గ్యారేజ్‌లో పెయింటర్‌గా మొదట జీవితాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కాంట్రాక్టర్‌ దగ్గర వెల్డర్‌గా కొంతకాలం పనిచేశాను. ఎంత కష్టపడినా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దాంతో కష్టాలూ ఎటూ తప్పవని అర్థమై, తిరిగి 2004లో సొంతూరుకు వచ్చేశాను. స్థానికంగా ఒక డ్రాయింగ్‌ టీచర్‌ దగ్గర చిత్రలేఖనంలో మెలకువలు తెలుసుకున్నా. బ్యానర్లు రాసుకుంటూ, పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడిని.

పూరీలో మలుపు తిరిగింది
పక్కనే ఉన్న ఒడిసా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ యాత్రకు మా కుటుంబసభ్యులతో కలసి వెళ్లా. అక్కడ సముద్రతీరంలో ఒక దృశ్యం నన్ను ఆకర్షించింది. అది ఒక మహిళ సైకత శిల్పం. అది నాకు ఎంతో ప్రేరణ కలిగించింది. అప్పుడే నేనూ సైకత శిల్పాలు రూపొందించాలనే నిర్ణయానికొచ్చాను. ఊరికి తిరిగొచ్చాక వంశధార నదీ తీరాన్ని అభ్యాసానకి వేదికగా చేసుకున్నాను. కొన్నినెలలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాకు నేనే గురువుగా భావించుకున్నా. నా ఊహలకు, ఆలోచనలకు రూపాల్ని ఇచ్చేవాడిని. అలా ఏకాగ్రతతో నేను చేసిన సాధన ఫలితమే నన్నీరోజు ఓ సైకత శిల్పికారుడిగా తీర్చిదిద్దింది. బ్రెజిల్‌ దేశానికి చెందిన సైకత శిల్పి అండ్రియన్‌ వజస్కీ కృషిని మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఆయన గురించి వివరాలు సేకరించి, కొత్త అధ్యయనం చేశాను. వివిధ దేశాల్లోని సైకత శిల్పాలపై ఇంటర్నెట్‌ సాయంతో పరిశీలన చేశాను. వాటిని భారతీయ సంస్కృతికి అన్వయిస్తూ, విభిన్నమైన శైలితో రూపకల్పన చేయాలని అనుకున్నా. ఆ క్రమంలో అలాంటి సైకత శిల్పిగా గుర్తింపునూ పొందాను.

కుటుంబ ప్రోత్సాహంతో
నా కళను అన్ని వేళలా కుటుంబసభ్యులు ప్రోత్సాహించడం జరుగుతోంది. ఈ కళతో కొంత ఆదాయం రావడం వల్ల డిగ్రీ పూర్తిచేశాను. నాన్న మరణించారు. ప్రస్తుతం నా కుటుంబం అమ్మ వసంతకుమారి, భార్య భారతి, ఇద్దరు పిల్లలు. వీరిని పోషించడమే నా ప్రధాన కర్తవ్యం. అందుకు ఈ కళే నాకు ప్రధానమైన ఉపాధి కూడా. కేవలం మా గ్రామం దగ్గరున్న నదీతీరమే నా సైకత శిల్పాలకు పరిమితం కాదు. జనావాసాల్లోనూ సైకత శిల్పాలు రూపొందిస్తుంటాను. పలుచోట్ల పెళ్లిళ్లు, వివిధ కంపెనీలు, సంస్థల ప్రమోటింగ్‌ ఈవెంట్లకూ లోగోలు, సృజనాత్మకమైన సైకత శిల్పాల్ని రూపొందింస్తుంటాను. సామాజికాంశాలతో ఉన్న వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి ప్రదర్శనలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక రోజుల్నీ శిల్పాలుగా మలుస్తాను. అవి నాకు ప్రముఖ గుర్తింపునూ తెచ్చిపెట్టాయి.

కళాత్మక విలువలతో
సైకత శిల్పాల్ని కొంతమంది ఔత్సాహికులు తయారుచేస్తున్నారు. అయితే కళాత్మక విలువలు కలిగిన వాటికే మంచి గుర్తింపు. ఒక్కో సైకత శిల్పం తయారీకి దాని పరిమాణాన్ని, విన్యాసాల్ని అనుసరించి నాలుగు గంటల నుంచి 36 గంటల వరకూ సమయం పడుతుంది. అతి తక్కువ సంభావ్యత గల వాలు తలంలో శిల్పాన్ని రూపొందించాలి. అవసరమైన చోట చిన్న చిన్న రంధ్రాలు కూడా చేస్తాను. శిల్పం కంటే వర్ణానికి ప్రాముఖ్యత ఉన్నచోట మాత్రమే రంగులు వాడతాను. ఈ సైకత శిల్పాన్ని భద్రంగా కాపాడగలిగితే ఎనిమిది రోజుల వరకూ అలానే ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటివి 400కి పైనే రూపొందించాను.

సందేశాలిచ్చే శిల్పాలు
ఏ ఊరు వెళ్లినా ఆ ఊరిలోని ప్రధానమైన సామాజిక రుగ్మత ఏదో గుర్తిస్తాను. దాని నుంచి బయటపడడానికి, అక్కడివారు చైతన్యం పొందేలా సందేశాలు రాస్తూ, సైకత శిల్పాన్ని రూపొందించడం నాకున్న ఒక అలవాటు. నూతన సంవత్సరం, రిపబ్లిక్‌ డే, ఉగాది, మహిళా దినోత్సవం, సంక్రాంతి, దసరా, దీపావళి, అక్షరాస్యతా దినోత్సవం, ఆగస్టు పదిహేను, కొత్త సంవత్సరాది వేడుకలు ఇలా ఏ సందర్భం వచ్చినా వెంటనే స్పందించి దాని సందేశాన్ని సైకత శిల్పం ద్వారా ప్రజలకు వివరిస్తాన. క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ గతంలో 200 పరుగుల నాటౌట్‌ రికార్డును సాధించిన సందర్భంలోనూ సైకత శిల్పం ద్వారా ప్రజలకు తెలియజేశాను. అది అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా రూపొందించిన సైకత శిల్పమూ ఎంతగానో ఆలోచింపజేసింది.

అక్షరాస్యతా ఉద్యమం, వయోజన విద్య, సంక్షేమ పథకాలు, బహుళార్థక ప్రాజెక్టులు, వందేమాతరం, వివిధ రకాల దేవుళ్ల సైకత శిల్పాలు, గాంధీ, అబ్దుల్‌ కలామ్‌ తదితర ప్రముఖులు... ఇలా నేను రూపొందించిన సైకత శిల్పాలు వంశధార నదీ తీరానికి వచ్చే సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టునేవి. ఈ సైకత శిల్పాల్ని చూసేందుకు ఒడిసా, ఉత్తరాంధ్ర జిల్లాల నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో వివాహాలు, ఇతర శుభ కార్యాలకు వివిధ వర్గాల వారు ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి, సందర్భానికి తగిన విధంగా అక్కడికక్కడే సైకత శిల్పాల్ని తయారు చేయించుకుంటుంటారు. దీనివల్ల నాకు ఆర్థికంగా ప్రయోజనం కలగడమే కాకుండా, వ్యక్తిగతంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో
ఢిల్లీలోని 'కింగ్‌డమ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌' పేరుతో ఉన్న థీమ్‌ పార్కులో మూడు సైకత శిల్పాల్ని ఏర్పాటు చేయడానికి ఆరేళ్ల కిందట పార్క్‌ నిర్వాహకులు నాతో ఒప్పందం చేసుకుని రూ.25 వేలు పారితోషికంగా ఇచ్చారు. అప్పటి నుంచీ అవసరమైనవారికి వారు కోరిన విధంగా సైకత శిల్పాల్ని రూపొందించి, అందిస్తుండడంతో జాతీయ స్థాయిలోనూ నా శిల్పాలకు మంచి గుర్తింపు లభిస్తోంది. దేశంలో న్యూ ఢిల్లీ, ముంబయి, పూనె, గోవా, హైదరాబాద్‌, అలంపూర్‌, పర్లాకిమిడి, మన ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల సైకత శిల్పాలను రూపొందించాను. సైకత శిల్పాల ప్రదర్శనలు కూడా నిర్వహించాను.


వారం ఉంటే గొప్పే
                           - తరణీ ప్రసాద్‌ మిశ్రో
సైకత శిల్పాల జీవితకాలం చాలా తక్కువ అయినప్పటికీ ఎంతో శ్రద్ధతో రూపొందించాలి. తగిన విధమైన ఇసుక, తేమ వంటివి అనుకూలంగా లేకపోతే వీటిని రూపొందించడం కష్టమే. అంతేకాదు వారం వ్యవధి దాటి అవి అలాగే ఉంటే, ఎంతో గొప్ప విషయం. నీటి ప్రవాహం వల్ల, తీవ్రమైన ఎండ వల్ల, పిల్లలు తొక్కి పాడుచేయడం వల్ల రూపురేఖలు మారి, మళ్లీ ఇసుకలో కలిసిపోతాయి. అప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది. కానీ తప్పదు. ఈ కళే మా కుటుంబానికి ఉపాధిని అందిస్తోంది.

                                                                                                                    ----- బెందాళం క్రిష్ణారావు
 

24, డిసెంబర్ 2016, శనివారం

నులక మంచంపై దాబా రుచులు



కాస్తంత ఊరికి దూరంగా.. కాసేపు అలా కారులోనో.. బస్సులోనో.. ఆటోలోనో లేదంటే బైక్‌పైనో ఫ్యామిలీతో నేషనల్‌ హైవే మీదుగా ప్రయాణం చేశాక.. నులక మంచం మీద బాసింపట్టు వేసుకుని చపాతీనో, పరాటానో తింటే ఎలా ఉంటుంది..? ''ఎందుకు బాగుండదూ.. చాలా చాలా బావుంటుంది'' అనేగా మీ మాట. రోటీన్‌కి భిన్నంగా ఏ వారంతంలోనో అలా గడపాలని అనుకునేవాళ్ళకు ఇప్పుడు 'దాబా'లు చక్కటి వేదికలు అవుతున్నాయి. ఒకప్పుడు రవాణా రంగంలో పనిచేసేవారికి మాత్రమే అన్నట్టుగా ఉండే దాబాలు ఇప్పుడు సామాన్యజనాల్నీ తనవైపుకి తిప్పుకునేలా చేస్తున్నాయి. ఇడ్లీ, ఉప్మా పెసరట్టు మొదలుకుని.. థమ్‌ బిర్యానీ, చికెన్‌ జాయింట్ల వరకూ.. ఎన్నో వెరైటీ రుచులకు, ఆటవిడుపు సాయంత్రాలకు దాబాలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి.

బాటసారులకు భోజన, విశ్రాంతి సదుపాయాలు కల్పించడానికి ఒకప్పుడు పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. ప్రస్తుతకాలంలో ఆధునిక పూటకూళ్ల ఇళ్లుగా దారిపక్కన దాబాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆధునికతను సంతరించుకుంటూ సరికొత్త రుచుల సమ్మేళనంతో దాబాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు దాబాలలో తినడానికి లారీలు, ట్రక్కుల డ్రైవర్లే ఎక్కువగా కన్పించేవారు. కానీ రోజులు మారాయి. కుటుంబాలతో సహా దాబాలకు వెళ్లి తినడం కొత్త ట్రెండ్‌గా తయారైంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుండంతో కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రధానమార్గంలో భోజన ప్రియుల్ని ఆకర్షిస్తున్న దాబాలు అనేకం.

ఉత్తరాది నుంచి
ఒకప్పుడు ఏదో వందో, ఏభైౖ కిలోమీటర్ల దూరంలో అదీ జాతీయ రహదార్ల పక్కన మాత్రమే దాబాలు ఉండేవి. జాతీయ రహదారిపై సుదూర ప్రాంతాలకు రేయింబవళ్ళు తిరిగే వాహనాల సిబ్బంది ఆకలి తీర్చేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడేవి. మొదట్లో పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు ఇటువంటి హోటళ్లను ప్రారంభించేవారు. ఉత్తరాది ప్రజల స్థానిక భాషలో వీటిని 'దాబాలు' అని పిలిచేవారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరే వీటికి స్థిరపడిపోయింది. అప్పట్లో పంజాబీలు ఎంతో ఇష్టంగా తినే రోటీలు, పుల్కాలు వంటివి, వాటికి కాంబినేషన్‌గా తడకా, రకరకాల కుర్మాలు లభించేవి. రాను రానూ తందూరీ వంటకాలు, బిర్యానీ, ఫ్రైడ్‌రైస్‌ వంటివి కూడా దాబాల్లో రాజ్యమేలుతున్నాయి.

పెరుగుతున్న ఆదరణ
వివిధ రాష్ట్రాల ప్రజల ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా దాబాల్లో వంటకాలు తయారీ జరుగుతున్నాయి. దాంతో వాటిని ఆస్వాదించడానికి వచ్చే స్థానిక, స్థానికేతర ప్రజలతో అవి కళకళలాడుతున్నాయి. పగటి సమయాల్లో కన్నా సాయంత్రం నుంచీ రాత్రి పది, పదకొండు గంటల వరకూ నిత్యం రద్దీగా కన్పిస్తున్నాయి. అందులోనూ కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి, పనిచేసేవారికి దాబాల్లో లభించే ఫుడ్‌ అనుకూలంగా ఉంటోంది.
కుటుంబ సమేతంగా
ఇటీవలి కాలంలో సకుటుంబ సమేతంగా ఈ దాబాలకు రావడం పెరుగుతోంది. స్టార్‌ హోటళ్లలో మాత్రమే లభించే వెరైటీఫుడ్‌ కూడా తమ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉండడం వల్ల చాలామంది దాబాలకు రావడానికి ఇష్టపడుతున్నారు. సాయంత్రమైతే చాలు ఎక్కువ మంది తమ టూవీలర్లు, కార్లపై దాబాలకు చేరుకుంటున్నారు. దీంతో దాబాల దగ్గర వాహనాల పార్కింగ్‌ సదుపాయాలను కూడా దాబాల నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. కావాల్సినంత సమయం దాబాల దగ్గర గడపడానికి అవకాశం ఉండడం వల్ల పిల్లలు, పెద్దలు, స్నేహబృందాలు ఇలా అన్నివర్గాలవారూ దాబాలలో గడపడానికి ఇష్టపడుతున్నారు.

వెరైటీ రుచుల కోసం
పంజాబీల ప్రత్యేక వంటకాలైన సర్సన్‌ కా సాగ్‌ అండ్‌ మక్కీ ది రోటీ, తందూరి కుక్కడ్‌, పిండీ చోలే, కడీ పకోడి, పన్నీర్‌ మఖనీ, ఇమ్మర్తీ, ఫిర్నీ, కేసర్‌ కుల్ఫీ, బటర్‌ చికెన్‌, ఆలూ ద ప్రంత, రాజ్మా చావల్‌ వంటి వెరైటీ ఫుడ్‌ దాబాల్లోనో తినగలం. అంతేకాదు నూనె లేకుండా కాల్చే తందూరీ రోటీతో పనీర్‌ బట్టర్‌ మసాలానో, జింజర్‌ చికెనో నంజుకోవడంలో ఉన్న మజా దేనిలోనూ ఉండదు. అదేవిధంగా కబాబ్స్‌, టిక్కాలు ఇలా ఒకటేమిటి తందూరీ ఐటెమ్స్‌ రుచే వేరు. తందూరీ చికెన్‌, తందూరీ మటన్‌, ఫిష్‌ తందూరీ, తందూరీ ఫ్రాన్స్‌, వెజిటేరియన్‌ వెరైటీలు...ఇలా రకరకాల వంటకాలు మంచి సువాసనతో ఘుమఘుమలాడిస్తూ నోరూరిస్తుంటాయి.
విస్తరిస్తున్న దాబాలు
దాబాలకు ఆహారరీత్యా పెరుగుతున్న డిమాండ్‌ చూసి, చాలా మంది ఈ వ్యాపార రంగంలోకి వస్తున్నారు. రహదారి పక్కన కాకుండా పట్టణ, నగరాల మధ్యన, శివారు ప్రాంతాల్లో కూడా వీరు దాబాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి రహదార్ల పక్కనున్న దాబాలకు కాస్తా భిన్నంగా ఉంటున్నాయి. రహదార్ల పక్కనున్న దాబాల్లో నులక మంచాలే భోజన టేబుళ్లుగా ఉంటే ఈ దాబాల్లో మాత్రం హోటళ్ల మాదిరిగా కుర్చీలు, ప్లాస్టిక్‌, టైల్స్‌తో తయారుచేసిన డైనింగ్‌ టేబుళ్లు ఉంటున్నాయి. ఆ దాబాల్లో అయితే భోజనానంతరం ఆయా వాహనాల సిబ్బంది కొంత సొమ్ము చెల్లించి, అక్కడే మంచాలపై ఆరాత్రి విశ్రాంతి తీసుకునే వీలుంది.

పండుగలు.. పార్టీలు
పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలను స్నేహితులు, సన్నిహితుల మధ్య జరుపుకోవడానికి చాలా మంది హోటళ్లను వేదికలుగా ఎంచుకుంటూ ఉంటారు. ఇటువంటివారు పట్టణాల్లోని హోటళ్ల కన్నా, దరిదాపుల్లో ఉన్న దాబాల్లో జరుపుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పట్టణాల్లోని హోటళ్లలోనైతే ఇలాంటివి జరుపుకోవడానికి అదనంగా సొమ్ము చెల్లించాలి. అదే దాబాల్లో అయితే అలాంటి ఖర్చులేమీ ఉండవు.
దాబాకి మరోవైపు
నాణేనికి మరోకోణం ఉన్నట్టుగానే కొన్ని దాబాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. చాలా దాబాలు బార్లని తలపిస్తూ మద్యం తాగేవారికి ఇవి అడ్డాలుగా మారుతున్నాయి. వీరి వలన చికెన్‌, మటన్‌ వంటి ఐటెమ్స్‌ కూడా బాగా అమ్ముడవుతాయని దాబా నిర్వాహకులు కూడా మందుబాబుల్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యభిచారం, జూదం వంటి కార్యకాలపాలు కూడా కొన్ని దాబాల్లో కొనసాగుతున్నాయనేది మరో ఆరోపణ. ఆహారం నాణ్యత పాటించని దాబాలూ ఉన్నారు. ఇలాంటి వాటిని సంబంధిత అధికారులు నివారించగలిగితే దాబాలు చక్కటి విందు, కాలక్షేపపు కేంద్రాలుగా ప్రజల ఆదరాభిమానాలను పొందగలవు.


నచ్చిన వంటలు
నాతో పాటు 20 మంది వరకూ ఒడిసాలోని బాలాసోర్‌ నుంచి వచ్చి, ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రజల ఆదరణ బాగుంది. తినేవారి అభిరుచులను బట్టి వారికి నచ్చినట్లు వంటలు చేసి, అందించడమే మా పని.
- ముస్సా బెహరా, వంటమాస్టర్‌.

ఆదరణ పెరిగింది
గత ఏడేళ్ల నుంచీ ఈ దాబాను నిర్వహిస్తున్నాను. అన్ని వర్గాల వారూ దాబాలకు వస్తున్నారు. మా దాబాలో అయితే కేవలం శాఖాహారానికే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తుండడంతో ఇటీవల కాలంలో దాబాలకు వచ్చేవారి సంఖ్య పెరిగింది.
- ప్రేమ్‌ కుమార్‌, డిలైట్‌ దాబా యజమాని, గుంటూరు హైవే
మంచి ఆహారం లభిస్తుంది
ఎప్పుడు డిన్నర్‌కు రావాలన్నా నేను దాబానే ప్రిఫర్‌ చేస్తా. విజయవాడ-గుంటూరు హైవేలో మంచి దాబాలున్నాయి. స్టార్‌ హోటళ్లకు దాబాలు ఏ మాత్రం తీసిపోవు. నచ్చిన రుచుల్లో కావాల్సిన ఆహారపదార్థాలెన్నో ఇక్కడ లభిస్తున్నాయి.
- ఎస్‌. సందీప్‌,
                                                                                            - బెందాళం క్రిష్ణారావు

ర‌మ‌ణీయ సంగీతం



ఏదైనా కళలో రాణించాలంటే కచ్ఛితంగా రోజుకి నాలుగు గంటలు నిరంతరాయంగా కష్టపడాలి. అదే.. ఆ కళలో నిష్ణాతులు కావాలంటే కనీసంగా ఎనిమిది గంటలైనా సాధన చేయాలి. అలా చేస్తేనే ఏ కళైనా అబ్బేది. అంతో ఇంతో వంటబట్టేది. ప్రపంచ కళాసాధకులంతా అలా కష్టపడి ఎదిగినవారే. అలాంటిది రెండు విభిన్నమైన కళల్లో సమర్ధనీయమైన ప్రవేశం ఉండటం మాటలు కాదు. అందునా సశాస్త్రీయమైన సంగీతంలోనూ, వాయులీన నాదంలోనూ సరిసమాన ప్రతిభ దక్కాలంటే ఎంతో సాధన కావాలి. అలాంటి సాధనకు ప్రతిరూపమే విశాఖపట్నానికి చెందిన సంగీత కళాకారిణి డాక్టర్‌ పంతుల రమ. మూడున్నర దశాబ్దాలకుపైగా దేశ, విదేశాల్లో సంగీత రంగంలో రాణిస్తున్న కళాకారిణి రమ సంగీత ప్రస్థానం 'జీవన' పాఠకుల కోసం.

విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ పంతుల రమ అంటే తెలుగునాట శాస్త్రీయ సంగీతంలో మంచి పేరున్న కళాకారిణి. అంతేకాదు, దేశ, విదేశాల్లోనూ అనేక కచేరీలు చేసి సంగీతజ్ఞుల మన్ననలు పొందుతున్నారు. ఎనిమిదో యేట తొలి సంగీత కచేరీతో ప్రారంభమై, మూడు దశాబ్దాలకు పైగా సంగీత రంగంలో రసజ్ఞులను తన గాన మాధుర్యంతో, వాయిలీన విన్యాసంలో అలరిస్తూనే ఉన్నారు.

సంగీత కుటుంబం
రమ తల్లిదండ్రులు కూడా సంగీత కళాకారులు కావడం వల్ల పసితనం నుంచే సంగీత స్వరాలతో పరిచయం ఏర్పడింది. తండ్రి పంతుల గోపాలరావు స్వస్థలం విజయనగరం. తల్లి పద్మావతి వీణా విద్వాంసురాలు. గోపాలరావు ఆల్‌ ఇండియా రేడియోలో ఇంజనీర్‌గా పనిచేశారు. ఉద్యోగరీత్యా గోపాలరావు కుటుంబం కాలికట్‌, రాంచీ, కటక్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా తల్లిదండ్రులిద్దరూ రమకు తగిన సంగీత శిక్షణ ఇచ్చారు. అప్పటికే గోపాలరావు ''సంగీత సాగర'' బిరుదు పొందిన వాయులీన విద్వాంసుడు ఇవటూరి విజయేశ్వరరావు వద్ద సంగీతంలో ఎన్నో మెళకువలు నేర్చుకుని ఉన్నారు. ఆమెను కూడా ఇవటూరి విజయేశ్వరరావు వద్ద ఉంచి, గురుకుల శిక్షణ ఇప్పించారు. అలా నడక నేర్చుకునే వయసులోనే సంగీత శిక్షణ పొందిన పంతుల రమ తన ఎనిమిదో యేటనే తొలి సంగీత కచేరి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో బి.ఎ., ఎం.ఎ. డిగ్రీలను అందుకున్నారు. గాత్ర సంగీతంలో రమను ఆకాశవాణి 'ఎ-టాప్‌ గ్రేడ్‌' ఇచ్చి ఆమె ప్రతిభను గుర్తించింది. గాత్రంతో పాటుగా వాయులీన, వయోలా వాయిద్యాలలో 'బి-హై' గ్రేడ్‌ని ఆమె సాధించారు. అనంతరం ''సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం'' అన్న అంశంపై పరిశోధనతో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. ఆంగ్ల భాషలో ఉన్న ఈ ప్రామాణిక పరిశోధన గ్రంథాన్ని న్యూఢిల్లీలోని జ్ఞాన్‌ పబ్లిషర్స్‌ ప్రచురించింది. సంగీతంతోపాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కూడా రమ డిప్లమో పొందడం మరో విశేషం.


గాత్రం.. వాయులీనం
పంతుల రమ సంగీత కళాప్రదర్శనలు కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈమె దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంపై జరిగిన ఎన్నో సెమినార్లలో కూడా ఆమె పాల్గొన్నారు. ''శ్యామశాస్త్రి సంగీత గొప్పదనం'' , ''కర్ణాటక సంగీత సాధన'' , ''రాగం-తానం-పల్లవి'' వంటి అంశాలపై సంగీత ఉపన్యాసాలిచ్చారు. రమ భర్త ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరుగా ఉన్నప్పటికీ ఈయన కూడా సంగీత విద్వాంసుడు కావడం మరో విశేషం. వాయులీనపై పలు రాగాలను పలికించడంలో ఆయన సంగీత ప్రపంచంలో ఎంతోమంది ప్రశంసలందుకున్నారు. సంగీత క్షేత్రంలో దంపతులిద్దరూ అగ్రశ్రేణి కళాకారులు కావడమన్నది ఎంతో అరుదైన విషయం. ఆ అవకాశం ఈ దంపతులకు దక్కింది. నిరంతర సంగీత సాధనకు, కచ్చేరీలకూ వీలుకల్గింది. రాగం తానం పల్లవి విద్యలోనూ, స్వరకల్పనలోనూ తన మధుర కంఠస్వరంతో సంగీత సభను రక్తి కట్టించడంలో పంతుల రమ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె తన భర్తతో కలిసీ, విడిగానూ దేశవిదేశాలకు వెళ్లి, తమ సంగీత విద్యను ప్రదర్శించారు. సింగపూర్‌, థారులాండ్‌, అమెరికా వంటి అనేక దేశాలలో రమ కచ్చేరీలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంగీత సభలలో ఆమె కచ్చేరీలు చేసి, ఖ్యాతి గడించారు. ముంబయి, ఢిల్లీలోని షణ్ముఖానంద సభ, మద్రాస్‌ సంగీత అకాడమీ, నారద గానసభ, శార్వాణీ సంగీత సభ, నాదోపాసన, హంసధ్వని, కృష్ణ గానసభ, టి.టి.డి, సరస్వతీ వాగ్గేయకార ట్రస్ట్‌, కార్తీక్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, కాపాలి ఫైన్‌ ఆర్ట్స్‌, నాద ఇంబమ్‌ (చెన్నయి), త్యాగరాజ ఆరాధన ట్రస్ట్‌ (తిరుపతి), కళాంగన్‌ (ల్లీ) సంగీత విద్వద్పరిషత్‌ (బెంగళూరు) వంటి అనేక సంగీత సభలలో ఆమె అగ్రశ్రేణి గాయనిగా పాల్గొన్నారు.

సంగీత విద్యానిధిగా
శ్యామశాస్త్రి సంగీత ఔన్నత్యాన్ని గురించి పంతుల రమ ఎన్నో సోదాహరణ ప్రసంగాలు చేశారు. 'కర్ణాటక సంగీత సాధన' మీద 'రాగం తానం పల్లవి' మొదలైన విద్యాంశాల మీద అమె ఆనేక ఉపన్యాసాలిచ్చారు. దక్షిణాది సంగీతంపై 2000లో జరిగిన జాతీయ గోష్టిలో 'సంగీతంలో విశేష ప్రయోగాలపై గాఢ అధ్యయనం' అనే అంశంపై ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. 'నవరస మాలిక' అన్న శీర్షికతో త్యాగరాజ రచనలలో నవరసాల గురించి వివరించారు. త్యాగరాజు రాసిన 'నౌకాచరితా'న్ని సంగీత రూపకంగా నిర్వహించారు.

వరించిన పురస్కారాలెన్నో
ప్రపంచ ప్రఖ్యాత సంగీతజ్ఞురాలు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి చేతుల మీదుగా 1992, డిసెంబర్‌ 4న సికింద్రాబాద్‌లోని కళాసాగరం సంస్థ ద్వారా తంబూరాని బహుమతిగా అందుకున్నారు. 1993లో మద్రాసు సంగీత అకాడమీ నిర్వహించిన పల్లవి పాటల పోటీలలో మొదటి బహుమతిని పొందారు. 1998లో నారా చంద్రబాబునాయుడు ద్వారా ప్రముఖ సంగీతకారిణిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవార్డు అందుకున్నారు. 2007లో మద్రాసు సంగీత అకాడమీ ద్వారా విశేష ప్రతిభ కలిగిన మహిళా వాయులీన విద్వాంసురాలి అవార్డు ఆమెకు లభించింది. 2006లో మద్రాస్‌ సంగీత అకాడమీ నుంచి 'అవుట్‌ స్టాండింగ్‌ లేడీ వోకలిస్టు'గా అవార్డుని పొందారు. ఇదే సంస్థ నుంచి 2008లో 'ఉత్తమ పల్లవి గాయని'గా అవార్డు అందుకున్నారు. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌ త్యాగరాజ ఆరాధన సమితి నుంచి 2010లో 'రాగం తానం పల్లవి'కి అవార్డుని పొందారు. 2011లో 'ఇసాయి పెరోలి' అవార్డును కార్తీక్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అనే సంస్థ నుంచి అందుకున్నారు. అంతకుముందు భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి 1992-94 సంవత్సరాలకు సీనియర్‌ స్కాలర్‌షిప్‌నీ, 1996-97 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ అవార్డుని పొందారు. గాయత్రీ సంగీత విద్వన్మణి, నాదవల్లభ, ఇశై పెరోలి తదితర బిరుదులు ఆమె సంగీత ప్రతిభకు గుర్తింపుగా లభించాయి. రమ ప్రస్తుతం విశాఖపట్నం ఆకాశవాణిలో ఆడిషన్‌ కమిటీ ప్రతినిధిగా ఉన్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్‌ (ఐ.సి.సి.ఆర్‌)లో కళాకారిణిగా గుర్తింపు పొందారు. ఇలా అనేక ప్రతిభా పురస్కారాలు గుర్తింపు పొందిన డాక్టర్‌ రమ అగ్రశ్రేణి సంగీత కళాకారిణిగా ఈ రంగంలో రాణిస్తూ, వర్ధమాన, ప్రవర్థమాన కళాకారులకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు.



బోధన పద్ధతులు మెరుగుపడాలి
సంగీత జ్ఞానం అందరికీ అందాలి. సంగీత కళాశాలల్లో బోధనా పద్ధతులు, సిలబస్‌ ఇంకా మెరుగుపడాలి. శ్రోతలు మంచి సంగీతాన్ని ఆస్వాదించగలిగే స్థాయికి వారిని చైతన్యవంతం చేయాలి. ఈ రంగంలో ఉన్నత స్థితికి చేరాలంటే నిరంతర సాధన ఒక్కటే మార్గం.
- డాక్టర్‌ పంతుల రమ

                                                                                                            - బెందాళం క్రిష్ణారావు

ఎంత‌దూర‌మైన న‌డిచి వెళ్ల‌డ‌మే ఇష్టం



డాబు.. దర్పం ఉండదు. పర్యావరణానికి ముప్పు అని తెలిస్తే.. కీకారణ్యందాకైనా నడుచుకుంటూ వెళ్తారామె. మానవహక్కుల ఉల్లంఘనకు భంగం కలుగుతుందని ఉప్పందితే.. సామాన్య జనాలతో కలిసి నడిరోడ్డుపై బైఠాయిస్తారామె. ఒకప్పుడు భౌతికదాడుల్ని సైతం లెక్క చేయకుండా 'నర్మదా బచావో' అని దేశమంతా ఎలుగెత్తిన పోరాటస్ఫూర్తి మేధా పాట్కర్‌. 'ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో సామాన్యుల కనీస అవసరాల కోసం, జీవించే హక్కులను సాధించుకోవడం కోసం గాంధీయిజం నుంచి మార్క్సిజం వైపు అడుగులు వేయాల్సిందే' అన్నది మేధాపాట్కర్‌ మాట. తాజాగా మద్యం మహమ్మారిపై పోరాటం చేస్తూ 'నాశా ముక్తిభారత్‌ ఆందోళన్‌' నిర్వహిస్తున్న జాతీయ యాత్రలో భాగంగా విజయవాడ వచ్చిన సందర్భంగా మేధా పాట్కర్‌తో 'జీవన'
ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం.

కుటుంబ నేపథ్యం గురించి?
               మా కుటుంబ నేపథ్యం, నేను పెరిగిన పరిస్థితులు, సామాజిక అవగాహన నన్ను ఈ వైపుకు మళ్లించాయి. నేను పుట్టింది ముంబయిలో. నా తల్లిదండ్రులు ఇందు, వసంత్‌ కనోల్కర్‌. ఆయన కార్మిక నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. మా అమ్మ 'స్వదార్‌' అనే సంస్థలో సభ్యురాలు. ఆర్థిక, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో నిరుపేద మహిళలకు ఈ సంస్థ తోడ్పాటు అందించేది. వారిద్దరూ నాకు ఊహ తెలిసేనాటికే సామాజిక కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. వారిద్దరూ విద్యార్థిదశలో ప్రజా ఉద్యమాలను నాకు మరింత దగ్గరగా పరిచయం చేశారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ నందు సామాజిక సేవలో ఎం.ఏ. చదువుతున్నప్పటికే వాటితో నేను మమేకం అయ్యాను.
రాజకీయ ప్రస్థానం గురించి?
                  మా కుటుంబం మొదటి నుంచీ సోషలిస్టు భావజాలంతో ఉంది. అప్పట్లో మహారాష్ట్రలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు వ్యతిరేకంగా వామపక్షాలు ఏర్పాటు చేసిన రాష్ట్రీయ సేవాదళ్‌లో చేరాను. సామాజిక సేవను ఆధ్యయనం చేశాక టి.ఐ.సి.సి.లో అధ్యాపకురాలిగా పనిచేశాను. ఆ తర్వాత పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాను. ప్రజాసమస్యలపై సుదీర్ఘకాలం నుంచి పోరాటాలు చేస్తున్నాను. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ తరుఫున పాల్గొన్నాను. అంతే.
మీ జీవనశైలి గురించి తెలుసుకోవచ్చా?
                  అతి సాధారణమైనది. ఎక్కడికక్కడ ప్రజల్లో కలిసిమెలిసి ఉండడం నా అలవాటు. ఎంత దూరమైనా నడిచి వెళ్లడానికే నేనెప్పుడూ ఇష్టంగా, సిద్ధంగా ఉంటాను. సాధారణంగా అందరూ తీసుకునే ఆహారమే తీసుకుంటాను. ప్రత్యేకించి జీవనశైలి అంటూ నాకేమీ ఉండదు.
పర్యావరణం, మానవహక్కులు వంటి అంశాలపై ఉద్యమాలు చేస్తూ.. ఇప్పుడు మద్యం మహమ్మారిపై పోరాటం ప్రకటించడానికి కారణం?
                   మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందులో వాస్తవం లేదు. మద్యపాన వ్యసనం కోట్లాది కుటుంబాలను ఈ దేశంలో ఆర్థికంగా, అనారోగ్యపరంగా కుంగదీస్తోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఆర్థికంగా సామాజికంగా నష్టపోతున్నారు. మద్యం వ్యాపారం పేరుతో ప్రభుత్వాలే మాఫియాగా మారాయి. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఎప్పుడో చెప్పారు 'మద్యం ప్రజల బతుకులను నాశనం చేస్తుంది. కాబట్టి దానిని నిషేధించి, ప్రజలకు పౌష్టికాహారం ఇవ్వాలి.. అని'. అయితే ప్రభుత్వాలు నడిపేవారు మాత్రం ఆయన విగ్రహాలకు, ఫోటోలకు దండలేస్తారు. కానీ ఆయన చెప్పింది మాత్రం పట్టించుకోరు. భారత రాజ్యాంగంలోని 47వ అధికరణంలోనే ప్రజారోగ్యాన్ని కబళించే మత్తు పదార్థాలను నిషేధించాలని స్పష్టంగా ఉంది. సంపూర్ణ మద్యనిషేధం ప్రజల హక్కు.. అందుకోసమే ఈ పోరాటం.
భారీ ప్రాజెక్టుల వల్ల రైతుల సమస్యలు పరిష్కారమౌతాయని పాలకులు చెబుతుంటే.. వాటిని అడ్డుకోవడంలో మీ లక్ష్యం ఏమిటి?
                       ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారీ ప్రాజెక్టులు ఎక్కడా సత్ఫలితాలు ఇవ్వవు. ఇందులోని భారీ జలాశయాలు కలిగించే విపత్తులను గుర్తించి 1958లోనే వీటిని 'మహాకాయవ్యాధి' గా పేర్కొంటూ అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి లేఖ రాశాను. అప్పట్లో ఏం జరుగుతుందని భయపడ్డానో.. ఇప్పుడూ భారీ ప్రాజెక్టుల వలన అదే జరుగుతోంది. ఎన్నో రకాలుగా పర్యావరణ సమస్యలు, నిర్వాసితుల సమస్యలు, రకరకాల ఆర్థిక అసమానతల సమస్యలు చుట్టుముడుతున్నాయి.
నర్మదాబచావో ఆందోళన్‌ ఎంతవరకూ సత్ఫలితాలను ఇచ్చింది?
                      నర్మదాబచావో ఆందోళన్‌ ఆన్నది మా ఉద్యమానికి పెట్టుకున్న పేరు. నర్మదానదిపై సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు సహా మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం వల్ల లక్షలాది మంది అక్కడ నుంచి నిర్వాసితులుగా వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి పునరావాసం కోసమే 1985లో 'నర్మదాబచావో ఆందోళన్‌' ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం చర్చని రేకెత్తించింది. ప్రజాస్వామ్యవాదుల మద్దతు ఉద్యమానికి లభించింది. గుజరాత్‌ ప్రభుత్వం నాతో సహా ఉద్యమకారులపై భౌతికదాడులకు కూడా తెగబడింది. ఎన్నోరకాలుగా ఉద్యమానికి విఘాతాలు కల్గించింది. ఆయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. నిర్వాసితుల పునరావాసం తర్వాతే ప్రాజెక్టు నిర్మించాలని చెప్పిన న్యాయస్థానం తన తీర్పుని తానే వెనక్కి తీసుకొంది. ఈ ప్రాజెక్టు అనేక విధాలుగా విఫలమైంది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరుతో జరిగిన భూసేకరణపై మీ వైఖరి?
                         రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవడాన్ని మొదట్నుంచీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా రైతులపై రకరకాలుగా వత్తిడి తీసుకొచ్చి, భూమిని లాగేసుకున్నారు. అమరావతి నిర్మాణంలో కూడా పర్యావరణ ఆంశాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. కృష్ణానదికి వరదలొస్తే అమరావతి అంతా మునిగిపోవడం ఖాయం. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయాన్ని కూడా ఆలోచించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేదు.
అమరావతి నిర్మాణంలో రైతులకు జరిగిన అన్యాయంపై మీ ఉద్యమం ఉంటుందా?
                         అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి బలవంతపు భూసమీకరణలోనే వారికి అన్యాయం జరిగింది. ఇప్పటికీ చాలామందికి పరిహారం కూడా సక్రమంగా అందలేదు. సహజవనరులను ధ్వంసంచేసి, రాజధాని నిర్మాణం పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు భూమిని ధారాదత్తం చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో రైతులకు అండగా నిలవాల్సిందే. అక్కడ జరిగే ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలపాల్సిందే. కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో రాజధాని ఉంటే, సాధారణ ప్రజలు అక్కడ అడుగుపెట్టడం కూడా కష్టమే. పేదలకు అండగా ఉద్యమం కొనసాగుతుంది.
మీ సామాజిక ఉద్యమాలు, ప్రజా పోరాటాల గురించి?
                          ఒడిసాలో పోస్కో ఉక్కు పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమం, ఢిల్లీలో మురికివాడల్లో నివసిస్తున్న పేదల ఇళ్ల తొలగింపుకు వ్యతిరేకంగా ఉద్యమం, ముంబయిలో మురికివాడల తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమం. సింగూరులో పంటపొలాలను పరిశ్రమలకు ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమం. నందిగ్రామ్‌ ఆందోళన. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు.. ఇలా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాను. జీవితమే పోరాటం లాంటిది.. ఆది ఎక్కడో ఒకచోట ఆగేదికాదు.
దళితులపై జరుగుతున్న దాడులపై మీ స్పందన?
                         ఎన్‌.డి.ఏ. ప్రభుత్వం తాలూకా అండదండలతో కొంతమంది కావాలనే దళితులపై దాడులు చేస్తున్నారు. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. దళితులపై దాడులు చేసి ప్రజాపోరాటాల్లో ఉన్నవారికి, అణగారిన వర్గాల వారికి భయాన్ని కలిగించాలన్నదే వారి లక్ష్యం. అందుకోసం గొడ్డుమాంసం ఒక నెపం మాత్రమే. ఏ ఆహారం తీసుకోవాలన్న విషయాన్ని రాజ్యం నిర్దేశించకూడదు.
ప్రజా ఉద్యమాల్లో ఎదురయ్యే సవాళ్లని ఎలా అధిగమించాలి?
                         సవాళ్లను ఎదుర్కోవడానికే ప్రజాఉద్యమాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి పాలకవర్గాలు, కార్పొరేట్‌ శక్తులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఎన్నో ప్రతిబంధకాలు సృష్టిస్తాయి. ఉద్యమాలు చేసేవారిపై అపనిందలు వేస్తాయి. పుకార్లు పుట్టించి, రెచ్చగొడతాయి. అన్ని సందర్భాలలోనూ సంయమనంగా వ్యవహరించాలి. వాస్తవాలపట్ల ఆవగాహన పెంచుకొని, ఉద్యమాలను కొనసాగించాలి. తద్వారానే ఆ సమస్యలను అధిగమించాలి.

ఇంటర్వూ: బెందాళం క్రిష్ణారావు

మోహన గీతం!

అన్ని పురోగామి స్రవంతుల సంగమ స్థలి, సంఘర్షణ స్థలి మోహన్‌. దశాబ్దాలుగా ఉద్యమాలతో నడుస్తున్న మోహన్‌ గీతలు, రాతలు ఇపుడు సంపుటాలుగా రాబోతున్నాయి. లెట్స్‌ సెలబ్రేట్‌ ది ఆర్టిస్ట్‌ ఆఫ్‌ అవర్‌ టైమ్స్‌. 



అర్టిస్టు తాడి మోహన్‌గారు వామపక్ష విలువలను చిన్ననాటినుంచే జీర్ణించుకుని నిబద్ధత నిమగ్నత గలిగిన కళాకారునిగా ఎదిగి తన కుంచెను ఎర్రజెండాగా ఎగరేసిన తెలుగువారి చిత్తప్రసాద్‌ అని ఏదైనా రాయొచ్చు. కొంచెం అర్థమయ్యేట్టు రాయెచ్చుగదబ్బా, అరిగిపోయిన మాటలను అరువు తెచ్చుకుని రాయకపోతే మనకు తెలిసిందేదో తెలిసిన భాషలోనే ఏడవచ్చుగదా అని ఆయన మీసాల చాటునుంచి సున్ని తంగా చనువుగా గదమాయించగలరు.. మోహన్‌ ఏకకాలంలో నోస్టాల్జియా, వర్తమానం- రెండూ. ఈడి దగ్గర సరుకెంత అన్నట్టు సూపును సూటిగా గుండెల్లోకి దించే నా అభిమాన ‘మగదూర్‌’ రచయిత పతంజలిని తొలిసారి కలిసింది అక్కడే. రచయితగా పేరు ప్రఖ్యాతులను నలిపి నోట్లో బీడిగా పెట్టుకుని నెత్తిమీద ఇంకేమో ఉంచుకుని ఉట్టిమీద కూడు, ఉప్పుచేప తోడు అని చిందేయగల కేశవరెడ్డిని తన్మయంగా చూసిందీ అక్కడే. భౌతి కంగా కనిపించి కొన్ని కబుర్లు పంచుకుని కొన్ని ప్రశ్నలు సంధించి వెళ్లిపోయిన వారు మాత్రమే కాదు. రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి, నండూరి రామ్మోహన్‌ రావు, మహీధర రామ్మోహనరావు, చలసానిప్రసాదరావు, అజంతా లాంటివారెందరో మాటలమధ్యలో సన్నిహితంగా తారసపడుతూ ఉంటారు. మోహన్‌తో మాట్లాడుతుంటే ప్రావ్దాను తెలుగులో చదువుతున్నామేమో అని అపుడపుడూ అనిపిస్తుంది. అలవాటుతో కూడిన చనువుతో వచ్చిన భ్రాంతి వల్ల మన సావాసగాడిలాగా భ్రమపెడతాడు గానీ బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వాన్ని రద్దుచేసినపుడు కోల్‌కతా వీధుల్లో ఆందోళనలో పాల్గొని జైలుగోడల మీద బొమ్మలువేసిన ఆ పాతకాలపు మనిషి. నిక్కర్లేసుకోకముందే అదేంటో తెలీకముందే ఎర్రజెండా చేతపట్టుకుని ఇంట్లోనో ఇంటికి దగ్గర్లోనో చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెలనాగిరెడ్డి లాంటివారిని చూసిన మనిషి కదా! ఆయ న జ్ఞాపకాల గని. ఆ పురాతనత్వం అలనాటి కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టడం వల్ల వచ్చే అదనపువిలువ. చాలామంది కమ్యూనిస్టు కుటుంబాల వారసుల మాదిరి రియల్‌ ఎస్టేట్‌, విద్య తదిరర ఖరీదైన కళలను ఆవాహన చేసుకోకుండా చిన్ననాట అలవాటైన అలగా వ్యసనానికే అంకితమై ఉన్నందున ఆ కిక్కు ఎప్పటికీ దిగకుండా తలమీద దరువేస్తూనే ఉంటుం ది. దేన్నైనా మనకు సన్నిహితమయ్యేట్టు మనం ఆ కాలంలోనే ఉన్నట్టు చెప్పడం మోహన్‌ దగ్గరున్న కళ. స్టాలిన్‌ కాలపు అరాచకాల ప్రస్తావన వస్తే మనం స్టాలిన్‌కి బెరియాకు మధ్య లో కూర్చున్నంత సన్నిహితంగా ఉంటుంది. స్టాలిన్‌, మావోల గురించి కమ్యూనిజం పేరుతో సాగిన అరాచకాల గురించి మాట్లాడేతీరు చూసి మోహన్‌ అరాచకవాదానికి ప్రయాణించారని కొందరికి అనిపిస్తుంది. అది వాస్తవంకాదు. ఆయనది నిందాస్తుతి. వర్తమానం ఉత్సాహంగా లేనపుడు జ్ఞాపక సంచారమెంత బాగున్నాదో అనుకోవడం మానవసహజం.
బాలగోపాల్‌ నివాసానికి కూతవేటు దూరంలో రెడ్‌హిల్స్‌ రోజుల్లో తొలిసారి చూసినపుడే ఆయన పిల్లలు వాలిన చెట్టులాగా ఉండేవారు. స్థిర ఆవాసం ఏర్పరుచుకున్న పక్షులు కొన్ని. వలస పక్షులు కొన్ని. సంచార పక్షుల సంగతి సరేసరి. అనేకానేక బ్రష్షులు, పెన్నులు వాటిని ముంచి తేల్చడానికి రకరకాల ద్రావకాలతో నిండి ఉంటుంది ఆయన అడ్డా. నాలుగుస్ర్టోకులు నేర్చుకుని ఏదో ఒక పత్రికలో ఉపాధి పొందుదామని కుంచె చేత పట్టుకుని నగరం వచ్చే పోరగాళ్లకు అది స్థావర జంగమం. నెలకు లక్షకు పైగా తీసుకున్న రోజుల్లోనూ రేపేమిటో తెలీని రోజుల్లోనూ యోగిలాగా చిలుము పీలుస్తూ అదే రకమైన చిర్నవ్వులు చిందిస్తూ ఉండగలరాయన. చూడడానికి సామాన్యంగా కనిపిస్తుంది కానీ అదేమంత వీజీ విషయంబు గాదు. ఇహలోకపు బాదరబందీలను వదిలించుకునో బలవంతంగా విదిలించుకునో తామరాకుమీద నీటిబొట్టులాగా ఉండడానికి చాలా యాతన పడాలి. ఆయన తిప్పలేవో ఆయన పడి ఆ స్థితిని సాధించారు. ఇవ్వాళ కొన్ని పత్రికల్లో కనిపించే గండరగండల్లాంటి ప్రఖ్యాత కళాకార్స్‌ ఆ దర్బార్‌లో ఆయన చేత తీయని మందలింపులకు మురిసిపోతూ కనిపించేవారు. ఇవాళ సంఖ్య పలుచబడొచ్చు గానీ ఆ గురుకుల సంప్రదాయం ఆగిపోలేదు.
కవులు కవిత్వాన్ని కథకులు కథలను బొమ్మలేయువారు బొమ్మలు మాత్రమే చూడవలెననే మూఢనమ్మకమేదో తెలుగునాట చాలామందిలో ఉంది. ఆ అంధవిశ్వాసాన్ని పారద్రోలడానికి నిరంతరం శ్రమిస్తున్న సంస్కరణ వాది మోహన్‌! చదువుకు చిత్రమైన లక్షణముంటుంది. చదువుతున్నపుడు దాని ప్రయోజనం తెలీదు. తర్వాతెప్పుడో మనం నిస్సహాయులమై నిలబడినపుడు అదాటున చేతిలోకి ఆయుధంలా వచ్చి చేరుతుంది. ఆ రహస్యం ఎరిగిన వాడు, నలుగురికి ఆ ఆయుధాన్ని అందివ్వాలనుకున్నవాడు మోహన్‌. తన దృష్టికి వచ్చిన మంచి పుస్తకాన్ని మంచి సినిమాను నలుగురితో పంచుకునే వరకు నిద్రపోయే అలవాటు లేని ఆరోగ్యకరమైన సంప్రదాయం ఉన్న మనిషి. అయితే ఈ చదువు యావ అపుడపుడూ యారగెన్సీలాగా అనిపించి కొందరిని గాయపెడుతుంది కూడా. మోహన్‌ అనే ఔషధానికున్న సైడ్‌ ఎఫెక్ట్‌ అది. జ్ఞాపకాల్లో ఎంత పురాతనుడో ఆలోచనల్లో అంత ఆధునికుడు మోహన్‌. యానిమేషన్‌ గురించి వినడమేతప్ప దాని రూపురేఖా విలాసాల గురించి తెలుగునేలకు అంతగా పరిచయం లేని రోజుల్లోనే యానిమేషన్‌ ప్రయోగాలు చేసిన ముందుచూపరి మోహన్‌. అయితే ఆర్టి్‌స్టగా మోహన్‌ తన కృషిని గట్టిగా కొనసాగించలేదని వేయి బాహువులతో విస్తరించగలిగిన మనిషి ఎక్కడో తనను తాను కట్టేసుకున్నారని ఆయన అభిమానులు కొందరు ఆక్షేపిస్తుంటారు. వాస్తవమెంతో తెలీదు.
కళమూ గళమూ ఇత్యాది ఆయుధ ప్రయోగాల్లో పేరుమోసిన పేరుగాంచిన యోధులెందరో అక్కడ అస్త్రప్రదర్శన చేస్తూ కనిపిస్తుంటారు. అది ఓపెన్‌ హౌస్‌. పేపర్లో పేర్లూ అవీ చదివి యూరోపియన్‌ ఆర్ట్‌ అంటే పడిచస్తారు గానీ అందులో ఈ కళ ఏదీ ఈ సుళువేదీ అని ఏ చైనా ఆర్టిస్ట్‌ పేరునో ప్రస్తావిస్తారు మోహన్‌. మనం అంతగా పట్టించుకోని రామప్ప కళ గురించి తపన పడతారు. ఆ చైనా ఆర్టిస్టు తెలీదుకానీ రామప్ప చూశాం కాబట్టి ఆ తపన అర్థమయ్యేది. మనదైనదాన్నేదో పోగొట్టుకుని పొరుగింటి పుల్లగూర కోసం ఎగబడుతున్నామనే బాధ అది. కార్టూన్స్‌ గురించి వ్యాఖ్యానిస్తే అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం అవుతుంది. కానీ కార్టూన్స్‌ నవ్వుతో పాటు కూసింత ఆలోచన కూడా రేపితే బాగుంటుంది అనే చాదస్తం ఉన్నవాడిని కాబట్టి ఆయన కార్టూన్స్‌ ఇష్టం. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబుదాకా వైఎస్‌ నుంచి జగన్‌ దాకా ఆయన కుంచె బారిన పడినవారే. నేను కళ్లుతెరిచే నాటికి ఏ ఎర్ర సమావేశంలో చూసినా ఆయన వేసిన పోస్టర్లు, బ్యానర్లే. బక్కజీవులైన ఆడవాళ్లు, దళితులు, ఆదివాసీలు గుంపులుగుంపులుగా కొడవళ్లెత్తి మార్చింగ్‌ సాంగ్‌ పాడుతున్నట్టుండేది. చిలకలు కత్తులు దులపరించమంటే ఏమిటో ఆ బొమ్మల్లో కనపడేది. అవింకా ఊపూ ఉద్వేగం మిగిలి ఉన్న రోజులు. నయా, అర్థ, పార్లమెంటరీ అన్‌పార్లమెంటరీ గొడవలు ఎన్నున్నా సీపీఐ, సీపీఎం మొదలుకొని వివిధ గోత్రనామాలు కలిగిన ఎంఎల్‌ పార్టీలు, దళిత, స్ర్తీవాద, హక్కుల సంస్థల వరకూ కుంచె విషయంలో ఏకీ రాస్తా. అది మోహన్‌. కవిత్వం, కథల పుస్తకాల కవర్‌ ఇలస్ర్టేషన్స్‌ సరేసరి. శ్రీశ్రీ, పి.ఎల్‌. నారాయణలతో పాటలు మాటలు ఉచితంగానో అనుచితంగానో రాయించుకోవడానికి సినిమా వాళ్లు ఎన్ని వేషాలు వేసేవారో మోహన్‌ చేత బొమ్మలేయించుకోవడానికి కొందరు రచయితలు అన్ని వేషాలు వేసేవారు.
వీటన్నింటినీ మించింది నాకు కూడా కాస్తో కూస్తో అర్థంకాగలిగింది ఆయన అక్షరం. లైన్‌ డ్రాయింగ్‌ తనకిష్టమని ఆయన చెప్తూ ఉంటారు. స్కేల్‌ అవసరంలేకుండా నేరుగా గీత గీసినట్టుగానే అక్షరాన్ని సూటిగా సంధిస్తారు. తెలుగులో అంత మంచి వాక్యం రాయగలిగిన వారిని లెక్క పెట్టడానికి చేతి వేళ్లు కూడా అవసరం లేదు. ఆ వాక్యం ధర్మపీఠం మీద కూర్చుని ఉపదేశం చేస్తున్నట్టుగా ఉండదు. ప్లీజ్‌ వినండర్రా అని చేతులు జోడించి అర్థిస్తున్నట్టూ ఉండదు. స్నేహితుడి భుజం మీద చేయేసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మోహన్‌ వాక్యం మన సహచరి. కామ్రేడ్‌. చిత్తప్రసాద్‌ను గాఢంగా పరిచయం చేసినా పేరు సక్సెస్‌ డబ్బు వెంట పరుగులు పెట్టే రచయితలను హెచ్చరిస్తూ కళా, కిరసనాయిల్‌ తహసిల్దారా అని ఎద్దేవా చేసినా వాక్యం వంకర్లు పోదు. ఇంకేదో మోటివ్‌ వెంటబెట్టుకుని వాక్యం నంగినంగిగా ప్రయాణించదు. భక్తీ లేదు, నలుగురు ఏమనుకుంటారో అనే భయమూ అంతగా లేదు. అన్ని పురోగామి స్రవంతుల సంగమ స్థలి, సంఘర్షణ స్థలి మోహన్‌. దశాబ్దాలుగా ఉద్యమాలతో నడుస్తున్న మోహన్‌ గీతలు, రాతలు ఇపుడు సంపుటాలుగా రాబోతున్నాయి. లెట్స్‌ సెలబ్రేట్‌ ది ఆర్టిస్ట్‌ ఆఫ్‌ అవర్‌ టైమ్స్‌.
జి.ఎస్‌. రామ్మోహన్‌
(నేడు తాడి మోహన్ 66వ జన్మదినం)

 

21, డిసెంబర్ 2016, బుధవారం

వివ‌క్షని ప్ర‌శ్ని‌స్తు‌న్న ఆమె



అడుగడున వివక్ష, పురుషాధిక్యత, రాజ్యమేలుతున్న వర్తమాన సమాజంలో మహిళల మనుగడ విషయంలో ఎన్నో సవాళ్లు. సామాన్య మహిళలకే కాదు, వివిధ హోదాల్లో ఉన్న మహిళలూ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే కొంతమంది చైతన్యవంతులైన మహిళలు మాత్రం అదరం.. బెదరం.. అన్నట్టుగా వారికి ఎదురవుతున్న అవమానాలను, వివక్షను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాద్యమాల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. అంతేకాదు, తమలా వివక్షను ఎదుర్కొంటున్న అనేకమందిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైతన్యాన్ని నింపుతున్నారు. అలా సోషల్‌ మీడియాలో మగ వేధింపులపై పోరాటం చేసిన, చేస్తున్న కొందరు ధీర వనితలపై 'జీవన' ప్రత్యేక కథనం..

సంచలనం సృష్టించిన వనజ వాసుదేవ్‌

ఒక మహిళను 14 సెకన్ల పాటు కన్నార్పకుండా చూసిన పురుషుల మీద కేసు పెట్టొచ్చని కేరళ ఎక్సైజ్‌ కమిషనర్‌ రిషిరాజ్‌ సింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే! అయితే దీనికి కేరళ అమ్మాయి వనజ వాసుదేవ్‌ ఫేస్‌బుక్‌లో ఘాటైన పోస్ట్‌తో నిరసన తెలిపింది. ఆ పోస్టుకు చాలామంది అసభ్యకరమైన కామెంట్లు పెట్టినా.. ఆమె వాటికి ఏమాత్రం జంకలేదు. అంతకంటే బలమైన వాదనతో అందరి నోళ్లూ మూయించింది. ఇప్పుడీమె పోస్ట్‌ ఫేస్‌బుక్‌తో సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో సంచలనం సష్టిస్తోంది.
వనజ వాసుదేవ్‌. కేరళలోని అలెప్పీ (అలప్పుజ) పట్టణంలో నివసిస్తోంది. ఈ నెల 16న రిషిరాజ్‌ సింగ్‌ మహిళల విషయంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆమెకు నచ్చలేదు. కొన్ని సెకన్లపాటు పురుషుడు ఒక స్త్రీని చూసినంత మాత్రాన అతని మీద కేసు నమోదు చేయొచ్చు అన్నమాట.. ఆమెకు అన్యాయంగా తోచింది. ఈ విషయం మీద ఫేస్‌బుక్‌లో నిర్భయంగా, ముక్కుసూటిగా తన మనసులోని ఆలోచనల్ని పోస్ట్‌ చేస్తూ.. 'స్త్రీ పురుషులు ఒకర్నొకరు చూసుకోవటం అనేది అత్యంత సహజమైన చర్య. పబ్లిక్‌లో మగవాళ్లు నా వంక కొంతసేపు చూడడాన్ని నేనూ ఎంజారు చేస్తాను. అయితే అంతమాత్రాన వాళ్లు నన్ను చూసి అసభ్యకరమైన కామెంట్లు చేస్తే సహించను. ఎంతసేపు చూడాలి? ఎంతసేపట్లో చూపు మరల్చుకోవాలి? అనే వాటికి కొలమానం ఏమిటి?' అని పేర్కొంది. ఈ పోస్ట్‌కు ఎన్నో రకాల ప్రతిస్పందనలు వచ్చాయి. ఎక్కువమంది పురుషులే ప్రతిస్పందించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే తమకు మద్దతుగా వనజ పెట్టిన పోస్టుని వారు సరిగా అర్థం చేసుకోకుండానే హద్దూ అదుపూ లేకుండా విమర్శలు చేశారు. కొంతమందైతే ఆమెను వ్యభిచారిగా ముద్ర వేశారు.. మరికొంతమంది ఆమె రేటు ఎంత? అంటూ అసభ్యకరంగా ప్రైవేట్‌ మెసేజ్‌లలో అడిగారు. తన పోస్టుపై స్పందించిన వారందరికీ వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వడం అనవసరం అనుకున్న వనజ రెండో పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్టే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో పురుషాధిక్యవాదుల చెంపచెళ్లు మన్పిస్తోంది.
'నా ఆత్మవిశ్వాసాన్ని, జీవితాన్ని మీ నాలుగు అంగుళాల కొలబద్ధతో కొలిచే ప్రయత్నం చేయకండి. ఓ కేరళ విధవరాలి సంతానంగా పెరిగే క్రమంలో నేనెన్ని కష్టాలను అనుభవించానో మీలో ఒక్కరికి తెలుసా?' అంటూ సాగిన ఆమె పోస్ట్‌లో తన జీవన నేపథ్యాన్ని వివరించింది. తనూ, తన తమ్ముడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తండ్రి పోయాడు. అమ్మ ఒంటిచేత్తో పిల్లలను పెంచింది. ఆర్థిక ఇబ్బందులు, అభద్రతాభావం వల్ల పిల్లలను పెంచే శక్తి లేక, తల్లి ఎంతో వ్యథకు లోనయ్యేది. ఆ బాధతో, చిరాకుతో పిల్లలను బెల్ట్‌తో తీవ్రంగా కొట్టేది. పిల్లలు నిద్రపోయిన తర్వాత పశ్చాత్తాపంతో కుమిలిపోతూ కొట్టడానికి వాడిన బెల్టును పట్టుకుని, వెక్కి వెక్కి ఏడ్చేది. వితంతు పునర్వివాహం పట్ల సమాజానికున్న చిన్నచూపుకు జంకి, వయసులో చిన్నదే అయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందామె. అటువంటి దయనీయ పరిస్థితుల్లో పెరిగిన వనజ.. చదువు ముగించి, చిరుద్యోగాలు చేసుకుంటూ తల్లికి చేదోడుగా ఉంటోంది. ఆ క్రమంలో తనలో గూడు కట్టుకున్న మనుషుల పట్ల ఉన్న ఏహ్యభావాన్ని వదిలించుకుంది. ఆ స్థానంలో ప్రేమను నింపుకుంది. జీవితాన్ని తనదైన కోణంలో చూడటం మొదలుపెట్టింది. దాని పర్యవసానమే రిషిరాజ్‌ సింగ్‌ స్టేట్‌మెంట్‌కు ఆమె పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌. ఇక అసభ్యకరమైన కామెంట్లకు సమాధానంగా ఆమె పెట్టిన రెండో పోస్ట్‌లో... ముఖ్యంగా భారతీయ సోదరులను ఉద్దేశించి 'నా మర్మాయవాల గురించి మాట్లాడే సోదరులారా!.. నాకు సంస్కారం నేర్పించే అర్హత మీకు లేదు' అంటూ నేరుగా అనకపోయినా.. ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో చెంప పగులగొట్టేసింది. అంతేకాదు 'నా స్వీయ గౌరవానికి వెలకట్టాలని అనుకున్నవారికి ఎన్ని గుండెలు?' అని కూడా నిలదీసింది. ఇప్పుడిదే పోస్ట్‌ కేరళలో తీవ్ర సంచలనమైంది. కోజికోడ్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత నాయర్‌, కేరళ ఫిల్మ్‌మేకర్‌ ఆషిక్‌ అబుతో ఇంకొంతమంది ప్రముఖులు వనజ చేసిన ఈ పోస్టింగ్‌ని షేర్‌ చేశారు.

లింగ వివక్షపై నిలదీస్తున్న ఫర్హాన్‌
కర్ణాటక రాష్ట్రం బళ్లారి పోలీస్‌స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గాయత్రి ఫర్హాన్‌ రెండు రోజుల కిందట తాజాగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు కర్ణాటక పోలీస్‌శాఖలోని పురుషాధిక్యతని బయటపెట్టింది. 'మహిళలను అధికారులుగా గుర్తించడం పురుషులకు కష్టతరంగా కనిపిస్తోంది. నా కెరీర్‌ మొదలైన నాటి నుంచి నేను దీనిని స్వయంగా అనుభవిస్తున్నా. డిపార్ట్‌మెంట్‌లో మహిళలు ఎంతగా శ్రమించినా.. వారి పనితీరుకు పురు షులకు లభించినంతగా గుర్తింపు రావడం లేదు' అంటూ గాయత్రి అందులో ఆవేదన వ్యక్తం చేశారు. 'డిపార్ట్‌మెంట్‌లో వారానికి ఏడు రోజులు, 24 గంటలూ పనిచేసినా అంతా వృథా అవుతోంది. డిపార్ట్‌ మెంట్‌లోని పరిస్థి తులకు అలవాటు పడేందుకు నాకు ఏడేళ్లు పట్టింది. కొన్ని ఘటనలు చూస్తే కన్నీళ్లు వచ్చేవి. కానీ అవి నన్ను, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయని ఎప్పుడూ నా కన్నీళ్లను చూపలేదు. ఇప్పుడు సమర్థతపైనే నాలో ప్రశ్నలు రేకెత్తు తున్నాయి. మా బ్యాచ్‌ డిపార్ట్‌ మెంట్‌లో అడుగుపెట్టి, సెప్టెంబర్‌ 1తో పన్నెండేళ్లు పూర్తికావొస్తోంది. అయినా ఉద్యోగంలో సంతృప్తి లేదు. సమా జంలోనూ, వృత్తి జీవితంలోనూ మహిళ తన ఉనికిని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. 'చెయ్యి లేదా చావు' అన్న పరిస్థితి నెలకొంది'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుశాఖలో మహిళల పట్ల తీవ్ర లింగ వివక్ష పాటిస్తు న్నారంటూ గాయత్రి ఫర్హాన్‌ ఆవేదన వ్యక్తం చేయడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది.

వేధింపులను వ్యతిరేకించిన షెనాయ్
ఇదే కర్నాటక రాష్ట్రం కూడ్లిగి డిఎస్పీ అనుపమ షెనాయ్ ఈ ఏడాది జూన్‌ నెలలో రాష్ట్ర కార్మికశాఖా మంత్రి పి.టి. పరమేశ్వర్‌ నాయక్‌ తనని లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపేసిన ఘటన విదితమే. ఇందుకు నిరసనగా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమె విసిరిన సవాళ్లతో పరమేశ్వర్‌నాయక్‌ మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు. ఇదే వివాదంపై విచారణ జరిపిన మహిళాకమిషన్‌ సభ్యుల ముందు ఆమె వినిపించిన వాదనలలో బళ్లారి ఎస్పీ చేతన రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పనిచేయాలంటూ వేధింపులకు గురి చేసేవారన్నారు. మంత్రి ఒత్తిడి వలన తనకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషాధిక్య సమాజంలో అవినీతి రాజకీయాలకు, మహిళా ఉద్యోగులు వేధింపుల బారిన పడకుండా తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుత సమాజం పురుషుల ఆలోచనల ప్రకారమే నడుస్తోందన్నారు. తనకు ఉద్యోగం ఎలాంటి మానసిక ప్రశాంతతను ఇవ్వలేదని చెప్పారంటే.. ఆమె ఎంతటి వేధింపులకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు.

అందం కొలమానం కాదంటున్న జోసఫ్‌
ఇటీవల ఒక హిందీ పత్రికకు చెందిన భాస్కర్‌.కాం ఒక నివేదికను తయారుచేసింది. పది చూడదగ్గ ప్రదేశాలు, పది తినదగ్గ వంటలు... అని జాబితాలు రూపొందించినట్లు 'అందమైన పదిమంది మహిళా అధికారులు' అంటూ ఓ జాబితాను తయారుచేసి వదిలింది. ఈ జాబితాలో కేరళకు చెందిన మెరిన్‌ జోసెఫ్‌ ఒకరు. కేరళ ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన మెరిన్‌... అత్యంత చిన్న వయసులో ఆ హోదాను దక్కించుకున్న వ్యక్తిగా, ప్రతిభావంతురాలైన అధికారిణిగా ఇప్పటికే వార్తల్లో నిలిచారు. కానీ ఆమెను తరచూ ప్రతిభతో కాకుండా అందంతో గుర్తించడం మెరిన్‌కు మొదటి నుంచీ బాధగా ఉండేది. 'ఇలాంటి అందమైన అధికారి ఎదుట ఎవరైనా లొంగిపోతారు!' తరహా వ్యాఖ్యలు ఆమెను ఇబ్బందిపెట్టేవి. అలాంటిది ఇప్పుడు ఏకంగా 'అందమైన అధికారుల' పేరుతో ఒక జాబితాను విడుదల చేసేసరికి మెరిన్‌ కోపం కట్టలు తెంచుకుంది. పోలీసు, రక్షణ శాఖలో ఉండే అధికారులు సాధారణంగా వివాదాలకు అతీతంగా ఉంటారు. కానీ మెరిన్‌ ఇలాంటి వెకిలి మీడియా జాబితాలకు ఒక ముగింపు పలకాలని అనుకున్నారు. తన ఫేస్‌బుక్‌ ద్వారా గతవారం ఆ వార్త మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ దేశంలోని పత్రికలు, ముఖ్యంగా ప్రాంతీయ పత్రికల వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ వార్తను చూస్తే తెలిసిపోతుందన్నారు మెరిన్‌. మహిళల ప్రతిభను, భౌతికమైన అందం స్థాయికి ఈ వార్త దిగజార్చిందన్నారు. కష్టతరమైన పరిస్థితుల మధ్య బాధ్యతలను నిర్వహిస్తూ, నానారకాల రాజకీయాలను ఎదుర్కొంటున్న సదరు ఆఫీసర్లను గుడ్లప్పగించుకుని చూసేలా మార్చేశారన్నారు. తెలివితోనూ, స్వయంకృషితోనూ పైకెదిగిన తమలాంటి వారికి నిజంగా ఇది తీవ్ర అవమానమంటూ ఉతికిపారేశారు. చివరగా... 'అందమైన మగ అధికారులు అంటూ ఏనాడన్నా మనం ఓ జాబితాను చూశామా?' అంటూ జవాబు లేని ప్రశ్న వేశారు.

                 పురుషుడితో సమానంగా ఆధునిక మహిళ ప్రతి రంగంలో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు వెళుతున్న సమయమిది. ఇప్పుడు ఆమెకు కావాల్సింది సాటి పురుషుల నుంచి కనీస సంస్కారం. అంతేకాదు సమాన హక్కులు, వివక్ష చూపని స్వేచ్ఛా సమాజం. మహిళలు తమపై జరుగుతున్న వివక్షను ప్రశ్నించడానికి, హింసను నిరసించడానికి, వక్రభాష్యాలను ఖండించడానికి సామాజిక మాధ్యమం వేదిక కావడం ఆహ్వానించదగ్గ పరిణామం.

                                                                                         ---- బెందాళం క్రిష్ణారావు

ఈమె పేరు ఆత్మ విశ్వా‌సం





నెలన్నర వయస్సులోనే పోలియో సోకడంతో ఆమె ఇక ఎప్పటికీ నడవలేదన్నారంతా. శాశ్వత అంగవైకల్యం సంక్రమించడంతో ఆమె భవిష్యత్‌ అంతా శూన్యమేనని ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని ఓడించారు. ఉన్నత విద్యాసాధనతో, సామాజిక సేవలతో ఎంతోమంది ప్రశంసలందుకున్నారు. విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. వికలాంగులకు అనేకరకాలుగా చేయూతనిస్తూ 'గ్లోబల్‌ ఎయిడ్‌' సంస్థ ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. తానుకదలలేని స్థితిలో ఉన్నా తనలాంటి ఎందరినో ముందుకు నడిపిస్తున్న ''సాయిపద్మ'' ''జీవన'' ప్రస్థానం... చదవండి.

విజయనగరం జిల్లా గజపతినగరంలో 1971లో బీఎస్‌ఆర్‌ మూర్తి, ఆదిశేషు దంపతులకు సాయిపద్మ జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ విశాఖ ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో డాక్టర్లే. అందుకే కూతురు సాయిపద్మకు పోలియో సోకకుండా ముందు జాగ్రత్తతో వ్యాక్సిన్‌కూ తెచ్చి ఇంట్లో ఉంచారు. కానీ ఆమెకు నెలన్నరకే పోలియో సోకింది. అప్పటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 90 రోజులు నిండిన వారికే ఈ వ్యాక్సిన్‌ వేయాలి. అందువల్ల అందుబాటులో వ్యాక్సిన్‌ ఉన్నా ఆమెకు వేయలేని స్థితి. ఇలా విశాఖ కేజీహెచ్‌లో తొలి పోలియో కేసు ఆమెదే. పోలియోతో ఆమె కాళ్లు, చేతులు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ఇతర అవయవాలు, గొంతు కూడా దెబ్బతిన్నాయి.
52 సార్లు షాక్‌ ట్రీట్‌మెంట్లు ఇచ్చారు. ఎట్టకేలకు కాళ్లు తప్ప మిగిలిన అవయవాలు పనిచేయడం మొదలెట్టాయి. పన్నెండేళ్లు వచ్చేవరకు ఆమెను ఎత్తుకునే పెంచారు. అవయవాలు బలం పుంజుకోవడానికి ఒంటికి 'పులి'కొవ్వు రాసేవారు. బీచ్‌లో మెడ వరకు ఇసుకలో ఉంచేవారు. 1996లో ఆమె సీఏ-ఇంటర్‌ చేస్తున్న సమయంలో వెన్నెముక 'ఎస్‌' ఆకారంలో వంగిపోతే పక్కటెముకలను కట్‌ చేసి సరిచేశారు. అందుకోసం గ్రాస్‌ స్కోలియోసిస్‌ అనే పెద్ద ఆపరేషన్‌ను 18 గంటల పాటు చేశారు. అలా సాయిపద్మ శరీరానికి రకరకాల సందర్భాల్లో 18 సర్జరీలు జరిగాయి.

అత్యున్నత విద్యల్లో
తనువు మొండికేస్తున్నా మనసు ముందుకు నడిపిస్తుండడంతో ఆమె జ్ఞానతృష్ణకు ఆత్మ విశ్వాసమే ఆలంబనగా నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎం.కాం. చేసారు, న్యాయశాస్త్రంలో పట్ట భద్రురాలయ్యారు, సీఏ ఫైనల్‌ చేసారు, ఎంబీఏ చేస్తూ, కంప్యూటర్‌ అప్లికేషన్లలో, శాస్త్రీయ సంగీతంలో కూడా డిప్లొమా పొందారు.
రచయిత్రిగా, గాయనిగా
విశాఖపట్నంలోని ఎం.వి.పి.కాలనీలో నివాసం ఉంటున్న సాయిపద్మ మంచంపై ఎటూ కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆపరేషన్లు జరిగినప్పుడు రెండేళ్ల పాటు మంచంపైనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇంగ్లీష్‌లో 'లైఫ్‌' అనే కవితల పుస్తకాన్ని ఆమె రాశారు. తెలుగులో 15 కథలు, ట్రావెలాగ్‌, తమ్మిమొగ్గలు (కలువ మొగ్గలు) వంటి పుస్తకాలు రాశారు. ఎన్నో కవితలు కూడా రాసారు. సోషల్‌మీడియాలో కూడా ఆమె రచనలు చేస్తున్నారు. నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ కథల పోటీల్లో ఆమె కథకు ప్రథమ బహుమతి వచ్చింది. 2007లో అమెరికాలో ఆమె పాడిన 'వైష్ణవజనతో' పాటకు ఏడు నిమిషాల్లో రూ.20 లక్షలు సమకూరింది. ఆ సొమ్ము అక్కడే ఒక సంస్థకు వికలాంగుల సర్జరీల కోసం ఇచ్చేశారు.

ఒకరికి ఒకరై
2006లో భర్త ప్రజ్ఞానంద్‌తో పరిచయం ఏర్పడింది. ప్రజ్ఞానంద్‌ చిన్నాన్న, సాయిపద్మ తండ్రి ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో సహచరులని పరిచయాల ద్వారా తెలిసింది. అదే సమయంలో హిల్లరీ క్లింటన్‌ నిర్వహించిన రాజకీయ నిధి సమీకరణకు ఆమె వాలంటీర్‌గా ఎంపికయ్యారు. అతనిని కూడా అదే కార్యక్రమానికి ఎంపికచేసారు. వారిద్దరూ కలిసి అమెరికా వెళ్లారు. ఆ సమయంలో వారి స్నేహబంధం మరింత బలపడింది. వారిద్దరూ వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఆనంద్‌ తల్లి కూడా అందుకు అంగీకరించడంతో వారి వివాహం 2008లో జరిగింది. మరణానంతరం తమ శరీరాలను దానమివ్వడానికి అంగీకారపత్రాన్ని రాసిచ్చి మరో ఆదర్శానికి అంకురార్పణ చేశారీ దంపతులు.

సమాజసేవలో
అన్నిరకాలుగా ఆసరా ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి ఆసరా లేని వికలాంగుల పరిస్థితి ఏమిటనే ఆలోచన వచ్చింది. అందుకే అప్పట్లో వెలుగు ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఉద్యోగం వచ్చినా ఆమె చేరలేదు. బీఎల్‌ చేసి న్యాయవాదిగా పనిచేస్తూ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రిలిమ్స్‌ కూడా పరీక్ష పాసయ్యారు. రెండున్నర గంటల సమయం ఉండే ఫైనల్‌ ఎగ్జామ్‌ రాయడం శారీరకంగా ఆమెకు చాలా కష్టమైనపని. అందుకోసం స్క్రైబ్‌ను అడిగితే టెన్త్‌, ఇంటర్‌ వారినే ఇస్తామన్నారు. అందువల్ల తనకు న్యాయం జరగదని దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నానని అమె చెప్పుకొచ్చారు.
ఉచిత న్యాయసహాయం
వికలాంగుల హక్కుల గురించి ఎవరూ మాట్లాడరు. మామూలు వారికంటే మాకే ఎక్కువ అవసరాలుంటాయి. మాలాంటి వారి కోసం ఉచితంగా కోర్టులో కేసులు వాదిస్తున్నానని సాయిపద్మ అన్నారు. వికలాంగులకే కాదు.. ఇతరుల దాంపత్య జీవితాల్లో తలెత్తే వివాదాలపై కూడా ఆమె కౌన్సిలింగ్‌ ఇస్తుంటారు.

గ్లోబల్‌ ఎయిడ్‌
తనలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే తపనతో అమెరికా వెళ్లి అధ్యయనం చేశారు. పదేళ్ల కిందట గ్లోబల్‌ ఎయిడ్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా వికలాంగులకు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులకు విద్య, వైద్య సాయం, వీల్‌చైర్స్‌, కాలిపర్స్‌ పంపిణీ వంటివి చేపడుతున్నారు. గజపతినగరంలో వికలాంగులు, పేదల కోసం వసతిగృహం నడుపుతున్నారు. నిరుద్యోగ వికలాంగులకు ఉద్యోగావకాశాలకు తగిన చేయూతనందిస్తున్నారు. వికలాంగులు స్వయంగా నడపడానికి వీలుగా కార్లకు మోడిఫికేషన్‌ చేయించారు. ఇందుకోసం ఒక నిపుణుడికి పూణేలో శిక్షణ ఇప్పించారు. ఇలా ఇప్పుడు విశాఖపట్నంలో నగరంలో సుమారు వంద మంది వికలాంగులు తమ కార్లను మోడిఫికేషన్‌ చేయించుకుని తామే స్వయంగా నడుపుకోగలుగుతున్నారంటే అదంతా సాయిపద్మ కృషే. ఆమె క్రీడల్లో కూడా వికలాంగులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. తాను కూడా పారా షూటింగ్‌ నేర్చుకున్నారు. పారాషూటింగ్‌లో సాయిపద్మ ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు కూడా అందుకున్నారు.

నిరంతర సేవలతో
వికలాంగుల సేవలకు మాత్రమే పరిమితం కాకుండా ఆమె తమ దగ్గరకు వచ్చే పేద, అనాథ పిల్లలను హీల్‌ ఇండియా నడుపుతున్న విద్యాలయానికి పంపుతున్నారు. అక్కడ వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతుంది. కాలిపర్స్‌ని(కృత్రిమ కాళ్ళు) ఇండియాలో అవసరమైన వారికి అందుబాటులోకి తేవాలన్నది ఆమె ప్రయత్నం. దీనిపై అమెరికాలోని డైనమిక్‌ బ్రేసింగ్‌ సొల్యూషన్స్‌తో గ్లోబల్‌ఎయిడ్‌ సంస్థకు ఒప్పందం కుదిరింది. వారే ఇక్కడకు వచ్చి వాటిని తయారు చేసిస్తారు. దీంతో సగం ధరకే వాటిని పొందే వీలుంది. వీటితో చిన్నారుల్లో వైకల్య తీవ్రతను కొంతైనా తగ్గించవచ్చని ఆమె ఆశాభావంతో ఉన్నారు. వికలాంగుల నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని కూడా అమె నిర్వహిస్తున్నారు. సామాజిక వివక్షకు గురౌతున్న హెచ్‌ఐవి బాధితుల పిల్లలకు ఓ అనాధశరణాలయాన్ని ఏర్పాటు చేసారు. సాయిపద్మ కృషికి ఎన్నో పురస్కారాలు ఎంతోమంది ప్రశంసలు లభిస్తున్నాయి. లయన్స్‌, రోటరీ క్లబ్బుల అత్యున్నత మానవసేవా పురస్కారాలు పొందారామె, అమెరికాలోని జయంతీ ఫౌండేషన్‌ నుంచి వికలాంగులకు అందించే సేవలకు ఉత్తమ పురస్కారాన్ని పొంది తన కృషికి వన్నెతెచ్చారు.



ఉన్నత వ్యక్తిత్వం
సాయిపద్మలా సామాజిక సేవను నిబద్దతతో స్పష్టమైన కార్యాచరణతో చేసేవారు అరుదుగా ఉంటారు. మా ఇద్దరికీ సామాజిక సేవా ధక్పథం ఉంది. అదే మా ఇద్దర్నీ కలిపింది. దాంతో ఈజీవితం సమాజసేవకే అన్న భావన మరింత బలపడింది.
-ప్రజ్ఞానంద్‌, సాయిపద్మ భర్త




లక్ష్యమే నడిపిస్తోంది
మార్పు మననుంచే ముందు మొదలుకావాలి. ఇల్లు అందుకు తొలివేదికగా నిలవాలి. అందుకే మా ఇంటిని వికలాంగులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దాను. వికలాంగుల ఆలోచనా దృక్పధాన్ని మార్చి వారు తమ అవకాశాలను మెరుగుపర్చుకునేలా ఉపాధికల్పించడమే మా లక్ష్యం.
-సాయిపద్మ

- బెందాళం క్రిష్ణారావు

15, డిసెంబర్ 2016, గురువారం

ఆమె..ఒక అద్భు‌త చిత్రం



ఆకాశంలో పట్టపగలే.. చంద్రుడ్ని చూసినప్పుడో... కాలిమువ్వలు మోగంగా.. ఆమెవరో.. మయూరమై బ్రహ్మాండంగా నర్తించినప్పుడో.. లీడ్‌ గిటార్‌పై.. ఇళయరాజానో, రెహమ్మానో.. వీనుల విందుగా పాటయినప్పుడో..
అప్రయత్నంగానే.. మనసు, శరీరం ఉప్పొంగి.. ''అద్భుతహా.. అనేస్తాం.
చిత్రకారిణి స్వప్న అగస్టీన్‌ని చూసినప్పుడు కూడా ఇంకా పెద్దగా 'అద్భుతహో..' అంటారంతా. ఆమె.. గొప్పగా పాడదు.. గొప్పగా మాట్లాడదు. నర్తించదు.. కానీ.. అవన్నీ కలబోసుకున్న చిత్రంగా మెరవడం మాత్రం ఆమెకు బాగా తెలుసు.
వేలికొనలమాటున చిత్రాలు హరివిల్లవ్వడం సర్వసాధారణం.
కానీ ఈ స్వప్నంకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు.
ఉన్నదల్లా.. కాళ్ళుమాత్రమే.. వాటితోనే.. అద్భుతమైన చిత్రాలు గీసేస్తుంది.
వేళ్ళమధ్య.. పెన్నో, పెన్సిల్‌తోనే.. ఏదో నాలుగు గీతలు గీయడం వేరు. ఈమె అలాక్కాదు.. ఉద్దండ చిత్రాకారులకు కంటే మిన్నగా కాన్వాస్‌పై ఆక్రిలిక్‌, ఆయిల్‌ కలర్స్‌తో అద్భుతాలు చేస్తోంది. అసలు ఇదెలా సాధ్యమైంది. అందుకే.. స్వప్న చిత్రాలను వెదుక్కుంటూ అలా కేరళదాకా వెళ్ళొద్దాం పదండి!!
ఆమె పేరు స్వప్న అగస్టీన్‌. ప్రస్తుతం ఉండేది కేరళలోని ఎర్నాకుళం. పుట్టిపెరిగింది త్రివేండ్రం దగ్గర్లోని పొతానికడ్‌. అయితే జన్యు సంబంధ లోపాల వలన చేతులు లేకుండానే పుట్టిన ఆమెను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అసలే ఆడపిల్ల, అన్ని అవయవాలు సరిగా ఉన్న ఆడప్లిలలకే అగచాట్లు తప్పడం లేదు. అటువంటిది చేతుల్లేని మొండెంలా కన్పిస్తున్న ఈ పిల్ల ఎలా ఈ సమాజాన్ని నెగ్గుకు రాగలదనే ఆవేదన వారిని మరింత కుంగదీసింది.

కాళ్ళతో.. కళాసాధన
స్వప్న పెరుగుతున్న కొద్దీ తల్లి దండ్రులు ఆమె భవిష్యత్‌ కోసం సానుకూలంగా ఏదైనా చేయాలని బాగా ఆలోచించేవారు. ఆమె ఊహ తెలిసేనాటికి తనకు అందరిలా చేతులు లేవన్న విషయం అర్ధమై బాధపడకూడదనేది వారి ఉద్దేశ్యం. అందరి పిల్లల్లా ఆమె తినలేకపోవడం, కాలకృత్యాలు తీర్చుకోలేకపోవడం, రాయలేకపోవడం, ఆడుకోలేకపోవడం వంటివన్నీ మానసికంగా మరింత దయనీయంగా మారుస్తాయని వారు ముందుగానే గుర్తించారు. తమ కూతురుకు చేతులతో చేయాల్సిన ప్రతి పనినీ కాళ్లతో ఎలా చేయాలో నేర్పారు. ఇలా చిన్నతనం నుంచే తన కాళ్లతోనే ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించింది స్వప్న. ఇంట్లో తల్లిదండ్రులతోపాటు స్కూల్లో టీచర్స్‌ కూడా అనునిత్యం ప్రోత్సాహిస్తూ ముందుకు నడిపారు. వారి సహకారంతో స్వప్న కాళ్ళతో రాయడమే కాకుండా చిన్న చిన్న బొమ్మలు వేసేది. ఇలా చిత్రకళపై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతుండడంతో తల్లిదండ్రులు ఆ దిశగా ఆమెను ప్రోత్సహించారు. అలా చిన్న వయసు నుంచే చిత్రకళలో ప్రతిభ చూపించేది స్వప్న. సాధారణ చిత్రకారులకు భిన్నంగా కాలి వేళ్ల మధ్య కుంచెను ఇరికించుకుని ఎంతో నైపుణ్యంతో బొమ్మలు గీయడంలో పట్టుసాధించింది. కొందరు గురువుల శిక్షణ కూడా అందుకు తోడ్పడింది.

ఎల్లలుదాటిన విచిత్రాలు
తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో స్వప్న చిత్రకళతో ఆంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆమె కాళ్లతో వేసిన వర్ణ చిత్రాలు ఇప్పటికే పలు ప్రదర్శనల్లో ఉత్తమ చిత్రాలుగా కళా విమర్శకుల ప్రశంసలు పొందాయి. తొలిసారిగా స్వప్న చిత్రాలు చూసినవారంతా ఎవరో చేయి తిరిగిన చిత్రకారుడు వాటిని గీసి ఉంటాడని అనుకునేవారు. కానీ చేతులు లేని స్వప్న వాటిని గీసిందంటే మరింత ఆశ్చర్యానికి లోనయ్యేవారు. చేతులతో బొమ్మలు గీసేవారి చిత్రాల సరసన తన చిత్రాలనుంచి కూడా వారికన్నా ఎక్కువగా విమర్శకుల మెప్పును పొందారు స్వప్న. తన చిత్రాలను పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల లోనే ఎక్కువగా ప్రదర్శనకు పెడుతుందామె. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. విద్యార్ధులు తమ భవిష్యత్‌ను అందంగా మలచుకోవడానికి కలలు కంటుంటారు, వాటిని నిజం చేసుకోవాలంటే పట్టుదల, విశ్వాసం ఎంతో అవసరం. వాటిని విద్యార్ధులకు, యువతకు అందించి వారిలో స్ఫూర్తిని నింపాలన్నదే ఆమె ధ్యేయం. స్వప్న గీసిన చిత్రాలు వందలాది అంతర్జాతీయ, జాతీయ యూత్‌ మేగజైన్స్‌ లోనూ, న్యూస్‌ లెటర్స్‌లోనూ ప్రచురించారు. మౌత్‌ అండ్‌ ఫుట్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వెబ్‌సైట్లలో కూడా ఆమె గీసిన చిత్రాలు ఉంటాయి.

ప్రకృతిలో కుంచెనద్ది
స్వప్న గీసిన చిత్రాలలో అత్యధికం ప్రకృతి దృశ్యాలే. అయితే అన్నిరకాల చిత్రాలు గీయడంలోనూ ఈమె అందవేసిన కాలే. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో స్వప్న చిత్రాలు గీసింది. అయితే ప్రకృతి మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో సహజమైన వర్ణ చిత్రాలను చిత్రించారు. అందరూ పెయింటింగ్‌ స్టాండ్‌కు కాన్వాస్‌ని అమర్చి చిత్రాలు గీస్తే స్వప్న మాత్రం తనకు అనుకూలంగా ఒక బల్లపైనే కాన్వాస్‌ను పెట్టుకుని కాలి వేళ్ల మధ్య కుంచెను బలంగా పట్టుకుని చిత్రాలు గీస్తుంది. రకరకాల రంగుల్ని కాళ్ల దగ్గర అందుబాటులో ఉంచుకుని అందులో కుంచెను ముంచి వర్ణచిత్రాలను రూపొందిస్తుంది.
స్వప్నకు 1999లో 'మౌత్‌ అండ్‌ ఫుట్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 'లో సభ్యురాలిగా అవకాశం లభించింది. తన లాంటి కొంతమంది చిత్రకారులను ఆమె కలుసుకుంది. అప్పట్నుంచీ మరింత రెట్టించిన ఉత్సాహం, సహచరుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతోంది.

స్ఫూర్తికి చిరునామా
నిరాశ, నిస్పృహలతో యుక్తవయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న కొంతమంది యువతరానికి.. స్వప్న ఒక స్ఫూర్తి. ప్రేరణ. పట్టుదల ఉంటే చాలు.. అనితర సాధ్యమనుకునే ఎన్నింటినో సాధ్యం చేసుకోవచ్చన్నది స్వప్న నిరూపించింది. శారీరక లోపం ఉన్నంతమాత్రాన.. నిరాశతో కుమిలిపోకుండా నాలా మీరూ సాధించొచ్చని తనలాంటివారెందరికో స్వప్న ఒక ప్రత్యక్ష ఉదాహరణ.


లోపం.. సమస్య కాకూడదు
''నేను అందరిలా చేతులతో పుట్టలేదన్న వాస్తవాన్ని అమ్మానాన్నా నాకు చిన్పప్పుడే అవగాహన కలిగించారు. వారి ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతో చిత్రకళలలో ఒక గుర్తింపుని పొందాను. కృషికి పట్టుదలను జోడిస్తే ఎలాంటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. దృఢమైన సంకల్పం ఉంటే శారీరక లోపం పెద్ద సమస్యేకాదు''
- స్వప్న అగస్టీన్‌, ఎర్నాకుళం

   ---- బెందాళం క్రిష్ణారావు

12, డిసెంబర్ 2016, సోమవారం

మనీ.. మనీ...



మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అందుకే మనీ ప్రపంచాన్ని శాసిస్తోంది. జీవన విలువలను అపహాస్యం చేస్తున్నది కూడా ఇదే. మానవ సంబంధాలను వ్యాపార సంబంధాలుగా మిగిల్చేసింది కూడా ఈ డబ్బు చుట్టూ అల్లుకున్న విష సంస్కృతే. మానవ నాగరికతతో పాటే పుట్టిన డబ్బు చివరికి ఈ విశ్వాన్నే పాదాక్రాంతం చేసుకునే స్థాయికి ఎదిగిపోయింది. జీవితావసరాలు తీర్చుకోవడానికి మనిషి రూపొందించుకున్న డబ్బే చివరికి అతనిని తన బానిసగా మార్చుకుంది. తాను లేనిదే మనిషి మనుగడ మృగ్యమైపోయినట్లే అన్నంతగా విస్తరించిన మనీ పుట్టు పూర్వోత్తరాలు పరిణామాలే ఈ వారం 'అట్టమీది కథ'



ఈ భూమి మీద మానవ పరిణామం జరిగిన తర్వాత మనుషులు స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుని సమూహాలుగా ఏర్పడి ఆహార ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టిన నాటి నుంచి అదనపు ఉత్పత్తులను సమాజంలో వేరొకరికి అందించి దానికి ప్రతిఫలాన్ని అశించడం మొదలైంది. ఇదే వ్యాపారానికి నాందీ ప్రస్తావన. తమ దగ్గర ఉన్న వస్తువులను, అదనపు సరుకులను ఇతరులకు విక్రయించడం. దానికి బదులుగా వారిచ్చినదానితో తమకు అవసరమైనవి సంపాదించడం అనే ప్రక్రియలు ఈ డబ్బు ఆవిర్భావానికి ప్రేరణగా నిలిచాయి. చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే డబ్బు అనేది ఎన్నో పరిణామాలకు లోనై నేడున్న రూపానికి చేరినట్లు స్పష్టమౌతోంది. నాగరికత పెరుగుతున్న కొలదీ డబ్బు రకరకాల రూపాల్లోకి మారుతూ వచ్చింది.
ప్రాచీన కాలంలో అంటే ఇంకా గణతంత్ర రాజ్యాలు, రాజరికాలు లేని రోజుల్లో తెగలుగా జీవించిన కాలంలో వస్తుమార్పిడి పద్ధతి ద్వారా క్రయ విక్రయాలు జరిపేవారు. ఈ రూపాన్ని ఇప్పటికీ కొన్ని ఆదివాసీ సమూహాల్లోనూ, గిరిజన సంతల్లోనూ చూడొచ్చు. అయితే వస్తుమార్పిడి సమయంలో తమకు అవసరమైనవి కొనేవారి దగ్గర లేనప్పుడు, అమ్మకందారుకు మార్పిడి చేయగలిగిన వస్తువులను కొనేవారు ఇవ్వలేనపుడు ఈ విధానంలో లావాదేవీలు జరగడం కష్టమయ్యేది. అప్పుడు అరుదైన వస్తువులను వాటికి బదులుగా ఇచ్చేవారు. ఇలా కాలక్రమేణా అనేక రకాల విలువైన వస్తువులు, ఆల్చిప్పలు, గవ్వలు, బార్లీ, పూసలు మొదలైనవి డబ్బుగా చలామణి అయ్యాయి. సహజంగా అతి తక్కువగా లభించే విలువైన లోహాలు, మణి, మాణిక్యాలు, బంగారం, వెండి లాంటివాటిని డబ్బుగా ఉపయోగించేవారు. కొన్నాళ్లకు ఇది కూడా అంత ప్రయోజనకరంగా లేకపోయింది. ఒక ప్రాంతంలో ఇలా లభించే వస్తువులకు మరో ప్రాంతంలో తక్కువ విలువ ఉండడం, కొన్ని చోట్ల అది కూడా లేకపోవడంతో ఒకే విలువైన కొన్ని రకాల వస్తువులను రూపొందించుకోవాల్సి వచ్చింది. అదే డబ్బు. ఈ దేశంలో ఆర్యులు అడుగుపెట్టక ముందు నుంచే రాతి నాణేలు చెలామణిలో ఉన్నాయి. ఆవి చతురస్రాకారంలోని ముద్రికల రూపంలో ఉండేవి.

హరప్పా కాలం నుంచే...
హరప్పా-మొహంజదారో నాగరికతలో వెలుగు చూసిన పశుపతి, ఎద్దు బొమ్మల ముద్రికలు ఆనాటి డబ్బు అనే దానికి ప్రాథమిక రూపాలుగా చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.పూ.3000 నుంచి క్రీ.పూ. 1500 వరకూ విలసిల్లిన ఈ నాగరికతలో లభించిన ఈ చిహ్నాల వంటివే సమకాలీనమైన ప్రపంచ నాగరికతల్లో లభించాయి. ఆనాటి కాలంలో దీనినే వ్యాపార లావాదేవీలకు ప్రధానమైన ద్రవ్యంగా వినియోగించేవారని స్పష్టమౌతోంది. ఆర్యుల దాడుల వల్ల మళ్లీ కొంతకాలం వస్తుమార్పిడి వ్యవస్థ కొనసాగింది. వస్తుమార్పిడి చేసుకున్న సరుకులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకువెళ్లడం కష్టం కావడం, అవి ఎక్కువ కాలం మన్నికగా, నాణ్యతగా ఉండక పోవడం వంటి సమస్యలుండేవి. వాటికి బదులుగా నాణేలను తయారుచేసుకుంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తేలిగ్గా తీసుకువెళ్లడానికి వీలౌతుందని భావించారు. మహాజనపదాలు రూపొందడంతో వాటి ఆధ్వర్యంలో టంకశాలలు ఏర్పడి నాణేల ముద్రణ ఆరంభమైనట్లు తెలుస్తోంది. అప్పటికే వివిధ రకాల లోహాలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో వాటిని కరిగించి నాణేలుగా ముద్రించారు. క్రీ.పూ. 1000 నుంచి భారతదేశంలో లోహపు నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్‌ అభిప్రాయం. మనదేశంలో క్రీ.పూ. 6-7 శతాబ్దాలలో లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని పి ఎల్‌ గుప్తాతో పాటు ఎక్కువ మంది చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. కచ్చితంగా నిర్ధారించ లేకపోవడానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. మౌర్య సామ్రాజ్య కాలానికి చెందిన కౌటిల్యుడు తాను రాసిన అర్థశాస్త్రంలో దొంగ నాణేలను గురించి సీసం గనుల గురించి ప్రస్తావించాడు. గ్రీకులు, చైనీయులు, రోమన్లు, పర్షియన్లు క్రీస్తు పూర్వం 6,7 శతాబ్దాల్లో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
జనపదాల్లో మొదలై...
పోత పోసిన, ముద్రించిన నాణేలను ఎక్కువగా వాడుకలోకి తీసుకొచ్చింది స్థానిక 'జనపదాలే'. అప్పటికే ఈ దేశంలో చిన్నా పెద్ద వంద జనపదాలుండేవి. వాటిలో ఆంధ్ర జనపదం కూడా ఒకటి. చారిత్రక తొలికాలానికి చెందిన ఆంధ్ర జనపద నాణేలు కృష్ణా జిల్లా సింగవరంలో బయల్పడ్డాయి. ఈ వెండి నాణేలను స్థానిక రాజులే విడుదల చేశారని చరిత్రకారులు భావిస్తున్నారు. వీటిపై తెలుగు లిపి ఉండడాన్ని బట్టి తెలుగు భాష ప్రాచీనతకు కూడా ఉదాహరణలుగా ఇవి నిలిచాయి. ఈ నాణేల మీద అనేక ముద్రలు కనిపిస్తున్నాయి. జనపదాలలో సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కూడా బయల్పడినాయి. ఆంధ్ర జనపదమే ఇందుకు గొప్ప ఉదాహరణ. అమరావతిలో దొరికిన 7668 నాణేలలో కనిపించిన రకాలు దేశంలో ఇంకెక్కడా కనిపించవు.
అణాలు.. మొహర్లు
మొఘల్‌ చక్రవర్తుల తర్వాత అధికంగా నాణేలు ముద్రించినవారు బ్రిటిష్‌ పాలకులే. వీరు ముద్రించిన నాణేలను బ్రిటీష్‌ ఇండియా నాణేలు, వీరి పాలన తర్వాత ముద్రించిన నాణేలను రిపబ్లిక్‌ ఇండియా నాణేలు అని వ్యవహరిస్తారు. 1834 నాటికి కొన్ని సంస్థానాలు, ఫ్రెంచ్‌, డచ్‌ ప్రాంతాలు మినహా మిగిలిన దేశమంతా ఈస్టిండియా కంపెనీ పాలన కిందకు వచ్చింది. అప్పటికే బ్రిటిష్‌ పాలకులు నాణేలను ముద్రిస్తున్నప్పటికి, వాటిని మూడు ప్రెసిడెన్సీల నుంచి (మద్రాసు, బొంబాయి, కలకత్తా) మూడు రకాలుగా వెలువడుతుండేవి, వాటి పేర్లు, బరువులు, రూపాలు రకరకాలుగా వుండేవి. మూడు ప్రెసిడెన్సీల నుంచి ఒకే రకమైన నాణేలను ముద్రించాలని నిర్ణయించి కలకత్తా మింట్‌ కమిటి సూచనలు అమలు చేశారు. దీని ప్రకారం జరిగిన ముఖ్యమైన మార్పు బంగారు, వెండి నాణేల మీద బ్రిటిష్‌ రాజు బొమ్మని ముద్రించడం. అలా భారతదేశ నాణేల చరిత్రలో 1835 ప్రాముఖ్యత పొందింది. మొత్తం ఐదుగురు రాజుల బొమ్మలతో నాణేలు వచ్చాయి. క్వీన్‌ విక్టోరియా బొమ్మ గల నాణేలు 1840 -1901 వరకు ముద్రించారు. మొహర్‌, రూపాయి, అర్ధ రూపాయి, పావు రూపాయి, అణా, అర్ధ అణా, పావు అణా తదితర విలువలు గల నాణేలను బ్రిటీష్‌ పాలకులు ముద్రించారు. వీటిలో ఎక్కువగా వెండి నాణేలు కూడా ఉండేవి. అణాలు మాత్రం రాగి లోహంతో ఉండేవి.

రూపాయి.. రూపాలు
భారత అధికారిక ద్రవ్యం రూపీని తెలుగులో రూపాయి అంటారు. దీనిని షేర్‌ షా సూరి క్రీస్తుశకం 1540-45లో విడుదల చేసాడు. రూపాయి చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. సంస్కత పదమైన రూప్యకం (వెండి నాణెం) నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రుపయ్యా అని పలుకుతారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో మాత్రం రూపాయిని టాకా అని పిలుస్తారు. మొదట్లో రూపాయి అంటే ఓ వెండి నాణెం. 19వ శతాబ్దంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడి ఉండేవి. ఆ సమయంలో అమెరికాలోను, ఇతర ఐరోపా ఆక్రమిత దేశాల్లోను అపారమైన వెండి నిల్వలను కనుక్కున్నారు. బంగారంతో పోలిస్తే వెండి విలువ పడిపోయింది. హఠాత్తుగా రూపాయి కొనుగోలు శక్తిని కోల్పోయింది. ఈ ఘటనను 'రూపాయి పతనం'గా పిలుస్తారు. బ్రిటిషు వారి కాలంలో రూపాయికి 16 అణాలు. ఒక్కో అణాకు 6 పైసలు లేదా 12 పై లు. 1815 వరకు, మద్రాసు ప్రెసిడెన్సీ ఫానం అనే ద్రవ్యాన్ని చెలామణీ చేసేది. 12 ఫానంలు ఒక రూపాయికి సమానం. స్వాతంత్య్రానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్‌ కోరీ రూపాయి ఇలా పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉండేది. 1947లో స్వాతంత్య్రం వచ్చాక, వీటన్నిటినీ రద్దు చేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. 1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో ''కొత్త'') పైసలుగా పిలిచారు. 'డేనిష్‌ ఇండియన్‌ రూపాయి'ని 1845 లోను, 1954 లో 'ఫ్రెంచి ఇండియన్‌ రూపాయి'ని, 1961లో 'పోర్చుగీసు ఇండియన్‌ ఎస్కుడో'ను తొలగించి ఆ స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్టారు.

రుపీ... రుపయ్యా
దేశవిభజన తరువాత మొదట్లో పాకిస్తాన్‌ భారత రూపాయినే వాడేది. దానిపై పాకిస్తాన్‌ ముద్ర వేసుకునేవారు. గతంలో కువైట్‌, బహ్రెయిన్‌, కతర్‌, యు.ఎ.ఇ, మలేసియాలలో కూడా భారత రూపాయినే అధికారిక ద్రవ్యంగా వాడేవారు. దేశం బయట చెలామణీ కోసమై, ప్రత్యేకంగా గల్ఫ్‌ రూపీని 1959 మే 1 నాటి చట్టసవరణ ద్వారా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బంగారం దొంగ రవాణా ద్వారా దేశ విదేశీ మారక ద్రవ్యంపై వస్తున్న వత్తిడిని తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నారు. 1966 జూన్‌ 6న భారత్‌ తన ద్రవ్య విలువను తగ్గించినపుడు అప్పుడు గల్ఫ్‌ రూపీని వాడుతున్న ఒమన్‌, కతర్‌, ఇప్పటి యు.ఎ.ఇ లోని దేశాలు దీని స్థానంలో తమ తమ ద్రవ్యాలను ప్రవేశపెట్టాయి. కువైట్‌ 1961 లోను, బహ్రెయిన్‌ 1965 లోను అదే పని చేసేసాయి. నేపాల్‌లో భారత్‌ సరిహద్దుకు దగ్గరి పట్టణాల్లో భారత రూపాయిని తీసుకుంటారు. భారతదేశం పాటు పాకిస్తాన్‌, శ్రీలంక, నేపాల్‌, మారిషస్‌, సీషెల్స్‌, మాల్దీవులు, ఇండోనేషియా ద్రవ్య కొలమానానికి సాధారణ నామంగా రూపీని ఉపయోగిస్తున్నారు. పూర్వం బర్మా, ఆఫ్గనిస్తాన్లలో కూడా ద్రవ్య కొలమానానికి రూపీని సాధారణ నామంగా ఉపయోగించారు. అమెరికన్‌ డాలర్‌ అంటే ఇప్పుడు ఎంతో గొప్పగా చూస్తాం. కానీ స్వతంత్రం వచ్చేనాటికి భారత్‌ రూపాయి, డాలర్‌ విలువ ఇంచుమించు సమానం. అప్పటి డాలర్‌ విలువ రూపాయలల్లో కేవలం ఒక రూపాయి 30 పైసలు మాత్రమే.
కాగితాల్లోకి ఎక్కి...
లోహ నాణేల స్థానంలోనే కాగితం కరెన్సీని తొలిసారిగా చైనా దేశంలో ముద్రించారు. క్రీ.శ, 7వ శతాబ్దంలోనే చైనాలో కాగితం కరెన్సీ చెలామణిలో ఉందని చరిత్ర చెబుతోంది. రాగి, వెండి తదితర లోహాలతో తయారైన నాణేలే చలామణిలో ఉన్న భారత దేశంలో రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు 'బ్యాంక్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' (1770-1832), 'జనరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ అండ్‌ బీహార్‌' (1773-75), వారన్‌ హేస్టింగ్స్‌ స్థాపించిన బెంగాల్‌ బ్యాంక్‌ (1784-91)లు. దీని తర్వాత అన్ని రకాల కాగితపు కరెన్సీ నోట్లు 1861లో తొలిసారిగా బ్రిటిష్‌ ఇండియా కాలంలో వచ్చాయి. బ్రిటిష్‌ ఇండియా నోట్లలో మొదటిగా వచ్చిన 'విక్టోరియా పోర్ట్రెయిట్‌ సిరీస్‌' నోట్లను ముద్రించి, భద్రత కోసం రెండు ముక్కలుగా మధ్యలోకి కత్తిరించి, రెండు సెట్‌లుగా చేసేవారు. చింపినవాటిలో మొదటిసెట్‌ పార్శిల్‌ను బ్యాంకులకు పంపి, అది అందిందనే సమాచారం తెలిశాకే రెండో సెట్‌ని పంపించేవారట. తరవాత వాటిని మళ్లీ అంటించేవారు. 1861-1947 వరకూ బ్రిటిష్‌ ఇండియా రూపొందించిన రూ.1, రూ.5, రూ.10, రూ.50, రూ.100, రూ.500, రూ.1,000ల తోపాటు రూ.10,000 విలువైన నోట్లు చలామణిలో ఉండేవి. భారత ప్రభుత్వపు నోట్లను ముద్రించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1935లో ప్రారంభమైంది. ఆర్‌బీఐ విడుదల చేసిన మొదటి కాగితపు నోటు రూ.5. దాని మీద ఐదవ జార్జ్‌ చిత్రం ఉండేది. స్వాతంత్రానంతరం 1949లో ద్రవ్య వ్యవస్థ ఆర్‌.బి.ఐ అధీనంలోకి వచ్చింది. ఇది గత నోట్లతోపాటు రూ.5,000 నోట్లను కూడా చెలామణిలోకి తెచ్చింది. దేశ సార్వభౌమాధికారం, స్వతంత్రతకు చిహ్నంగా ఉండేలా నోట్ల రూపాన్ని ప్రభుత్వం క్రమంగా మార్చేస్తూ వచ్చింది.
నోటు పదివేలు.. నాణేం వేయి..
ఆర్‌బిఐ చరిత్రలో ఎక్కువ విలువ గల నోటు రూ. పదివేలదే. 1938, 1946ల మధ్య ఇవి చలామణిలో ఉండేవి. మళ్లీ 1954లో రూ.1000, రూ.5000, రూ.10,000 నోట్లను ప్రవేశపెట్టారు. ఆర్‌బీఐ చట్టాల ప్రకారం రిజర్వ్‌ బ్యాంక్‌ 10,000 నోటుకి మించి ముద్రించడానికి వీల్లేదు. అంతకు తక్కువలో ఏ సంఖ్యతో అయినా నోట్లను విడుదల చెయ్యొచ్చు. నాణాల విషయానికొస్తే రూ. వెయ్యి విలువ వరకూ ఏ సంఖ్యతో అయినా ముద్రించే వీలుంది. ఈ నేపథ్యంలోనే 1978లో రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేసిన భారత ప్రభుత్వం వివిధ రకాల నోట్లను అమల్లోకి తెచ్చింది. ఇందులోభాగంగానే 1970లో కొత్తగా రూ.20, రూ.50 నోట్లను, 1978లో రూ.100 నోటును, 1987లో రూ.500 నోటును, 2000వ సంవత్సరంలో రూ.1,000 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చింది. ఇప్పుడు 2000 నోటు వచ్చింది. గతంలో రద్దు చేసిన చిన్న నోట్ల స్థానంలో రూ.1, రూ.2, రూ.5, రూ.10 విలువ గల నాణేలను విరివిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ యేడాది నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం అప్పటికి ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పెద్ద నోట్లు వలన నకిలీ నోట్లు, నల్ల ధనం పెరిగిపోతోందని ప్రధానమంత్రి మోడీ ప్రకటిస్తూ కొత్తగా రూ.2000 నోటును ప్రవేశ పెట్టారు. కొత్త రూపుతో రూ.500 నోటును కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. మిగిలిన రూ.100, రూ.50, రూ.20 విలువ గల నోట్లని రద్దు చేయకుండా అవి చెలామణిలో ఉంచుతూ వాటి విలువతో కొత్త నోట్లని ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌.బి.ఐ ప్రకటించింది. అయితే రద్దుచేసిన నోట్ల స్థానంలో అందుబాటులో ఉంచాల్సిన నోట్లకు మధ్య పొంతన లేకపోవడంతో అన్ని వ్యవస్థలూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.
గాంధీగిరి...
ప్రస్తుతం అమల్లో ఉన్న బ్యాంకింగ్‌ సీరిస్‌ నోట్లను మహాత్మాగాంధీ సీరిస్‌గా వ్యవహరిస్తున్నారు. 1996 నుంచి భారత కరెన్సీలోని అన్ని నోట్లపై మహాత్మ గాంధీని తప్పక ముద్రించాలనే ఆదేశాన్ని కేంద్రం ప్రభుత్వం అధికారికంగా జారీ చేయడంతో ఆర్‌.బి.ఐ దానిని అమలు చేస్తోంది. రూపాయి నోటును కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ జారీ చేస్తుంది. ప్రస్తుతం ఈ నోట్లు అంతగా చలామణిలో లేవు. మిగిలిన అన్ని నోట్లని, నాణేలనీ భారతీయ రిజర్వ్‌బ్యాంకు జారీ చేస్తుంది. ఆయా నోట్ల మీద ఆ నోటు విలువ 17 భారతీయ భాషల్లో ముద్రిస్తారు. నాణేలన్నిటినీ భారత ప్రభుత్వపు నాలుగు మింట్లలో ముద్రిస్తారు. నోట్లను నాసిక్‌, దేవాస్‌, సల్బోని, మైసూరు, హౌషంగాబాద్‌లలో ముద్రిస్తారు. నోట్లూ, నాణేలు వేరువేరు పరిమాణాలు, రంగుల్లో ఉంటాయి. చదువురానివారు, దష్టిలోపాలు కలవారు గుర్తించడానికి వీలుగాను, ఇతర భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.

సిత్రాలు.. అంతాలు
నాణేలు కేవలం వాణిజ్యపరమైన అవసరాల్లోనే కాదు. ఇతర ప్రయోజనాలకు కూడా కొన్ని సార్లు వినియోగించారు. ఇవి చరిత్రలో చిత్రాలు చేశాయి. చరిత్ర పుటల్లోకి మరోసారి తొంగిచూస్తే... బుద్ధునితోపాటు భిక్షువుల నివాసం కోసం సుదత్తుడు అనే వ్యాపారి శ్రావస్తి పరిసరాల్లో గల జేత రాజుకు చెందిన తోటని కొని కానుకగా ఇచ్చేందుకు ఆ మొత్తం విస్తీర్ణంలో ఎన్ని బంగారు నాణేలు పడతాయో అంత ధనం కోసం తన సర్వస్వాన్ని అర్పించాడు. ఆ కాలానికే బంగారు నాణేలు చెలామణిలో ఉన్నాయని, రాజ వంశీయులు కన్నా సమాజంలో వ్యాపారులు సంపన్నులుగా ఉండేవారని తెలుస్తోంది.
14వ శతాబ్దికి చెందిన ఢిల్లీ సుల్తాన్‌ మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ తన సామ్రాజ్యంలో అప్పటి వరకూ ఉన్న పాత నాణేల నగదు రద్దు చేసి కొత్త నగదును ప్రవేశపెట్టాడు. నిర్దిష్ట పరిమాణాల్లోని బంగారం, వెండికి అంతే విలువ కలిగిన రాగి, కంచు నాణేలు మారకం చేసుకోవడానికి తుగ్లక్‌ అనుమతించాడు. ఈ కొత్తనాణేలను 'టంకా'లని అనేవారు. ఈ టంకాలను రూపొందించడంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. నకిలీ టంకాలను నిరోధించడంలో తుగ్లక్‌ ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు. దీంతో మార్కెట్‌లో నకిలీ టంకాలు వెల్లువెత్తాయి. ప్రజలు రాగి, కంచుతో దొంగ నాణేలు తయారు చేసి ప్రభుత్వం నుంచి విలువైన బంగారం, వెండి నాణేలను తీసుకోసాగారు. తుగ్లక్‌ సామ్రాజ్యంలో ప్రతి గహమూ ఒక టంకశాలగా మారిపోయిందని ఆనాటి చరిత్రకారుడు ఒకరు రాశారు. అంతా అస్తవ్యస్తమై, టంకాలు రద్దు కాబడి ఆ తర్వాత దౌలతాబాద్‌ కోట బయట కుప్పలుగా పోశారని మరొకరు రాశారు.
మూడో ఘటన విజయనగర సామ్రాజ్య పతనానికి సంబంధించినది. 1565 జనవరి 23న రక్కసి తంగడి యుద్ధంలో దక్కన్‌ సుల్తానులు, ఆళియ రామరాయల పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి తన బంగారు నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. వారి దాడులతో సుల్తానుల కూటమి సైన్యం వెనక్కు కొంచెం తగ్గింది. ఎవరో ఆలోచనో కానీ మధ్యభాగంలోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం అంతా చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ ఏనుగు పరిగెత్తుకుంటూ రామరాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకీని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రామరాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్‌ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించింది. హుసేన్‌ షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు. అలా విజయనగర సామ్రాజ్యం అంతమైంది.

ప్రమాణ పత్రాలే పెద్ద నోట్లు
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కరెన్సీ అంటే వాస్తవానికి రూపాయి నోటు మాత్రమే. మిగిలిన నోట్లన్నీ ప్రామిసరీ నోట్లు. రూపాయి నోటు వరకు కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. రూపాయి కరెన్సీ నోటు తప్ప మిగిలిన నోట్లకు ఆర్‌.బి.ఐ గవర్నర్‌ బాధ్యత వహిస్తారు. అందువలన ఈ నోట్లపై 'ఐ ప్రామిస్‌ టు పే' అన్న ప్రామిస్‌ తో గవర్నర్‌ సంతకం ఉంటుంది. రూపాయి నోటుపైన మాత్రం గవర్నర్‌ సంతకం ఉండదు. రూపాయి అనేది భారత దేశం యొక్క ప్రాథమిక కరెన్సీ. మిగిలిన డినామినేషన్‌తో కూడిన నోట్లన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క కరెన్సీ అధికారం తరపున ఆర్‌.బి.ఐ బాధ్యత వహిస్తూ ప్రామిసరీ నోట్లుగా జారీ చేస్తుంది. రూపాయి కరెన్సీ అయితే మిగిలిన నోట్లు దానికి ప్రతిబింబాలు అన్నమాట. ప్రామిసరీ నోటు ద్వారా దానిపై ఎంత అంకె ఉంటే అన్ని (రూపాయి) కరెన్సీ నోట్ల విలువ చెల్లిస్తున్నట్లుగా బేరర్‌కు ఆర్‌.బి.ఐ హామీ ఇస్తుంది. బ్యాంకులు జారీ చేసే డి.డిలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు, సావరిన్‌ బాండ్లు, బ్యాంకులు పోస్టాఫీసులు జారీ చేసే వివిధ బాండ్లు, ఫిక్సుడ్‌ డిపాజిట్‌ బాండ్లు, సెక్యూరిటీలు మొదలైనవన్నీ కూడా డబ్బుకు వివిధ రూపాలే. వీటన్నిటినీ కలిపి విస్త త అర్థంలో ద్రవ్యం అని అంటారు. డబ్బు అన్న పదాన్ని కరెన్సీని సూచించే అర్థంలో వాడుతారు. నాణేలు కూడా కరెన్సీయే. అవి ఆ విలువకు సమానమైన లోహంతో తయారు చేస్తారు. కనుక వాటి విలువ నిజమైనది. రూపాయికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించే కరెన్సీ కనుక అది లోహం కాకపోయినా తన విలువను వ్యక్తం చేస్తుంది.

పాలీమర్‌ నోట్లు..
నాటి రాజుల కాలం నుంచి వస్తున్న నాణేల స్థానాన్ని ఆక్రమించిన కాగితపు నోట్లను వెనక్కి నెట్టి వాటి స్థానంలోకి ప్లాస్టిక్‌ నోట్లు వస్తున్నాయి. 2009లో ఇటు దొంగ నోట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతోపాటు అటు కాగితపు నోట్లతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నేందుకు ప్లాస్టిక్‌ కరెన్సీనే సరైందని ఆర్‌బిఐ భావించింది. ఈ క్రమంలోనే 2009 సెప్టెంబర్‌లోనే ఆర్‌బిఐ రూ.100 కోట్ల విలువైన రూ.10 ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా ఓ గ్లోబల్‌ సంస్థకు టెండర్‌ ఇచ్చింది. తర్వాత ఏం జరిగిందో గానీ ఇప్పటి వరకూ ఇవి చెలామణిలోకి మాత్రం రాలేదు. భారత్‌లో ఇలా జరిగితే ఈ పాలీమర్‌ నోట్లు విదేశాల్లో మాత్రం ఏనాడో చలామణిలోకి వచ్చేశాయి. న్యూజిలాండ్‌, పపువా న్యూగినియా, రొమేనియా, బెర్ముడా, బ్రూనై, వియత్నాం వంటి దేశాలలో ఇప్పటికే విస్త తంగా వినియోగంలో ఉన్నాయి. సాధారణ నోట్లతో పోల్చితే ద్రవ్య మార్పిడికి అనుకూలంగా ఉంటుందనే ఆయా దేశాలు స్పష్టం చేస్తున్నాయి.

పాలీమర్‌ నోట్ల దశ దాటేసి ఇక డబ్బు డిజిటల్‌ రూపంలోకి మార్చేసే ప్లాస్టిక్‌ కార్డులు, కరెన్సీ ఇతర పద్ధతుల్లోకి మారే శకం రానుందని అంటున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా సాంకేతికతను సామాన్యుడికి చేర్చాలి. అంతే కానీ ప్రచారం కోసమో, ప్రయోగం కోసమో మనీతో ఆటలాడుకుంటే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదాలుంటాయి. సామాన్యుడి బతుకుకు పూరించలేని చిల్లు పడుతుంది. ద్రవ్యం అవసరం లేని సమాజం కోసం అభ్యుదయ శక్తులు ఆలోచిస్తుంటే ఇంకా మనీ మాయలోనే పడేసే ఎన్నో ప్రయోగాలు, కార్యక్రమాలు రకరకాల రంగులు మారుతున్నాయి.. రూపాల్లోకి చేరుతున్నాయి.


రూపాయి-చరిత్ర
జనపదాల కాలం తర్వాత తొలిగా అవిర్భవించిన మగధ సామ్రాజ్యం, తర్వాత వచ్చిన గుప్తులు, కుషానులు, పల్లవుల పరిపాలనా దక్షత, చోళుల వైభవం, నవాబుల విలాసం, మొఘల్‌ పాదుషాల పరిపాలన, క ష్ణదేవరాయల కీర్తి, ఆంగ్లేయుల రాజభక్తిని చాటేవి నాణేలే. ఇలా ఎన్నో రకాల చారిత్రక అంశాలకు ఇవి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మౌర్యుల కాలం నాటి నాణేలపై ఏనుగు, సూర్యుని బొమ్మలను ఎక్కువగా ముద్రించారు. వివిధ రాజుల కాలాల్లో విదేశీయులు ఇక్కడి ప్రజలతో విస్తృతమైన వ్యాపార సంబంధాలు కొనసాగించేవారని చెప్పడానికి ఎన్నో రకాల విదేశీ నాణేలు కూడా లభించాయి. కుషాణుల రాజు, కనిష్క వంశపు సామ్రాజ్యాధి పతులలో చివరివాడైన వాసుదేవుడు (క్రీ.శ. 202-233) ముద్రించిన నాణెం చూస్తే ఒక వైపున తన బొమ్మను, మరో వైపున 'ఓషో' అనే దేవత బొమ్మను వేయించాడు. సముద్ర గుప్తుని కాలం నాటి నాణేలపై గరుడ స్తంభపు బొమ్మలు, పడవల బొమ్మలు ముద్రించారు. శాతవాహన అనంతర కాలం నాటి ఉద్యోగ వర్గానికి చెందిన 'మహాతలవర', 'మహాసేనాపతి' అనే నాణేలు కోటిలింగాలలో లభించాయి. మగధ రాజ్యాన్ని మౌర్యుల తర్వాత శుంగులు, కాణ్వులు, తర్వాత అంధ్ర రాజులు వరుసగా పాలించారని ఈ నాణేలు స్పష్టం చేస్తున్నాయి. సుల్తానుల పాలనలో కూడా రకరకాల నాణేలు ముద్రించారు. మొఘల్‌ చక్రవర్తుల పాలనలో కూడా ఎన్నో రకాల నాణేలను ముద్రించారు. అవి ఇప్పటికీ ఆ కాలం నాటి చరిత్రని కళ్ల ముందుంచుతాయి. ఆంగ్లేయుల పాలన ప్రారంభం కాక ముందు నుంచీ ఈ దేశంలో వినియోగిస్తున్న 'రూపాయి' అనే నాణేన్ని తొలిసారిగా షేర్‌షా సూరి (1540-1545) ప్రవేశపెట్టాడు. ఆ రూపాయికి 40 రాగి నాణేల విలువ ఉండేది. ఆ తర్వాత కాలంలో ఇది రూపం, విలువ మారుతూ వచ్చింది. కానీ ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతోంది.


విశిష్ట నాణేలు
సాధారణ చెలామణి కోసం కాకుండా విభిన్నమైన సందర్భాలలో వివిధ వ్యక్తుల, సంస్థల గౌరవార్థం ఆర్‌.బి.ఐ. ప్రత్యేక నాణేలను ముద్రిస్తోంది. ఆర్‌బీఐ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గౌరవ సూచికంగా రూ.75 నాణాన్ని ముద్రించింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 150వ జయంతి సందర్భంగా రూ.150 నాణాన్ని ముద్రించారు. తంజావూరులోని బ హదీశ్వరాలయాన్ని నిర్మించి వెయ్యేళ్లు పూర్తైనందుకు సూచికంగా వెయ్యి రూపాయల నాణాన్నీ ముద్రించారు.
- సమత
9493043888